జగన్ సర్కార్’కు టాలీవుడ్ ... బిగ్ శాల్యూట్

తెలుగు చిత్ర సీమకు,రాజకీయ చుట్టరికం కొత్త విషయం కాదు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్’ లో  కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగానే, చాలా మంది  నటీ నటులు, రాజకీయ అరంగేట్రం చేశారు. పాత తరం హీరో కంమ్ విలన్  కొంగర జగ్గయ్య మొదలు నట శేఖర కృష వరకు కాంగ్రెస్ టికెట్ మీద పోటీచేసి పార్లమెంట్’ లో అడుగు పెట్టారు. అలాగే హీరోయిన్లలో జమున కూడా కాంగ్రెస్ ఎంపీగా లోక్ సభకు ఎన్నికయ్యారు. అలాగే, వాణిశ్రీ, వంటి ఇంకొందరు  ప్రముఖ నటీనటులు చట్టసభల్లో కాలు పెట్టక పోయినా కాంగ్రెస్ పార్టీలో, అదే విధంగా కమ్యూనిస్ట్ పార్టీలలో క్రియాశీలక పాత్రను పోషించారు. ఎర్ర సినిమాలకు పెట్టింది పేరుగా నిలిచినా మాదాల రంగా రావు,  కమ్యూనిస్ట్ రాజకీయాల్లో క్రియాశీల పాత్రను పోషించారు.  అలాగే అల్లు రామలింగయ్య చివరి వరకు, సిపిఎం పార్టీకి ప్రతి సంవత్సరం ‘సెస్’ ( చందా)  ఇచ్చేవారని అంటారు.  ఇక, విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, అన్న ఎన్టీ రామ రావు స్థాపించిన తెలుగు దేశం హయాంలో అయితే చెప్పనే అక్కరలేదు. ఆది సినిమా రాజకీయ అనుబంధానికి స్వర్ణ యుగం అని చెప్పవచ్చును. ఆ కాలంలో  ఎందరో నటీనటులు, నిర్మాతలు, దర్శకులు ఒకరని కాదు 24 ఫ్రేమ్స్  కు చెందిన అనేక మంది సినిమా ప్రముఖులు ప్రత్యక్షంగా, పరోక్షంగా రాజకీయాలలో క్రియాశీల భూమికను పోషించారు. తెలుగు దేశం టికెట్ పైన, ఎంపీలు, ఎమ్మెల్యేలు అయ్యారు. బాబూ మోహన్ వంటి ఒకరిద్దరు మంత్రులుగానూ ఓ వెలుగు వెలిగారు. నిర్మాత రామానాయుడు, నటీ నటులు నందమూరి బాల కృష్ణ, హరికృష,  మురళీ మోహన్, సత్యనారాయణ, రావు గోపాల రావు, బాబు మోహన్, కోట శ్రినివాస రావు, శారద, జయ ప్రద, జయ సుధ, కే . రోజా, ఇంకా అనేక  మంది తెలుగు దేశం పార్టీ వేదిక నుంచే రాజకీయ అరంగేట్రం చేశారు. పార్టీలు మారినా ఇప్పటికీ కొందరు క్రియాశీలంగా, కీలక పదవుల్లో ఉన్నారు.  అలాగే రెబెల్ స్టార్ క్రిషన్ రాజ, కోట శ్రీనివాస రావు, నరేష్ వంటి చాలా మంది నటీనటులు బీజేపీలో క్రియాశీలంగా వ్యవహరించారు. కృష్ణం రాజు అయితే, వాజ్ పేయి ప్రభుత్వంలో కేంద్ర మత్రిగా పనిచేశారు.  అదే విధంగా  మెగా స్టార్  చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారానూ కొందరు, నటీ నటులు సినీ ప్రముఖులు రాజకీయాలలో తమ అదృష్టాన్ని పరీక్షించు కున్నారు. అయితే, చిరంజీవి అతి తక్కువ కాలంలోనే ప్రజారాజ్యం దుకాణం మూసి వేయడం వల్లనో ఏమో తమ్ముడు, పవన్ కళ్యాణ్. పోసాని కృష్ణ మురళీ తప్పించి పెద్దగా సినిమా వాళ్ళు చిరంజీవితో చేయి కలపలేదు. కలిసి నడవలేదు. చివరకు తమ్ముడు పవన్ కళ్యాణ్’ కూడా ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడాన్ని వ్యతిరేకించి,వేరు కుంపటి(జనసేన) పెట్టుకున్నారు.  ఇక ప్రస్తుతానికి వస్తే, ఉభయ తెలుగు రాష్ట్రాలలో  సినిమా వాళ్ళకు పొలిటికల్ ప్యాట్రనేజ్ పెద్దగా దక్కడం లేదు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సినిమా వాళ్ళను కూరలో కరివేపాకులా వాడుకుని  వదిలేస్తున్నారు. అంతే కానీ, వారికి సముచిత స్థానం ఇవ్వడం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్రను పోషించిన విజయ శాంతి మొదలు నిన్నమొన్న ఇట్లా దగ్గర చేసి అట్లా పక్కన  పెట్టిన ప్రకాష్ రాజ్ వరకు  ఎవరికీ కాసింత గౌరవం ఇచ్చింది లేదు. అందరి విషయంలోలానే సినిమా వాళ్ళ విషయంలోనూ కేసీఆర్, యూజ్ అండ్ త్రో’ పద్ధతినే పాటించారని  అంటారు.  ఇక ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయం అయితే చెప్పనే అక్కరలేదు. నిజానికి, సినిమా హీరోలను జీరోలుగా చేసిన, ‘ఘనత’ జగన్ రెడ్డికే దక్కింది. సినిమా టికెట్ ధరల చుట్టూ వివాదాన్ని సృష్టించి, వివాదం పరిష్కారం విషయంలో ప్రభుత్వం అనుసరించిన విధానం  సినిమా రంగం పట్ల జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్న అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పింది. అదే విధంగా రాజకీయ పదవుల విషయంలోనూ జగన్ రెడ్డి, చిరంజీవి మొదలు అలీ వరకు, మోహన్ బాబు  మొదలు పోసాని కృష్ణ మురళీ, వరకు ప్రతి ఒక్కరితో ఒకే విధంగా ఆడుకున్నారనే టాక్  టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అందుకే, ఇంతవరకు ఏవో ఆశలతో, వైసీపే కండువా కప్పుకుని, జగన్ రెడ్డిని నెత్తిన మోసిన, పెద్దల ఆశలు మంచులా కరిగి పోయాయని, ఇంకొందరేమో, జగన్ రెడ్డి ని మోసి నందువలన తమకు దక్కింది ఏమీ లేక పోగా సినిమాల్లోనూ అవకశాలు రావడం లేదని అ వాపోతున్నారు. అందుకే జగనన్నా నీకో దండం అంటున్నారు.  అదలా ఉంటే  రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్దికి అవకాశాలున్నా, సినిమా  రంగం అంటే ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి చిన్న చూపని, అర్థమయింది కాబట్టే, స్టుడియోల నిర్మాణానికి ఫ్రీ ల్యాండ్ సహా ఇతర సదుపాయాలు కలిపిస్తామని చెప్పినా, ఎవరూ ముందుకు రావడం లేదని, అంటున్నారు.

బంగారం దొంగ ఈ చిట్టెలుక‌!

కుందేళ్లు, ఎలుక‌లు ప‌గ‌దీర్చుకోవ‌డం జాన‌ప‌ద‌క‌థ‌ల్లో చ‌దివాం. రాకుమారుడికి అత‌ని ప్రేయ‌సి వున్న చోటు పూర్వం ఒక కుందేలే చూపించ‌డం వంటి చంద‌మామ క‌థ‌లు ఎంతో ఆస‌క్తిక‌రంగా వుంటాయి. అవి నిజంగా జ‌రిగాయో లేదో  తెలీదుగాని పాఠ‌కుల‌కు మాత్రం క‌థ ప‌ట్ల ఉత్సాహాన్ని రెట్టింపుచేస్తాయి. ఎలు క‌లు మ‌ద్యం తాగాయి, గోడౌన్ల‌లో బియ్యం తినేశాయ‌న్న క‌థ‌లూ అప్పుడ‌ప్పుడూ  పేప‌ర్ల‌లో చ‌దువుతూం టాం.  కానీ ఒక ఎలుక నిజంగానే దొంగ‌లా దొరికింది! ఈ దొంగ ముంబాయిలో ఏకంగా బంగారం వున్న క‌వ‌రుతో దొరికింది! అస‌లే బంగారం ఖ‌రీదు ఆకాశాన్ని అంటుతున్నాయి. ముంబాయిలో ఓ పెద్దావిడ త‌న వ‌ద్ద వున్న బంగా రాన్ని బ్యాంక్‌లో డిపాజిట్ చేయాల‌ని బ‌య‌లుదేరింది. దారిలో పిల్ల‌లు ఆడుతూ క‌నిపించారు. వారికి ఆమె చేతిలో వున్న బ్రెడ్ ఇవ్వాల్సింది పొర‌బాటున బంగారం వున్న క‌వ‌ర్ ఇచ్చేసింది. పిల్ల‌లు ఆట గోల లో ఆ క‌వ‌ర్‌ని రోడ్డు ప‌క్క‌న వుండే  చెత్త కూప‌లో ప‌డేయ‌మ‌ని ఇచ్చిందేమో అనుకున్నారు. అస‌లు  ఆ క‌వ‌ర్లో  ఏముందో కూడా చూడ‌కుండా చెత్త‌కుప్ప‌లోకి  విసిరేసి వెళిపోయారు. అది  ముంబ‌యి గోకుల్‌ధామ్ కాల‌నీ ప్రాంతం. ఆ చెత్త‌కుప్ప వ‌ద్ద‌కు వచ్చిన ఎలుక స‌రిగ్గా ఆ బంగారం వున్న క‌వ‌ర్‌నే ప‌ట్టుకుని కొరికింది. అది ఏదో తినే ప‌దార్ధ‌మ‌నుకున్న‌ది. కొర‌క‌బ‌డ‌లేదు..దూరంగా తీసికెళ్లి మ‌రో ప్ర‌య‌త్నం  చేయాల‌నుకుందో ఏమో ఆ క‌వ‌ర్‌ని నోటితో గ‌ట్టిగా మ‌రో ప‌ట్టుప‌ట్టి  త‌న‌వ‌ల్ల కాక అక్క‌డే వ‌దిలేసి పోయింది.  పోలీసులు అక్క డికి వ‌చ్చి ఆ బంగారాన్ని రిక‌వ‌ర్ చేసుకున్నారు.  ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఎలుక త‌తంగాన్ని ప‌ట్టేసాయి.  అది ఇచ్చిన పెద్ద సాక్ష్యంతో  పోలీసులు ఈ చిన్ని దొంగ త‌తంగాన్ని గుర్తించి  ప‌రుగున వెళ్లి బంగారం క‌వ‌ర్‌ని  ప‌ట్టేసారు.   పిల్ల‌లే వ‌ది లేసిన క‌వ‌ర్‌లో త‌ను ప‌ట్టుకున్న క‌వ‌ర్‌లో ఎంతో విలువ‌యిన బంగారం వుంద‌న్న సంగ‌తి దానికి  తెలియ‌దు, తెలిసినా వాటి సంగ‌తి దానికి అన‌వ‌స‌రం, తినేద‌యితే ఈపాటికి తినేసేదే. అది కొరుకుడు ప‌డలేదు కాబ‌ట్టి వ‌దిలేసి పారిపోయేదే!   ఆ చోరీ స‌త్తు రిక‌వ‌రీ అయింది!  

