ఏపీలో 2019 నాటి సీన్ రిపీట్.. కేసీఆర్,ఉండవల్లి భేటీ రహస్యం ఇదేనా?
posted on Jun 14, 2022 7:18AM
ఉండవల్లి అరుణ్ కుమార్.. తెలుగు రాష్ట్రాలలో పరిచయం అక్కర్లేని పేరు. రాష్ట్ర విభజన తరువాత నుంచీ రాజకీయాలకు దూరంగా ఉంటున్నా.. ఉండుండి ఒక్కసారి తన విలక్షణ, సంచలన విశ్లేషణలతో వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పుడు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో భేటీలో ఒక్క సారిగా తెరమీదకు వచ్చారు. కేసీఆర్ ఎందుకు పిలిచారు? ఉండవల్లి ఎందుకు వెళ్లారు? అన్న చర్చ ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఓ రేంజ్ లో జరుగుతోంది.
ఎందుకంటే రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన వారిలో మొదటి వరుసలో ఉన్న ఉండవల్లి.. రాష్ట్ర విభజన జరిగిన ఎనిమిదేళ్ల తరువాత నాడు ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించిన కేసీఆర్ తో భేటీ కావడమే ఒక సంచలనం అయితే.. విభజనను పూర్తిగా వ్యతిరేకించిన ఉండవల్లిని కేసీఆర్ పిలిపించుకుని మరీ చర్చించడం అంతకు మించిన సంచలనం. సరే ఇరువురి భేటీ అయిపోయింది. ఆ భేటీలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే కూడా ఉన్నారు. అనూహ్య నిర్ణయాలు, వ్యూహాలకు పెట్టింది పేరైనా పీకే సమక్షంలో భిన్న ధృవాలు వంటి కేసీఆర్, ఉండవల్లిల భేటీ జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ ప్రస్తుతం ఎన్నికల హీట్ పీక్స్ లో ఉన్న సమయంలో జరిగిన ఈ భేటీపై పలు విశ్లేషణలు వస్తున్నాయి. ప్రస్తతుం ఉభయ తెలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలు రెండూ కూడా తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయన్న అంచనాల నేపథ్యంలో జరిగిన ఈ భేటీ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరువురి భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశాలు కేసీఆర్ ఏర్పాటు చేయబోయే జాతీయ పార్టీ, ఏపీలో అధికారం చేపట్టాలని భావిస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తెలంగాణలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్న కేసీఆర్ అందుకు రాష్ట్రంలో స్థిరపడిన ఆంధ్రుల ఓట్లు కీలకం అని భావిస్తున్నారు. అలాగే ఏపీలో అధికారం కోసం అర్రులు చాస్తున్న పవన్ కల్యాణ్ కు గత ఎన్నికలలో పొరుగు రాష్ట్రం నుంచి వైసీపీ అధినేత జగన్ కు ఎలాంటి ‘సహకారం’ అందిందో అటువంటి సహకారం కోరుకుంటున్నారు. సో రోగీ వైద్యుడు సామెతలా ఇరువురి ఉద్దేశాలూ ఒకటే అయినా ఇరువురికీ సమన్వయం కుదిర్చే ఒక మీడియేటర్ అవసరం. సరిగ్గా ఆ మీడియేటర్ పాత్ర పోషించేందుకు ఉండవల్లి అయితే సరిగ్గా సరిపోతారని కేసీఆర్ భావించారు. అందుకే ప్రత్యేకంగా ఆయనను హైదరాబాద్ పిలిపించుకుని చర్చించారు.
