స్పీకరు ప్రాంతీయ విభేదాలు
posted on Mar 29, 2011 @ 10:37AM
హైదరాబాద్: ఉప సభాపతి నాదెండ్ల మనోహర్ ఎదురుగానే ఓ మంత్రి శాసనసభలో శాసనసభ్యునిపై దాడి చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా పక్షనేత ఈటెల రాజేందర్ మంగళవారం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ఖండించారు. నాదెండ్ల తీరు ఓ ప్రాంతానికో ఓ న్యాయం, మరో ప్రాంతానికి మరో న్యాయం అన్నట్లుగానే ఉందన్నారు. శాసనసభలో స్వయంగా మంత్రులే దాడి చేయడం శోచనీయమన్నారు. తాము స్పీకరు ఆదేశాల మేరకు నడుచుకుంటున్నామని చెప్పారు. అయితే మాకో న్యాయం వివేకానందరెడ్డికి ఓ న్యాయమా అని ప్రశ్నించారు. స్పీకరు ముందే వివేకా ఎమ్మెల్యేలపై దాడి చేస్తే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇలాంటి ప్రాంతీయ విభేదాలు చూస్తుంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే మాకు న్యాయం జరుగుతుందనేది స్పష్టం అవుతుందన్నారు.
మరోవైపు సమైక్య రాష్ట్రంలో ప్రాంతాల వారిగా న్యాయం ఉంటుందా అని నిజామాబాద్ జిల్లా బాన్సువాడ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి మంగళవారం ఉపసభాపతి నాదెండ్ల మనోహర్‌ను ప్రశ్నించారు. సాక్షాత్తు శాసనసభలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులపై దాడి చేసిన మంత్రివర్యులపై స్పీకరు చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటేనే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. తెలంగాణ ప్రజలు, విద్యార్థులు అత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన ఈ సందర్భంగా కోరారు. తెలంగాణ సాధించుకునే వరకు అందరం కలిసి పోరాడుదామన్నారు. కాగా తన రాజీనామాను ఆమోదించాలని నాదెండ్ల మనోహర్‌ను కలిసి పోచారం శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం టిఆర్ఎస్‌తో కలిసి ఉద్యమాన్ని ఉధృతంగా చేయడానికే రాజీనామా చేసినట్టు చెప్పారు.