జేసీ సోదరుల నివాసాల్లో ఈడీ సోదాలు

ఈడీ దాడులు ఎప్పుడు జరిగినా సంచలనమే. ఆ దాడులు రాజకీయ నాయకుల నివాసాలలో అయితే మరింత సంచలనం. అందులోనూ తాడిపత్రిలో జేసీ సోదరుల నివాసాలపై ఈడీ దాడులంటే రాష్ట్ర మంతటా ఆ దాడుల ప్రకంపనలు వినిపిస్తాయి. కనిపిస్తాయి. ఇప్పడు అదే జరుగుతోంది తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి తో పాటు ఆయన  ముఖ్య అనుచరుడు క్లాస్ వన్ కాంట్రాక్టర్ గోపాల్ రెడ్డి ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  అధికారులు తనిఖీలు చేపట్టారు. జేసీ ప్రభాకర్ రెడ్డి సహా కుటుంబ సభ్యుల సెల్‌ఫోన్ల ను సైతం ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బయట వ్యక్తులు ఎవరూ ఇంట్లోకి రానీయడం లేదు.  గతంలో అశోక్ లేల్యాండ్ నుంచి కొనుగోలు చేసిన వాహనాల విషయంలో జరిగిన లావాదేవీలపై ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. తనిఖీల సమయంలో జేసీ సోదరులు ఇళ్లలోనే ఉన్నారు.  ఈడీ దాడుల నేపథ్యంలో జేసీ ఇంటికి సమీపంలో పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులను కూడా  పెద్ద ఎత్తున మోహరించారు.  జేసీ ఇంటిపై ఈడీ రైడ్స్ నేపథ్యంలో తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది.   అదే విధంగా హైదరాబాద్ లోని జేసీ బ్రదర్స్ కు చెందిన నివాసాలలోనూ ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ఏక కాలంలో  తాడిపత్రిలోనూ, హైదరాబాద్ లోని జేసీ బ్రదర్స్ నివాసాలపై ఈడీ దాడులు జరగడం గమనార్హం.   రాజకీయ వేధింపులలో భాగమే ఈ దాడులు అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈడీ అధికారులు మాత్రం యధా ప్రకారం బస్సుల అక్రమ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ఆరోపణలపైనే ఈ దాడులు నిర్వహిస్తున్నామని చెబుతున్నారు. 

సికిందరాబాద్ స్టేషన్లో కాల్పులు.. ఒకరి మృతి

త్రివిధ దళాల్లో రిక్రూట్‌మెంట్‌ కోసం రక్షణశాఖ చేపట్టిన అగ్నిపథ్‌ నియామకాలపై నిరసనలు దేశవ్యాప్తంగా భగ్గుమన్నాయి.  నాలుగేళ్లు సర్వీస్‌ అంటూ కేంద్రం తమను పిచ్చివాళ్లను చేస్తోందని సైనిక నియామక రిక్రూట్‌మెంట్‌కు ప్రిపేర్‌ అవుతున్న యువత మండి పడుతోంది.  దేశ వ్యాప్తంగా యువత ఆగ్రహజ్వాలలు ఎగసిపడుతున్నాయి.   బీహార్‌ ,ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ , పంజాబ్‌ , హర్యానా రాష్ట్రాల్లో హింస చెలరేగింది. తాజాగా గురువారం యువత ఆగ్రహజ్వాలల్లో సికిందరాబాద్ స్టేషన్లో రైలు దగ్ధమైంది.    రైలు పట్టాలపై పార్సిల్ సామాన్లను కాల్చివేసి… నిరసన తెలిపారు. కేంద్రం వెంటనే అగ్నిపథ్‌ను రద్దు చేసి… యథావిధిగా సైనిక ఎంపిక జరపాలని డిమాండ్ చేశారు.   రైల్వే పోలీసులు రంగప్రవేశం చేసి కొందరు ఆందోళనకారులను అదుపులోనికి తీసుకున్నారు.  దీంతో కొందరు నిరసనకారులు పోలీసులపై రాళ్ల రువ్వారు. ప్రతిగా పోలీసులు జరిపిన కాల్పుల్లో  ఒకరు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు.  దేశ వ్యాప్తంగా యువత ఆందోళన దిగడానికి కేంద్రం ‘అగ్నిపథ్’ పేరుతో నిరుద్యోగుల ఆశలపై నీళ్లు పోయడమే కారణమని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అగ్నిపథ్ పేరున ఆర్మీ రిక్రూట్ మెంట్లు యువత భవిష్యత్ ను సర్వనాశనం చేస్తాయన్న విమర్శలు మేధావి వర్గం నుంచి కూడా వెల్లువెత్తుతున్నాయి.  

నిరసనలు వెల్లువెత్తుతున్నా... అగ్నిపథ్.. తగ్గేదేలే.. అంటున్న కేంద్రం

కేంద్ర ప్రభుత్వ అగ్నిపథ్ పథకానికి నిరసనగా దేశ వ్యాప్తంగా యువత ఆగ్రహ జ్వాలలు వ్యక్తం అవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేదే లే అంటూ ముందుకు సాగుతోంది.  భారత త్రివిధ దళాల్లో నాలుగేళ్ల పాటు సేవలు అందించేందుకు యువతకు అవకాశం ఇచ్చేలా కొత్తగా ప్రవేశ పెట్టిన 'అగ్నిపథ్' పథకానికి నిరసనగా దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి విదితమే. పలు ప్రాంతాలలో ఈ  హింసాత్మక రూపం కూడా దాలుస్తున్నాయి. అయితే ఈ పథకం విషయంలో పునరాలోచనే లేదంటూ కేంద్రం మొండిగా ముందుకే అడుగేస్తున్నది. అయితే ఈ పథకం కింద అర్హులైన యువత వయోపరిమితిని రెండేళ్లు పెంచింది.    తొలుత 17 ఏళ్ల నుంచి 21 ఏళ్ల యువకుల మాత్రమే  ఈ పథకానికి అర్హులని కేంద్రం ప్రకటించింది. తాజాగా గరిష్ఠ వయో పరిమితిని 23 ఏళ్లకు పెంచింది.  గత రెండేళ్లుగా ఆర్మీలో కొత్త నియామకాలు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం చెబుతోంది.    మున్ముందు ఆర్మీలోకి మరింత మందిని తీసుకుంటామని, ప్రస్తుత నియామకాలను మూడు రెట్లు చేస్తామని చెబుతోంది.  అగ్నిపథ్ పథకం కింద  ఈ ఏడాది 46 వేల మంది అభ్యర్థులను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిని ‘అగ్నివీరులు’గా పిలుస్తారు. వీళ్లను ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో నాలుగేళ్ల పాటు నియమిస్తారు.  అంతే.. నాలుగేళ్ల తరువాత వీరి భవిష్యత్తేమిటన్న ప్రశ్నకు మాత్రం కేంద్రం బదులివ్వడం లేదు. నాలుగేళ్లు ఆర్మీలో చేసిన సేవలకు నెలనెలా ఇచ్చే వేతనం మినహా వీరికి దక్కేది ఏమీ ఉండదు. పెన్షన్ వంటి సౌకర్యాలూ ఉండవు. నాలుగేళ్ల తరువాత మళ్లీ నిరుద్యోగులుగా రోడ్డున పడతారని ఈ పథకాన్ని వ్యతిరేకిస్తున్న వారు చెబుతారు. యథాప్రకారం ఆర్మీరిక్రూట్ మెంట్ జరిపితే.. ఇటువంటి దొడ్డిదారి పథకాల అవసరమేముంటుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు. 

గ‌డ‌ప గ‌డ‌ప‌కు తిర‌గ‌బ‌డుతున్న ప్ర‌జ‌!

పాల‌న అద్భుతంగా సాగుతుంటే ప్ర‌జ‌లు భుజాన‌కెత్తుకుంటారు. కేవ‌లం ప్ర‌చార ఆర్భాటంతో న‌డుస్తుం టే నొస‌ట‌ విరుపులూ వుంటాయి. ప్ర‌జ‌లు ఓట్లు వేసి గెలిపించారు గ‌నుక వారికి ఆగ్ర‌హించే హ‌క్కూ  వుం టుంది.  ప్ర‌జాసంక్షేమ ప‌థ‌కాల ఫ‌లాలు నిజంగానే ప్ర‌జ‌ల‌కు అందాలి కేవ‌లం పేరుకి ప‌థ‌కాలు అమ‌లు చేయ‌డానికి ప్ర‌భుత్వం పూనుకుంటే ఎద‌ర‌య్యేవ‌న్నీ అవ‌మానాలే! ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డ‌తారు, కాదు పొమ్మం టారు. ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో  జ‌గ‌న్ పాల‌న ప‌రిస్థితి ఇలానే వుంది.  వైసిపి గ‌డ‌ప గ‌డ‌ప కార్య‌క్ర‌మం ఉదృతంగా చేప‌ట్ట‌ద‌లిచారు. ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లి త‌మ  సంక్షేమ  కార్య‌క్ర మాల గురించి వైసీపి ఎమ్మ‌ల్యేలు, మంత్రులు ఇంటింటికీ తెగ తిరుగుతున్నారు. త‌మ‌ది గొప్ప సంక్షేమ రాజ్య‌మ‌ని, పింఛ‌న్లు పెద్ద  మొత్తంలో అంద‌స్తున్న ఘ‌న‌త త‌మ‌దేన‌ని  ప్ర‌చారం చేస్తూ  ప్ర‌జ‌ల‌కు  వారి సేవ‌లు ఎంత‌గా న‌చ్చాయో తెలుసుకుందామ‌ని  గ‌డ‌ప గ‌డ‌ప‌కూ తిరుగుతున్నారు. చిత్ర‌మేమంటే పింఛ న్లు  ఇప్పుడే కాదు చాలాకాలం నుంచి వ‌స్తున్నాయి, గ‌త ప్ర‌భుత్వాలు ఇచ్చాయ‌న్న‌ది ప్ర‌జ‌లు త‌మ వ‌ద్ద‌కు వచ్చిన వైసీపీ నేత‌ల‌కు అర్ధ‌మ‌య్యేలా చెబుతున్నారు. ప్ర‌భుత్వం వూరికే ఏమీ ఇవ్వ‌డంలేదు, ప‌న్నులు, ఛార్జీలు వ‌సూలు చేస్తున్నారు. అలాంట‌పుడు ఏదో ధ‌ర్మ సేవ చేస్తున్నట్టుగా గ‌మ్మం వ‌ద్ద‌కు మ‌రీ వ‌చ్చి అడగ‌డంలో అర్ధం లేదు. నిజానికి ప్ర‌జ‌లు ఈ మూడేళ్ల పాల‌న‌తో విసిగెత్తారు. ఏదో మ‌హాద్భుతం చేస్తాడ‌ని గెలిపించినా నిష్ప్ర‌యోజ‌న‌మే అయింద‌ని బాధ‌ప‌డుతున్నారు. అదే సంగ‌తి త‌మ వ‌ద్ద‌కు వ‌స్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు, నాయ‌కుల‌కు కుండ‌బ‌ద్ద‌లుకొట్టిన‌ట్టు చెబుతున్నారు.  వారిని నివారించి త‌మ ప్ర‌భుత్వం, సీఎం త‌మ కోస‌మే ప‌నిచేస్తోంద‌ని, ఇంత‌కంటే గొప్ప‌గా సేవ‌లు ఎవ‌రూ అందించ‌లేర‌న్న జ‌గ‌న్ సంకీర్త‌న చేస్తున్న‌వారిని ఎక్క‌డికక్క‌డ నిల‌దీస్తున్నారు. పేద‌ల‌కు ఇళ్ల నిర్మాణం, వృద్ధాప్య పింఛ‌న్లు, వితంతు పింఛ‌న్లు వంటివి చాలాకాలం నుంచే వున్నాయ‌ని, వాటిని త‌మ‌రే ఆరంభించి ఇస్తున్న‌ట్టుగా ప్ర‌చారం చేసుకోవ‌డంలో అర్ధంలేద‌ని ప్ర‌జ‌లు గ‌ట్టిగానే త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చిన‌వారికి చెబుతున్నారు. ప్ర‌జ‌లు  అమాయ‌కులు కారు, ప్ర‌చార ఆర్భాటం ఏది, వాస్త‌వంగా జ‌రుగుతున్న‌దేమిట‌నేది వారికి ఎంతో బాగా తెలుసు. అస‌లు ప్ర‌భుత్వ ప‌థ‌కాల ప్ర‌యోజ‌నాలు, ఫ‌లితాలు అందాల్సిందే వారికి క‌నుక అవి ఎంత‌వ‌ర‌కూ సక్ర‌మంగా జ‌ర‌గుతున్న‌దీ లేనిదీ వారికిగాక మ‌రెవ‌రికి తెలు స్తుంది?  గ‌డ‌ప గ‌డ‌ప‌కీ వెళ్లి తెలుసుకునే నాయ‌కుల‌కు ప్ర‌జ‌ల‌ను త‌మ వేపు ఏ మేరకు ఇంకా వెన్ను ద‌న్నుగా వున్నార‌న్న‌ది తెలుసుకోవ‌డ‌మే ఈ కార్య‌క్ర‌మం అస‌లు ర‌హ‌స్యంగా తెలియ‌క‌పోలేదు. ప్ర‌జ‌లు ఎవ‌రికి ఓటు వేయాలి, ఎవ‌రిని స‌మ‌ర్ధించాల‌న్న‌దానిలో వున్నంత స్ప‌ష్టతను త‌క్కువ అంచ‌నా వేసి వైసీపీ నాయ‌కులు ఈ మ‌హాద్బుత కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టార‌నే అభిప్రాయాలు వ్య‌క్తమ‌వుతున్నాయి.  గ‌డ‌ప గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మంలో ఇళ్ల‌చుట్టూ ప్ర‌ద‌క్షిణం చేస్తున్నవారంద‌రికీ చేదు అనుభ‌వాలే ఎదుర‌వుతు న్నాయి. ప్ర‌జ‌లు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇవ్వ‌లేక నాయ‌కులు నీళ్లు న‌ములుతున్నారు. దీంతో అస‌లు మా వ‌ద్ద‌కు ఎందుకు వ‌చ్చిన‌ట్టు అని ఎదురుప్ర‌శ్న వేయ‌డం గ‌మ‌నార్హం. కొన్ని ప్రాంతాల్లో స్థానిక నేతలు స‌మాధానం చెప్ప‌లేక భ‌య‌ప‌డిపోతున్నారు. బాలినేని శ్రీ‌నివాస రెడ్డి సైతం ఈ వ్య‌తిరేక‌త ఎదుర్కొన్నారు. అలాగే స్థానిక వైసీపీ మ‌హిళా నేత‌లు కూడా ప్ర‌జ‌ల ప‌క్షాన  త‌మ నాయ‌కుల‌ను నిల‌దీశారు. ఇటువంటి వ్య‌తిరేక‌త‌లు త‌లెత్త‌డం వెనుక టీడీపీ నేత జ‌నార్ధ‌న్ హ‌స్తం వుంద‌న్న అనుమానాలు బాలినేని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. న‌ర్సీప‌ట్నంలోనూ ఎమ్మెల్యే పి.ఉమాశంక‌ర్ గ‌ణేష్ ను ప్ర‌శ్నించ‌డాన్ని వైసీపీ నాయ‌కులు జీర్ణించుకోలేక అస‌హ‌నం వ్య‌క్తంచేశారు. అటు అర‌కులో ఎమ్మెల్యే  శెట్టి ఫాల్గుణ పై గిరిజ‌న మ‌హిళ‌లు ఎదురుతిర‌గారు. త‌మ స్థ‌లాన్ని క‌బ్జా చేశారం టూ నిల‌దీశారు. ఆయ‌న వూహించ‌ని ఈ సంఘ‌ట‌న‌కు బెదిరిపోయి కార్య‌క్ర‌మాన్ని వ‌దిలి వెళిపోయారు. పోల‌వ‌రం ఎమ్మెల్యే ఇళ్ల స్థ‌లాలు, పింఛ‌న్ల మాట ఎత్త‌గానే మ‌హిళ‌లు ఎదురుతిరిగారు.  గ‌డ‌ప గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మం రాష్ట్రం అంత‌టా విఫ‌ల‌మ‌యింద‌నాలి. కార్య‌క్ర‌మంలో ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టా ల‌ని చూసిన వైసీపీ ఎమ్మెల్యేలు, నాయ‌కులు వూహించ‌ని వ్య‌తిరేక‌తే ఎదుర‌యింది.  ఈ మొత్తం కార్య‌క్ర మాన్ని, వ్య‌తిరేక‌త‌ను త‌ర‌చి చూస్తే రాష్ట్రంలో వైసీపీకి నూక‌లుచెల్లిన‌ట్టే వుంద‌ని రాజ‌కీయ విశ్లేష కులు భావిస్తున్నారు. త‌మ ప్ర‌భుత్వ పాల‌న‌, ప‌థ‌కాల అమ‌లు గురించి అడ‌గ‌డానికి  పెట్టిన కార్యక్ర‌మంలా  కాకుండా ప్ర‌జలు త‌మ  ప్ర‌భుత్వాన్ని అభిమానిస్తున్నారో తెలుసుకోవ‌డానికి చేప‌ట్టిన‌ట్టు వుంద‌ని అంటు న్నారు.   

