దక్షిణాదిన కమల వికాసం తెలంగాణలో కాషాయ జెండా?
భారతీయ జనతాపార్టీ, ఆ పార్టీ నాయకులు పదేపదే చెప్పుకునే విధంగా దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యదిక సభ్యత్వం ఉన్న,అతి పెద్ద రాజకీయ పార్టీ, అయితే కావచ్చును. కానీ, వింధ్యకు అవలే కానీ, గీత దాటి దక్షిణాదిలోకి వస్తే, కమల దళానికి ఒక్క కర్ణాటక మినహా మరో రాష్ట్రంలో అంతగా రొమ్ము విరుచుకునే స్థాయిలో బలం లేదు. బలగం లేదు. ఈ మధ్య కాలంలో తెలంగాణలోనూ బీజేపీ కొంత పుంజుకుంటోంది. 2019 లోక్ సభ ఎన్నికలలో అనూహ్యంగా నాలుగు స్థానాలు గెలుచుకుంది. ఆ తర్వాత దుబ్బాక, హుజురాబాద్ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించింది. ఇక ఆక్కడ నుంచి బీజీపీ దూకుడు పెంచింది. అధికార తెరాస, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీలకు సమ ఉజ్జీగా గట్టి పోటీ ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. తమిళనాడులోనూ దూకుడు పెంచింది. ఏపీ, కేరళలో ప్రయత్నం జరిగిన అడుగులుపడడం లేదు.
అయినా మొత్తంగా చూస్తే, ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే, దక్షిణాదిన బీజేపీ ఇంకా చాలా దూరం ప్రయాణించవలసి వుంది. అందులో సందేహం లేదు. ఈనిజాన్ని, ఆ పార్టీ నాయకులే అంగీకరిస్తారు. మొత్తం ఐదు దక్షిణాది రాష్ట్రాలలో 129 లోక్ సభ స్థానాలుంటే, 2019 ఎన్నికలో బీజేపీ ఖాతాలో చేరింది ఆ పై 29 సీట్లు మాత్రమే (కర్ణాటక 25, తెలంగాణ 04) ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో కమలదళం ఖాతానే తెరవలేదు.
అయితే, ఇప్పుడు కమలనాధులు దక్షిణాది రాష్ట్రాలపై దృష్టిని కేంద్రీకరించారు. 2024 లోక్ సభ ఎన్నికలలో, ఇప్పుడున్న స్థానాలకు రెట్టింపు స్థానాలు గెలుచుకునేలా, వ్యూహ రచన చేసిన బీజేపీ ఆచి తూచి, అతి జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఇదే సమయంలో,లోక్ సభ ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు జరిగే తెలంగాణ శాసన సభ ఎన్నికలపైనా కాషాయ దళం దృష్టిని కేద్రేకరించింది. అందితే అధికారం, కాదంటే కనీసం ప్రధాన ప్రతిపక్షం స్థాయికి చేరుకునేదుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇలా ఒకరి వెంట ఒకరు రాష్ట్రంలో పర్యటించి పట్టు పెంచే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పార్టీ క్యాడర్’లో జోష్ పెంచే ప్రయ్తాన్ చేస్తున్నారు. మరోవంక తెరాస వ్యతిరేకతే ప్రధాన అజెండాగా రాజకీయం చేస్తున్న కొండా విశ్వేశ్వర రెడ్డి వంటి వివిధ పార్టీల నాయకులు కమల వైపు చూస్తున్నారు. ఇప్పటికైతే ఇటు నేతల దృష్టిలో, అటు ప్రజల దృష్టిలోనూ కూడా, తెరాసకు బీజేపీనే ప్రధాన ప్రత్యర్ధి అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అదే విధంగా దక్షిణాది రాష్ట్రాలలో పట్టు పెంచుకోవడం లక్ష్యంగా, తెలంగాణ నుంచి దండయాత్రను ప్రారంభించేందుకు, కమల దళం, సుమారు రెండుదశాబ్దాల తర్వాత జులై 2,3 తేదీలలో బీజేపీ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‘లో నిర్వహించాలని నిర్ణయించింది, ఇందుకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో ఏర్పడిన ఐదుగురు సభ్యుల కమిటీ, ఆపనిలో నిమగ్నమైంది. జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగే రెండు రోజులు భాగ్యనగరం కాషాయమయం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ కీలక నేతలందరూ హైదరాబాద్‌లో కొలువు దీరనున్నారు. పదహారు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సుమారు 40 మందికి పైగా కేంద్ర మంత్రులు, జాతీయ స్థాయి పథాదికారులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పార్టీ కీలక నేతలందరూ హాజరు కానున్నారు. సమావేశాలు జరిగే 2 రోజుల పాటు ప్రధాని మోడీ రాజ్ భవన్‌లో బస చేయనున్నట్లు తెలుస్తోంది.
