నందమూరి కుటుంబాన్ని గౌరవించనందుకే

విజయవాడ: తాను తెలుగుదేశం పార్టీకి నిబద్ధత కలిగిన కార్యకర్తనని, దివంగత ఎన్టీఆర్ కుటుంబానికి అభిమానించేవాడినని అలాంటి తాను ఎట్టి పరిస్థితులలోనూ పార్టీ వీడే అవకాశం లేదని, ఎన్టీఆర్ కుటుంబం మీద తనకు ఉన్న అభిమానం, టిడిపి కార్యకర్తగా తనకు ఉన్న నిబద్దత ముందు అన్నీ వెంట్రుకతో సమానమని తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా నేత వల్లభనేని వంశీ శుక్రవారం మీడియా సమావేశంలో జగన్ పార్టీలోకి వెళుతున్నట్లు వచ్చిన వాదనలను దృష్టిలో పెట్టుకొని అన్నారు. తాను జగన్ పార్టీలోకి వెళ్లే ప్రసక్తి లేదన్నారు. టిడిపీలోనే ఉంటానని చెప్పారు. తనకు పార్టీలో పదవులు ఇచ్చినా, ఇవ్వకున్నా పార్టీ కార్యకర్తగానే పని చేస్తానని చెప్పారు. ఎన్టీఆర్ కుటుంబంతో తమకు ఉన్న అనుబంధాన్ని ఎవరూ విడదీయలేరన్నారు. తమకు ఎప్పుడూ పార్టీ తరఫున పోటీ చేశామని, ఎన్నో ఏళ్లుగా పార్టీలో ఉంటున్నప్పటికీ చంద్రబాబు, హరికృష్ణ పర్యటనల విషయం తమకు ఎప్పుడూ చెప్పలేదన్నారు. హరికృష్ణ కృష్ణా జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఎమ్మెల్యే దేవినేని ఉమా మహేశ్వరరావు అవమానించారని అన్నారు. హరికృష్ణకే గౌరవం లేకుంటే సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటని అన్నారు. సుజనా చౌదరికి గౌరవం ఇవ్వడాన్ని తాను తప్పుపట్టడం లేదన్నారు. అందరికీ గౌరవం ఇవ్వాల్సిందే అన్నారు. పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణకే అవమానం జరిగిందన్నారు. తనకు దేవినేని ఉమపై వ్యక్తిగత కక్షలు లేవన్నారు. పార్టీలో ఎన్నో ఏళ్ల నుండి ఉన్నప్పటికీ కొడాలి నాని, తాను కార్యకర్తలుగా పని చేస్తున్నామని అన్నారు. పార్టీ పట్ల నిబద్దతతో తాము పని చేస్తున్నామన్నారు. నేను పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలకు ఎప్పుడైనా పాల్పడ్డట్టు గన్నవరం నియోజకవర్గంలో గానీ, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలోగానీ చెప్పించాలన్నారు. వ్యక్తిగతంగా నేను ఎవరినీ విమర్శించలేదన్నారు. దేవినేని ఉమ టిడిపిలో, దేవినేని నెహ్రూ కాంగ్రెసులో, దేవినేని చంద్రశేఖర్ జగన్ వెంట వెళ్లనున్నారని ఇలా మూడు పార్టీలు వారి కుటుంబ సభ్యుల చేతుల్లో ఉండాలని చూస్తున్నారన్నారు. నందమూరి కుటుంబాన్ని గౌరవించనందుకే ఉమతో విభేదిస్తున్నానని చెప్పారు. నైతిక విలువలకు నేను కట్టుబడి ఉండే వ్యక్తిని అన్నారు. దేవినేని నాయకత్వంలో తాను పని చేయలేకనే రాజీనామా చేశానని, అయితే ఆయన రాజీనామా చేసినందువల్ల నేను కొనసాగుతానని చెప్పారు. ఆయన తన రాజీనామాను ఉపసంహరించుకుంటే నేను రాజీనామా చేస్తానని చెప్పారు. ఆయన టిడిపిలో ఉంటే తనకేమి సమస్య కాదని, అయితే ఆయన నాయకత్వంలో మాత్రం పని చేయనన్నారు.  అయితే హరికృష్ణకు క్షమాపణలు చెబితే మాత్రం తాను ఆయన నాయకత్వంలో పని చేయడానికి సిద్ధమని అన్నారు. పార్టీ కోసమే తాను బయటకు మీడియా ముందుకు వచ్చానని, వ్యక్తిగత ప్రయోజనాలు మాత్రం ఏమీ లేవన్నారు. నెహ్రూ జిల్లాలో టిడిపి కార్యకర్తలపై దాడులు జరుపుతున్నప్పటికీ ఉమ స్పందించడం లేదన్నారు. గతంలో సిపి సీతారామాంజనేయులు వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించలేదన్నారు. పార్టీ కోసం తాము ఎన్నో అవమానాలకు గురయ్యానన్నారు. వారిలా పేపర్లలో ఫోటోలు వేయించుకోవాలన్న పిచ్చి నాకు లేదన్నారు. చంద్రబాబు కూడా నందమూరి కుటుంబంలో సభ్యుడే అని ఆయన అన్నారు. తాను ఎమ్మెల్యే సీటునో, ఎంపీ సీటునో కోరుకోవడం లేదన్నారు. ఉమను టిడిపినుండి తప్పించాలనే ఉద్దేశ్యం తనకు ఏమాత్రం లేదన్నారు. ఆయన వ్యవహార శైలి మార్చుకుంటే చాలన్నారు. దేవినేని అయినా, కొడాలి నాని అయినా వ్యక్తిగతంగా ఎవరూ గెలవలేదని అందరూ టిడిపి పైనే గెలిచారన్నారు. వంగవీటి రాధాకృష్ణతో కేవలం పరిచయం మాత్రమే అన్నారు. కుటుంబం వేరు రాజకీయం వేరని అన్నారు. అన్ని విషయాలు చంద్రబాబు దృష్టికి తీసుకు వెళతానని ఆయన అన్నారు.

