కమల దళంలో ముసలం మోడీ తీరు పట్ల అసంతృప్తి.. మోడీ మూడోసారి డౌటే
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తిరుగులేని నాయకుడు, ఎనిమిదేళ్ళ పాలన తర్వాత కూడా దేశంలో మోడీకి సరి జోడీ మరొకరు కనిపించడం లేదు. ఇది చాలా మందిలో ఉన్న ప్రస్తుతఅభిప్రాయం. అలాగే, పార్టీలో ప్రభుత్వంలో అయన మాటకు ఎదురుండదు. అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో మోడీ, షా జోడీదే హావా. ఆ ఇద్దరు ఏ నిర్ణయం తీసుకుంటే, అదే ఫైనల్..నిజమే,కొంచెం అతిశయోక్తిగా అనిపించినా ఇదే నిజం.ముఖ్యంగా, 2019లో రెండవ సారి, 303 మంది సభ్యుల సొంత సంఖ్యాబలంతో అధికారంలోకి వచ్చిన తర్వాత, పార్టీలో, ప్రభుత్వంలో ఆ ఇద్దరే హీరోలు .. మిగిలిన అందరూ జీరోలు, అనే అభిప్రాయం మరింతగా బలపడింది. బీజేపీ అంటే మోడీ, బీజేపీ అంటే అమిత్ షా, ప్రభుత్వంలోనూ ఆ ఇద్దరు చెప్పిందే వేదం, ఎంత మంది సీనియర్ మంత్రులు ఉన్నా, ఆ ఇద్దరు చేసిందే శాసనం, అనే ఒక బలమైన పర్సెప్షన్ అయితే ఏర్పడింది. సహజంగానే అది సీనియర్లలో అసంతృప్తిని రగిల్చింది.
నిజమే ఒకప్పుడు, కాంగ్రెస్ లో ఇందిరా గాంధీ ఇలాగే, ఓ వెలుగు వెలిగారు 1969లో సీనియర్ నాయకులు అందరినీ పక్కకు నెట్టి, ఇందిరాగాంధీ పార్టీని రెండు ముక్కలు చేశారు. అయినా 1971 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో, ఇందిరా గాంధీ, 353 సీట్లతో తిరుగులేని శక్తిగా, ఎదురు లేని నాయకురాలుగా నిలిచారు. ఈ నేపధ్యంలోనే పార్టీ నాయకుడు దేవకాంత్ బారువా ఇందిరా గాంధీని పొగడ్తలతో ముంచెత్తారు. ఏకంగా, ‘ఇందిరానే ఇండియా, ఇండియానే ఇందిరా’ అని ఆమెను ఆకాశానికి ఎత్తేశారు. ఇప్పుడు, మోడీ షా జోడీ కూడా అలానే పార్టీని, ప్రభుత్వాన్ని తమ గుప్పిటలో పెట్టుకుని చక్రం తిప్పుతున్నారు.
అయితే, ఇప్పుడు ఇటు పార్టీలో, అటు ప్రభుత్వంలో కూడా, మోడీ షా జోడీకి ప్రతిఘటన మొదలైందని తెలుస్తోంది. నిరసన సెగ ఆ ఇద్దరినీ గట్టిగా తాకుతోందని, పార్టీ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. అది కూడా నాగపూర్ సెగ అంటున్నారు. పార్టీ సర్వోన్నత విధాన నిర్ణాయక కమిటి, పార్లమెంటరీ బోర్డును నిర్వీర్యం చేసి, ముఖ్యమంత్రుల నియామకం వంటి కీలక నిర్ణయాలను ఆ ఇద్దరే, (మోడీ, షా జోడీ) తీసుకోవడం, ఏమిటనే ప్రశ్న ప్రముఖంగా వినిపిస్తోంది.అదే విధంగా, పార్టీతో సంఘ్ పరివార్ సంస్థలతో సంప్రదించకుండా, హిదుత్వ వాదానికి కట్టుబడిన, పార్టీ అధికార ప్రతి నిథి నూపూర్ ‘ ను సస్పెండ్ చేయడం వంటి నిర్ణయాలు నాగపూర్ కు రుచించడం లేదని అంటున్నారు.
ఈ నేపద్యంలో, పార్టీ సీనియర్ నాయకుడొకరు, గడచిన రెండు సంవత్సరాలలో, పార్లమెంటరీ బోర్డు ఒక్కసారి కూడా సమావేశం కాలేదు, అయినా, నాలుగైదు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను మార్చారు. ఇటీవల ఎన్నికలు జరిగిన ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులనే కొనసాగించాలననే కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ఈ నిర్ణయాలు ఎవరు తీసుకున్నారు? పార్లమెంటరీ బోర్డులో సభ్యులుగా ఉన్న అరుణ్ జైట్లీ, సుష్మ స్వరాజ్ చనిపోయారు. వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతిగా ఎన్నికై రాజకీయ క్షేత్రం నుంచి తప్పుకున్నారు అలాగే గడచిన ఐదేళ్లలో ఇంకొన్ని ఖాళీలు కూడా ఏర్పడ్డాయి. బోర్డ్ సభ్యుల సంఖ్య ఇంచు మించుగా సగానికి తగ్గి పోయింది. ముఖ్యంగా ప్రశ్నించే వారు లేకుండా పోయారు. ఒక్క గడ్గరీ మినహా మరొకరు గొంతు వినిపించే పరిస్థితి లేదు. అయినా ఖాళీలు భర్తీ చేయలేదు. చివరకు పార్టీ రాజ్యాంగం అత్యున్నత నిర్ణాయక కమిటీగా పేర్కొన్న, పార్లమెంటరీ బోర్డును, కేవలం కాగితాలకు పరిమితం చేశారు, అంటూ ఆగ్రహం వ్యక్త పరిచారు.
