కాంగ్రెస్ లో తెరాస విలీనం కాకపోతే...
posted on Jan 31, 2014 7:05AM
రాష్ట్ర విభజన బిల్లుని ఉభయసభలు మూజువాణి ఓటుతో తిరస్కరించిన తరువాత కొన్ని న్యూస్ ఛానళ్ళు ఆవిషయాన్ని ప్రకటిస్తూ, ఇందుకు కారణమయిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని సమైక్యసింహమని సీమాంధ్ర ప్రజలు భావిస్తున్నారని వారిమాటగా చెప్పాయి. ఆయన మొదటి నుండి కూడా బిల్లుపై సభలో తప్పనిసరిగా ఓటింగ్ జరుగుతుందని, బిల్లుని తాము ఓడిస్తామని చెప్పినట్లుగానే చేయడంతో సీమాంధ్రలో ఆయనకు ఆదరణ పెరిగి ఉండవచ్చును.
కానీ, ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ తాను వీధి రాజకీయాల కోసమో, తన రాజకీయ భవిష్యత్ కోసమో ఇదంతా చేయలేదని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా యావత్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొనే ఈవిధంగా చేశానని అన్నారు. కానీ, తను కొత్తపార్టీ పెట్టబోతున్నారో లేదో అనే విషయం తేల్చి చెప్పకుండా, అందరితో మాట్లాడిన తరువాత తగు నిర్ణయం తీసుకొంటామని చెప్పారు.
కానీ, ఇటు కిరణ్ కుమార్ రెడ్డి, అటు కాంగ్రెస్ అధిష్టానం ఇద్దరూ కూడా ఒకరిపై మరొకరు చూపుతున్న అచంచలమయిన విశ్వాసం చూస్తే, అసలు ఆయన పార్టీ వీడకపోవచ్చనే అనుమానం కూడా కలుగుతోంది. ఒకవేళ ఆయన కాంగ్రెస్ లోనే కొనసాగి వచ్చే ఎన్నికలలో పార్టీ కోసం ఆయనే స్వయంగా ప్రచారం చేసి పార్టీని గెలిపించుకోవాలంటే తప్పనిసరిగా అందుకు చాలా బలమయిన కారణం అవసరం ఉంటుంది. శాసనసభలో రాష్ట్ర విభజన బిల్లునిఅడ్డుకొన్న ఈ సమైక్య సింహం ఎన్నికలలో కాంగ్రెస్ తరపున తమ రాజకీయ ప్రత్యర్ధులను చీల్చి చెండాడాలంటే, రాష్ట్ర విభజన బిల్లుని ఏదో ఒక కారణంతో, ఏదో ఒక దశలో నిలిపివేయవలసి ఉంటుంది. ఆవిధంగా చేసినట్లయితే ఆయన కాంగ్రెస్ పార్టీకి సీమాంధ్రలో మళ్ళీ ప్రాణ ప్రతిష్ట చేయగలరు.
కానీ దిగ్విజయ్ సింగ్ వంటి వారు ఎట్టిపరిస్థితుల్లో ఎన్నికలలోగా తెలంగాణా ఏర్పాటు చేస్తామని గట్టిగా చెపుతున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ఇచ్చేందుకు సిద్దపడినప్పటికీ తెరాస కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యేందుకు ఇష్టపడటం లేదు. ఒకవేళ తెరాస కాంగ్రెస్ లో విలీనం కాకపోయినట్లయితే, తెలంగాణా ఇచ్చినా, ఇవ్వకున్నావచ్చే ఎన్నికలలో తెలంగాణాలో కాంగ్రెస్ గెలవలేదు. మరి అటువంటప్పుడు, తెలంగాణా ఇచ్చి రెంటికి చెడిన రేవడిగా మారే బదులు ఇవ్వకుండా వదిలేస్తే, తన సమైక్యసింహం సీమాంధ్రలో పార్టీకి మళ్ళీ ప్రాణ ప్రతిష్ట చేయగలదు. ఒకవేళ కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలే ఉంటే, అప్పుడు కేసీఆర్ కూడా ఎలాగు తనకే మద్దతు ఈయక తప్పదు. అదేవిధంగా సీమాంధ్రలో మళ్ళీ పార్టీ పుంజుకొన్నట్లయితే, అక్కడి నుండి కూడా భారీగా మద్దతు దొరుకుతుంది.
ఎన్నికల సమయానికి రాష్ట్ర విభజన జరుగకపోయినట్లయితేనే సీమాంధ్రలో సమైక్య సెంటిమెంటు చాలా బలంగా పనిచేస్తుంది గనుక గనుక, తెరాస కాంగ్రెస్ లో విలీనం కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక సాకుతో రాష్ట్ర విభజన చేయకుండా తప్పుకొంటే, కాంగ్రెస్ సమైక్య సింహాలన్నీ కాంగ్రెస్ లోనే ఉండి కాంగ్రెస్ తరపునే పోరాడి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొంటాయి. బహుశః అందుకే కొత్త పార్టీకి ముహూర్తం ఇంకా ఖరారు చేసుకోలేకపోతున్నారేమో!
ఇక ముప్పై లోక్ సభ స్థానాలకు వలేస్తున్నమరో సమైక్య సింహం జగన్మోహన్ రెడ్డి కూడా తమ ఉమ్మడి రాజకీయ ప్రత్యర్దులయిన తెదేపా-బీజేపీలను చీల్చి చెండాడి, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే పార్టీ (కాంగ్రెస్) కే మద్దతు ఇస్తానని బహిరంగంగా ప్రకటిస్తున్నాడు గనుక హస్తం గుర్తున్న కాంగ్రెస్ పార్టీ ఆఖరు నిమిషంలో తెలంగాణా ప్రజలకి, తన నేతలకి హ్యండిచ్చినా ఆశ్చర్యం లేదు.