వైఎస్ఆర్ పార్టీ జెండా పై ఈసీకి ఫిర్యాదు

హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెసు పార్టీ జండా గుర్తుపై కాంగ్రెసు పార్టీ ఎన్నికల సంఘానికి శుక్రవారం ఫిర్యాదు చేసింది. కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడైన కమలాకర్ జగన్ పార్టీ వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీని కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీ ఎన్నికలలో వారి గుర్తుతో ఎన్నికలకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. జగన్ పార్టీ జెండా గుర్తులో వైయస్ఆర్ ఫోటోతో పాటు ప్రభుత్వం చేపడుతున్న పథకాలు ఉన్నాయని ఆయన అన్నారు. వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీలో ఉంటూ మరణించినందువల్ల ఆయన ఫోటోతో ఉప ఎన్నికలకు వెళ్లనివ్వరాదని కోరారు. అలాగే ప్రభుత్వ పథకాలు ఆ జెండాలో ఉన్నందున అనుమతిని నిరాకరించాలని కోరారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం లిఖిత పూర్వకంగా ఇస్తే స్పందిస్తానని చెప్పింది.

ఫీజు రీయింబర్స్‌మెంట్ మళ్లీ మొదటికి

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం-ఇంజినీరింగ్ కళాశాల మధ్య ఫీజు రీయింబర్స్‌మెంట్ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. 25 శాతం ఫీజు బకాయిలు చెల్లించామని ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలువ్యాఖ్యానించాయి.. ఇప్పటివరకూ 15 శాతమే బకాయిలు మాత్రమే చెల్లించిదన్నాయి. బకాయిలు చెల్లించకుండా ట్రెజరీలకు ముఖ్యమంత్రి ఫ్రీజింగ్ ఆర్డర్స్ ఇచ్చారని కళాశాలల యాజమాన్యాలు ఆరోపించాయి. ఫీజుల బకాయిల విషయంలో విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని యాజమాన్యాసంఘాలు పేర్కొన్నాయి. బకాయిలు చెల్లించకుంటే వచ్చే విద్యా సంవత్సరంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద విద్యార్థులకు అడ్మిషన్లు నిలిపివేస్తామని హెచ్చరించాయి.

ఉమాపై మరోసారి విరుచుకుపడిన వల్లభనేని

విజయవాడ: నందమూరి తారక రామారావు కుటుంబాన్ని అణిచివేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని టీడీపీనేత వల్లభనేని వంశీ ఆరోపించారు. కృష్ణాజిల్లా పార్టీ అధ్యక్షుడు ఉమాపై శుక్రవారం ఆయన మరోసారి విరుచుకుపడ్డారు. ఉమా ఒంటెద్దు పోకడలు పోతున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ జిల్లా పర్యటన సందర్భంగా ఓ శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేశామని, అయితే ఈ కార్యక్రమానికి హరికృష్ణ హాజరుకాకుండా దేవినేని ఉమా అడ్డుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఇదీ పార్టీ కార్యకర్తలను బాధించిందని తెలిపారు. కృష్ణాజిల్లాలో మూడు రోజులు ఉన్న హరికృష్ణతో టీడీపీ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరిపించలేదని దుయ్యబట్టారు. జిల్లాలో పార్టీ ప్రతిష్ట కోసం ఎంత కృషిచేశామని, ఎన్టీఆర్ కుటుంబంతో తమకున్న అనుబంధం ముందు పదవులు తృణప్రాయమని చెప్పారు. ఉమాతో తనకు ఎలాంటి ఆర్థిక తగదాలు లేవని తెలిపారు.

రజనీకాంత్ మద్దతు ఎవరికి?

చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ సాధారణ ఎన్నికల సందర్భంగా ఇటు అధికార డిఎంకె పార్టీ మరోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలని ఉబలాటపడుతుంటే, అటు ప్రతిపక్ష అన్నాడిఎంకె పార్టీ ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో దక్షిణాది సూపర్ స్టార్, అశేష అభిమాన కథా నాయకుడు రజనీకాంత్ వైపు డిఎంకె, అన్నాడిఎంకె చూస్తున్నాయి. రజనీకాంత్ తమకు మద్దతు ప్రకటించాలని ఇరు పార్టీలు ఆశాభావంతో ఉన్నాయి. రజనీ అభిమానులు కూడా ఆయన ఆదేశాల కోసం ఎదురు చూడటం విశేషం. అయితే ఎక్కువసార్లు రజనీ అభిమానులను తమ సొంత నిర్ణయం మేరకే ఓటు వేయాలని కోరుకుంటారు. ఇటీవలే జయలలిత పార్టీ ఏఐడిఎంకె పార్టీ పత్రిక ఎడిటర్ రామస్వామి రజనీకాంత్‌ను కలిశారు. అయితే రామస్వామి రజనీని కలవడంతో ఓటర్లు రజనీ జయలలితకు మద్దతు ప్రకటిస్తారనే భావనలో పడిపోతారనే అనుమానం డిఎంకెకు వచ్చింది. వెంటనే ఉపముఖ్యమంత్రి అళగిరి తర్వాత రోజు రజనీని కలిశారంట. అయితే రజనీ డిఎంకెకు మద్దతు ప్రకటించక పోవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. రజనీ జయలలితవైపే మొగ్గు చూపుతారని పలువురు భావిస్తున్నారు. అయితే గతంలో ఓసారి రజనీ జయలలితకు వ్యతిరేకంగా ఓటు వేయమని తన అభ్యర్థులను కోరారు. అవినీతి జయ ప్రభుత్వాన్ని సమర్థించవద్దని చెప్పారు. ఆ ఎన్నికల్లో జయ ఓటమి చవి చూసింది. ఒకటి డిఎంకె కూటమి భారీ కుంభకోణాల్లో కూరుకుపోవడం కాగా మరొకటి పిఎంకె పార్టీ. తాజా ఎన్నికలలో పిఎంకె పార్టీ డిఎంకెతో జట్టుకట్టింది. అయితే గతంలో రజనీ బాబా చిత్రం విడుదల అయినప్పుడు ఆ చిత్రాన్ని పిఎంకె వ్యతిరేకించింది. దానిని బ్యాన్ చేయాలని డిమాండ్ చేసింది. దీంతో చిర్రెత్తిన రజనీ 2004 ఎన్నికల్లో పిఎంకెను ఓడించాలని అభిమానులను కోరారు. ఆ పిఎంకె కూటమి ఇప్పుడు డిఎంకెతో కలిసి ఉంది. మరో ముఖ్య విషయం తమిళనాట ఏ పార్టీ రెండుసార్లు వరుసగా గెలుపొందలేదు.

పోటీపై పార్టీదే నిర్ణయం: మైసూరారెడ్డి

హైదరాబాద్ : కడప ఉప ఎన్నికల్లో పోటీపై తనకు ఆసక్తి లేదని, పార్టీనే నిర్ణయం తీసుకుంటుందని మైసూరారెడ్డి అన్నారు. ఈసీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కడప, పులివెందులలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని ఈసీని కోరినట్లు మైసూరారెడ్డి తెలిపారు. ఉప ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు లేకుండా చేసే పరిస్థితి రాకుండా చూడాలని ఈసీని కోరామని, ఈవీఎంలలో జంబ్లింగ్ విధానం అనుసరించాలని కోరామని ఆయన చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలో వైఎస్ ఫోటో ఉంచడాన్ని కాంగ్రెస్ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్ళింది. ఉగాది పండుగ అనంతరం పార్టీ అధ్యక్షుడు ఉప ఎన్నికల అభ్యర్థులను ప్రకటిస్తారన్నారు.

కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే నేనూ రెడీ

కరీంనగర్: తెలంగాణ ఉద్యమం కోసం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే తానూ రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ అన్నారు. కరీంనగర్ జిల్లా కోరుట్లలో నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కీని శుక్రవారం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎంపీ పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. దీంతో ఆయన అసహనం వ్యక్తం చేస్తూ ముందు భాజపా నేత కిషన్‌రెడ్డి రాజీనామా చేస్తే తాను చేస్తానన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, భాజపా కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు.