సరే, ఏర్పాట్ల విషయం ఎలా ఉన్నా, త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ కాకుండా, జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్’ లో నిర్వహించాలనే నిర్ణయం వెనక భారీ స్కెచ్ ఉందని రాజకీయ, మీడియా వర్గాలో చర్చ జరుగుతోంది. మనం ఇంతకు ముందే అనుకున్నట్లుగా, దక్షినాది రాష్ట్రాలలో పార్టీ నిర్మాణం ప్రధాన లక్ష్యం అయితే, తెలంగాణలో తెరాసను గద్దెదించి, కాషాయ జెండా ఎగరేయడమే జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్’లో నిర్వహించడం వెంక ఉన్న మరో ప్రధాన లక్ష్యమని వేరే చెప్పనక్కర లేదు.
అయితే అది అయ్యే పనేనా, ఉత్తర బారత పార్టీగా ముద్ర వేసుకున్న బీజేపీ దక్షిణాదిలో పాగా వేయడం సాధ్యమేనా? ముఖ్యంగా వంతుల వారీగా అధికార, ప్రతిపక్ష భూమికను పోషించే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న తమిళ నాడు, ఆంధ్ర ప్రదేశ్’ రాష్ట్రాలలో బీజేపీ, నిలబదగాలుగుతుందా? అంటే, బీజేపే నాయకులు ఈశాన్య రాష్ట్రాల వైపు చూడండి... లుక్ నార్త్ ఈస్ట్ .. అంటున్నారు. ఒకప్పుడు ఒకటి రెండు శాతం ఓటు కూడా లేని అస్సాం, త్రిపురలలోనే కాదు, ఎనిమిదికి ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ, మిత్ర పక్షాలు అధికారంలో ఉన్నాయని అంటున్నారు.
అలాగే, పశ్చిమ బెంగాల్’లోనూ అధికారంలోకి రాలేక పోయినా, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలను ‘జీరో’ కు చేర్చి. బీజేపీ ప్రధాన ప్రతిపక్ష హోదాను పొందిందని, బీజేపీ నాయకులు ధీమాగా ఉన్నారు. మరోవంక రాజకీయ విశ్లేషకులు కూడా 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ, 30 - 40 సీట్లతో ప్రధాన ప్రతిపక్ష స్థాయికి చేరుకున్నా, తెలంగాణలో భవిష్యత్ బీజేపీదే అవుతుందని, రాష్ట్రం నుంచి బీజేపీ ఆశిస్తున్న విధంగా సగానికి పైగా లోక్ సభ స్థానాలను సునాయాసంగా గెలుచు కుంటుందని అంటున్నారు. అలాగే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో దినదిన ప్రవర్తమానంగా దిగజారి పోవడం, జాతీయ నాయకత్వం అంతే వేగంతో బలహీనమవడం కూడా బీజేపీకి కలిసొచ్చె అంశాలుగా పరిశీలకులు భావిస్తున్నారు.
అయితే, జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్’లో నిర్వహించినంత మాత్రాన, ఆ ఒక్క కారణంగా తెలంగాణలో, దక్షణాది రాష్ట్రాలలో బీజేపే బలాన్ని పుంజుకుంటుందని అనుకుంటే పొరపాటే అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఈ సందర్భంగా 2004 లోక్ సభ ఎన్నికలకు ముందు, దక్షణాది రాష్ట్రాలకు చెందిన వెంకయ్య నాయుడు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నరోజుల్లోనే, 2003 చివర్లో, హైదరాబాద్’లోనే పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించారు. అయినా .. ఆవెంటనే జరిగిన లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏమిటో... వేరే చెప్పనక్కరలేదు. అటల్జీ పాలనలో దేశం వెలిగి పోతోందని ప్రచారం జరిగినా .. ఆ ఎన్నికలలో కమలం వాడి పోయింది.
కాంగ్రెస్ సారధ్యంలో ఏర్పడిన యూపీఎ ప్రభుత్వం పదేళ్ళు దేశాన్ని పాలించింది.రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ కూటమి అధికారం కోల్పోయింది. అంతకు ముందు పదేళ్ళు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర విభజన వరకు పదేళ్ళు ఉమ్మడి రాష్ట్రాని హస్తం పార్టీ పాలించింది. సో .. హైదరాబాద్’లో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించడం వల్ల మాత్రం చేతనే బీజేపీ దక్షిణాదిన /తెలంగాణలో జెండా పాతేస్తుందని అనుకోవడం కుదరదని పరిశీలకులు అంటున్నారు. అయితే, రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణం కమల వికాసానికి అనుకూలంగా ఉందని మాత్రం అందరూ అంగీకరిస్తున్నారు.