సికిందరాబాద్ స్టేషన్లో రైలు దగ్ధం చేసిన ఆందోళనకారులు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో అగ్నిపథ్ కు వ్యతిరేకంగా ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. రైల్వే స్టేషన్ ముందు ఉన్న బస్టాప్ లలో ఉన్న బస్సులను ఆందోళన కారులు ధ్వంసం చేశారు. రైల్వే స్టేషన్ లోనికి చొచ్చుకుపోయిన ఆందోళనకారులు ప్లాట్ ఫాంలపై ఉన్న రైళ్లపై రాళ్లు రువ్వారు. దీంతో స్టేషన్ లో రైళ్లను నిలిపివేశారు. కొన్ని రైళ్ల బోగీలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. అగ్ని పథ్ నియామకాలను తక్షణమే నిలిపివేసి ఆర్మీ రిక్రూట్ మెంట్ యథాతథంగా కొనసాగించాలంటే ఆర్మీ అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న సంగతి విదితమే.  అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ కింద నాలుగేళ్ల సర్వీస్ అంటూ కేంద్ర ప్రభుత్వం తమ జీవితాలను నాశనం చేస్తోందని దేశంలో యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆందోళన కార్యక్రమాలు హింసాత్మక రూపు దాలుస్తున్నాయి. పలు చోట్లు ఆందోళనకారులు రైళ్లకు నిప్పు పెట్టారు.  హైదరాబాదులో కూడా అగ్నిపథ్ ను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద  ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది.  ఈ క్రమంలో రైలు పట్టాలపై పార్సిల్ సామాన్లు వేసి నిప్పుపెట్టారు. సికింద్రాబాద్ నుంచి బయల్దేరే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ రైలుకు నిప్పు పెట్టారు. ఈ ఘటనతో సికింద్రాబాద్ స్టేషన్ లో ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. త్రివిధ ద‌ళాల్లో సైనిక నియామ‌కాలకు కేంద్రం ప్ర‌క‌టించిన అగ్నిప‌థ్ ప‌థ‌కం వ‌ల్ల ప్ర‌యోజ‌నం వుండ‌ద‌నియువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ ప‌థ‌కం నాలుగేళ్ల‌కు మాత్ర‌మే యువ‌త‌కు ఉద్యోగ‌భ‌ద్ర‌త‌ను క‌ల్పిస్తోంది. మ‌రి ఆ త‌ర్వాత ఇత‌ర వుద్యోగాల‌కు వెళ్ల‌డానికి వీలు లేకుండా పోతుంది. క‌నుక ఆ నాలుగేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ నిరుద్యోగంలో యువ‌త కూరుకుపోవ‌డం ఖాయమని విమర్శలు మేధావులు సైతం విమర్శిస్తున్నారు.   అగ్నిప‌థ్ వంటి పథ‌కాల‌తో ప్రయోజ‌నం లేక‌పోగా, ప‌థ‌కం కాలం ముగిసిన త‌ర్వాత యువ‌త‌ను నిర్వీర్యం చేస్తుంద‌నే ఆరోప‌ణ‌లు దేశ‌మంత‌టా వెల్లువెత్తుతుండడమే  కాకుండా అస‌లు ఇలాంటి ప‌థ‌క‌ రూప‌క‌ల్ప‌నే చాలా దారుణ‌మ‌ని విప‌క్షాలూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  మన బలగాల గౌరవం, సంప్రదాయం, పరాక్రమం, క్రమశిక్షణ విషయంలో రాజీ పడటాన్ని బీజేపీ ప్రభుత్వం మానుకోవాలంటూ రాహుల్‌ గాంధీ ట్వీట్ చేశారు.

ఓట్లు చీల్చు అధికారం పట్టు .. తెరాస వ్యూహం ఇదేనా?