భారత్- శ్రీలంక ఫైనల్ మ్యాచ్‌పై జోరుగా బెట్టింగులు

హైదరాబాద్: ప్రపంచ కప్ కోసం శనివారం అంతిమ పోరులో తలపడుతున్న భారత్-శ్రీలంకలపై బూకీలు భారీగా బెట్టింగులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. రెండు ఉప ఖండ దేశాలు మొదటిసారి ఫైనల్ మ్యాచ్‌లో తలపడుతున్నాయి. ఉపఖండానికే కప్ ఖాయమైనందున బూకీలు ఇప్పుడు శ్రీలంక, ఇండియాలపై జోరుగా బెట్టింగులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ముంబయి వాంఖేడే స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌కు బూకీలు సుమారు 5వేలకోట్ల రూపాయల మేర బెట్టింగులకు పాల్పడుతున్నట్టుగా అనుమానిస్తున్నారు. అయితే పోలీసులు ఎంతగా నిఘా వేసినప్పటికీ బెట్టింగు దారులు వెనక్కి తగ్గడం లేదు. ప్రపంచ కప్ ప్రారంభమయినప్పటినుండి పోలీసులు పలువురిని అరెస్టు చేసి హెచ్చరికలు జారీ చేసినప్పటికీ బెట్టింగు రాయుళ్లు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అంతేకాదు పాకిస్తాన్, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ సెంచరీలపై బెట్టింగు ఈ మారు కొనసాగుతోంది. ఇప్పుడు సచిన్ తన సొంత స్డేడియంలో ఆడుతుంటడం సచిన్‌కు కలిసి వస్తుందని అందరూ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాదుతో పాటు రాష్ట్రంలోని పలు ముఖ్య నగరాల్లో బెట్టింగ్ రాయుళ్ల జోరు పుంజుకున్నట్టుగా తెలుస్తోంది. నగరంలో పోలీసులు అపార్టుమెంట్లు, పబ్‌లు, కాఫీషాప్‌లు, గెస్టు హవుస్‌లు తదితర వాటిపై దృష్టి సారించారు. బెట్టింగు జరుపుతున్న వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పోలీసు అధికారి స్టీఫెన్ రవీంద్ర చెబుతున్నారు. బెట్టింగులకు పాల్పడుతున్న వారి సమాచారం అందిస్తే రివార్డులు ఇస్తామని చెబుతున్నారు. కాగా హైదరాబాదులో బెట్టింగుకు పాల్పడుతున్న మరో బూకీని పోలీసులు అరెస్టు చేశారు.

కృష్ణా రాజకీయాల్లో విభేదాలు

గుడివాడ : కృష్ణా జిల్లా టీడీపీ శాఖ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు తీరుపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) తీవ్రంగా మండిపడ్డారు. ఎన్టీఆర్ కుమారుడు, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణను దేవినేని అవమానించారని ఆరోపించారు. ఈ విషయమై పార్టీ అధినేత చంద్రబాబు ఎదుటే తాడోపేడో తేల్చుకుంటానని ధ్వజమెత్తారు. పార్టీ కార్యాలయంలో నాని గురువారం మీడియాతో మాట్లాడారు. గతనెల 28న హరికృష్ణ చల్లపల్లి పోస్టాఫీసులో నూతన రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌ను ప్రారంభించేందుకు వచ్చినపుడు ఆయనకు జిల్లా పార్టీ తరఫున అవమానం జరిగిందన్నారు. మండల పరిషత్ కాంప్లెక్స్ భవనానికి హరికృష్ణతో శంకుస్థాపన చేయించాలని స్థానిక నేతలు ఏర్పాట్లు చేసినా ఆ విషయాన్ని చెప్పకుండా దేవినేని దాచిపెట్టాడని ఆరోపించారు. అందువల్ల శంకుస్థాపనకు హాజరుకాకుండా హరికృష్ణ వెళ్లిపోయారన్నారు. దేవినేని వైఖరి కారణంగా అక్కడి నేతలు కలత చెంది రాజీనామా చేశారని, పార్టీకి తీరని నష్టం జరిగిందన్నారు. ఇందుకు దేవినేని బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో పార్టీ ఇతర నేతలను ఆయన కలుపుకుపోవటం లేదని నాని విమర్శించారు. ఏ కార్యక్రమం జరిగినా పార్టీ నాయకులందరికీ సముచిత స్థానం ఇవ్వాలని హితవు పలికారు. రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి వస్తే చూపిన అత్యుత్సాహం, అతి గౌరవం.. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు వచ్చినపుడు ఏమైపోయాయని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఈ పోకడలను మానకుంటే భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. కాగా విజయవాడ అర్బన్ టీడీపీ అధ్యక్ష పదవికి శుక్రవారం రాజీనామా చేస్తున్నట్లు వల్లభనేని వంశీ ప్రకటించారు.

