పులిమీద సవారి చేస్తున్న కాంగ్రెస్ అధిష్టానం
posted on Feb 15, 2014 @ 2:40PM
డిల్లీలో మకాం వేసిన కేసీఆర్ మరియు టీ-కాంగ్రెస్ నేతలు విభజన బిల్లుని ఎట్టిపరిస్థితుల్లో పార్లమెంటులో ఆమోదింపజేయాలని కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో వారు అధిష్టానానికి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. వారి స్వరంలో, విధేయతలో ఇప్పుడు మార్పు చాల స్పష్టంగా కనబడుతోంది. తెలంగాణా ప్రజలను సంయమనం కోల్పోవద్దని చెపుతున్న కేసీఆర్, ఒకవేళ బిల్లు ఆమోదం పొందకపోతే డిల్లీ నుండే యుద్ధం మొదలుపెడతామని హెచ్చరిస్తున్నారు. తెలంగాణా ఇవ్వకపోతే శాంతి భద్రతల సమస్యలు తల్లెత్తవచ్చని హెచ్చరిస్తున్నారు. ఇక ఎంతో భాధ్యాయుతంగా, నిష్పక్షపాతంగా మాట్లాడుతారని పేరున్న కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, మరో అడుగు ముందుకు వేసి ‘తెలంగాణా ఇవ్వకపోతే ఆత్మాహుతి దాడులు జరుగుతాయని’ హెచ్చరించడం చాలా విస్మయం కలిగిస్తుంది.
ఇంతకాలంగా సోనియాగాంధీ తెలంగాణా ప్రజల ఇంటి ఇలవేల్పు, కాంగ్రెస్ పార్టీయే తెలంగాణా ఇస్తుంది, అంతా రాజ్యాంగ బద్దంగానే జరుగుతోందని, అని కాంగ్రెస్ అధిష్టానాన్ని వెనకేసుకువచ్చిన టీ-కాంగ్రెస్, తెరాస నేతలే ఇప్పుడు ఇటువంటి హెచ్చరికలు జారీ చేయడం చాలా ఆశ్చర్యకరం. అయితే ఇంతవరకు వచ్చిన తరువాత కూడా తెలంగాణా ఏర్పాటు కాదేమోననే వారి భయం, ఆవేదన, ఆక్రోశం వారిని ఆవిధంగా మాట్లాడేలాచేస్తోందని అర్ధం చేసుకోవచ్చును. కానీ వారి మాటలు జరుగబోయే విపరీత పరిణామాలకు స్పష్టమయిన సంకేతాలుగా కూడా భావించవలసి ఉంటుంది.
తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం సరిగ్గా ఎన్నికల ముందు రాష్ట్ర విభజనకు పూనుకొని అటువంటి పరిస్థితులు కల్పించిన కాంగ్రెస్ అధిష్టానమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. దానినే నిందించవలసి ఉంటుంది. తెలంగాణా అంశంతో ఎన్నికలలో లబ్ది పొందాలని దురాలోచన చేసిన కాంగ్రెస్ అధిష్టానం, ఒకవేళ ఏ కారణంగానయినా పార్లమెంటులో తెలంగాణా బిల్లుని ఆమోదింపజేయలేకపోయినట్లయితే తెలంగాణాలో కూడా భూస్థాపితం కావడం ఖాయం. కానీ దానివల్ల ప్రజలకి ఎటువంటి నష్టమూ లేదు. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే చేతులు దులుపుకొని వెళ్ళిపోతుంది. కానీ దాని అనాలోచిత నిర్ణయాల వలన తెలంగాణాలో ముఖ్యంగా జంటనగరాలలో ప్రజల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడి, అది కేసీఆర్, కోదండరాం వంటి నేతలు హెచ్చరిస్తున్నట్లు ‘సివిల్ వార్’ కి దారితీసినట్లయితే, అందుకు ప్రజలే తీవ్రంగా బాధలు పడవలసి వస్తుంది. కాంగ్రెస్ అనాలోచిత నిర్ణయాలకు కేవలం ఆ పార్టీ నేతలే కాదు ప్రజలు కూడా భారిగా మూల్యం చెల్లించవలసివస్తుంది.
బహుశః కాంగ్రెస్ అధిష్టానానికి ఇప్పటికే ఈ సంగతి బాగా అర్ధమయ్యే ఉంటుంది. అందుకే అది లోలోన ఎంత భయపడుతున్నపటికీ పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ బీజేపీ మద్దతు ఇచ్చినా ఇవ్వకున్నా తెలంగాణా బిల్లుని ఆమోదింపజేస్తానని చెపుతోంది. దానికి అంతకంటే వేరే గత్యంతరం లేదు కూడా. అందుకోసం అది ఎంతకయినా తెగించక తప్పదు. అవసరమయితే మిగిలిన తన యంపీలను, కేంద్రమంత్రులను కూడా రేపు సభ నుండి సస్పెండ్ చేయవచ్చు. నిజం చెప్పాలంటే కాంగ్రెస్ అధిష్టానం తిరిగి సరిదిద్దుకోలేని తప్పుని చేసింది. వెనక్కి మళ్లలేని పరిస్థితికి చేరుకొంది.
కానీ,ఇంత సంకట స్థితిలో కూడా అది తన సహజసిద్దమయిన అతి(చావు)తెలివి ప్రదర్శించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకవేళ ఏ కారణంగానయినా బిల్లు ఆమోదింపజేయలేకపోతే, ఆ నెపం బీజేపీ మరియు సీమాంధ్ర యంపీల మీదకి నెట్టివేసి, తను ఇందులో నుండి క్షేమంగా బయటపడాలనే దురాలోచనతోనే బీజేపీ మద్దతు ఈయకపోయినా కూడా బిల్లుని ఆమోదింపజేస్తామని పదేపదే గట్టిగా చెపుతూ తను ఈ విషయంలో చాలా నిబద్దతతో ఉన్నట్లు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తోంది. అయితే, తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకోసం తెలుగు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ అధిష్టానం తను పులిమీద సవారి చేస్తున్నానే సంగతి మరిచిపోయింది.