 తెలంగాణ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయా? ఇంచుమించుగా రెండు దశాబ్దాలకు పైగా రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా నిలిచిన, తెలంగాణ అస్తిత్వ వాదం తెరమరుగవుతోందా? ఆంద్ర పాలకులు, ఆంధ్ర రాజకీయ నాయకుల పట్ల ఉద్యమ కాలంనాటి  వ్యతిరేకత కరిగిపోతోందా? అప్పటి బద్ద శత్రువులే ఇప్పడు అధికార పార్టీకి ఆప్త మిత్రులు అవుతున్నారా? అంటే, అటునుంచి అవుననే సమాధానమే వస్తోంది.  సమైక్యవాదానికి ప్యాంటూ, షర్టు వేస్తే ఎలా  ఉంటుందో అలా ఉండే, ఉండవల్లి అరుణ కుమార్’ ను ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమనేత కేసేఆర్ ప్రగతి భవన్’ కు ప్రత్యేకంగా ఆహ్వానించి, ఆయనతో రాజకీయ చర్చలు జరపడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనమే అయింది.   ఈ నేపధ్యంలో. ఇప్పుడు రాష్ట్ర రాజకీయ, మేధావి వర్గాలో ఇదే చర్చ జరుగుతోంది. నిజానికి, ఆంధ్రా  తెలంగాణ మధ్య ఉద్యమం గీసిన విభజన రేఖ చెరిగి పోతోందనే అభిప్రాయానికి బలాన్ని చేకూర్చే అంశాలు చాలానే ఉన్నాయని అంటున్నారు, రాజకీయ విశ్లేషకులు.  అదలా ఉంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ కాలం నుంచి కూడా తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆంధ్రా పెట్టుబడి దారులకు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతామనే చెపుతూ వచ్చారు. అయితే, అప్పుడు ఉద్యమ అవసరాల దృష్ట్యా ఆయన అలాంటి వ్యాఖ్యలు చేశారని సరిపెట్టుకున్నా, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం అక్షరాలా అదే పంధాలో పయనిస్తోంది...అందుకే ప్రభుత్వ కాంట్రాక్టులలో, ఇతరత్రా పెట్టుబడుల విషయంలో  తెరాస ప్రభుత్వం ఆంధ్రా పెట్టుబడి దారులకే ప్రాధన్యత ఇస్తోందనే విమర్శలు వినవస్తున్నాయి. అయితే ఇదేదో హఠాత్తుగా, అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం కాదు. నిజానికి, 2014 ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్ది గంటల్లోనే, కేసీఆర్, తెలంగాణ భవిష్యవాణిని విష్పష్టంగా వినిపించారు. ‘తెరాస ఇక ఎంత మాత్రం ఉద్యమ పార్టీ కాదు, ఫక్తు పదహారు అణాల రాజకీయ పార్టీ’ అని ప్రకటించారు. ఇక అక్కడి నుంచి ఏమి జరిగిందన్నది చరిత్ర .. అనేక మంది ఉద్యమకారులు ఆరోపిస్తున్న లేదా విశ్లేస్తున్న విధంగా తెలంగాణ ఉద్యమ ఆనవాళ్ళు ఏవీ మిగలకుండా తుడుచుకుంటూ వస్తున్నారు. రాజకీయ పునరేకీకరణ పేరున తెలంగాణ ఉద్యమాన్ని అవహేళన చేసిన, ఒకప్పుడు తమ నోటితోనే తెలంగాణ ద్రోహులగా  ముద్ర వేసిన అందరినీ చేరదీశారు. అందలం ఎక్కించారు. అందుకే ఈరోజున్న మంత్రి వర్గంలో సగం మందికి పైగా ‘తెలంగాణ ద్రోహులే’ ఉన్నారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, ముఖ్యమంత్రి  తెలంగాణ ద్రోహులకు మంత్రి పదవులు ఇవ్వడాన్ని కూడా సమర్ధించుకున్నారు అనుకోండి అది వేరే విషయం. ఇన్నెందుకు, రాష్ట్రంలో ఈ ఎనిమిదేళ్ళలో, ఆంధ్ర కాంట్రాక్టర్ల పుణ్యాన రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులు పూర్తయ్యాయి, ప్రగతి భవన నిర్మాణం అయితే ఇంకా వేగంగా పూర్తయింది. కానీ,తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరుల స్థూప నిర్మాణం మాత్రం, అది కూడా ఆంధ్రా కాంట్రాక్టర్ కే  కట్ట బెట్టినా, పూర్తి కాలేదు. అలాగే 1200 మంది అమరవీరులలో సగం మందికి కూడా ప్రభుత్వం ప్రకటించిన పరిహారం అందలేదు.  అందుకే  ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమ స్పూర్తిని భూస్థాపితం చేసి, తమ కుటుంబ పాలనను సుస్థిరం చేసుకునేందుకు దిశగా అడుగులు వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే 1200 మంది అమర వీరుల త్యాగాలను ఏనాడూ స్మరించని, తెరాస నాయకులు, ఒక్క కేసీఆర్ వల్లనే తెలంగాణ సాధ్యమైందని, ఆయన చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చారనే అర్థ సత్యాన్ని పెద్దగా ప్రచారం చేసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.అయితే, విమర్శల దారిన విమర్శలు సాగుతున్నా, ముఖ్యమంత్రి అడుగులు ముందుకే  పడుతున్నాయి. అదలా ఉంటే, ఇప్పుడు ఏపీతో రాజకీయ సంబంధాలను పెనవేసుకునే ప్రయత్నాలు కూడా ముమ్మరంగా సాగుతున్ననాయని అంటున్నారు. అయితే, ఇది కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలో భాగమే కావచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పొత్తును బూచిగా చూపించి, సెంటిమెంట్ ను క్యాష్ చేసుకున్న కేసీఆర్, ఇప్పడు రూటు మార్చారని అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, తెలంగాణ సెంటిమెంట్ ను ఎప్పుడోనే అధిగమించిన నేపధ్యంలో ఇప్పుడు కేసీఆర్, సెంటిమెంట్ ను పక్కన పెట్టి, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు ఏపీ రాజకీయాలను వ్యూహాత్మకంగా ఉపయోగించు కుంటున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.  ఉండవల్లితో భేటీ అయినా, షర్మిల పాదయాత్రను సాఫీగా నడిపిస్తున్నా, పవన్ కళ్యాణ్ ను తెలంగాణ ఎన్నికల బరిలో దింపుతున్నా, అన్నిటి లక్ష్యం  అదేనని, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడమే అని  విశ్లేషకులు అంటున్నారు. నిజానికి, రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు ఏ చిన్న ఆందోళన చేపట్టినా, తెరాస ప్రభుత్వం అడుగడునా అవరోధాలు కల్పిస్తుంది.  హౌస్ ఆరెస్టులతో నేతలను నిర్భందిస్తుంది.నాయకులు, కార్యకర్తల మీద కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తుంది. ఒక్క రేవంత్ రెడ్డి పైనే వందకు పైగా కేసులు ఉన్నాయంటే, పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చును. అలాగే, బండి సంజయ్ పాదయాత్రలో అనేక అవరోధాలు సృష్టించింది. చివరకు ఆయన కార్యాలయంలో దీక్ష చేపట్టినా, పోలీసులు తలుపులు బద్దలు కొట్టి మరీ అరెస్ట్ చేశారు. కానీ, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల సాగిస్తున్న ప్రజాప్రస్థానం పాద యాత్రకు మాత్రం పోలీసులు ఎక్కడా అభ్యంతరం చెప్పరు. వెనకటికి వైఎస్సార్ పాదయాత్ర చేసిన సమయంలో, అప్పటి పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెస్సార్, ‘నడిచింది వైఎస్ అయినా, నడిపించింది కేవీపీ’ అని కితాబు నిచ్చారు. అలాగే, ఇప్పడు నడుస్తోంది షర్మిల అయినా నడిపిస్తోంది, తెరాస నాయకత్వమే  అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అలాగని ఆమె తెరాస ప్రభుత్వాన్ని, ముఖ్యంత్రి కేసీఆర్ ను తక్కువ విమర్సిస్తున్నారా, అంటే లేదు. ప్రగతి భవన్ స్క్రిప్ట్’ను ఫాలో అవుతూ ఘాటు విమర్శలే చేస్తున్నారు. అయినా, అరెస్టులు, అవరోధాలు కాదు కదా, కనీసం అధికార పార్టీ నుంచి రియాక్షన్ రావడం లేదు ..తాజాగా ఖమ్మ జిల్లాలో పాద యాత్ర చేస్తున షర్మిల ,"రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మోసం చేయని వర్గం లేదు.16 వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తో ఏర్పడ్డ రాష్ట్రాన్ని అప్పుల మయం చేసిన ఘనత కేసీఆర్ దే. ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన 16 మంది ముఖ్యమంత్రుల కన్నా.. ఒక్క కేసీఆర్ చేసిన అప్పులే ఎక్కువ. తెరాస బ్యాంకు ఖాతాలో రూ.860 కోట్లు ఉన్నాయి. వడ్డీ రూపంలో ఇప్పటికే రూ.25 కోట్లు వచ్చిందని ఆ పార్టీ చెబుతుంది. మరి పార్టీ దగ్గరే ఇన్ని వందల కోట్లు ఉంటే.. పార్టీ అధ్యక్షుడి దగ్గర, ఆయన కుటుంబ సభ్యుల దగ్గర ఎన్ని వేల కోట్లు ఉన్నాయో ప్రజలు అర్థం చేసుకోవాలి” అంటూ విమర్శలు గుప్పించారు. ఇలాంటి విమర్శలు కాంగ్రెస్, బీజేపీ నాయలు ఎవరు చేసినా, తెరాస మంత్రులు, నాయకులూ కస్సున లేస్తారు. కానీ, షర్మిల ఎంత ఘాటు విమర్శలు చేసిన అధికార పార్టీ నుంచి ప్రతిస్పందన లేదు. చివరకు జిల్లా మంత్రి పువ్వాడను పొట్టు పొట్టు తిట్టినా పువ్వాడ సహా ఎవరూ రియాక్ట్ కాలేదు. అందుకే, ఒకప్పుడు జగనన్న విడిచిన బాణం అంటూ పాదయాత్ర సాగించిన షర్మిల, ఇప్పుడు కేసీఆర్  విడిచిన బాణం అనే విమర్శలు వినిపిస్తున్నాయి.  అదే విధంగా, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ పోటీ చేస్తామని జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించడం వెనక కూడా తెరాస వ్యూహమే ఉందని అంటున్నారు. ఇటీవల నల్గొండ జిల్లాలో పర్యటించిన సందర్భంగా పవన్ కళ్యాణ్ తెలంగాణలో 30 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేస్తామని తెలిపారు. ఏపీలో బలంగా ఉన్న తెలుగు దేశం, వైసీపీలే తెలంగాణ రాజకీయాలకు దూరంగా ఉంటున్న సమయంలో, ఆంద్ర ప్రాంతానికి చెందిన, అక్కడే  దిక్కు దివానం లేని  నాయకులు, పార్టీలు తెలంగాణ ఎన్నికల బరిలో దిగుతున్నాయి అంటే, ఈ వ్యూహం వెనక ఎవరున్నారో ... అర్ధం చేసుకోవడం కష్టం కాదని పరిశీలకులు అంటున్నారు.

ఆత్మకూరు ప్రచారంలో జయప్రద.. బీజేపీ కోసమా.. తన ఉనికి కోసమా?

ఏ అవకాశమూ లేని చోట బీజేపీ ఆకాసానికి నిచ్చెన వేస్తున్నంత హడావుడి చేస్తోంది. అధికార పార్టీ ఘన విజయంగా చెప్పుకోవడానికి పూర్తిగా దోహదపడేందుకే ఆత్మకూరు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిని పోటీలో నిలిపిందని విపక్షాలు, రాజకీయ పరిశీలకులే కాదు.. సామాన్య జనం కూడా బహిరంగంగా చెప్పేస్తున్నారు. దీనిని బట్టే ఆత్మకూరు ఉప ఎన్నికలో పోటీకి దిగడంలో బీజేపీ సీరియస్ నెస్ ఏమిటన్నది అవగతమౌతుంది. అయితు పొలిటికల్ డ్రామాను రక్తి కట్టించడానికి బీజేపీ నానా తిప్పలూ పడుతోంది.  బీజేపీ ప్రచారానికి సినీ గ్లామర్ ను రంగంలోకి దించి ప్రజలను ఆత్మకూరు ఉప ఎన్నికను బీజేపీ సీరియస్ గా తీసుకుందని నమ్మించడానికి తంటాలు పడుతోంది. అలనాటి అందాల తార, ప్రస్తుతం బీజేపీ నాయకురాలు అయిన జయప్రదను ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్ గా రంగంలోకి దించుతోంది.  స్టార్ క్యాంపెయినర్ గా సినీ గ్లామర్ ను రంగంలోనికి దించుతోంది. గత కొంత కాలంగా రాజకీయాలలో ఏ మంత చురుకుగా లేని జయప్రద తిరిగి తన ఉనికిని ఘనంగా చాటాలని భావిస్తున్న సంగతి విదితమే. అయితే అందుకు ఉత్తర భారతంలో కాకుండా.. తనకు సినీ నటిగా గుర్తింపును తీసుకువచ్చిన తెలుగు గడ్డ మీద నుంచి అయితే బాగుంటుందని ఆమె భావించారు. రాజకీయంగా తన ఉనికిని బలంగా చాటేందుకు తెలుగు రాష్ట్రాలైతేనే ఏదో ఒక మేరకు ప్రయోజనం ఉంటుందనీ భావించారు. అందుకే ఆమె ఇటీవల తెలుగు రాష్ట్రాలపై దృష్టి సారించారు. ఇటీవలే రాజమహేంద్రవరంలో జరిగిన బీజేపీ సభలోనూ పాల్గొన్నారు. ఆ సభలో ఏపీలో వైసీపీ పాలన అధ్వానం అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అవే మాటలు ఆత్మకూరులోనూ వల్లించి.. తాను రాజకీయాలలో క్రియాశీలంగానే ఉన్నానంటూ చాటేందుకు సిద్ధపడుతున్నారు. ఆత్మకూరు ఉప ఎన్నికలో అధికార పార్టీ విజయం లాంఛనమేనన్నది పరిశీలకుల అభిప్రాయం. అక్కడ ప్రధాన విపక్షం పోటీలో లేదు. పోటీలో ఉన్న బీజేపీకి ఓటు లేదు. అటువంటి చోట వైసీపీ కూడా చతురంగ బలాలను మోహరించినట్లు పెద్ద సంఖ్యలో మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులను అక్కడ దింపి ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. మంత్రి రోజా ఇప్పటికే అక్కడ ప్రచారం చేస్తున్నారు. అక్కడ వైసీపీకి ప్రత్యర్థిగా పోటీలో ఉన్న బీజేపీపై కాకుండా.. పోటీలో లేని తెలుగుదేశంపై విమర్శలు కురిపిస్తూ ఆత్మకూరులో వైసీపీ, బీజేపీ పోటీ వెనుక ఉన్న రహస్యమేమిటో చెప్పకనే చెప్పేస్తున్నారు. అలాగే బీజేపీ కూడా ఇంత వరకూ ప్రచారం గురించే పట్టించుకోలేదు. తమ అభ్యర్థి తరఫున నియోజకవర్గంలో పర్యటించి సభలు, ఇంటింటి ప్రచారంలో పాల్గొనేందుకు బీజేపీ నేతలెవరూ బయటకు రాలేదు. ప్రెస్ మీట్లతో సరిపెట్టేస్తూ వచ్చారు. అయితే జనం నవ్విపోతున్నారన్న గ్రహింపునకు వచ్చి.. ఇప్పుడు ఆత్మకూరు ఉఫ ఎన్నికలో బీజేపీ తరఫున ప్రచారానికి జయప్రదను రంగంలోకి దింపుతున్నారు.  ఇటు రాజకీయాలలోనూ, అటు సినిమాలలోనూ ప్రాధాన్యత పెద్దగా లేని జయప్రద ఆత్మకూరు ఉప ఎన్నికలో విస్తృతంగా ప్రచారంలో పాల్గొని కనీసం ఏపీలోనైనా రాజకీయ గుర్తింపు తెచ్చుకుని క్రియాశీల రాజకీయాలలో ఉనికి చాటాలని భావిస్తున్నారు. 

