పాత స్నేహితుల కలయిక ఎవరికి ఊరట
posted on Jun 14, 2022 6:01AM
రాజకీయాల్లో శాశ్వత శతృవులు అంటూ వుండరు. ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సంఘటన ప్రభావంతో శతృవులు మళ్లీ మంచి మిత్రులూ కాగల్గుతారు. అంతకుముందు వరకూ పెద్దగా స్నేహం లేకున్నా మంచి స్నేహితులుగానూ మారవచ్చు. పార్టీలు వేరయినా తమ స్నేహబంధాన్ని కొనసాగించేవారు ఒక్కోసారి తమ తమ పార్టీలకు అనుకూలించనూ వచ్చు. శనివారం వంగవీటి రాధా, వల్లభనేని వంశీల కలవడం ఈ తరహా రాజకీయ వంతెనను కట్టుదిట్టం చేయడానికి వంశీ వుపయోగిస్తాడేవెూ అనుకోవచ్చునేవెూ! ఎందుకంటే గన్నవరంలో కూడా ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య విభేదాలు పార్టీ అధినేతకు తలభారంగానే మారింది. ఈ సమయంలో పాత స్నేహితుల కలయిక కొంత వూరటనివ్వచ్చునని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పార్టీ, ప్రభుత్వ పరువు కాస్తంత దెబ్బతిన్న ఈ తరుణంలో జగన్‌కి ఇలాంటి స్నేహితుల కలయిక ఊరట నిస్తుందేవెూ మరి.
కృష్ణాజిల్లా గన్నవరంలో రాజకీయ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాధా, వంశీలు అంతకుముందు నుంచీ స్నేహితులే. అయితే రాజకీయాల కారణంగా ఒకరు వైసీపీ లోంచి టీడీపీకి వెళితే, మరొకరు టిడీపీ నుంచి వైసీపీలోకి మారారు. ఇటీవలే రంగా 33వ వర్ధంతి సందర్భంగా రాధా, వంశీలు విజయవాడలోని రాధా కార్యాలయంలో కలిసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. 2019లో టిడిపీ నుంచి గెలిచిన వంశీ ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్‌పట్ల ఆకర్షితుడయ్యారు, జగన్ పార్టీలో వున్న వంగవీటి రాధా జగన్‌తో విభేదించి టీడీపీలోకి వెళ్లేరు.
ఇప్పుడు అసలే వైసీపీలో లుకలుకలు బయటపడుతున్న నేపథ్యంలో వీరి కలయిక కొంత ప్రాధాన్యతను సంతరించుకుందనే విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలా పాతస్నేహాలకు మళ్లీ ప్రాణం పోస్తుండటం పాత మిత్రులు కలుస్తుండటం ఆ మధ్య కూడా జరిగింది. గుడివాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా వెంకటరమణ(బాబ్జీ) మరణించినపుడు అంతిమయాత్రలో కొడాలి నాని, వంగవీటి రాధా పాల్గొన్నారు. ఆ సందర్భంలో ఇద్దరూ కలిసి టీ తాగుతూ చాలాసేపు ముచ్చటించుకోవడం అందరూ గమనించారు. అసలు కొంతకాలంగా వంగవీటి రాధాను మళ్లీ పార్టీలోకి తీసుకురావలన్న తాపత్రయంతోనే నాని తమ స్నేహాన్ని మరింత కొన సాగించి జగన్‌కి నమ్మకం కలిగిస్తున్నారు. ఇక్కడ మరో మాట కూడా చెప్పుకోవాలి కొడాలి నానితో వున్నంత స్నేహంగా టిడీపీ నేతలతో వంగవీటి రాధా వుండరన్న మాట బాగా ప్రచారంలో వుంది.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మరి ఈ స్నేహబంధాలు జగన్‌కు ఎన్నికల సమయానికి ఎంత వరకూ ఉపయోగ పడతాయో చూడాలి. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య చాలాచోట్ల విభేదాలు, ఆగ్ర హావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వార్తలతో జగన్ నానా ఇబ్బందీ పడుతున్నారు. ఎవరిని బుజ్జగించాలి, ఎవరితో జాగ్రత్తగా వ్యవహరించాలన్నదీ ఇదమిద్ధం తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది.
.......