ఉండవల్లితో కేసీఆర్ భేటీ ఆంతర్యమిదేనా?
posted on Jun 13, 2022 @ 3:28PM
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వ్యూహాలు ప్రత్యర్థులకు ఒక పట్టాన అంతుపట్టవు. ఉండి ఉండి ఒక్కసారిగా ప్రత్యర్థులను ఉక్కిరి బిక్కిరి చేసే వ్యూహాలతో ముందుకు వస్తుంటారాయన. ఆ వ్యూహాలలో నైతికత ఉందా, పద్ధతి ప్రకారం రాజకీయాలను నడిపే తీరదేనా లాంటి ప్రశ్నలను ఆయన పట్టించుకోరు. ప్రత్యర్థి పార్టీలనైనా, రాజకీయ ప్రత్యర్థులనైనా బినీత్ ది బెల్ట్ కొట్టడమంటే ఆయనకు మహా సరదా. ఇప్పుడు రాష్ట్రంలో యాంటి ఇంకంబెన్సీ తీవ్రంగా ఉందని విశ్లేషణలు వెల్లువెత్తుతున్న సమయంలో ఆయన జాతీయ పార్టీ అంటూ ప్రభుత్వ వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి ఒక కొత్త ఎత్తుగడతో ముందుకు వచ్చారు. అయితే అది ఒక్కటే చాలదని ఆయనే అనుకున్నారు. ఎందుకంటే ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉండటం, తెలంగాణ సెంటిమెంట్ పై ప్రజలను ఇక కదిలించలేమన్న నిర్ధారణక రావడం ఒక కారణమైతే.. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బలోపేతం కావడం మరో కారణంగా చెప్పుకోవాల్సి ఉంటుంది.
అందుకే ఆయన అనూహ్యంగా ఏపీలో రాజకీయ విశ్లేషకుడిగా మంచి గుర్తింపు ఉన్న రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లిని తెరమీదకు తెచ్చారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో కేసీఆర్ భేటీ అయిన రోజునే ఉండవల్లి కూడా కేసీఆర్ ను ప్రగతి భవన్ లో కలిశారు. ఇరువురి మధ్యా ఏ అంశంపై చర్చలు జరిగాయన్న స్పష్టత లేక పోయినా విశ్లేషకులు మాత్రం తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకు జనసేనాని పవన్ కల్యాణ్ ను రంగంలోనికి దింపేందుకేనని అంటున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం ద్వారా మాత్రమే ముచ్చటగా మూడో సారి రాష్ట్రంలో జయకేతనం ఎగురవేసి అధికార పగ్గాలు అందుకోవడం సాధ్యమౌతుందని కేసీఆర్ గట్టిగా నమ్ముతున్నారు. ఇప్పటికే అనివార్యంగా రాష్ట్రంలో త్రిముఖ పోరుకు రంగం సిద్ధమైంది. ఒక వైపు కాంగ్రెస్, మరో వైపు బీజేపీ వచ్చే ఎన్నికలలో టీఆర్ఎస్ కు సవాల్ విసరడానికి శక్తియుక్తులను కూడగట్టుకుంటున్నాయి.
ప్రభుత్వ వ్యతిరేకతను తమ ఓట్లుగా మార్చుకునేందుకు అస్త్రశస్త్రాలతో సిద్ధమౌతున్నాయి. త్రిముఖ పోరులో సునాయాసంగా గెలవచ్చు అని ఇంత కాలం భావిస్తూవచ్చిన కేసీఆర్ కు క్షేత్రస్థాయి పరిస్థితులపై అందిన నివేదికలు గట్టి ఝలక్ ఇచ్చాయి.
విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు రాష్ట్రంలో త్రిముఖ పోరు హోరాహోరిగా ఉంటుందని భావించడం సరికాదన్నదే ఆ నివేదికల సారాంశం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ కు అనుకూలంగా మారబోతున్నదని క్షేత్ర స్థాయి నుంచి అందిన నివేదికలు తేటతెల్లం చేయడందతో కేసీఆర్ అప్రమత్తమయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు గంపగుత్తగా కాంగ్రెస్ కు మరలే అవకాశం ఉందన్న నివేదికలతో ఆ పరిస్థితి రాకుండా ఏం చేయాలన్నదానిపై కేసీఆర్ వ్యూహాలకు పదును పెట్టిన ఫలితమే తెరపైకి రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ ద్వారా ఇప్పటి వరకూ తెలంగాణలో నామమాత్రంగా ఉన్న జనసేన పార్టీని ప్రోత్సహించి ఎన్నికల బరిలో ఎక్కువ స్థానాలలో పోటీ చేసేలా ప్రేరేపించడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటులో భారీ చీలిక తీసుకురావాలన్నది కేసీఆర్ వ్యూహంగా చెబుతున్నారు. పీకే సలహా మేరకే ఉండవల్లిని పిలిపించుకుని మరీ కేసీఆర్ భేటీ అవ్వడం వెనుక కారణం ఇదే నంటున్నారు. జనసేన తెలంగాణలో యాక్టివ్ అయితే.. ఆ పార్టీకి రాష్ట్రంలో భారీగా ఉన్న అభిమానుల ఓట్లు కాంగ్రెస్ కు మళ్లకుండా ఉంటాయన్నది కేసీఆర్ వ్యూహంగా చెబుతున్నారు.
మొత్తంగా రాష్ట్రంలో టీఆర్ఎస్ కు బీజేపీ కాదు, కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి అని కేసీఆర్ కు నివేదికలు అందిన నేపథ్యంలోనే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ వైపు మళ్ల కుండా ఉండాలంటే జనసేన పార్టీని రాష్ట్రంలో యాక్టివ్ చేయడమొక్కటే మార్గమన్న ఎత్తుగడతోనే కేసీఆర్ ఉండవల్లితో ‘ప్రత్యేక’ భేటీ అయ్యారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఉండవల్లి ఇటీవలి కాలంలో జగన్ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడమే కాకుండా, జనసేన కు అనుకూలంగా మాట్లాడిన సంగతిని ఈ సందర్భంగా వారు ప్రస్తావిస్తున్నారు. మొత్తం మీద ప్రభుత్వ వ్యతిరేక ఓటు గంపగుత్తగా కాంగ్రెస్ కు మళ్లకుండా చీలిక తీసుకు రావడం ద్వారా లబ్ధి పొందాలని కేసీఆర్ భావిస్తున్నారనీ అందుకే ఉండవల్లి అరుణ్ కుమార్ ద్వారా జనసేనను రీచ్ కావడానికి యత్నిస్తున్నారనీ పరిశీలకులు అంటున్నారు.