జగన్ పార్టీలో చేరేందుకు వివేకా?
posted on Mar 28, 2011 @ 4:11PM
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి వైఎస్.వివేకానంద రెడ్డి సిద్ధమవుతున్నారా? అంటే అవుననే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కడప స్థానాన్ని గెలుచుకునేందుకు వైఎస్ వివేకా కాలికి బలపం కట్టుకుని నియోజకవర్గం అంతటా తిరిగినా, తెదేపా - కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కైనా జగన్ ఆధ్వర్యంలో బరిలోకి దిగిన అభ్యర్థిని ఓడించలేకపోయారు. నలుగురు మంత్రులు రంగంలోకి దిగినా ఫలితం గుండుసున్నా. దీంతో వైఎస్ వివేకానంద రెడ్డి పునరాలోచనలో పడ్డట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అన్నయ్య వైఎస్సార్ కుమారుడు వైఎస్ జగన్ వెంట రాష్ట్ర ప్రజలు ఉన్నారన్న నిర్ణయానికి ఆయన వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు సోదరుని కుమారుడు వైఎస్ జగన్‌ను వ్యతిరేకించడాన్ని కడప నియోజకవర్గ ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడమే బెటర్ అనే నిర్ణయానికి వివేకానంద రెడ్డి వచ్చినట్లు వినికిడి.
వైఎస్సార్ హయాంలో భారీ దోపిడి జరిగిందని కాంగ్రెస్‌లోని కొంతమంది సీనియర్ నాయకులు మాట్లాడుతున్నా పట్టించుకోని వైఎస్ వివేకా, తెలుగుదేశం పార్టీ సభ్యుల ఆరోపణలపై అంత సీరియస్‌గా స్పందించడాన్ని చూస్తే ఆయన జగన్ పార్టీకి దగ్గరవుతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ సభ్యులు ప్లకార్డుల ప్రదర్శనపై వివేకా తీవ్రంగా స్పందించడమూ... ఆయనకు వైఎస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలు మద్దతుగా రావడాన్ని చూస్తే వైఎస్ వివేకానంద రెడ్డి ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి దూకడం ఎంతో దూరంలో లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైపెచ్చు.. యువనేత కుటుంబంతో రాజకీయ వైరం ఉన్నప్పటికీ.. కుటుంబ పరంగా వస్తే మాత్రం తామంతా ఒకటేనని, కడప రాజకీయాలను తమ కుటుంబమే శాసిస్తుందనే సంకేతాలను అసెంబ్లీ సంఘటన ద్వారా చెప్పే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది.