ఉప ఎన్నికల్లో గెలిచేందుకే ఈ డ్రామా
posted on Mar 29, 2011 @ 10:07AM
హైదరాబాద్: త్వరలో జరుగనున్న కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో గెలిచేందుకే రాష్ట్రమంత్రి వైఎస్.వివేకానంద రెడ్డి దివంగత మహానేత వైఎస్ఆర్‌పై కపట ప్రేమను ప్రదర్శిస్తున్నారని కాంగ్రెస్ పార్టీతో పాటు.. విపక్ష పార్టీలకు చెందిన పలువురు సభ్యులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా, జగన్ వర్గం ఎమ్మెల్యేలు మరో అడుగు ముందుకేసి మంత్రిదే తప్పు అన్నట్టుగా అసెంబ్లీ లాబీల్లో వ్యాఖ్యానిస్తున్నట్టు సమాచారం. అసెంబ్లీలో వైఎస్ వివేకానంద ఓవర్‌యాక్షన్ చేశారని, ఇదంతా కడప, పులివెందుల ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలవడానికి చేసే ఎత్తుగడల్లో భాగమేనని జగన్ వర్గం ఎమ్మెల్యేలు అంటున్నారు. వైఎస్‌ఆర్‌పై కాంగ్రెస్ పార్టీకే చెందిన సీనియర్ నేతలు వి.హనుమంతరావు, శంకర్రావు, డీఎల్ రవీంద్రా రెడ్డి వంటి అనేక మంది సీనియర్ నేతలు విమర్శల వర్షం గుప్పిస్తున్నా పట్టించుకోని వైఎస్ వివేకా.. సోమవారం ఉన్నట్టుండి ఫైర్ కావడానికి ఇదే కారణమని వారు అంటున్నారు. ఉప ఎన్నికల్లో గెలుపునకు ఇదంతా కాంగ్రెస్ పార్టీ వివేకాతో ఆడిస్తున్న డ్రామాగా వారు అబివర్ణించారు.