జగన్ పాలనలో సాగు వెతలు.. కానరాని ఏరువాక సంబరాలు
‘విసిరిన బంతినల్లా ఓకే చేస్తే.. వెర్రోడే విన్నర్’ చందంగా ఉంది ఏపీలోని వైసీపీ సర్కార్ తీరు. ఒక్క ఛాన్స్ అంటూ పవర్ లోకి వచ్చిన సీఎం జగన్ తమ నెత్తినే భస్మాసుర హస్తం పెడుతున్నారనే విమర్శలు రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్ర ఖజానాలో కాసులు లేవు. విద్యుత్ సరఫరా లేదు. రోడ్లు లేవు, సౌకర్యాలు లేవు. అభివృద్ధి లేదు..పాలన పట్ల, ప్రజా సమస్యల పట్ల వైసీపీ సర్కార్ కు అనుభవం లేదు. ఆపై మొండితనం.. అధికార పార్టీ నేతల తీరుతో జనం లబోదిబో. కరెంట్ లేదు.. వ్యవసాయ విద్యుత్ మోటార్లకు 9 గంటల నాణ్యమైన విద్యుత్ మాట అంటుంచితే.. అసలు విద్యుత్తే లేని దుస్థితిలో ఏపీ కొట్టుమిట్టాడుతోంది. తద్వారా అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ లో పంటలు సాగు చేసే పరిస్థితి కనిపించడం లేదు. జగన్ హయాంలో అన్నదాతలు కుదేలైపోయారు. సాగు వెతలతో ఏపీలో ఏరువాక సంబరాలే కానరావడం లేదు. గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా పచ్చటి కోనసీమలో రైతులు క్రాప్ హాలీడే ప్రకటించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
పంటలకు నీరు లేక రైతులు, రోడ్లు లేక ప్రయాణికులు, విద్యుత్ లేక ప్రజలు, ఉపాధి లేక నిరుద్యోగులు, పని ఉన్నా జీతాలు వచ్చే పరిస్థితి లేక కార్మికులు, సరైన చదువుల్లేక విద్యార్థులు, వైద్యం అందక సామాన్యులు, అమ్మకాలు లేక వ్యాపారులు, ఉత్పత్తి లేక సంస్థలు.. ఇలా ఒకటేమిటి? ఏపీలో ఏ ఒక్క రంగాన్ని కదిలించినా కన్నీటి పర్యంతం అయ్యే పరిస్థితి నెలకొందంటున్నారు. పనుల నిర్వహణలో జగన్ సర్కార్ నిర్లక్ష్యం, నిష్క్రియాపరత్వం కారణంగా ఏపీలోని పలు వర్గాల ప్రజలు నిరంతరం నలిగిపోతున్నారు. పూర్తయిన పాత ప్రాజెక్టు పనులకు బిల్లులు చెల్లించని దుస్థితి.. పైగా పనులకు టెండర్లు పిలుస్తాం.. పనిపూర్తి చేసేయండి.. కానీ బిల్లులు అడగొద్దని ఏపీ సర్కార్ చెబుతుంటే.. ఏ కాంట్రాక్టరైనా ఎందుకు ముందుకు వస్తారనే ప్రశ్న వస్తోంది.
వాటర్ షెడ్ పనులకు నిధులు వెచ్చించడంలో ఏపీ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. దాంతో గడువులోగా ఏపీలో ప్రాజెక్టులేవీ పూర్తి కాని దుస్థితి నెలకొందంటున్నారు. ఇప్పటికే పూర్తి చేసిన పాత ప్రాజెక్టులకు వైసీపీ సర్కార్ 80 కోట్ల మేరకు బిల్లులు చెల్లించలేదట. దాంతో కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదట. దీంతో ఏపీలో వాటర్ షెడ్ పనులు ముసుగుతన్ని పడుకుంటున్నాయి.