ఏపీలో జగన్ కు, తెలంగాణలో కేసీఆర్ కు కూడా ఎన్నికల వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిశోర్ (పీకే) సమక్షంలో ఈ భేటీ జరిగింది. అంటే ఉండవల్లిని పరోక్షంగనో, ప్రత్యక్షంగానో తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రులను తెరాస వైపు ఆకర్షితులను చేయడానికి అదే సమయంలో ఏపీలో జనసేన ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి.. తన రాజకీయ గురువు వైఎస్ కుమారుడు జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికి ఉపయోగపడేలా మౌల్డ్ చేయడానికే ఈ భేటీ జరిగిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2019 ఎన్నికలలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. అయితే అప్పట్లో ఉండవల్లి ప్రత్యక్షంగా ఇలా బయట పడలేదు కానీ, పవన్ కల్యాణ్ తో భేటీల్లో కానీ, ఆయన అప్పట్లో ఏర్పాటు చేసిన పలు మీడియా సమావేశాలలో కానీ తెలుగుదేశం, జనసేనల మధ్య ఎన్నికల పొత్తు అనర్ధమన్న రీతిలోనే సాగాయి.
సరే కారణాలేమైతేనేం నాడు తెలుగుదేశం, జనసేన పార్టీలు విడివిడిగా రంగంలోకి దిగాయి. ఫలితం తెలిసిందే. ఇప్పుడు తెలుగుదేశం, జనసేనల మధ్య అవగాహన ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమౌతున్న వేళ మరో సారి ఉండవల్లిని రంగంలోకి దింపడం ద్వారా ‘కాగల’ కార్యాన్ని సాధించాలని కేసీఆర్, పీకేల వ్యూహంలో భాగమే ఉండవల్లితో భేటీ అన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఏపీలో కేవలం 7 శాతం ఓటు షేర్ ఉన్న పవన్ కల్యాణ్ ను రాష్ట్ర ముఖ్యమంత్రిగా అంగీకరించేందుకు తెలుగుదేశం అంగీకరించే పరిస్థితి ఎటూ లేదు. ఇక ఏపీలో జనం మూడ్ వైసీసీకి వ్యతిరేకంగా ఉందన్నదీ ఇటీవలి పలు సర్వేలు తేటతెల్లం చేశాయి. ఈ పరిస్థితుల్లో ఓట్ల చీలిక ఒక్కటే రాష్ట్రంలో వైసీపీని గట్టెక్కిస్తుందన్నది కేసీఆర్, పీకేల వ్యూహంగా పరిశీలకులు చెబుతున్నారు. ఏపీలో తెలుగుదేశం ను అధికారానికి దూరం చేయడం ద్వారా కేసీఆర్ కు వచ్చే ప్రయోజనం ఏమిటన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమౌతుంది. అయితే తెలంగాణ అభివృద్ధిని ఘనంగా చాటుకోవాలంటే ఏపీలో వెనుకబాటు కొనసాగాలి. గత మూడేళ్లుగా ఏపీ విధానాల కారణంగా తెలంగాణ పాలన ఘనంగా, గొప్పగా ఉందని తెరాస సర్కార్ ప్రచారం చేసుకోగలిగింది.
అంతకు ముందు అంటే 2014 నుంచి 2018 వరకూ తెలంగాణకు ఆ అవకాశం లేకపోయింది. మిగులు రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ కంటే జీరోతో మొదలైన ఏపీ ప్రగతి గురించే నాడు దేశం మొత్తం మాట్లాడుకుంది. అందుకే ఏపీలో తెలుగుదేశం ను అధికారానికి దూరం చేయాలంటే పవన్ కల్యాణ్ ను ఎన్నికలలో ఒంటరిగా పోటీలో దిగేలా ప్రోత్సహించాలి. అందుకే ఉండవల్లి అరుణ్ కుమార్ ని కేసీఆర్ ప్రత్యేకంగా పిలిపించుకుని మరీ గంటల తరబడి చర్చించారు. సొంత కేబినెట్ మంత్రులకే తెరుచుకోని ప్రగతి భవన్ తలుపులు.. సమైక్యాంధ్ర వాది ఉండవల్లికి బార్లా తెరుచుకోవడం వెనుక కారణం ఇదే. ఏపీలో 2019 నాటి సీన్ రిపీట్ కావాలన్నదే కేసీఆర్, పీకే వ్యూహంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.