ఇదలా ఉంటే, ఇటీవల మూడో సారీ, మళ్ళీ నేనే, అంటూ ప్రధాని మోడీ ప్రకటించిన నేపధ్యంలో, పార్టీలో, సంఘ పరివార్’ లో లుకలుకలు మొదలయ్యాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. నాగపూర్’కు ఫిర్యాదులు చేరాయి. కొదరు పార్టీ సీనియర్ నాయకులు, ఎంపీలు, పార్టీలో వ్యక్తీ ఆరాధన ఎక్కువుతున్న తీరును, ఆ ఇద్దరు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాల వలన పార్టీకి జరుగతున్న నష్టాన్ని నేరుగా ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ దృష్టికి తీసుకెళ్ళారని తెలుస్తోందని అంటున్నారు. ఆ ఇద్దరిని కట్టడి చేయక పోతే. 2024 ఎన్నికలలో పార్టీకి ఓటమి తప్పదని, సుమారు 150కి పైగా ఎంపీల సంతకాలతో కూడిన నివేదిక మోహన్ భగవత్’కు చేరిందని సమాచారం.
ఇందులో ప్రధానంగా పెట్రోల్, డీజిల్ సహా నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, రైతులు, గ్రామీణ ప్రాంత ప్రజలు, వ్యవసాయ రంగం ఎదుర్కుంటున్న సమస్యలను పట్టించుకోక పోవడం వంటి కీలక అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది.అలాగే, మిత్ర పక్షాలను, ముఖ్యంగా శివసేన వంటి మిత్ర పక్షాలను దూరం చేసుకోవడం, ఆ పార్టీ నేతలను వేధింపులకు గురిచేయడం, ప్రాంతీయ పార్టీలతో కయ్యానికి కలుదువ్వడం వంటి విషయాలను కూడా ఆర్ఎస్ఎస్ అధినేత దృష్టికి తీసుకువెళ్ళినట్లు సమాచారం.
ఈ నేపధ్యంలోనే, ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్ అధినేత ఆదేశాల మేరకు, సీనియర్ మంత్రులు, కీలక నేతలతో సమావేశ మయ్యారు. ఈ సమావేశంలో, సీనియర్ మంత్రులు రాజనాథ్ సింగ్, నితిన్ గడ్గరీ ప్రధాని మోడీ వ్యవహార శైలిని ప్రశ్నించడం తో పాటుగా తీరు మార్చుకోక పొతే, 2024 ఎన్నికలలో గట్టెక్కడం కష్టమని గట్టిగా హెచ్చరించారని తెలుస్తోంది. ఈ సందర్భంగా గడ్గరీ, ప్రధాని మోడీ మధ్య వాగ్వివాదం సైతం చోటు చేసుకుందని, ఆ సమయంలో మోడీ ‘ఎన్నికలలో ఎలా గెలవాలో , ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో తనకు తెలుసునని, ఎవరూ చెప్పవలసిన అవసరం లేదని అసహనాన్ని ప్రదర్శించారు. అలాగే ఎంపీలు అందరూ తనతోనే ఉన్నారని అన్నారు,
దీంతో గడ్గరీ 150 మంది ఎంపీలు సంతకాలతో నాగపూర్’కు పంపిన నివేదికను మోడీ ముందు పెట్టినట్లు సమాచారం.ఆ తర్వాతనే మోడీ, పెట్రోల్, డీజిల్’పై ఎక్సైజ్’ డ్యూటీ భారీగా తగ్గించడం,ఎరువుల సబ్సిడీ పెంచడం వంటి నిర్ణయాలు తీసుకున్నారని తెలుస్తోంది. అలాగే, మిత్రపక్షాల విషయంలోనూ పునరాలోచన చేస్తునట్లు తెలుస్తోంది. అయితే, ముడో సారీ నేనే. అంటూ మోడీ చేసిన ప్రకటన సృష్టించిన ప్రకంపనలు అంత తేలిగ్గా చల్లారవని, ముఖ్యంగా ప్రధాని పదవిని ఆశిస్తున్న, ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు ఉన్న గడ్గరీ, ఈసారి తాడో పేడో తేల్చుకునేందుకు సిద్డమయ్యారని అంటున్నారు.
అయితే, అదే సమయంలో మోడీ షా జోడీ వ్యూహాలను తక్కువగా అంచనా వేయలేమని, కమల దళంలో విరిసిన ‘ముసలం’ ఏమి చేస్తుందో, ఎటుగా సాగుతుందో చూడవలసిందే కానే చెప్పలేమని, పార్టీ నేతలు, పరిశీలకులు అంటున్నారు. అయితే, బీజేపీ అంతా బాగుందని, మోడీ షా జోడీకి తిరుగు లేదని, అనుకునే పరిస్థితి అయితే లేదని తాజా పరిణామాలు సూచిస్తున్నాయని, పార్టీ నాయకులే అంగీకరించడం ... ఈ కథకు కొసమెరపు.