పోచారం కోసం అసెంబ్లీ ముందు టీఆర్ఎస్ ధర్నా

హైదరాబాద్: పోచారం శ్రీనివాస రెడ్డి రాజీనామా ఆమోదంపై డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ జాప్యం చేస్తుండడాన్ని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు శుక్రవారం ఉదయం అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా ప్రారంభించారు. మాజీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీ కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు. తన రాజీనామా ఆమోదం పొందకుండా తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటోందని పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. ధర్నా ప్రారంభించడానికి ముందు తెరాస శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలుసుకున్నారు. పోచారం శ్రీనివాస రెడ్డి రాజీనామాను వెంటనే ఆమోదించాలని వారు కోరారు. బాలనాగి రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, పోచారం శ్రీనివాస రెడ్డిపై అనర్హతపై తాము చేసిన ఫిర్యాదుపై చర్యలు తీసుకునే వరకు పోచారం శ్రీనివాస రెడ్డి రాజీనామాను ఆమోదించకూడదని తెలుగుదేశం నాయకులు డిప్యూటీ స్పీకర్‌ను కోరుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగుకు పాల్పడిన ఆ ముగ్గురు శాసనసభ్యులపై అనర్హత వేటు వేయాలని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్‌ను కోరారు. పోచారం శ్రీనివాస రెడ్డి రాజీనామాను ఆమోదిస్తే వెంటనే నిజామాబాద్ జిల్లా బాన్సువాడ సీటుకు ఉప ఎన్నిక వస్తుంది. దానివల్ల తెరాస లాభపడే అవకాశాలున్నాయి. పోచారం శ్రీనివాస రెడ్డి ఆ సీటు నుంచి తెరాస తరఫున పోటీ చేస్తారు. కడప లోక్ సభ సీటుకు, పులివెందుల శాసనసభ సీటుకు జరిగే ఉప ఎన్నికలతో పాటు బాన్సువాడ శాసనసభ సీటుకు ఉప ఎన్నిక జరిగితే తమకు లబ్ధి చేకూరుతుందనే ఉద్దేశంతో తెరాస నాయకత్వం ఉంది. దానివల్ల తెలంగాణ ఉద్యమానికి ఊపు వస్తుంది. అందుకే డిప్యూటీ స్పీకర్‌పై పోచారం శ్రీనివాస రెడ్డి రాజీనామా ఆమోదానికి ఒత్తిడి తెస్తోంది.

ప్రచారానికి సిద్దమైన జగన్ రథం

కడప: కడప పార్లమెంటు సీటుకు, పులివెందుల శాసనసభా స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో ప్రచారం కోసం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైయస్ జగన్ రథం సిద్ధమైంది. కడప పార్లమెంటు నియోజకవర్గంలో విస్తృత ప్రచారానికి అనువుగా ఈ రథాన్ని సిద్ధం చేశారు. ఇదే వాహనాన్ని వైయస్ జగన్ 2009 ఎన్నికల్లో వాడారు. ఆయన ఎన్నికల్లో ఆయన కొందరు అభ్యర్థుల తరఫున కాంగ్రెసు పార్టీ నాయకుడిగా ప్రచారం చేశారు. అప్పుడు వాహనానికి ఆయన కొన్ని మార్పులు చేశారు. ప్రచార రథంలో జగన్ విశ్రాంతి తీసుకోవడానికి, కీలక నేతలతో మంతనాలు జరపడానికి ఏర్పాట్లు ఉన్నాయి. వాహనంపై నుంచి ప్రజలను ఉద్దేశించి మాట్లాడే వెసులుబాటు కూడా ఉంది. వాహనంపై పార్టీ జెండా, వైయస్సార్ చిత్రాలు ఉన్నాయి.

పార్టీ పదవులకు దేవినేని, వంశీ రాజీనామాలు

విజయవాడ : కృష్ణాజిల్లాలో తెలుగు తమ్ముళ్ల విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇవి రాజీనామాలకు దారి తీశాయి. కృష్ణాజిల్లా టీడీపీ అధ్యక్ష పదవికి దేవినేని ఉమ శుక్రవారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా దేవినేని ఉమ మీడియాతో మాట్లాడుతూ తనపై వల్లభనేని ఉమ, నాని చేస్తున్న ఆరోపణలకు మనస్తాపం చెందే రాజీనామా చేసినట్లు తెలిపారు. నందమూరి హరికృష్ణ అంటే తనకు గౌరవం అని దేవినేని చెప్పారు. కార్యకర్తలతో చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు, ఎన్టీఆర్ స్ఫూర్తితో పనిచేస్తున్న తనపై ఆరోపణలు చేయటం సరికాదన్నారు. ఉమా మహేశ్వరరావుకు మద్దతుగా తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు రాజీనామా చేశారు. ఇటు విజయవాడ నగర టీడీపీ అధ్యక్ష పదవికి వల్లభనేని వంశీ కూడా రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామాను ఫ్యాక్స్ ద్వారా పార్టీ కార్యాలయానికి పంపించారు. ఈరోజు మధ్యాహ్నాం రెండు గంటలకు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. హరికృష్ణ పర్యటన సందర్భంగా దేవినేని ఉమ వైఖరికి నిరసనగా తాను రాజీనామా చేస్తున్నట్లు వంశీ చెప్పుకొచ్చారు. ఈ పరిణామాల పట్ల తెలుగుదేశం పార్టీ నాయకుడు హరికృష్ణ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాలు రచ్చకెక్కడంపై ఆయన మండిపడ్డారు. పార్టీలో సమన్వయంతో పని చేసి, అందరినీ కలుపుకుని పోవాలి తప్ప విభేదాలకు తావిచ్చేలా వ్యవహరించడం సరి కాదని ఆయన కృష్ణా జిల్లా నాయకులకు చెప్పినట్లు సమాచారం.

