ప్రధాని పదవి కోసమే థర్డ్ ఫ్రంట్ స్థాపన
posted on Feb 1, 2014 7:45AM
ప్రధాన మంత్రి పదవిపై కన్నేసిన అనేక మంది ప్రాంతీయ పార్టీ నేతలలో బీహారు ముఖ్యమత్రి నితీష్ కుమార్ కూడా ఒకరు. కానీ, తనకా అర్హత లేదని పైకి చెప్పుకొనే ఆయన, నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్లుగానే తను కూడా బీహార్ రాష్ట్రాన్ని అభివృద్ధిపధంలో నడిపిస్తున్నందున, తను కూడా మోడీలాగే ప్రధానమంత్రి పదవికి అన్నివిధాల అర్హుడనని ఆయన గట్టిగా భావిస్తుంటారు. నరేంద్ర మోడీని వ్యతిరేఖిస్తున్నసాకుతో ఆయన ఎన్డీయే కూటమి నుండి బయటపడిన తరువాత, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయేకి దగ్గర కావాలని ప్రయత్నించారు. అందుకు కాంగ్రెస్ కూడా చాలా సానుకూలంగానే స్పందించింది. అయితే, అక్కడ ప్రధానమంత్రి పదవి రాహుల్ గాంధీకే రిజర్వ్ చేయబడింది గనుక, యూపీయే కూటమిలో జేరినా నితీష్ కుమార్ కల నెరవేరే అవకాశం లేదు. అందుకే, కాంగ్రెస్ ఎన్ని సైగలు చేస్తున్నా, బహుమతులు అందజేసేందుకు సిద్దపడినా, నితీష్ కుమార్ యూపీయేతో మైల పాటిస్తూనే ఉన్నారు.
అయితే తన జీవితాశయమయిన ప్రధానమంత్రి పదవి పొందేందుకు ఆయన తన ప్రయత్నాలు మానుకోలేదు. ప్రస్తుతం దేశమంతటా కాంగ్రెస్, రాహుల్ గాంధీల పట్ల ప్రజలలో వ్యతిరేఖత కనబడుతుంటే, మరో వైపు మోడీ ప్రభంజనం వీస్తున్నపటికీ, ఆయనపట్ల కూడా అంతే సమానంగా దేశంలో వ్యతిరేఖత ఉంది. తాను మోడీని వ్యతిరేఖించి ఎన్డీయేలో నుండి బయటకి వచ్చేయడమే కాకుండా, ఆ తరువాత మోడీని గట్టిగా డ్డీ కొంటున్నందున, ప్రజలు, ప్రాంతీయ పార్టీ నేతలు అందరూ కూడా తననే రాహుల్, మోడీలకు ప్రత్యామ్నాయంగా భావిస్తారని, అందువల్ల తనే ప్రధానమంత్రి అవవచ్చని నితీష్ కుమార్ ఆశపడుతున్నారు. ప్రజలలో ఉన్నఈ సందిగ్దతను మూడో ఫ్రంట్ కి అనుకూలంగా మార్చుకోగలిగితే, తన కల నేరవేర్చుకోవచ్చని నితీష్ కుమార్ ఆశ. అందుకే ఆయన మూడో ఫ్రంట్ ఏర్పాటుపై ఆసక్తి చూపుతున్నవామపక్ష పార్టీలను ముందుంచుకొని పనులు మొదలు పెట్టారు. కాంగ్రెస్ , బీజేపీలకు వ్యతిరేకంగా భావసారూప్యత గల ప్రాంతీయ, జాతీయ పార్టీలతో సంకీర్ణ కూటమిని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.
అయితే, చాలా కాలంగా కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా కేంద్రంలో మూడో కూటమి ఏర్పరచి డిల్లీలో చక్రం తిప్పాలని దేశంలో చాలా ప్రాంతీయ పార్టీ నేతలు ఆశపడుతున్నప్పటికీ, వారు కూడా తమ తమ రాష్ట్రాలపై తమకున్న పట్టు, పరపతి కారణంగా అందరికంటే తామే ప్రధానమంత్రి పదవికి అర్హులమని భావిస్తుండటంతో మూడో ఫ్రంట్ స్థాపనకు ప్రధాన అవరోధంగా నిలుస్తోంది. కానీ, మూడో ఫ్రంట్ ఏర్పాటు ఆవశ్యకత గురించి నితీష్ కుమార్, నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ, మాయావతి, జయలలిత, జగన్మోహన్ రెడ్డి వంటి ప్రాంతీయ పార్టీ నేతలు మాట్లాడటం మాత్రం మానలేదు.
దేశ ప్రజలలో ప్రస్తుతం నెలకొన్న ఈ సందిగ్దతను సద్వినియోగం చేసుకొని కేంద్రంలో చక్రం తిప్పేయాలనే వారందరూ చాలా ఆశపడుతున్నారు. థర్డ్ ఫ్రంట్ పూర్తి మెజార్టీ పొందడం అసంభవమని వారందరికీ తెలుసు. కనీసం ఆ పేరుతో ప్రజల నుండి మరిన్ని ఎక్కువ సీట్లు దండుకోగలిగినా వచ్చే ఎన్నికల తరువాత ఏర్పడబోయే సంకీర్ణ ప్రభుత్వాన్ని తమ గుప్పెట్లో పెట్టుకొని కీలకమయిన కేంద్రమంత్రి పదవులు పొందవచ్చని వారి దురాశ. ఈ దురాశ, దురాలోచనల కారణంగానే మూడో ఫ్రంట్ ఏర్పాటు కాలేకపోతోంది. ఒకవేళ మూడో ఫ్రంట్ ఏర్పాటయినా కూడా దురాశతో కూడుకొన్న నేతలందరూ కలిసి దానిని కప్పల తక్కెడగా మార్చడం ఖాయం.