మ‌హిళా ఎంపి దుస్తులు చింపిన పోలీసులు.. ఢిల్లీలో ఉద్య‌మించిన కాంగ్రెస్

దేశంలో ప్ర‌భుత్వ ప‌ని తీరును నిర‌సిస్తూ భారీ నినాదాల‌తో ఉద్య‌మించ‌డం మామూలే. కానీ ఇటీవ‌లి కాలంలో వాటిని నివారించ డంలో పోలీసులు అనుస‌రిస్తున్న విధానం మ‌రీ దారుణంగా, అమానవీయంగా మారింది. వారిని అడ్డుకోవ‌డానికి లాఠీఛార్జీలు చేయ‌డం, టియ‌ర్ గ్యాస్ వ‌ద‌ల‌డం,  వాటర్ కానన్ లను ప్రయోగించడం వంటివి  కామన్. కానీ ఇపుడు ఆందోళనకారులపై లాఠీచార్జితో పాటు త‌న్న‌డం, దుస్తులు చింప‌డం వంటి దారుణాల‌కూ పోలీసులు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  ఆ ఆరోపణలకు బలం చేకూర్చేలాంటి    సంఘ‌ట‌న   ఢిల్లీలో జ‌రిగింది. దీని ప‌ట్ల కాంగ్రెస్ నాయ‌కులు తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ ఆందోళనను అడ్డుకునే క్రమంలో పోలీసుల చర్యలో  మ‌హిళా ఎం.పీ జ్యోతిమ‌ణి దుస్తులు చిరిగిపోయాయి.  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ విచారించ‌డాన్ని వ్య‌తిరేకిస్తూ ఆందోళ‌న‌కు ద‌గిన కాంగ్రెస్ శ్రేణుల‌పై ఢిల్లీ పోలీసులు    అమానుషంగా ప్ర‌వ‌ర్తించారు. కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌ను నాయ‌కుల‌పై విచ‌క్ష‌నా ర‌హితంగా పోలీసులు దాడులు చేసిన‌ట్లు ఆరోపిస్తు న్నారు. మ‌హిళ‌ల‌ని కూడా చూడ‌కుండా దుస్తుల‌ను చించేశార‌ని త‌మ‌ను అరెస్టు చేసి గుర్తు తెలియ‌న ప్రాంతాల‌కు తీసికెళ్లార‌ని ఆరోపించారు. త‌మిళ‌నాడులోని క‌రూర్కు చెందిన కాంగ్రెస్ మ‌హిళా ఎంపీ జ్యోతిమ‌ణి పోలీసుల దాడి తీరుపై సెల్ఫీ వీడియోలో స్పీక‌ర్‌కు విన్న‌వించారు.  ఢిల్లీ పోలీసులు త‌మ ప‌ట్ల దారుణంగా వ్య‌వ‌హ‌రంచార‌ని ఆమె ఆరోపించారు. త‌న దుస్తుల‌ను చించేశార‌ని పేర్కొన్నారు. ఢిల్లీ పోలీసులు త‌మ‌ను నేర‌స్థుల్లా  ఈడ్చుకు వెళ్లార‌ని  త‌న  షూని  కూడా లాగేశార‌ని  ఆరోపించారు. క‌నీసం  తాగ డానికి మంచినీళ్లు కొనుక్కోవ‌డానికి  కూడా వీలు లేకుండా దుకాణ‌దారుల‌ను హెచ్చ‌రించ‌డం మ‌రీ దారుణంగా ఆమె పేర్కొ న్నారు. జ్యోతిమ‌ని వీడియోను కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్ ట్విట్ట‌ర్ లో పోస్టు చేశారు. మ‌హిళా నిర‌స‌న‌కారుల ప‌ట్ల పోలీసులు వ్య‌వ‌హ రించిన తీరు మ‌రీ దారుణ‌మ‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. లోక్‌స‌భ ఎంపీకే ఇలా జ‌రిగితే సామాన్యుల‌కు న్యాయం ఎక్క‌డ జ‌ర‌గుతుంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరుపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని శశి థారూర్ స్పీక‌ర్‌ను కోరారు.  . 

మోడీ, షాలు విచారణ ఎదుర్కో లేదా.. రాహుల్ ను ఈడీ విచారిస్తే ఆందోళనేల?

నేషనల్ హెరాల్డ్ మనీ ల్యాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి ఈడీ నోటీసులు విచారణ   దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో త‌మ నాయ‌కుడిని ఇ.డి. విచార‌ణ పేరుతో వేధించడంపై  కాంగ్రెస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు దేశంలో అనేక ప్రాంతాల్లో నిర‌స‌న‌కు దిగారు. హైద‌రాబాద్‌లో గురువారం పెద్ద ఎత్తున రాజ్‌భ‌వ‌న్ ముట్డిడికి ఉప‌క్ర‌మించారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పోలీసుల‌తో వాగ్వివాదాల‌కు దిగారు. ఊహించ‌ని విధంగా హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. సీనియ‌ర్ నాయ‌కుల‌ను అరెస్టు చేశారు.  దీనిపై బీజేపీ విమర్శలకు దిగింది. కాంగ్రెస్ ఆందోళ‌న పేరుతో విధ్వంసం సృష్టిస్తోందని ఆరోపిస్తోంది. గురువారం హైదరాబాద్ లో జరిగిన విధ్వంసంపై బిజెపి రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు.  అసలు కాంగ్రెస్ చ‌లో రాజ్‌భ‌వ‌న్ ఎందుకు చేప‌ట్టిందో అర్ధం కావ‌డం లేద‌న్నారు. ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు ఆస్తుల‌ను ధ్వంసం చేసి భ‌యాన‌క వాతావ‌ర‌ణం క‌ల్పించార‌ని బండి విమ‌ర్శించారు.  కాంగ్రెస్ పార్టీని ప్ర‌జ‌లు అస‌హ్యించుకుంటున్నార‌ని, గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కూ ఆ పార్టీని ఎవ‌రూ అంత‌గా ప‌ట్టించు కోవడం లేద‌ని ఎద్దేవా చేశారు.  స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధులు స్థాపించిన నేష‌న‌ల్ హెరాల్డ్ వంటి సంస్థ నుంచి వేలాది కోట్లు దోచుకుంటే చోద్యం చూసిన‌ట్టు చూడాలా? విచారణ జరిపితే ఆందోళనలా. ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ జరపడం సహజమేననీ, విచారణను ఎదుర్కొని నిర్దోషిగా బయటకు వస్తే జనం కూడా మెచ్చుతారని హితవు పలికారు. రాహుల్ గాంధీని ఈ.డి. విచారించడంలో త‌ప్పు ఏముందని ప్రశ్నించారు.  కాంగ్రెస్ అక్ర‌మాలు బ‌య‌ట ప‌డితే ప్ర‌జ‌లు పూర్తిగా ఆ పార్టీని మ‌ర్చి పోతార‌ని కాంగ్రెస్ నాయ‌కులకు, కార్య‌క‌ర్త‌ల‌కు ఇప్పటి నుంచే  భ‌యం ప‌ట్టుకుంద‌న్నారు.  త‌మ నాయ‌కులు మోదీ, షా కూడా ఇ.డి. విచార‌ణ‌ను ఎదుర్కొన్నార‌ని, నిజాయితీ నిరూపించుకొని బ‌య‌ట‌కు వ‌చ్చారేగాని విధ్వంసాల‌కు పాల్ప‌డ‌లేద‌ని బండి అన్నారు. ఇదంతా టిఆర్ ఎస్  సౌజ‌న్యంతోనే జ‌రుగుతోంద‌ని ఆరోపించారు. రాష్ట్రంలో బిజెపి బ‌ల‌ప‌డుతుంద‌నే భ‌యంతోనే కాంగ్ర‌స్, టిఆర్ ఎస్ క‌లిసి ఈ నాట‌కం ఆడుతున్నాయ‌న్నారు. అస‌లు రాహుల్ గాంధీ పాద‌యాత్ర‌ను కాంగ్రెస్ నాయ‌కులే అంత‌గా ప‌ట్టించు కోవ‌డం లేద‌ని బండి ఎద్దేవా చేశారు.  

ఓలా.. ఊబర్ సేవలు దారుణం, తీరు అధ్వానం.. సీసీపిఎకు ఫిర్యాదుల వెల్లువ

ఎక్క‌డిక‌యినా వెళ్లాలంటే బ‌స్సులు ప‌ట్టుకుని వేలాడుతూ నానా అవ‌స్థ‌లూ ప‌డాలా? ఇంక అక్కర్లేదు. సిటీ పరిధిలో ఎక్కడికి కావాలంటే అక్కడికి హాయిగా ఇంట్లో కూర్చునే క్యాబ్ బుక్ చేసుకుని.. అది రాగానే ఎంచక్కా పెద్దగా శ్రమ పడకుండానే అందులో కూచుని గమ్యానికి చేరుకోవచ్చు. ఇదీ సగటు మానవుడి ఆలోచన. క్యాబ్ అన‌గానే ఊబ‌ర్‌, ఆటో అన‌గానే ఓలా గుర్తుకొస్తాయి. అంతగా అవి పాపులర్ అయ్యాయి. అనుకున్నదే తడవు ఆన్‌లైన్లో  బుక్ చేసుకోవ‌డం గమ్యానికి చేరుకోవడం. అంతే అనుకుంటాం. కానీ పరిస్తితి అలా లేదు. ఈ మాట వినియోగదారులే అంటున్నారు. ఇటీవ‌ల వాటి స‌ర్వీసు బొత్తిగా అధ్వానంగా ఉందని ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. బుక్ చేసిన చాలాసేప‌టికి గాని రావ‌డంలేద‌ని, పెద్ద సౌక‌ర్య‌వంతంగా వుండ‌టం లేద‌ని,  బుక్ చేసిన తరువాత రైడ్ ను క్యాబ్ డ్రైవర్ లు అర్ధంతరంగా క్యాన్సిల్ చేసేయడం, అలా వాళ్లు క్యాన్సిల్ చేసిన దానికి కూడా వినియోగదారుడే డబ్బులు చెల్లించాల్సి రావడం వంటి సంఘటనలు పెరిగిపోతున్నాయి. ఇలా ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న ఆరోప‌ణ‌ల కార‌ణంగానే కేంద్ర వినియోగదారుల ర‌క్ష‌ణ అధారిటీ (సిసిపిఏ) ఓలా, ఊబ‌ర్ సంస్థ‌ల‌కు నోటీసులు జారీచేసింది.   వినియోగ‌దారుల వ్య‌వ‌హారాల శాఖ  ప్ర‌కారం  ఓలా సేవ‌లు దారుణంగా వుంటున్నాయ‌ని  మే ఒక‌టో తేదీ వ‌ర‌కూ గ‌త 12 నెల‌ల్లో 2,400 మంది వినియోగ‌దా రులు, ఊబ‌ర్ కు వ్య‌తిరేకంగా 770 మంది వినియోగదారు లు జాతీయ వినియోగ‌దారుల హెల్స్ లైన్‌కి   ఫిర్యాదులు చేశారు.  అస‌లు ఆయా సంస్థ‌ల సేవ‌లు బొత్తిగా బాగుండ‌డం లేద‌ని, ఫిర్యాదుల‌కు స‌మాధా నం చెప్ప‌డం లేద‌ని, ఛార్జీలు కూడా మితిమీరి వ‌సూలు చేస్తున్నార‌ని ఫిర్యాదులు చేశారు. అలాగే క్యాబ్‌, ఆటోలను బుక్ చేసిన త‌ర్వాత అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో ఒక‌వేళ క్యాన్సిల్ చేస్తే అందుకు తీసుకునే ఛార్జీలు అతిగా ఉంటున్నాయని ఫిర్యాదులు వున్నాయి.  దేశంలో అనేక దాదాపు అన్ని ప్రాంతాల నుంచి అటువంటి ఆరోప‌ణ‌లు కోకొల్లుగా వ‌స్తుండ‌డంతో ఆయా సంస్థ‌ల‌కు నోటీసులు జారీ చేసిన‌ట్లు అధారిటీ పేర్కొన్న‌ది. ముఖ్యంగా ఓలా విష‌యానికివ‌స్తే, 54 శాతం ఫిర్యాదులు స‌ర్వీసు త‌క్కువ‌గా వుండ‌డం మీద‌, అలాగే ఊబ‌ర్ క్యాబ్‌ల విష‌యంలో 64 శాతం సేవ‌లు త‌క్కువ‌ స్థాయిలో వున్నాయ‌ని వచ్చాయి. అంతేగాక  క‌స్ట‌మ‌ర్ స‌పోర్ట్ నుంచి త‌గిన విధంగా స‌మాచారం లేక పోవ‌డం, డ్రైవ‌ర్లు ఆన్‌లైన్లో  చెల్లింపుల‌ను తిర‌స్క‌రించ‌డం, క్యాష్ రూపంలోనే   చెల్లించాల‌ని డిమాండ్ చేయ‌డం పెరిగిపోయింద‌నే ఫిర్యాదులు చాలా వున్నాయి. అస‌లు ఒకే రూట్‌లో  వెళ్లేట‌పుడు ఒక విధంగా, వ‌చ్చేట‌పుడు మ‌రో విధంగా ఛార్జీలు వ‌సూలు చేస్తుండ‌టం, క్యాబ్‌లో ఏసీ వుంద‌ని యాప్‌లో చెప్పిన‌ప్ప‌టికీ క్యాబ్‌లో ఆ సౌక‌ర్యం క‌ల్పించ‌క‌పోవ‌డం వంటి ఫిర్యాదులూ న‌మోద‌య్యాయి. మ‌రీ ముఖ్యం గా క్యాబ్‌, లేదా ఓలా ఆటో బుక్‌చేసిన‌పుడు ఒక‌వేళ కాన్సిల్ చేసుకుంటే ఎంత చెల్లించాల్సి వస్తుంద‌నేది తెలియ‌డం లేద‌ని, దీనితో ఆ ఛార్టీలు తోచిన‌ట్టు విధిస్తున్నాని, అలాగే పిక్ అప్ పాయింట్ కి రావ‌డానికి కూడా చాలా మంది డ్రైవ‌ర్లు  ఆస‌క్తి చూప‌క‌పోవ‌డ‌మో, తిర‌స్క‌రించ‌డ‌మో చేస్తున్నార‌నీ విని యోగదారుల నుంచి ఫిర్యాదులు అందాయని సిసిపిఏ  అధికారులు పేర్కొన్నారు. 