క్రికెట్ తో దౌత్యానికి ముడిపెట్టొద్దు సుష్మ

చెన్నై: కేంద్ర ప్రభుత్వం క్రీడలకీ, దౌత్యానికి ముడి పెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలను బిజెపి సీనియర్ నేత సుష్మా స్వరాజ్ విమర్శించారు. ‘ఆటను ఆటగానే చూడాలి. చర్చలు, దౌత్య వ్యవహారాలు ప్రత్యేకంగానే ఉండాలి’ అని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ మీడియాతో అన్నారు. మొహిలీలో బుధవారం జరిగిన క్రికెట్ పోటీలకు పాక్ ప్రధాని, భారత్ ప్రధానులు హాజరవడం గురించి ఆమె ప్రస్తావించారు. క్రీడలకూ. దౌత్యానికి ముడి పెడితే క్రీడాకారులపై ఒత్తిడి పడి వారి ఆటతీరును ప్రభావితం చేస్తుందని ఆమె అన్నారు. ఎన్నికల కమిషన్ పనితీరును ఆమె ప్రశంసిస్తూ, అది నిష్పక్షపాతంగానే పనిచేస్తోందని కానీ తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి మాత్రం ఏదో నిరాశతో ఇసిని విమర్శిస్తున్నారని అన్నారు. దేశంలో తమిళనాడులో చక్కటి పరిపాలన ఉండేదని, కానీ డిఎంకె అధికారంలోకి వచ్చాక గత ఐదేళ్లలో అక్కడ పరిస్థితులు క్షీణించాయని ఆమె చెప్పారు. డిఎంకెకి చెందిన కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజాపై 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో సిబిఐ 80 వేల పేజీలతో చార్జిషీట్‌ను సుప్రీంకోర్టుకు దాఖలు చేయనుందని అన్నారు. ఎన్నికల పేరుతో జనాలను మభ్యపెట్టి ఈ అవినీతి మచ్చను తుడిపేసుకోవచ్చునని డిఎంకె భావిస్తే అది తప్పే అవుతుందని ఆమె చెప్పారు. తమిళనాడు బిజెపి వ్యవహారాల ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న సుష్మాస్వరాజ్ అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీస్తున్న అవినీతి పవనాలు, కేంద్రంలో కాంగ్రెస్ పాలనపై ఉన్న వ్యతిరేకత, తమ పార్టీపై ప్రజల్లో నెలకొన్న సానుకూల భావనల వల్ల తమ పార్టీ ఎక్కువ స్థానాలనే సాధిస్తుందన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు

పారిపోయిన అనుష్క

బెంగుళూరు: టాలీవుడ్ సూపర్ హీరోయిన్ అనుష్క పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆమె ఆస్తులపై ఆదాయపన్ను శాఖ కన్ను పడటమే ఇందుక్కారణం. అనుష్క రాష్ట్రంలో ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టిందన్న విషయంపై ఐటీ లోతుగా పరిశీలన జరుపుతోంది. ఆమధ్య నాగార్జున, రవితేజ, అనుష్క ఇళ్లపై ఐటీ శాఖ ఒకేసారి సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. వారి సంగతి ఎలా ఉన్నా అనుష్క మాత్రం ఐటీ దాడులతో బెంబేలెత్తిపోతోంది. ఇదిలావుండగా అనుష్క హోమ్ టౌన్ బెంగళూరులోనూ ఆమెకేమైనా అక్రమ సంపాదన ఉన్నదా అన్న కోణంలో ఐటీ అధికారులు దృష్టి సారించినట్లు టాలీవుడ్ ఫిలిమ్ జనం అనుకుంటున్నారు. ఈ విషయం అనుష్క చెవిన పడటంతో ఉన్నపళంగా బెంగళూరుకు చెక్కేసిందట. ఎవరైనా ఫోన్ చేస్తే కొంతకాలం ఆగిన తర్వాత మళ్లీ కలుస్తానని సమాధానామిస్తోందట.