వర్షపునీటిని వడిసి పట్టి, భూగర్భజలాల్ని పెంచేందుకు 2009-10 నుంచి 2013-14 సంవత్సరాల మధ్య 373 వాటర్ షెడ్ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం ఏపీకి మంజూరు చేసింది. వాటిలో కొన్నింటి పనులు బాగా ఆలస్యమయ్యాయి. ఎట్టకేలకు 2022 మార్చి నాటికి పూర్తయ్యాయి. అయితే.. అనేక గ్రామాల్లో పనులు పూర్తిచేసిన వాటర్ షెడ్ కమిటీలు వైసీపీ సర్కార్ తీరుతో బిల్లుల కోసం బిక్కమొహంతో చూడాల్సిన పరిస్థితి ఉంది. గ్రామాల్లోని చిన్న, సన్నకారు రైతులతో వేసిన కమిటీలు చెక్ డ్యామ్ లు, ఊట చెరువుల, ఇతర పనులు చేయిస్తుంటారు. వీటికి పెట్టుబడి పెట్టి పనులు పూర్తిచేసిన వారంతా బిల్లులు రాక అవస్థల్లు పడుతున్నారు. దీంతో వాటర్ షెడ్ పనులు నీరుగారిపోతున్నాయి.
సీఎం సొంత జిల్లాకు నీరు తీసుకెళ్లే సొరంగం పనులు నత్త నడకన సాగుతున్నాయి. బిల్లుల చెల్లింపులో జాప్యం, కాంట్రాక్టర్ల అలసత్వం వల్లే క్షేత్రస్థాయిలో పనులు జరగడం లేదంటున్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ ను వెలిగొండ సొరంగాల ద్వారా నల్లమల సాగర్ కు 43.5 టీఎంసీలు తరలించి ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు, కడప జిల్లాలోని 30 మండలాల్లో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని గత ఎన్నికలప్పుడు వైఎస్ జగన్ ఇచ్చిన హామీ నెరవేరడం లేదు. కాల్వల మరమ్మతుల టెండర్ లో బిల్లుల కోసం ఒత్తిడి తేవద్దని వైసీపీ సర్కార్ పెట్టిన నిబంధనలు రాష్ట్రం పరువు తీశాయన్న టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శ ఈ సందర్భంలో ప్రస్తావించదగ్గ అంశం.
దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో ఏపీలో విద్యుత్ కొరత ఎక్కువగా ఉంటోందని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ లెక్కలు చెబుతున్నారు. గత ఏప్రిల్ లో ఏపీలో 382 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు వచ్చిందట. విద్యుత్ డిమాండ్ కు తగినట్లు సప్లై లేకపోవడం.. విపరీతమైన పవర్ కట్ లతో రైతులు, సామాన్యుల్లో తీవ్ర అసహనం పెల్లుబుకుతోంది. ఏపీలోని చిన్న చెరువుల్లో ఏళ్ల తరబడి పూడికలు తీయలేదు. దీంతో ఆయా చెరువుల నీటి సామర్ధ్యం తగ్గిపోతోంది. తద్వారా ఆయకట్టు కూడా తగ్గిపోతోంది.
వైసీపీ సర్కార్, జగన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందిన కోనసీమలోని 12 మండలాల రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారు. దిక్కుతోచని స్థితిలోనే క్రాప్ హాలిడే అంటున్నామని కోనసీమ రైతు పరిరక్షణ సమితి ఆవేదనగా చెబుతోంది. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి సకాలంలో డబ్బులు చెల్లించడం లేదు. దాంతో పెట్టుబడి పెట్టిన సొమ్ములు చేతికి అందక, తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక అన్నదాతలు సతమతం అయిపోతున్నారు. దీంతో సాగు చేసేందుకు పలువురు రైతులు విముఖత చూపుతున్నారు. అన్నపూర్ణగా పేరు పొందిన ఏపీలో సాగుబడి ముందుకు సాగే పరిస్థితి కనిపించడం లేదు.