మోడీ కాకపోతే చంద్రబాబుకి ప్రధాని అవకాశం?
posted on Feb 6, 2014 6:52AM
ఈరోజు ఒక ప్రముఖ ఆంగ్ల దిన పత్రికలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గురించి చాలా ఆసక్తికరమయిన వార్త వెలువడింది. రానున్న ఎన్నికలలో నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ 200 సీట్లు సాధించలేని పక్షంలో, ఎన్డీయే కూటమి మరియు ఇతర రాజకీయ పార్టీలందరికీ ఆమోదయోగ్యుడయిన చంద్రబాబు నాయడుని ప్రధాని అభ్యర్ధిగా నిలుపుదామని బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీకి అనుకూల వాతావరణం ఉన్నందున బీజేపీ స్వయంగా 200 సీట్లకి పైగా సులువుగా గెలుచుకోగలదని వారు భావిస్తున్నారు. అయితే, అదే సమయంలో నరేంద్ర మోడీకి పార్టీలో, బయట, దేశంలో కూడా కొంత వ్యతిరేఖత ఉన్నసంగతిని దృష్టిలో పెట్టుకొన్న బీజేపీ అగ్రనేతలు ఒకవేళ తమ పార్టీ, కూటమి రానున్న ఎన్నికలలో పూర్తి ఆధిక్యత సాధించలేకపోయినట్లయితే, మళ్ళీ కేంద్ర ప్రభుత్వ పగ్గాలు కాంగ్రెస్ చేతిలోకి జారిపోకుండా ఉండేందుకు అవసరమయితే మోడీకి బదులు అందరికి ఆమోద యోగ్యుడయిన చంద్రబాబుని తమ ప్రధాని అభ్యర్ధిగా చేసేందుకు కూడా వెనుకాడకూడదని భావిస్తున్నట్లు తాజా సమాచారం.
రానున్న ఎన్నికలలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొనే యోచనలో ఉన్న బీజేపీ, ఒకవేళ మోడీ ప్రధానిగా బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకి తగినంత మెజార్టీ సాధించలేకపోయినట్లయితే, దేశంలో అన్నిరాజకీయ పార్టీలతో మంచి పరిచయాలు, బలమయిన సంబంధాలు కల చంద్రబాబుని తమ అభ్యర్ధిగా ముందుకు తీసుకువచ్చి అధికారం తమ చేయి జారిపోకుండా చూసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. పైగా చంద్రబాబు కూడా నరేంద్ర మోడీ లాగే మంచి పాలన దక్షుడిగా పేరు ప్రఖ్యాతులున్నవారు గనుక, ఒకవేళ మోడీ కాకపోతే చంద్రబాబుని ప్రధానిగా ప్రతిపాదించినట్లయితే, అన్ని పార్టీల మద్దతు కూడగట్టడం సులువవుతుంది. అంతే గాక కాంగ్రెస్ పార్టీని అది నేతృత్వం వహిస్తున్న యూపీఏ కూటమిని మళ్ళీ అధికారం చేజిక్కుంచుకోకుండా నిలువరించవచ్చును. ఈ వార్తను బీజేపీలో ఒక సీనియర్ నేత తమకు తెలియజేసినట్లు సదరు పత్రిక పేర్కొంది.
దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ పేరు మారుమ్రోగిపోతున్న ఈ తరుణంలో ఇటువంటి వార్త వెలువడటం చాలా ఆశ్చర్యాన్నే కాదు అనుమానం కూడా కలిగిస్తోంది. బీజేపీ రాష్ట్రంలో తెదేపాతో పొత్తులు పెట్టుకొంటే ఫలితాలు తారుమారవుతాయని భయపడుతున్న ప్రత్యర్ధ పార్టీలు, ఆ బీజేపీ-తెదేపాల మధ్య చిచ్చుపెట్టేందుకే ఇటువంటి పుకార్లు పుట్టిస్తున్నాయా? అనే అనుమానం కూడా కలుగుతోంది. దీనివలన ఆ రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టడం సాధ్యం కాకపోయినా, చంద్రబాబు ప్రధాని అయ్యే అవకాశాలున్నాయనే ఈ వార్త రాష్ట్రంలో తేదేపాకు తప్పకుండా చాలా మేలు చేకూరుస్తుంది. ఈసారి ఆయన మల్కాజ్ గిరీ లేదా హిందూపురం నుండి లోక్ సభకు పోటీ చేయవచ్చని ఇదివరకే వార్తలు వెలువడ్డాయి. అందువల్ల ఒకవేళ చంద్రబాబు రానున్న ఎన్నికలలో లోక్ సభకు పోటీ చేసినట్లయితే, ఆయనను బీజేపీ తన రెండో ప్రధాన మంత్రి అభ్యర్ధిగా నిలబెట్టవచ్చనే ఈ వార్తలలో ఎంతో కొంత నిజముందని భావించవచ్చును. ఏమయినప్పటికీ, చంద్రబాబుకి ప్రధాని పదవికి అర్హుడని ఈ వార్తలు చెప్పకనే చెపుతున్నాయి.