ప్రభుత్వ చేతగాని తనంతోనే పెంపు: బాబు

హైదరాబాద్ : వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, తర్వాత ముఖ్యమంత్రి అయిన కిరణ్‌కుమార్‌రెడ్డి అనుసరిస్తున్న లోపభూయిష్ట విధానాల వల్లే రాష్ట్రంలో విద్యుత్ రంగం కుప్పకూలిందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుచూపు గానీ, సరైన ప్రణాళిక గానీ లేనందునే విద్యుత్ రంగం సంక్షోభం దిశగా పయనిస్తోందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫ్యూయల్ సర్‌చార్జీల పేరుతో వినియోగదారులపై ఏటా భారాన్ని మోపుతూనే ఉన్నారని తెలిపారు. ఏడాదిలోపే రెండుసార్లు విద్యుత్ చార్జీలను పెంచడం ప్రభుత్వ చేతగానితనానికి, అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు. బడ్జెట్ సమావేశాలు ముగిసిన మరుసటి రోజే విద్యుత్ చార్జీలు పెంచడం ప్రభుత్వ పలాయనవాదానికి నిదర్శనమని దుయ్యబట్టారు. పరిశ్రమలు, వాణిజ్య వినియోగదారులపై రూ.3,678 కోట్ల భారాన్ని మోపి ఏడాది కాకుండానే మళ్లీ అన్ని వర్గాల వినియోగదారులపై రూ.650 కోట్ల మేరకు భారం మోపడం దగాకోరుతనమన్నారు. ఓవైపు ధరల పెరుగుదలతో ప్రజలు సతమతమవుతుంటే, విద్యుత్ చార్జీలు, పన్నులను పెంచడం దారుణమని పేర్కొన్నారు. విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా ఈ నెల 6న రాష్ట్రంలోని అన్ని మండలాల్లో సబ్‌స్టేషన్ల ఎదుట ధర్నాలు నిర్వహిస్తామని ప్రకటించారు. విద్యుత్ కోతల కారణంగా రబీలో పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు.

బాబు వారసుడు లోకేశా? జూనియర్ ఎన్టీఆరా?

హైదరాబాద్: మూడు దశాబ్దాల తెలుగుదేశం పార్టీ మూడో తరంలో ఎవరిని పిలుస్తుంది!? పార్టీ పగ్గాలు చేపట్టేదెవరు!?  చంద్రబాబు రాజకీయ వారసుడు ఎవరు? నిజానికి, టీడీపీలో ఇప్పటికిప్పుడు చంద్రబాబుకు ప్రత్యామ్నాయం అవసరం లేదు. ఆయన నాయకత్వానికి ఢోకా లేదు. ఎదురు తిరిగే వారెవ్వరూ లేరు. చంద్రబాబు ఫిట్‌నెస్ విషయంలో ఎవరికీ అనుమానాలూ లేవు. మరో రెండు ఎన్నికలను సైతం సునాయాసంగా ఒంటిచేత్తో ఎదుర్కోగల ఉత్తేజంతో ఆయన ఉన్నారు. అయినా, లోకేశ్, జూనియర్ ఎన్టీఆర్‌లలో టీడీపీ అధినేత వారసుడు ఎవరనే అంశంపై పార్టీ శ్రేణుల్లో తీవ్రంగా చర్చ సాగుతోంది. తర్జనభర్జన కొనసాగుతోంది. చంద్రబాబు వారసుడి రేసులో ప్రధానంగా మూడు పేర్లు చర్చకు వస్తున్నాయి. వారిలో ఒకరు.. చంద్రబాబు బావమరిది బాలకృష్ణ అయితే.. మిగిలిన ఇద్దరూ లోకేశ్.. జూనియర్ ఎన్టీఆర్‌లు. అయితే, చంద్రబాబు నారా లోకేష్ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. నారా లోకేష్‌కు తన కూతురును ఇచ్చిన నందమూరి బాలకృష్ణ తాను నాయకత్వం కోసం పోటీ పడకపోవచ్చునని అంటున్నారు. చంద్రబాబు అభిప్రాయానికి అనుగుణంగా ఆయన నారా లోకేష్‌కు మద్దతుగా నిలిచే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. అయితే, మరో వైపు జూనియర్ ఎన్టీఆర్ దూసుకొస్తున్నారు. తన సమీప బంధువు నార్నే శ్రీనివాస రావు కూతురును జూనియర్ ఎన్టీఆర్‌కు పెళ్లి చేస్తున్న చంద్రబాబు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నారా లోకేష్‌కు అడ్డు రాకుండా ఈ పెళ్లి ఉపయోగపడుతుందని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, పార్టీ కార్యకర్తల నుంచి జూనియర్ ఎన్టీఆర్‌కు మద్దతు లభిస్తుంది. విశేష జనాదరణ ఆయనకు ఉంది. తాత స్వర్గీయ ఎన్టీ రామారావు లక్షణాలను పూర్తిగా పుణికి పుచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ పార్టీ నాయకత్వానికి సరిగ్గా సరిపోతాడని అంటున్నారు. జనాదరణ విషయానికి వస్తే నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్‌తో పోటీ పడలేరు. కానీ ఇప్పటికే ఆయన పార్టీ వ్యవహారాల్లో తలదూరుస్తూ పార్టీ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నట్లు చెబుతున్నారు. చంద్రబాబుకు చేదోడు వాదోడుగా నిలుస్తూ పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నట్లు కూడా చెబుతున్నారు.

