30వ వసంతంలోకి టీడీపీ
posted on Mar 29, 2011 @ 10:57AM
హైదరాబాద్: టీడీపీ పార్టీ 30వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మంగళవారం ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. 30 ఏళ్లుగా ప్రజలకు ఏం చేశాం, ఇంకా ఏం చేయాలనే దానిపై పూర్తిగా సమీక్షిస్తామని అన్నారు. తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టేందుకు అన్నారు. ప్రజలకు పునరంకితం అయ్యేందుకు ఎలా ముందుకు వెళ్లాలో పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నాడు కేంద్ర స్థాయి పార్టీని ప్రతిపక్ష స్థాయిలో కూర్చుండబెట్టిన అరుదైన గౌరవం టిడిపిదే అన్నారు. టిడిపి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిందన్నారు. వచ్చే మహానాడు వరకు పార్టీ విధివిధానాలు నిర్ణయించి ప్రజలలోకి తీసుకు వెళ్లే కార్యక్రమాలు చేపడతామన్నారు. తెలుగువారి గురించి ప్రపంచానికి చాటి చెప్పింది తెలుగుదేశం పార్టీయే అన్నారు. టిడిపి జెండా బడుగు బలహీన వర్గాలకు అండ అన్నారు. సామాజిక న్యాయం, ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకు వచ్చింది తెలుగుదేశం పార్టీయే అన్నారు. నేటి నుండి వచ్చే సంవత్సరం మహానాడు వరకు 14 నెలల పాటు పెద్ద ఎత్తున ప్రజలలోకి వెళ్లేందుకు కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఎన్టీఆర్ ఏ ఉద్దేశ్యంతో పార్టీ పెట్టారో ఆ ఆశయాలు నెరవేర్చడానికి కార్యకర్తలు, నేతలు కలిసి పని చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.