కిరణ్ డైరెక్షన్‌లోనే వివేకా నాటకం?
posted on Mar 29, 2011 @ 9:54AM
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి డైరెక్షన్‌లోనే వ్యవసాయ శాఖ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి సోమవారం అసెంబ్లీ నాటకాన్ని నడిపించినట్లు ప్రచారం జరుగుతోంది. శాసనసభలో వైయస్సార్‌పై తెలుగుదేశం ఆరోపణలను ఎదుర్కోవడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు ముందుకు వచ్చి ఎదురు దాడికి దిగారు. ఈ స్థితిలో వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతిష్టను కాపాడడానికి జగన్ మాత్రమే ముందుకు వచ్చారనే అభిప్రాయం బలపడే స్థితి ఏర్పడింది. దీన్ని అడ్డుకోవడానికి కిరణ్ కుమార్ రెడ్డి వైయస్ వివేకానంద రెడ్డిని ముందుకు తోసినట్లు చెబుతున్నారు. శాసనసభలో తెలుగుదేశం సభ్యులపై దాడికి ప్రయత్నించిన తర్వాత వైయస్ వివేకానంద రెడ్డి వ్యవహారమంతా కిరణ్ కుమార్ రెడ్డి అనుకున్నట్లే జరిగిందని అంటున్నారు. ఇందుకుగాను మంత్రి వట్టి వసంతకుమార్, పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ స్క్పిప్టు తయారు చేశారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సభలో క్షమాపణ చెప్పాల్సిన స్థితిలో వివేకానంద రెడ్డి వట్టి వసంతకుమార్, ఉండవల్లి అరుణ్ కుమార్‌లతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ చర్చల్లోనే వైయస్ వివేకానంద రెడ్డి స్క్రిప్టు రెడీ అయినట్లు చెబుతున్నారు. సభలో క్షమాపణ చెప్పే సమయంలో వైయస్ వివేకానంద రెడ్డి రాసుకొచ్చిన ప్రకటన చదివారు. దాన్ని బట్టి ఓ పద్ధతి ప్రకారం ఆ ప్రకటనను తయారు చేసినట్లు అర్థం చేసుకోవచ్చు. వివేకానంద రెడ్డిని బర్తరఫ్ చేసి, భూ కేటాయింపులపై సంయుక్త సభా సంఘాన్ని వేసే వరకు సభకు రానని చెప్పిన చంద్రబాబు తన డిమాండ్లు నెరవేరకుండానే సభకు రావడం వెనక జగన్‌ను అడ్డుకునే వ్యూహం అంటున్నారు.