ఏపీలో బీజేపీ బలం ఉండవల్లికే కనిపించిందా?
posted on Jun 14, 2022 @ 10:36AM
రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కు ఏపీలో బీజేపీ అత్యంత బలమైన పార్టీగా కనిపిస్తోంది. తమకంత బలం ఉందని బీజేపీ వాళ్లే అనుకోవడం లేదు. కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో భేటీ కాగానే ఒక్కసారిగా ఏపీలో బీజేపీ విశ్వరూప సందర్శనం జరిగిపోయినట్లు మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడినా కవర్ చేసే మీడియా ఉండటం, ఆయన ఒక మేధావి అనే భ్రమను ప్రజలలో కల్పించే కొందరు పొలిటీషియన్లు ఉండటం కూడా ఉండవల్లికి కలిసొచ్చి ఏం మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుందనుకుంటున్నారు. ఏపీలో బీజేపీ బలం ఏమిటో ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికలు, ఆ ఎన్నికలలో ఆ పార్టీకి వచ్చిన ఓట్లు గమనిస్తే చాలు ఆ పార్టీ బలం ఎంతన్నది తెలుసుకోవడానికి. ప్రత్యేకించి ఆ పార్టీని భుజాన వేసుకుని.. కేసీఆర్ కు భుజకీర్తులు అద్దడానికి ఉండవల్లి ఎందుకు ప్రయత్నిస్తున్నారన్నది అర్ధం చేసుకోలేనంత అమాయకులు కాదు జనం. కేసీఆర్ ఒక్కరు మాత్రమే దేశంలో బీజేపీని దీటుగా ఎదుర్కొనగలిగే నాయకుడని ఏపీ ప్రజలకు చెప్పడానికి ఉండవల్లి తెగ తాపత్రేయపడుతున్నట్లు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలను బట్టి అవగతమౌతున్నది. తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో మిత్రపక్షంగా ఉండి కూడా ఆ పార్టీని గట్టిగా ఎదుర్కొన్న విషయం.. రాజకీయ పండితుడైన ఉండవల్లి ఎలా, ఎందుకు మరచిపోయారో ఆయనే చెప్పాలి. అంతకంటే ముందు గుజరాత్ లో అల్లర్ల సమయంలో మోడీని సీఎంగా తొలగించాలన్న డిమాండ్ తో ఎన్డీయే నుంచి తెలుగుదేశం బయటకు వచ్చిన సంగతి ఉండవల్లికి తెలియదా.
విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరాతి కి అంకురార్పణ జరిగిన సమయంలో ఉండవల్లి కుల విద్వేషాలను రెచ్చెగొట్టే పుస్తకాల ఆవిష్కరణలో యమా బిజీగా ఉన్న సంగతి ఏపీ జనం మరచిపోతారా? మరచిపోగలరా? తన రాజకీయ గురువు వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడికి అనకూలంగా అవసరమైన ప్రతి సందర్భంలోనూ గొంతెత్తే ఉండవల్లి ఇప్పుడు కేసీఆర్ తో భేటీ అనంతరం ఏపీలో బీజేపీ బలాన్ని ఆకాసానికెత్తేస్తూ మాట్లాడిన మాటలు కూడా జగన్ కు ఏదో మేర మేలు చేకూర్చేందుకేనన్నది పరిశీలకుల విశ్లేషణ.
వాస్తవానికి ఏపీతో పోలిస్తే తెలంగాణలోనే బీజేపీ బలంగా ఉంది. అంతే కాదు 2019తో పోలిస్తే ఇప్పుడు మరింత బలోపేతమై టీఆర్ఎస్ కే సవాలు విసురుతోంది. అటువంటి పరిస్థితుల్లో ఉండవల్లి ఏపీలో బీజేపీ బలం కనిపించింది. బీజేపీని ఎదుర్కొనగల ధీరత్వం కేసీఆర్ కు మాత్రమే ఉందని పించింది. కేసీఆర్ జాతీయ పార్టీకి ఏపీలో సానుకూలత తెచ్చి పెట్టేందుకు ఉండవల్లికి ఇంత తాపత్రయం ఎందుకు.
రాజకీయాల నుంచి రిటైర్ అయ్యానని చెబుతున్న వ్యక్తి కేసీఆర్ ను భుజాన వేసుకుని మోయడమెందుకు? ఏపీలో జగన్ కు ఎన్ని కల వ్యూహాలు రచించి పెట్టే పీకే సమక్షంలో కేసీఆర్ తో భేటీ అయిన ఉండవల్లి వైఎస్ కుమారుడికి రాష్ట్రంలో రాజకీయ లబ్ధిచేకూర్చేందుకే కేసీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించేశారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.