ఏపీలో ఆరోగ్య శ్రీకి తిలోదకాలు
posted on Jun 14, 2022 8:12AM
జగన్ ప్రభుత్వం మరో పథకానికి తిలోదకాలిచ్చేసింది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా పేదవాడికి కార్పొరేట్ వైద్యం అంటూ ఘనంగా చాటుకుని ఆరంభించిన ఈ పథకానికి మూడేళ్ల కూడా పూర్తి కాకుండానే మూత పెట్టేస్తోంది జగన్ సర్కార్. ఫీజు రీయింబర్స్ మెంట్, రైతులకు ఉచిత విద్యుత్ వంటి పథకాల దారిలోనే ఆరోగ్య శ్రీ కూడా లబ్ధిదారులకు ఎటువంటి ప్రయోజనం లేకుండా కొనసాగే పథకంగా మిగిలిపోనుంది. అదేలా గంటే.. ఇక నుంచి ఆరోగ్య శ్రీ సేవలకు సర్కార్ నేరుగా సొమ్ము చెల్లించదు. ఆ సొమ్మును రోగుల ఖాతాలకు జమ చేస్తుంది.
ఆ తరువాత ఆ సొమ్ము ఆటో డెబిట్ ద్వారా ఆసుపత్రులకు చేరుతుంది అని ప్రభుత్వం చెబుతున్నది. అయితే పరిశీలకులు మాత్రం ఇది ఆరోగ్య శ్రీ పథకానికి చెల్లు చీటీ రాసేయడమేనని పేర్కొంటున్నారు. ఇప్పటికే ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం కింద సొమ్మును కాలేజీలకు కాకుండా విద్యార్థుల తల్లుల ఖాతాలలో జమ చేస్తున్నారు. అయితే ఆ సొమ్మును నాలుగు విడతలుగా జమ చేస్తామన్న ప్రభుత్వం రెండు విడుతల తరువాత ఆపేయడంతో ఆ సొమ్మును విద్యార్థుల తల్లిదండ్రులే కాలేజీలకు చెల్లించాల్సి వస్తున్నది. అదే విధంగా రైతులకు ఉచిత కరెంటు పథకం కూడా. కనెక్షన్లకు మీటర్లు బిగించి..వచ్చిన బిల్లు సొమ్మును రైతుల ఖాతాలలో జమ చేస్తామని చెప్పిన ప్రభుత్వం అలా చేయకపోవడంతో రైతులే విద్యుత్ బిల్లులు చెల్లించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఆరోగ్య శ్రీ కూడా వాటి జాబితాలోకి చేరిపోనుంది. ఇలా చేయడం వల్ల పేదలకు వైద్యం దూరమయ్యే పరిస్థితి ఎదురుకావడం ఖాయమని పరిశీలకులు చెబుతున్నారు. పథకం కొనసాగుతున్నదని ప్రచారం చేసుకోవడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తున్నదనీ, కానీ ఆ పథకం ప్రయోజనాలను లబ్ధిదారులకు దూరం చేసే విధానాలన ప్రభుత్వం అవలంబిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం విషయంలో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం రీయింబర్స్ మెంట్ సొమ్ము ఖాతాలో వేయదు.
ఫీజు చెల్లిస్తే తప్ప కాలేజీలలో మార్కులు, హాల్ టికెట్లు, టీసీలు ఇవ్వరు. దీంతో అప్పో సొప్పో చేసి విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు కట్టాల్సి వస్తోంది. పేరుకే ప్రభుత్వం రీయింబర్స్ మెంట్ అంటోంది కానీ వాస్తవంలో ఆ పథకానికి దాదాపు చెల్లు చీటీ ఇచ్చేసిన పరిస్థితి. ఇక వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకం పరిస్థితి కూడా అలాగే తయారైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించిన సర్కార్..ఆ బిల్లుల సొమ్ము రైతుల ఖాతాలలో వేయడం లేదని పలు జిల్లాల రైతులు ఆరోపిస్తున్నారు. దాంతో చచ్చినట్లు తామే బిల్లులు చెల్లించాల్సి వస్తోందనీ, అలా చెల్లించకుంటే విద్యుత్ అధికారులు కనెక్షన్ కట్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఆరోగ్య శ్రీ పథకానికి కూడా ఆసుపత్రులకు కాకుండా నేరుగా రోగి ఖాతాకే సొమ్ము విధానాన్ని జగన్ ప్రభుత్వం తీసుకువస్తోందనీ, దీని వల్ల ఈ పథకాన్ని నమ్ముకుని వైద్యం కోసం ఆసుపత్రిలో చేరిన రోగికి ప్రభుత్వం సొమ్ము చెల్లించకుంటే పరిస్థితి ఏమిటని పలువురు నిలదీస్తున్నారు. ప్రస్తత విధానంలో ఆరోగ్యశ్రీ పథకంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో డబ్బు చెల్లించకుండా చికిత్స తీసుకోవచ్చు.
బిల్లులు ప్రభుత్వం నేరుగా ఆస్పత్రులకు చెల్లిస్తుంది. అయితే ఆస్పత్రులు ప్రభుత్వం ఎప్పుడు బిల్లులు చెల్లిస్తే అప్పుడే తీసుకోవాలి. దీంతో ప్రభుత్వం వందల కోట్ల బిల్లులు ఆస్పత్రులకు బకాయి పడింది. బిల్లులు చెల్లించకపోతే వైద్యం ఆపేస్తామని ఆస్పత్రులు విస్పష్టంగా చెబుతున్న పరిస్థితి ఉంది.
దీంతో ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి నేరుగా పేషంట్లకే సొమ్ము ఇస్తామని చెబుతున్నది. దీంతో ఆస్పత్రి బిల్లుతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు.. ఆస్పత్రికి ప్రభుత్వం బకాయి పడదు. అయితే ఫీజు రీయింబర్స్ మెంట్ లా, ఉచిత విద్యుత్ బిల్లులకు చేసినట్లుగా ఆరోగ్య శ్రీ బిల్లులు సకాలంలో పేషెంట్ల ఖాతాలో ప్రభుత్వం జమ చేయకపోతే.. ఇతర నగదు బదిలీ సబ్సిడీల్లాగే చేస్తే పేదల పరిస్థితి ఏమిటి? ఆస్పత్రులకు కాకుండా ఆరోగ్య శ్రీ బిల్లులు రోగుల ఖాతాకే నేరుగా జమ చేస్తామని ప్రభుత్వం చెప్పడం ఈ పథకానికి తిలోదకాలిచ్చేయడమేనని పలువురు విమర్శిస్తున్నారు. జగన్ ప్రభుత్వం ఒక్కటొక్కటిగా సంక్షేమ పథకాలను నిలిపివేస్తున్నదనీ, ఇప్పుడు ఆరోగ్య శ్రీని కూడా నిలిపివేత పథకాల జాబితాలోకి చేర్చేస్తోందని పరిశీలకులు అంటున్నారు.