తెరాస మద్దతు బీజేపీ కేనా?

ఈ దేశంలో బీజేపీని ,మోడీని ఎదిరించగల మగాడు కేసీఆర్, ఒక్కరే. ఈ మాట అన్నది ఎవరో వేరే చెప్పనక్కరలేదు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో మూడు గంటలకు పైగా, భేటి అయిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్, ఈ వ్యాఖ్య చేశారు. అంతే కాకుండా, కేసీఆర్ తో  మాట్లాడిన తర్వాతనే  బీజేపీ భయంకర రూపం తనకు అర్థం అయిందని చెప్పుకొచ్చారు. అలాగే, కేంద్రంలో బీజీపీ అధికారంలో కొనసాగితే దేశానికి జరగనున్న భయంకర ప్రమాదం గురించి, కేసీఆర్ బోధనలతోనే తనకు మరింతగా జ్ఞానోదయం అయిందని ఉండవల్లి, ఉద్ఘాటించారు. ఒక్క మాటలో చెప్పాలంటే, నేనే అనుకుంటే, నాకంటే కేసీఆర్ కరుడు గట్టిన బీజీపీ వ్యతిరేకి అని కితాబు నిచ్చారు. అసలు, బీజేపీ , మోడీ, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకతే మా ఇద్దరినీ  కలిపిందని ఉండవల్లి చెప్పుకొచ్చారు.  అయితే, ఇది నిజమా? నిజంగా కేసీఆర్ నరనరాన బీజేపీ వ్యతిరేకతను నింపు కున్నారా? కమల దళం పై ఆగ్రహంతో రగిలి పోతున్నారా? అంటే, అదంతా ఒట్టి నాటకం, అందులో నిజం లేదని, ఉండవల్లి మాజీ మిత్రుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఉత్తమ కుమార్ రెడ్డి అంటున్నారు. అంతే కాదు, కేసీఆర్‌కు, బీజేపీకి మధ్య రహస్య ఒప్పందం ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చేశారు.  నిజానికి, ఒక్క ఉత్తమ కుమార్ రెడ్డి మాత్రమే కాదు, రేవంత్ రెడ్డి కూడా పదే పదే అదే ఆరోపణ చేస్తున్నారు. అంతే కాదు, ఆ ఇద్దరి మధ్య రహస్య బంధం ఉంది కాబట్టే, కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై  మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఉత్తమ్, రేవంత్ ఇతర కాంగ్రెస్ నాయకులు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. అందుకు కౌంటర్ గా  బీజేపీ నాయకులు, కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడే, ఆ రెండు పార్టీల మధ్య ఫెవికాల్ బంధం ఉందని అంటారు. ఎన్నికల వరకు ప్రత్యర్దులుగా నటించినా, ఎన్నికల తర్వాత ఇద్దరు కలిసి పోతారని, కమల దళం నేతలు ఆరోపిస్తున్నారు. అలాగే, కాంగ్రెస్, తెరాస ఒకే నాణ్యానికి రెండు పార్స్వాలని అంటారు. కాంగ్రెస్ టికెట్ మీద గెలిచినా  చివరకు చేరేది గులాబీ గూటికే అని, గతాన్ని గుర్తు  చేస్తారు.  అయితే ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లోనూ తెరాస, బీజేపీల మధ్య రహస్య ఒప్పందం ఉందని, ఉత్తమకుమార్ రెడ్డి ఆరోపించారు. నిజానికి, గతంలో పరిస్థితి అదే అయినా, ఇటీవల కాలంలో తెరాస, బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందనే అందరూ అంటున్నారు. అయినా, ఉత్తమ కుమార్ రెడ్డి మాత్రం,  రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని,అందుకే ప్రతిపక్షాలతో కలిసి రావడం లేదని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏర్పాటుచేసిన ప్రతిపక్షాల సమావేశానికి తెరాస ఎందుకు హాజరు కాలేదని నిలదీశారు. అందులో కుట్ర దాగి ఉందని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని, ఆరోపించారు. అంతే కాకుండా ఇప్పుడే కాదు,గత రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థి మీరా కుమార్‌కు తెరాస మద్దతు ఇవ్వలేదని గుర్తుచేశారు. ఆర్ఎస్ఎస్ అనుకూల అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్‌కు రాష్ట్రపతిగా ఓటు వేశారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా కరుడుగట్టిన బీజేపీ వాది వెంకయ్య నాయుడుకు అనుకూలంగా ఓటు వేశారని పేర్కొన్నారు. పార్లమెంటులో అన్ని విషయాల్లో బీజేపీకి టీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. బీజేపీకి టీఆర్ఎస్ దూరంగా ఉంటే ప్రతిపక్షాల అభ్యర్థికి టీఆర్ఎస్ ఓటు వేయాలి. లేదంటే టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని తెలంగాణ ప్రజలు అనుకుంటారని ఉత్తమ్ చెప్పారు. నిజమే, ఉత్తమ కుమార్ చేసిన ఆరోపణలలో కొంత నిజం ఉంది,అయితే,అదే సమయంలో తెరాస, కాంగ్రెస్ పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉన్నా లేకున్నా ఆ రెండు రెండు పార్టీలు మధ్య రాజకీయ అవగాహన, సైధాంతిక సారుప్యతా ఉన్నాయనే విషయంలో మాత్రం ఎవరికీ ఎలాంటి సందేహం అవసరం లేదని, విశ్లేషకులు అంటున్నారు.

బుల్డోజర్ బాబాకు సుప్రీం చురకలు .. చట్టం గీత దాటకండి

బుల్డోజర్ బాబా’ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ అద్జిత్య నాథ్ ఆ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన బిరుదు. రాష్ట్రంలో దశాబ్దాలుగా క్షీణిస్తూ వచ్చిన, శాంతి భద్రతల పరిస్థితిని చక్క దిద్దేందుకు యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్, తమ ఫస్ట్’టర్మ్ నుంచే సంప్రదాయ పద్ధతులకు కొంత విభిన్నంగా చర్యలు తీసుకుంటూ వచ్చారు. శాంతి భద్రతల సమస్యలు సృష్టించే వారు ఎవరైనా, ఇన్స్టంట్’గ చర్యలు తీసుకునేందుకు పోలీసులకు సంపూర్ణ స్వేచ్ఛను ఇచ్చారు. రాజకీయంగా ఇతరత్రా ఎంత ప్రతిఘటన వచ్చినా వెనకాడ లేదు. మాఫియాపై ఉక్కుపాదం మోపారు. కరుడు గట్టిన గ్యాంగ్‌స్టర్‌ వికాస్ దూబే,ఆయన అనుచరులు సహా అనే మంది రౌడీషీటర్లు ఎన్‌కౌంటర్’లో పోయారు. బతికుంటే బలుసాకు తిని బతకొచ్చనే భయంతో కొందరు పోలేస్సులకు లొంగి పోయారు.కొందరు రౌడీలు రాష్ట్రం వదిలి పారిపోయారు. గ్యాంగ్‌స్టర్‌ల ఇళ్లను, స్థావరాలను యోగి ప్రభుత్వం బుల్‌డోజర్లతో కూల్చేసింది.నిజానికి యూగీ ప్రభుత్వం అనిసరించిన ఈ ‘అణచివేత’ విధానం రాజకీయంగా బీజేపీని దెబ్బతీస్తుందని, రాజకీయ ప్రత్యర్దులే కాదు, సొంత పార్టీ నేతలు, చివరకు మంత్రులు కూడా భావించారు. అందుకే మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు బీజేపీని వదిలి ఎస్పీలో చేరారు. అయితే, 2022 ఎన్నికలలో  బీజీపీ గెలుపుకు, బుల్డోజర్ న్యాయం కూడా కలిసొచ్చింది.  ఈ నేపధ్యంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం శాంతి భద్రతల పరిరక్షణకు మరింత ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. బుల్డోజర్లకు మరింతగా పనిచెప్పింది. తప్పు చేసి తప్పించుకుందామంటే కుదరదని, నోటి మాటలతో కాకుండా బుల్డోజర్’ చేతలతో సమాధానం చెప్పింది. ముఖ్యంగా  ఇటీవల బీజేపీ  అధికార ప్రతినిధి (ప్రస్తుత మాజీ) నుపుర్ శర్మ, పార్టీ ఐటీ సెల్ ఇంచార్జి నవీన్ కుమార్ జిందాల్ ( ఇప్పుడు పార్టీ బహిష్కృత నేత) మొహ్మద్ ప్రవక్త గురించి చేసిన వివాదస్పద వ్యాఖ్యలు నేపధ్యంగా వివిధ ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయి. అందులో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ హింసాత్మక ఘటన వెనుక ప్రధాన నిందితుడిగా భావిస్తున్న జావేద్‌ అహ్మద్‌ నివాసాన్ని అక్రమ కట్టడంగా పేర్కొంటూ స్థానిక అధికారులు కూల్చివేశారు. అనుమతి తీసుకోకుండా నిర్మించడంపై మే 10నే నోటీసు ఇచ్చి, రెండువారాల సమయం ఇచ్చామనీ, గడువులోగా ఎలాంటి పత్రాలు సమర్పించకపోవడంతో కూల్చివేత చర్యలు చేపట్టామనీ అధికారులు తెలిపారు.  ఇదే కాకుండా, ఇంతకూ ముందు తర్వాత కూడా చట్టాని త్తమ చేతుల్లోకి తీసుకుని, హింసకు పాల్పడుతున్న వారిని అక్రమ నివాసాలను యోగీ ప్రభుత్వం నెల మట్టం చేసింది.  ఈ పరిస్థితిలో ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం అనుసరిస్తోన్న బుల్డోజర్ విధానంపై  సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. జమియత్ ఉలామా-ఇ-హింద్ సంస్థ సుప్రీంను ఆశ్రయించింది. చట్టబద్ధమైన ప్రక్రియకు విరుద్ధంగా కూల్చివేతలు జరగకుండా చూసేలా కోర్టు యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరింది.‘ముందస్తుగా నోటీసులు ఇవ్వాలి. ఇప్పుడు జరుగుతున్నది చట్టవిరుద్ధంగా ఉంది. షాక్‌కు గురిచేస్తోంది. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని జరుపుతున్న దాడిలా ఉంది’ అంటూ పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. దీనిపై కోర్టు స్పందించింది.‘కూల్చివేత ప్రక్రియ చట్టానికి లోబడి మాత్రమే ఉండాలి.అది ప్రతీకారం తీర్చుకునే విధంగా ఉండకూడదు. అయితే తాము కూల్చివేతలపై స్టే ఇవ్వలేము. చట్టం ప్రకారం వెళ్లమని మాత్రమే చెప్పగలం’ అని వ్యాఖ్యానించింది.

