అప్పుడు సస్పెండ్ చేశారు... మరిప్పుడు?
posted on Mar 28, 2011 @ 2:31PM
హైదరాబాద్: గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగిన సంఘటనలకు తెలంగాణ ప్రాంత సభ్యులను సస్పెండ్ చేసిన శాసనసభ డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ నేటి సంఘటనకు బాధ్యులైనవారిని కూడా సభ నుంచి సస్పెండ్ చేయాలని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఒక వేళ వివేకానందరెడ్డిపై చర్యలు తీసుకోకపోతే కొంత మంది ఒత్తిడికి లోనై, సీమాంధ్ర సభ్యుల పట్ల వివక్ష చూపుతున్న సభాపతిగా మనోహర్ మిగిలిపోతారని ఆయన అన్నారు. సభ సీమాంధ్ర సభగా, సీమాంధ్రుల అక్రమాలను కాపాడే సభగా మిగిలిపోతుందని ఆయన అన్నారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగిన సంఘటనల వీడియోలను మీడియాకు విడుదల చేసిన నాదెండ్ల మనోహర్ నేటి సంఘటనల వీడియోలను కూడా విడుదల చేయాలని ఆయన అన్నారు. మీడియాకు నాటి సంఘటనల వీడియోలను విడుదల చేసి తమపై చర్యలు తీసుకున్నారని, నేటి సంఘటనలపై కూడా అదే వైఖరిని తీసుకోవాలని ఆయన అన్నారు. సభ్యులపై దాడికి దిగిన మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి 2014 వరకు ఉభయ సభల్లో అడుగు పెట్టకుండా చర్యలు తీసుకోవాలని ఆయన నాదెండ్ల మనోహర్‌ను కోరారు. సభ్యుల హక్కులను రక్షించాల్సిన బాధ్యత మనోహర్‌పై ఉందని ఆయన అన్నారు. వివేకానంద రెడ్డితో పాటు సభ్యులపై దాడికి ప్రయత్నించిన ఇతర శాసనసభ్యులపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దాడికి దిగినవారిపై చర్యలు తీసుకోకపోతే నాదెండ్ల మనోహర్‌పై ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు.