ఉండవల్లితో భేటీ అందుకేనా..? పొలిటికల్ సర్కిల్స్’లో హాట్ డిస్కషన్
ఉండవల్లి సరే... ఆయనకు రాజకీయంగా ఉన్నదీ లేదు, పొయేదీ లేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించి నందుకు 2014లోనే కాంగ్రెస్ ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించింది. అ తర్వాత ఆయన కూడా రాజకీయాలకు దూరంగా, చేసేది లేకనే కావచ్చును, ప్రవచనాలతో కాలక్షేపం చేస్తున్నారు. సో .. ఇప్పడు ఆయన ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా, ప్లేట్ ఫిరాయించినా, కేసీఆర్’ను పొగడ్తలతో ముంచెత్తినా, కేసీఆర్ భజన చేసినా ఇంకో మెట్టు కిందకు దిగి, కేసీఆర్ పెట్టే పార్టీకి సలహాదారు గానో, లేదా మరో పాత్రో పోషించినా ఆయనకు పోయేదేమీ లేదు. ఆఫ్కోర్స్, రాజమహేంద్రవరం ఎంపీగా ఆయన సంపాదించుకున్న గత వైభవం కారణంగా మిగిలున్న పరువులాంటిది ఏదైనా అంతో ఇంతో ఇంకా మిగిలుంటే, అది కాస్తా, ఖర్చయిపోతే పోవచ్చును. అంతకు మించి ఆయనకు పోయేది లేదు. వచ్చేది అయితే అసలే లేదు.
కానీ, కేసీఆర్ పరిస్థితి, అది కాదు... ఆయన క్రియాశీల రాజకీయాల్లో మునిగి తేలుతున్నారు. తెలంగాణలో కుటుంబ పాలనను సక్సెస్ఫుల్’గా ఎస్టాబ్లిష్ చేసిన ఆయన,ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నారు. కారణాలు ఇంకైమైనా కావచ్చును కానీ, జాతీయ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీని రీప్లేస్ చేసేందుకు, వ్యూహరచన చేస్తున్నారు. అందులో భాగంగానే, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్’ను ఆశ్రయించిన కేసీఆర్, ఇప్పుడు ఉండవల్లితో మంతానాలు సాగించారు. కేసీఆర్ ప్రవచిస్తున్న జాతీయ జాతీయ పార్టీ ఏర్పాటుకు, ఈ భేటీకి ఏదైనా సంబంధం ఉన్నా లేకున్నా రాష్ట్ర రాజకీయాలపై మాత్రం ఈ భేటి ప్రభావం తప్పక ఉంటుందని అంటున్నారు. అదలా ఉంటే, ఆయన ఆశలు, అవసరాలు ఎలా ఉన్నా, ఆయన జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పినా, తిప్పక పోయినా, ఆయన పునాదులు మాత్రం తెలంగాణలో మరీ మాట్లాడితే, తెలంగాణ అస్తిత్వ వాదంలోనే ఉన్నాయన్నది నిజం. అవును, తెలంగాణ సెంటిమెంటే ఆయన బలం. ఆ సెంటిమెంటే ఆయన్ని ఈ స్థితికి చేర్చింది.
అయితే, ఇప్పుడు కరుడు కట్టిన సమైక్యవాదిగా ముద్రవేసుకుని, పార్లమెంట్ ఆమోదించిన రాష్ట్ర విభజన బిల్లునే న్యాయ స్థానంలో సవాలుచేసి, ఇంకా న్యాయపోరాటం చేస్తున్న, తెలంగాణ వ్యతిరేకి ఉండవల్లి అరుణ కుమార్’తో మంతనాలు జరపడం, అనేక సందేహాలకు తావిస్తోంది. చావు నోట్లో తలపెట్టి తెచ్చానని చెప్పుకునే తెరాస అధ్యక్షుడు కేసీఆర్, ఇప్పుడు పోయి పోయి కరడు కట్టిన సమోక్యవాది ఉండవల్లితో రాజకీయ మంతనాలు సాగించడం ఏమిటి? తెలంగాణ ప్రజలు ఈ ‘భేటీని ఎలా చూస్తారు? ముఖ్యమంత్రి ఈ భేటీ ద్వారా తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన 1200 మంది అమరవీరుల కుటుంబాలకు, తెలంగాణ ప్రజలకు ఏమి సమాధానం చెపుతారు? రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది.
తెలంగాణ సెంటిమెంట్’ను అడ్డుపెట్టుకునే తెరాస ఒకటికి రెండు సార్లు ఎన్నికలలో విజయం సాధించింది. అయితే ముచ్చటగా మూడవ సారి మళ్ళీ అధికార పగ్గాలు చేపట్టేందుకు, తెలంగాణ సెంటిమెంటును మాత్రమే నమ్ముకుంటే ప్రయోజనం ఉండదని, సెంటిమెంటును నమ్ముకుంటే ఈసారి విజయం సాధించడం అయ్యే పనికాదని కేసీఅర్’కు అర్థమై పోయిందని అంటున్నారు. ముఖ్యంగా, దుబ్బాక, హుజురాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు ప్రమాద ఘంటికలు వినిపించిన నేపధ్యంలో, కేసీఆర్, జాతీయ రాజకీయాల పేరిట దక్షిణాది సెంటిమెంట్ ‘ను ఆశ్రయించారని, అందులో భాగంగానే, ఆయన ఎన్నికల వ్యూహకర్త పీకే డైరెక్షన్’లో పావులు కదుపుతున్నారని, అంటున్నారు. ఇందులో భాగంగానే, ఉండవల్లితో కేసీఆర్ భేటీ అయ్యారని తెలుస్తోంది. అంతే కాదు, ఈ భేటీ తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ప్రతిపక్షాలు, ఉద్యమ సంఘాలే కాదు, తెరాస నాయకులు కార్యకర్తలు కూడా ఈ పరిణామాన్ని జేర్ణించుకోలేకుండా ఉన్నారని అంటున్నారు.
ఇప్పటికే తెలంగాణ ఉద్యమా స్పూర్తిని, లక్ష్యాలను, ఉద్యమం కోసం ప్రాణ త్యాగం చేసిన 1200 మంది అమరవీరుల త్యాగాలను మరిచి, ఉద్యమ ద్రోహులను అందలం ఎక్కించి, కుటుంబ పాలన సాగిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కుంటున్న కేసీఆర్, ఇప్పుడు ఏకంగా, సమైక్య వాదానికి చెరగని చిరునామాగా నిలిచిన ఉండవల్లితో రహస్య మంతానాలు సాగించడం ఎవరి వరకో ఎందుకు, తెరాసలోనే ఒక వర్గం గట్టిగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్’లో ప్రధాని మోడీ, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఏదో అన్నారని, ప్రధానిపై ఇంతెత్తున ఎగిరిపడిన తెరాస నాయకులు, ప్రధాని మోడీ తెలంగాణను ఏపీలో విలీనం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపణలు చేసిన నాయకులు, ఇప్పుడు, కేసీఆరే అలాంటి సంకేతాలు పంపుతున్నారా? పునః విలీనానికి సిద్దమవుతున్నారా ? అనే సందేహం వ్యక్తపరుస్తున్నారు.
అయితే, అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం, కేసీఆర్ ఇలాంటి జిమ్మిక్కులు చేస్తారని సీనియర్ జర్నలిస్టు ఒకరు స్వీయ అనుభవం వ్యక్తపరిచారు.ఆలాగే , కొద్ది రోజుల క్రితం సినిమా నటుడు ప్రకాష్ రాజ్’ను ఇలాగే, కొద్దిరోజులు వాడుకుని ఆ తర్వాత పక్కన పెట్టారని, ఇప్పడు ఉండవల్లిని కూడా కరివేపాకులా తీసేసిన ఆశ్చర్య పోనవసరం లేదనీ అంటున్నారు.