రాజకీయ వార్తలంటే యువత పరుగో పరుగు.. రాయటర్స్ సర్వే తేల్చిన నిజం

టెన్త్ చదివే వారి దగ్గర నుంచి గ్రాడ్యుయేషన్  పూర్తి చేసిన వారి వరకూ.. ఉద్యోగుల నుంచి నిరుద్యోగుల వ‌ర‌కూ, అంతెందుకు యువ‌తలో  అమ్మాయిలు, అబ్బాయిలు అన్న తేడా లేదు, ఎప్ప‌డూ మొబైల్‌తోనే క‌న‌ప‌డుతుంటారు. అది వారికి మూడో చేయి. అది చేతిలో లేక‌పోతే వారి ప్ర‌పంచం త‌ల‌కిందుల‌వుతుంది. ఇది  ప్ర‌తీరోజూ అంద‌రూ గ‌మ‌నిస్తున్న‌దే. కానీ మొబైల్ నుంచి వారిని దూరం చేయ‌డ‌మ‌న్న‌ది దుర్ల‌భం, ప్ర‌య త్నించి విఫ‌ల‌మ‌యిన త‌లిదండ్రుల శాతం చాలా ఎక్కువ.   అది అటుంచితే అస‌లు యువ‌త‌ను అంత‌గా క‌ట్టిప‌డేస్తున్న ప్ర‌త్యేకాంశాలు మొబైల్ ఫోన్ లో ఏమున్నాయి? అనేది ప్ర‌త్యేకంగా ప‌రిశోధించాల్సిన అవ‌స‌ర మే లేదు. దానికి వెంట‌నే రెడీమేడ్ స‌మాధానం వుంది.. సినిమా, వెబ్ సీరీస్‌, ఇంకా ఇలాంటివే ఏన్నెన్నో!   అసలు ప్ర‌పంచం, పోనీ దేశం, పోనీ ప్రాంతీయ వార్త‌ల‌ను ప‌ట్టించుకుంటున్న‌వారే క‌న‌ప‌డ‌రు. అస‌లు వార్త‌ల మీద అంత విముఖ‌త ఎలా ఏర్ప‌డింద‌నేది పెద్ద ప్ర‌శ్నే! రాయిట‌ర్స్ ఇటీవ‌ల జ‌రిపిన స‌ర్వేలో జ‌ర్న‌లిజం ప్ర‌జ‌ల్ని అంత‌గా ఆక‌ట్టుకోవ‌డం లేద‌న్న అంశం స్ప‌ష్ట మ‌యింది. ఏదో మ‌ధ్య మ‌ధ్య‌లో టీవీ న్యూస్ అదీ ఇంట్లో వారి వొత్తిడితో ఓ క్ష‌ణం విన‌డ‌మో, చూడ్డ‌మో త‌ప్ప ప్ర‌త్యేకించి యువ‌త దాని ప‌ట్ల  న‌మ్మ‌కం, ఆసక్తి  కనబరచడం లేదని,  శ్ర‌ద్ధ పెట్డడం లేద‌న్నది రాయటర్స్ సర్వే తేల్చిన  క‌ఠోర వాస్త‌వం.  టీవీల్లో, ప‌త్రిక‌ల్లో వ‌చ్చే వార్త‌ల ప‌ట్ల యువ‌తకు చిత్రంగా అప‌న‌మ్మ‌కం ఏర్ప‌డింద‌ని, అందుకే  వారు వార్త‌ల‌ను నిర్ల‌క్ష్యం చేస్తున్నార‌ని రాయటర్స్ సర్వేలో  తేలింది. ఈ త‌ర‌హా వాతావ‌ర‌ణం దాదాపు అన్ని దేశాల్లోనూ  ఏర్ప‌డింది. యువ‌త  ప‌ని గ‌ట్టుకుని విముఖ‌త ప్ర‌ద‌ర్శించ‌డం గ‌మ‌నించ‌వచ్చ‌ని రాయిట‌ర్స్ సర్వే  స్ప‌ష్టం చేసింది.  ఆన్‌లైన్ ప్ర‌శ్నావ‌ళి ద్వారా చేపట్టిన ఈ సర్వేలో యువతలో వార్తల పట్ల అనాసక్తి పెరగడానికి  కోవిడ్-19 కూడా ఒక కారణమని తేలింది!   అస‌లు టీవీ పెడితే, వార్తా ప‌త్రిక‌లు తిరగేస్తే అవే భ‌యాన‌క వార్త‌లు  విన‌వ‌ల‌సి వ‌స్తుంద‌ని, చ‌ద‌వ వ‌ల‌సివ‌స్తుంద‌న్న భ‌యాందోళ‌న‌తో వార్త ల‌కు బాగా యువ‌త దూర‌మ‌యింది. యువ‌త లో  ముఖ్యంగా 35 సంవ‌త్స‌రాల లోపు వారిలో అస‌లు వార్త‌ల‌ను న‌మ్మం అనేవారి శాతం 29 , వార్త ల‌తో విసిగెత్తిన వారి శాతం 29గా ఉంది. అస‌లు వార్త‌ల వ‌ల్ల త‌మ మూడ్ దెబ్బ‌తింటోందనీ అంటున్న సుమారు 17 శాతం మంది వాటి వల్ల  స్నేహితుల‌తో, బంధువుల‌తో వాగ్వివాదాల‌కు దిగాల్సి వ‌స్తోంద‌ని వార్తా ప‌త్రిక‌ల వేపు చూడ‌డం లేద‌ని అన్నారు!  16 శాతం మంది  అస‌లు వార్త‌లు వింటూంటే, చ‌దువుతూంటే అస‌లు దేశంలో ప్ర‌భుత్వం వుందా లేదా అనే సందిగ్ధంలో ప‌డుతున్నాన్నారు.  భార‌త‌దేశంలో  ఏషియ‌న్ కాలేజ్ ఆఫ్ జ‌ర్న‌లిజం స‌హ‌కారంతో రాయిట‌ర్స్ స‌ర్వే నిర్వ‌హిం చింది. దేశంలో 72 శాతం యూత్  స్మార్ట్‌ఫోన్‌లో వార్త‌లు తెలుసుకుంటున్నార‌ని, 35 శాతం మంది కంప్యూ ట‌ర్ల ద్వారా తెలుసుకుంటున్నార‌ని తేలింది. అలాగే 84 శాతం యువ‌త ఆన్‌లైన్ న్యూస్‌నే ఫాలో అవుతు న్నారు. కాగా 63 శాతంమంది సోష‌ల్ మీడియా ద్వారా, 59 శాతం మంది టివీ న్యూస్‌, 49 శాతం మంది ప్రింట్ మీడియా ద్వారా వార్త‌ల‌ను తెలుసుకుంటున్నారు. ఇక యూ ట్యూబ్ 53 శాతం, వాట్స్ అప్ ద్వారా 51 శాతం మంది భార‌తీ యువ‌త వార్త‌ల‌ను తెలుసుకోంటున్నారు.   36 శాతం మంది   మీడియాపై రాజ‌కీయ‌, వాణిజ్యరంగాల ప్ర‌భావం  అతిగా ఉందని అభిప్రాయపడ్డారు.   మొత్తంగా యువతకు రాజకీయ వార్తల పట్ట ఆసక్తి గణనీయంగా తగ్గిపోయందని రాయటర్స్ సర్వే నిర్ద్వంద్వంగా తేల్చేసింది.

సినిమాల్లో కామెడీ ట్రాక్.. రాజకీయాల్లో పాల్ ఫార్సు

సినిమాలలో ప్రధాన కథ రంజుగా సాగుతుంది. అయితే ఆ కథకు అడ్డు రాకుండా  , టెంపో చెడకుండా ఓ కామెడీ ట్రాక్ కూడా కొనసాగుతూ ఉంటుంది. పాత కాలం సినిమాలలో ఇదో హిట్ ఫార్ములా. అలాగే కొన్నేళ్ల కిందటి వరకూ దర్శకుడు పూరీ జగన్నాథ్ కూడా ఈ హాట్ ఫార్ములాను ఫాలో అయ్యేరు. ఇడియట్ సినిమాలో సినిమాకు సంబంధం లేకుండా కమేడియన్ అలీతో అలా నడిపిన ట్రాక్ బాగా పాపులరైంది కూడా. ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటారా? ఇప్పుడు రాజకీయాలలో కూడా అలాంటి కామెడీ ట్రాక్ నడుస్తోంది. ఈ కామెడీ ట్రాక్ కు కథ, స్క్రీన్ ప్లే, సంగీతం, నటన అన్నీ ఒక్కరే. అంటే కర్తా కర్మా క్రియా కూడా ఒక్కరే. ఆయనే కే.ఏ పాల్. ప్రజా శాంతి వ్యవస్థాపకుడు పాల్. ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ హీటెక్కిన రాజకీయాలలో ఒకింత రిలీఫ్ ఆయన మాటలూ చేతలూ. తాజాగా ఆయన తన హాస్యరసాన్ని  మరో ఎత్తుకు తీసుకు వెళ్లారు. ఏకంగా మోడీ షాలకే వార్నింగ్ ఇచ్చేశానని చెప్పుకున్నారు. అన్నీ గుజరాత్ కే అంటే తాను ఓప్పనని మోడీకి ఖరాఖండీగా చెప్పేశానని చెప్పుకున్నారు. ఇంతకీ అసలు మోడీ, అమిత్ షాలతో ఆయన అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందో కూడా సెలవిచ్చేశారు. రాష్ట్రపతి ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి విజయానికి సహకరించాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షాలు పాల్ ను వేడుకున్నారట. అందుకు పాల్ గారు అంగీకరించారట. ఈ విషయాన్ని స్వయంగా పాలే మీడియాకు తెలియజేశారు. అక్కడితో ఊరుకోకుండా మోడీ దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉందనీ, ఎకనామిక్ సమ్మిట్ ఏర్పాటు చేసి దేశాన్ని గట్టెక్కించాలని తనను కోరినట్లు ఆయన చెప్పారు. అందుకు తాను అంగీకరించాననీ, అయితే మోడీ సదరు సమ్మిట్ గుజరాత్ లో ఏర్పాటు చేయాలంటే తాను కుదరదంటే కుదరదని ఖరాఖండీగా చెప్పేశారట. హైదరాబాద్ లో అయితేనే ఏర్పాటు చేస్తానని కుండ బద్దలు కొట్టేశానని సెలవిచ్చారు. ఈ విషయంలో రాజీ ప్రశక్తే లేదని  మోడీకి స్పష్టం చేశానని పాల్ చెప్పారు. మళ్లీ రాష్ట్రపతి ఎన్నిక గురించి మోడీ షాలకు అభయమిచ్చినట్లూ చెప్పుకున్నారు. బీజేపీ నిలబెట్టిన అభ్యర్థే గెలుస్తారని తాను వారికి చెప్పానన్నారు. మోడీ షాలతో పాల్ తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి కూడా చర్చించారట. వచ్చే ఎన్నికలలో టీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు కూడా గెలిచే అవకాశం లేదని పాల్ చెప్పారు. కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని,  మరో సారి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదనీ తాను మోడీకి వవరించినట్లు కేఏపాల్ మీడియాకు చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది.  హీటెడ్ పొలిటికల్ స్పీచెస్ మధ్యలో నెటిజన్లు పాల్ ప్రసంగాలు వింటూ తెగ రిలాక్స్ అవుతున్నారు.  

అప్ప‌డూ, ఇప్పుడూ ఫైర్ బ్రాండే!.. తగ్గేదేలే పోలీస్ కాల‌ర్ ప‌ట్టుకున్న రేణుకా చౌద‌రి

కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కురాలు ఫైర్‌బ్రాండ్‌గా  సుపరిచితురాలు.  ఆమెను అలానే కాంగ్రెసే త‌ర నాయ‌కులు కూడా గుర్తిస్తారు. నమ్మిన విషయం కోసం ధైర్యంగా నిలబడటంలో ఆమెను మించిన‌వారు లేర‌నే అనాలి. ఇది చాలా కాలం నుంచి ఆమె ప్ర‌ద‌ర్శిస్తున్న ఫైర్‌. పాతికేళ్ల కిందట ‘నెల రాజు’ నాదెండ్ల సభలో ఎన్టీఆర్ జిందాబాద్ అని గర్జించి రాష్ట్ర వ్యాప్తంగా గుర్పింపు పొందిన నాటి రేణుకా చౌదరికీ ఇప్ప‌టి  రేణుకా చౌద‌రికీ ఏం తేడా లేదు. అప్పడూ ఫైరే.. ఇప్పుడూ ఫైరే. తాజాగా రేణుకా చౌద‌రి  మ‌రోసారి తన ఆగ్రహాన్ని ప్రదర్శించారు. కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీని నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో ఈడి విచార‌ణ‌కు  పిల‌వడం మీద తెలంగాణా కాంగ్రెస్ ఆగ్ర‌హించి  చేప‌ట్టిన  రాజ్‌భ‌వ‌న్ ముట్ట‌డి కార్య్ర‌క‌మం ఉద్రిక్త‌త‌కు  దారి తీసింది. మ‌హిళా కాంగ్రెస్ నాయకుల‌ను, కార్య‌క‌ర్త‌లను పోలీసులు నిలువ‌రించ‌డంలో తోపులాట‌లు జ‌రిగాయి. ఆ ఉద్రిక్త ప‌రిస్థితిలో రేణుకా చౌదరి పోలీసు కాల‌ర్ ప‌ట్టుకుని నిల‌దీశారు. పోలీసులు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును దుయ్య బ‌ట్టారు. గురువారం ఉద‌యం రాజ్‌భ‌వ‌న్ ముట్ట‌డికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయ‌కులు,  కార్య‌క‌ర్త‌లు ఉద్య‌మించారు. పోలీసులు అరెస్టు చేయ‌డానికి ప్ర‌య‌త్నించారు. రేణుకా చౌద‌రి వారితో వాదులాట‌కు దిగారు. దేశంలో అస‌లు  ప్ర‌జాస్వామ్యా న్ని అణ‌చి వేస్తున్నార‌ని కేంద్ర ప్ర‌భుత్వం మీద తీవ్ర ఆరోప‌ణల‌తో  ఆమె విరుచుకుప‌డ్డారు.  ప్ర‌జాస్వామ్య బ‌ద్దంగా చేప‌ట్టిన కార్యక్ర‌మాల‌ను పోలీసుల సాయంతో అడ్డుకోవ‌డంపై మ‌హిళా కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో నిర‌సించింది.  ఆ సందర్భంగా జరిగిన వాదులాటలో, తోపులాటలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రేణుకా చౌదరి పోలీస్ కాలరు పట్టుకుని నిలువరించారు. ఈ దౌర్జన్యం ఏమిటంటూ నిలదీశారు.

