వైఎస్ ని అంటే తట్టుకోలేకపోయా
posted on Mar 28, 2011 @ 5:20PM
హైదరాబాద్: తన అన్న, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని దొంగ అనడాన్ని తాను తట్టుకోలేకపోయానని మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి శాసనసభలో వివరణ ఇచ్చారు. ఉదయం వాయిదాపడిన శాసనసభ ఏడు గంటల తరువాత మొదలైంది. ఉదయం జరిగిన సంఘటనకు చింతిస్తున్నానని చెప్పారు. ''30 ఏళ్లు నా అన్నవెంట నడిచాను. రాముడి వెంట లక్ష్మణుడిలాగా ఉన్నాను. నా అన్న ప్రజల కోసమే బతికారు. ఏనాడు డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వలేదు. అటువంటి వ్యక్తిని బతికున్నప్పుడు కూడా మీరు వేధించారు. మీరు ఏ ఆరోపణ చేసినా ఆయన వెంటనే కమిటీని వేసేవారు. నా కుటుంబ సభ్యులకంటే నేను వైఎస్ఆర్ కే అధి ప్రాధాన్యత ఇస్తాను. ఆయనని దొంగ అంటే నేను భరించలేను.'' అని వివరణ ఇచ్చారు. కమిటీలు వేయండి, విచారణలు జరిపించండి తనకు అభ్యంతరంలేదన్నారు. అత్యున్నత సభ ఏమైనా చేయవచ్చునని మంత్రి అన్నారు. తన అన్న వైఎస్ఆర్ ని దొంగ అనడం కాని, కాంగ్రెస్ వారు దొంగల ముఠా అనడాన్ని తాను సమర్ధించనన్నారు. తన ప్రవర్తన వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే తీవ్ర విచారాన్ని వక్తీకరిస్తున్నానన్నారు. ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే వారిని హీనపరచాలన్న ఆలోచన తనకులేదని వారికి మనవి చేస్తున్నానన్నారు.అయినప్పటికీ మంత్రి వివేకానందరెడ్డి భర్తరఫ్ చేయాలని తెలుగుదేశం పార్టీ సభ్యులు నినాదాలు చేశారు.
జరిగిన దాడికి విచారం వ్యక్తం చేయకుండా గొప్పలు చెప్పుకుంటున్నారని గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని - వైయస్ వివేకానంద రెడ్డి తరఫును తాను క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. జరిగిన సంఘటన దురదృష్టకరమని ఆయన అన్నారు. అలాంటి సంఘటనలు సభకు మర్యాద కాదని ఆయన అన్నారు. జరిగిన సంఘటనకు క్షమాపణ చెప్పిన తర్వాత దానిపై చర్చ చేయడం మంచిది కాదని ఆయన అన్నారు. వ్యక్తిగత దూషణలకు దిగినప్పుడు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయని, విధానాలూ అంశాలపై చర్చ జరిగితే ఇలా ఉండదని ఆయన అన్నారు. చర్చ జరిగిన తర్వాత భూకేటాయింపులపై ఎటువంటి విచారణకైనా తాము సిద్ధమని చెప్పామని ఆయన గుర్తు చేశారు. చర్చ జరగకుండా విచారణకు ఆదేశించడం సరి కాదని ఆయన అన్నారు. ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు మాట్లాడుతూ - రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్సించే హక్కు తమకు ఉందని అన్నారు. రౌడీయిజం చేస్తే భయపడేది లేదని ఆయన అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైయస్ రాజశేఖర రెడ్డి తమ కన్నా దారుణంగా మాట్లాడారని ఆయన అన్నారు. మరణించిన వ్యక్తి గురించి మాట్లాడడం సరి కాదని, అలా మాట్లాడితే సహించబోమని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ గురించి తాము మాట్లాడబోమని ఆయన అన్నారు. తాము చనిపోయిన వ్యక్తి గురించి వ్యక్తిగతంగా మాట్లాడడం లేదని, ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాలపై మాట్లాడుతున్నామని ఆయన అన్నారు. డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభ్యులకు సర్ది చెప్పారు. దాంతో సభ సద్దుమణిగింది.