ముగ్గురి మధ్య హోరాహోరీ

హైదరాబాద్: కడప లోక్ సభ సీటుకు, పులివెందుల శాసనసభా స్థానానికి త్రిముఖ పోటీ ఖరారైనట్లే. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగడానికి రంగం దాదాపుగా సిద్ధమైనట్లే. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇప్పటికే తన అభ్యర్థులను ఖరారు చేసింది. కడప లోక్ సభ సీటు నుంచి వైయస్ జగన్‌ను, పులివెందుల శాసనభా నియోజకవర్గం నుంచి వైయస్ విజయమ్మ పోటీ పడతారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గురువారం తాజాగా మరోసారి ప్రకటించింది. వీరిని ఎదుర్కోవడానికి తగిన బలమైన అభ్యర్థుల కోసమే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. ఈ ఉప ఎన్నికలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ప్రతిష్టాత్మకంగా మారాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కడప నుంచి కాంగ్రెసు పార్టీ అభ్యర్థి ఓడిపోయిన నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి ఉప ఎన్నికల కోసం పకడ్బందీ వ్యూహాన్ని రూపొందించే పనిలో పడ్డారు. ఇప్పటి వరకు కాంగ్రెసు అభ్యర్థులుగా పులివెందుల నుంచి వైయస్ వివేకానంద రెడ్డి, కడప లోక్ సభ సీటు నుంచి ఆయన అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి పోటీ చేస్తారని అనుకుంటూ వస్తున్నారు. అయితే, వదిన విజయమ్మ మీద పోటీ చేయడానికి వైయస్ వివేకానంద రెడ్డి విముఖత ప్రదర్శిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, వివేకానంద రెడ్డి మాత్రం ఆ విధమైన యోచనలో ఉన్నట్లు కనిపించడం లేదు. ఏమైనా మార్పు చేయదలిస్తే అధిష్టానం చేయాల్సిందే. ఈ స్థితిలో వైయస్ వివేకానంద రెడ్డి తన నర్రెడ్డి రాజశేఖర రెడ్డితో కలిసి గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. ఒక రకంగా కడప జిల్లాలో ఆధిపత్యం కోసం పోరాటం చేయాల్సిన అనివార్యతలో వివేకానంద రెడ్డి పడ్డారు. వైయస్ జగన్‌పై ఆధిక్యత సాధించడం ఆయన తక్షణ లక్ష్యంగా కనిపిస్తోంది. అందువల్ల హోరాహోరీ పోరుకే ఆయన సిద్ధపడవచ్చు.

జగన్ కు గట్టిపోటీనివ్వనున్న టీడీపీ

కడప: చంద్రబాబు నివాసంలో జరిగిన వైఎస్‌ఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ నేతల సమావేశం ముగిసింది. కడప లోకసభ, పులివెందుల ఉప ఎన్నికల కోసం పార్టీ అనుసరించాల్సిన వ్యూహం పై చర్చ జరిపినట్టు తెలిసింది. మే 8 వ తారీఖున జరిగే కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాల నుండి పోటీ చేయాల్సిన అభ్యర్థులను టిడిపి దాదాపు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెసు ఓట్లు చీలిపోతున్నందున తాము లాభపడతామని భావించిన టిడిపి బలమైన అభ్యర్థిని నిలపాలనే యోచనలో ఉంది. పులివెందుల శాసనసభనుండి బిటెక్ రవిని పోటీ చేయించే ఉద్ధేశ్యాలు కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక కడప పార్లమెంటు స్థానం నుండి కూడా జగన్‌ను ఎదుర్కొనడానికి బలమైన అభ్యర్థిని పెట్టాలని చూస్తోంది. కాంగ్రెసునుండి టిడిపిలోకి వచ్చిన సీనియర్ నాయకుడు మైసూరారెడ్డిని కడపనుండి పోటీ చేయించాలనే యోచనలో ఉంది. అయితే కందుల రాజమోహన్ రెడ్డి, రామసుబ్బారెడ్డి వంటి వారిని కూడా పార్టీ పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. అసెంబ్లీ అభ్యర్థి దాదాపు ఖరారైనప్పటికీ, పార్లమెంటు అభ్యర్థిగా మాత్రం పై ముగ్గురిని పరిశీలిస్తోంది. పూర్తిగా పరిశీలించి పార్టీలో చర్చించిన అనంతరం ఏప్రిల్ 5వ తారీఖున అభ్యర్థులను ప్రకటించనున్నారు. కాగా, కడప లోక్ సభ నియోజకవర్గానికి జరిగే ఉపఎన్నిక కోసం మండలానికి ముగ్గురు ఎమ్యెల్యేలను నియమించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.