అభ్యర్ధుల జాబితాతో రేవంత్ ముందస్తుకు రెడీ.. కాంగ్రెస్ లో కలకలం

తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? అంటే, అందుకు ఇంకో సంవత్సరం పైగానే సమయముంది. అయితే, తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తొలి శాసన సభను అర్ధాంతరంగా రద్దు చేసి ముందస్తుకు వెళ్ళిన ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ అదే బాటలో మరో మారు ముందస్తు ఎన్నికలు వెళతారని, రాష్ట్ర రాజకీయ వర్గాల్లో బలమైన చర్చ జరుగుతోంది.   ముందస్తు తధ్యమని ప్రతిపక్ష పార్టీలు గట్టిగా విశ్వశిస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ మొదలు ప్రధాన ప్రతిపక్ష నాయకులు అందరూ ఎన్నికలకు సిద్దమై పోతున్నారు. మరో మూడు నాలుగు నెలల్లో,నవంబర్ లేదా డిసెంబర్’లో ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ రద్దు  చేస్తారు.. నెక్ట్  ఇయర్  ఏప్రిల్, మే నెలల్లో  జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో  పాటుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి ... ఇది నా మాట.. నా మాటే శాసనం..అన్నట్లు ప్రతిపక్ష నాయకులు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తపరుస్తున్నారు. ముందస్తు ఎన్నికలకు ముహూర్తం కూడా ఖరారు చేశారు.  అదలా ఉంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరో అడుగు ముందుకు వేసినట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మొత్తం 119 అసెంబ్లీ  స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేసి, జాబితాను కాంగ్రెస్ అధిష్టానానికి పంపినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, ఇందులో ఎంత  నిజం వుంది, ఎంత లేదు అనే విషయాన్ని పక్కన పెడితే, రేవంత్ రెడ్డి ముందు నుంచి కూడా ఎన్నికలకు ఆరు నెలల ముందు అభ్యర్ధులను ప్రకటిస్తామని, మూడు నెలల ముందుగా ఎన్నికల ప్రణాళిక విడుదల చేస్తామని చెపుతూ వస్తున్నారు. అదే క్రమంలో ఇప్పుడు జాబితా సిద్దం చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే, అసెంబ్లీ రద్దు కాకుండానే, ముందస్తు ఎన్నికలు ఉహించుకుని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్దులను ప్రకటిస్తుందా, అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి, ముందుగా అభ్యర్ధులను ప్రకటించే కల్చర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ లేదు, ఆఖరి నిముషంలో అభ్యర్ధులను ఖరారు చేయడమే కాంగ్రెస్ సంప్రదాయం. హుజురాబాద్ ఉప ఎన్నిక విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ ఇదే సంప్రదాయం పాటించిందని, పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.  మరోవంక, పార్టీ టికెట్ ఆశిస్తున్న అనేక మంది నాయకులు, రేవంత్ జాబితాలో తమ పేరు ఉందా లేదా అని తెలుసుకునేందుకు, పనిలో పనిగా అధిష్టానం పెద్దలకు తమ కోరికను వినిపించేందుకు ఢిల్లీకి క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు మాజీ ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నేతలు ఢిల్లీ చేరుకున్నారు. అయితే, వీరు నేషనల్ హెరాల్డ్, మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరట్ ( ఈడీ) విచారణ ఎదుర్కుంటున్నకాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి సాలిడారిటీ తెలిపేందుకే ఢిల్లీ వెళ్ళినట్లు బిల్డప్ ఇస్తున్నా, స్వామి కార్యం స్వకార్యం చక్క బెట్టుకునేందుకే ఢిల్లీ చేరినట్లు తెలుస్తోంది. అక్కడకు చేరిన రాష్ట్ర నాయకులు, ఢిల్లీ పెద్దల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారని  పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.  మరో వంక రేవంత్ రెడ్డి జాబితాలో ఆయన తమ అనుకూల వర్గానికి చెందినవారికే ప్రాధాన్యత ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల రేవంత్ రెడ్డి, చేసిన వివాదస్పద, ‘రెడ్డి’ వ్యాఖ్యల నేపధ్యంగాను, పార్టీలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, రేవంత్ రెడ్డి ఒక్కడే కుర్చుని జాబితా తయారు చేశారా? కాంగ్రెస్ పార్టీలో ఒంటరి నిర్ణయాలు చెల్లుతాయా  అనేది మరో చర్చగా వినవస్తోంది. అదెలా ఉన్నా, రేవంత్ రెడ్డి ముందస్తు ఎన్నికల అభ్యర్ధుల జాబితా సిద్ధం చేసింది నిజమైనా కాకున్నా,  సోషల్ మీడియాలో  మాత్రం మొత్తం 119 పేర్లతో జాబితా షికార్లు చేస్తోంది. దీనిపై  వంక వివాదాలూ మొదలయ్యాయి.  అదలా ఉంటే, కర్ణాటక కాంగ్రెస్ నాయకులు తమ రాష్ట్రంలోనూ ముందస్తు ఎన్నికలు రావచ్చని అంటున్నారు. నిజానికి ఇటీవల హిజాబ్, హలాల్ వివాదాలు పతాక శీర్షికలకు ఎక్కిన సందర్భంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచనతోనే బీజేపీ మత ఉద్రిక్తలు రెచ్చగొడుతోందని ఆరోపించారు. అంతే కాదు, ముందస్తు అంచనాలతోనే రాహుల్ గాంధీ ఏప్రిల్ లో లిగాయత్ ఓటు బ్యాంక్ టార్గెట్ గా తుముకూరు శ్రీ సిద్ధి గంగ మఠాన్ని సందర్శించారని  వార్తలొచ్చాయి.  అయితే, అక్కడ  కర్ణాటకలో, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు ముందస్తు తధ్యం అంటున్నా, అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ, ఇక్కడ తెలంగాణలో అధికారంలో ఉన్న తెరాస ముఖ్యంత్రులు మాత్రం ముందస్తు లేదు వెనకస్తూ లేదు ... ఐదేళ్ళు అయిన తర్వాత, షెడ్యూలు ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని,అంటున్నారు. అయితే రేవంత్ జాబితా కాంగ్రెస్ పార్టీలో కలకలం అయితే రేపింది.

నిష్ప్ర‌యోజ‌నం అగ్నిప‌థ్ ప‌థ‌కం

త్రివిధ ద‌ళాల్లో సైనిక నియామ‌కాలకు కేంద్రం ప్ర‌క‌టించిన అగ్నిప‌థ్ ప‌థ‌కానికి దేశంలో యువ‌త నుంచి తీవ్ర‌వ్య‌తిరేక‌త వెల్లువెత్తింది. సైనిక నియామ‌క రిక్రూట్‌మెంట్ కొర‌కు సిద్ధ‌ప‌డుతున్న నిరుద్యోగ యువ‌కు లు దేశ ర‌క్ష‌ణ‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్ర‌క‌టించిన ప‌థ‌కం వ‌ల్ల ప్ర‌యోజ‌నం వుండ‌ద‌ని దేశ‌మంత‌టా యువ‌త నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు.  ఈ ప‌థ‌కం నాలుగేళ్ల‌కు మాత్ర‌మే యువ‌త‌కు ఉద్యోగ‌భ‌ద్ర‌త‌ను క‌ల్పిస్తోంది. మ‌రి ఆ త‌ర్వాత ఇత‌ర వుద్యోగాల‌కు వెళ్ల‌డానికి వీలు లేకుండా పోతుంది. క‌నుక ఆ నాలుగేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ నిరుద్యోగంలో యువ‌త కూరుకుపోవ‌డం ఖాయం.   అస‌లే శ‌త్రువుల నుంచి ముప్పు పొంచి వున్న ఈ స‌మ‌యంలో ఈ  స‌రికొత్త ప‌థ‌కం వ‌ల్ల ఇటు సాయుధ బ‌ల‌గాల సామ‌ర్ధ్యానికి చెప్పుకోద‌గ్గ  మేలు అయితే  ఏమీ వుండ‌ద‌న్న అభిప్రాయాలే వ్య‌క్త‌మ‌వుతున్నయి. దేశంలో యువ‌త‌ను అభివృద్ధి కార్య‌క్రమాల్లో పాలుపంచుకోవాల‌ని, అభివృద్ధి ఫ‌లాలు అందుకోవాల‌ని, అందుకు కేంద్రం ఎంతో చేయూత‌నిస్తోంద‌ని బిజెపి నాయ‌కులు భారీ ఎత్తు ప్ర‌చారం చేయ‌డం త‌ప్ప నిజానికి  అగ్నిప‌థ్ వంటి పథ‌కాల‌తో ప్రయోజ‌నం లేక‌పోగా, ప‌థ‌కం కాలం ముగిసిన త‌ర్వాత యువ‌త‌ను నిర్వీర్యం చేస్తుంద‌నే ఆరోప‌ణ‌లు దేశ‌మంత‌టా వెల్లువెత్తుతు్నాయి. అస‌లు ఇలాంటి ప‌థ‌క‌రూప‌క‌ల్ప‌న చాలా దారుణ‌మ‌ని విప‌క్షాలూ గోల చేస్తున్నాయి.  మన బలగాల గౌరవం, సంప్రదాయం, పరాక్రమం, క్రమశిక్షణ విషయంలో రాజీ పడటాన్ని బీజేపీ ప్రభుత్వం మానుకోవాలంటూ రాహుల్‌ గాంధీ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ కొత్త పథకంపై  అనుభవజ్ఞులతో పాటు పలు వర్గాల నుంచి విమర్శలు, ప్రశ్నలు ఎదురవు తున్నాయి. నాలుగేళ్ల పాటు మాత్రమే సర్వీసులోకి తీసుకోవడంతో యువతలో పోరాట స్ఫూర్తి దెబ్బతింటుందని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్‌ పథకం దేశానికి గానీ, యువ తకు గానీ అనుకూలంగా లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత భూపేందర్‌ సింగ్‌ హుడా విమర్శించారు. దీనిపై కేంద్రం పునరాలోచన చేయాలని సూచించారు. సాయుధ దళాల్లో నాలుగేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న సైనికులకు వారి ఉద్యోగాలను శాశ్వత ఉద్యోగాలుగా హేతుబద్ధీకరించేలా కేంద్రం పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు.  ఈ అంశంపై విశ్రాంత మేజర్‌ జనరల్‌ బీఎస్‌ ధనోవా రెండు కీలక సిఫారసులతో ట్వీట్‌ చేస్తూ.. కొత్తగా నియమించుకొనే వారికి కనీసం ఏడేళ్ల పాటు సర్వీసు ఉండేలా చూడాలని, వీరిలో 50 శాతం మందిని శాశ్వత సర్వీసుల్లోకి తీసుకొనేలా చేయడం మంచిదని సూచించారు. ఇలా పలువురు తమ తమ అభిప్రా యాలను వెల్లడిస్తున్నారు. నాలుగేళ్ల సర్వీసు తర్వాత వీరిలో కేవలం 25శాతం మంది అగ్నివీరులను మాత్రమే శాశ్వత సైనిక ఉద్యోగాల్లోకి ఎంపిక చేస్తారు. వీరంతా 15 ఏళ్ల పాటు నాన్‌ ఆఫీసర్‌ ర్యాంకులో సేవ లందించే వీలుంటుంది. మిగిలిన 75శాతం మంది నాలుగేళ్ల తర్వాత రూ.11 లక్షల నుంచి రూ.12 లక్షల మధ్య ప్యాకేజీతో సేవల నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. పెన్షన్‌ ప్రయోజనాలు కూడా లేవు. ఇలాం టి ప‌థ‌కాల‌తో యువ‌త‌ను  ఆక‌ట్టుకోవ‌డంలో అర్ధం లేదని రాజ‌కీయ విశ్లేష‌కులు  భావిస్తున్నారు.