బీజేపీ టార్గెట్ ప్రాంతీయ పార్టీలేనా?..నడ్డా పర్యటనలు .. అందుకేనా?
భారతీయ జనతా పార్టీ, ఓ వంక రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, రానున్న సంవత్సరం, సంవత్సరంన్నర కాలంలో, 2024 లోకసభ ఎన్నికలకు ముందు గుజరాత్ సహా అసెంబ్లీ ఎన్నికలు జరిగే మరో పది రాష్ట్రాలపై దృష్టిని కేంద్రీకరిస్తూనే, 2024 లోక్ సభ ఎన్నికల సన్నాహాలకు కుడా శ్రీకారం చుట్టిందా,అంటే రాజకీయ విశ్లేషకుల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ముఖ్యంగా, ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డా త్రయం 2024 ఎన్నికలపై ఇప్పటి నుంచే దృష్టిని కేంద్రీకరించిందని, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు లక్ష్యంగా దండయాత్రకు సిద్దమవుతోందని అంటున్నారు.
అందులో భాగంగానే, పార్టీ అధ్యక్షుడు నడ్డా ఒక్కొక్క రాష్ట్రాన్ని చుట్టి వస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే క్రమమలో ఇటీవల ఉభయ తెలుగు రాష్ట్రాలలో పర్యటించిన నడ్డా ఇప్పుడు బెంగాల్ లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలలో పార్టీ సంస్థాగత వ్యవహారాలపై దృష్టిని కేంద్రీకరించడంతో, నడ్డా పర్యటనలు ముందస్తు ఎన్నికల సన్నాహాలనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.అయితే, బీజీపే నాయకులు మాత్రం, 2024 ఎనికలను దృష్టిలో ఉంచుకునే నడ్డా వివిధ రాష్ట్రలలో పర్యటిస్తున్నారని అంటున్నారు. అదలా ఉంటే నడ్డా బెంగాల్ పర్యటన నేపథ్యంగా ఆ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
ముఖ్యంగా ఎప్పుడో సంవత్సరం క్రితం జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై నడ్డా ఇప్పడు చేసిన వ్యాఖ్యలు చిత్రంగా ఉన్నయనే మాట వినవస్తోంది. దొంగలు పడ్డ ఆరు నెలలకు.. అన్నట్లుగా.. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల క్రతువు ముగిసి, సంవత్సరం అయిన తర్వాత... ఆ ఎన్నికలలో బీజీపీ.. ఎందుకు ఓడి పోయింది.. ఎందుకు అధకారంలోకి. రాలేకపోయిండో చెప్పుకోవడం చిత్రంగానే కాదు, ఇంకేదోలా కూడా వుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. పోనీ అలా చెప్పుకున్నది ఎవరో చిన్నా చితకా నాయకుడు... అయితే అదో రకం. కానీ, ఏకంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా బెంగాల్ లో అధికారంలోకి రాలేక పోయామని.. చెప్పుకోవడం ఏమిటని, బెంగాల్ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిజమే, నడ్డా చెప్పినట్లుగా,ఎనిమిది విడతల్లో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో, నాల్గవ విడత పోలింగ్ ముగిసిన తర్వాత, ఒక్క బెంగాల్ ను మాత్రమే కాదు, దేశం మొత్తాన్ని, కొవిడ్ సెకండ్ వేవ్ చుట్టేసింది.అయితే నడ్డా, అదేదో ఒక్క బెంగాల్లో మాత్రమే ప్రభావం చూపింది అన్నట్లు, కొవిడ్ కారణంగా ఎన్నికలలో ఓడిపోయామనడం ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా ఉందని బెంగాల్ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
నిజమే, నాల్గవ విడత పోలింగ్ ముగిసిన తర్వాత కొవిడ్ సెకండ్ వేవ్ ఉదృతి పెరింగింది. ఎనికల ప్రచారం ఇంచుమించుగా స్తంభించి పోయింది. అయితే కొవిడ్ ప్రభావం ఒక బీజేపీ ప్రచారాన్నే కాదు, తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్, వామపక్షాల ప్రచారంపై కూడా ప్రతికూల ప్రభావమే చూపింది. అయినా, తృణమూల్ కాంగ్రెస్ 213/294 స్థానాలు గెలుచుకుని వరసగా మూడవసారి, మూడింట రెండు వంతుల మెజారిటీతో అధికారంలోకి వచ్చింది.
మరో వంక 200 ప్లస్ అంటూ చివరివరకు ధీమా వొలక పోసిన బీజీపీ, ప్రశాంత్ కిశోర్ సవాలు విసిరిన 100 మార్కును కూడా చేరలేక పోయింది. కేవలం 77 దగ్గరే ఆగిపోయింది. అఫ్కోర్స్, కలిసి పోటీ చేసిన కాంగ్రెస్, కమ్యూనిస్టులు పూర్తిగా తుడిచి పెట్టుకు పోయిన ఎన్నికలలో బీజీపే 4 నుంచి ఒకే సారి 77 స్థానాలకు చేరి, బెంగాల్ అసెంబ్లీలో తొలిసారి ప్రధాన ప్రతిపక్ష హోదాను పొందడం మాములు విషయం కాదు. అయితే, ఆశించిన స్థాయిలో బీజేపీ ఫలితాలు సాధించ లేక పోయింది.
అయితే, సంవత్సరం తర్వాత ఇప్పుడు బెంగాల్ ఓటమికి నడ్డా కొవిడ్ ను కారణం చేయడం ఎందుకంటే, అందుకో కారణం ఉందని బీజీపీ నాయకులూ వివరణ ఇస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో సహా ఇద్దరు ఎంపీలు,బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ సహా, ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీకి రాజీనామా చేసి తృణమూల్ కాంగ్రెస్ లో చేరిన నేపధ్యంలో, పార్టీ కార్యకర్తల నైతిక స్థైర్యం దెబ్బతినకుండా ఉండేందుకు,నడ్డా, అసెంబ్లీ ఎన్నికల ఓటమికి కొవిడ్ ను కారణంగా చూపారని పార్టీ నాయకులూ అభిప్రాయ పడుతున్నారు. అదలా ఉంటే లోక్ సభ ఎన్నికలకు పార్టీని సిద్దం చేసేందుకా అన్నట్లుగా ఒకొక్క రాష్ట్రాన్ని, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను చుట్టివస్తున్న నడ్డా, బెంగాల్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుందని, పరిశీలకులు భావిస్తున్నారు.
అలాగే, నడ్డా రహస్య మిత్ర పక్షం వైసీపీ అధికారంలో ఉన్న ఏపీ సహా ఏ రాష్త్రం వెళ్ళినా, ప్రాంతీయ పార్టీల పాలనలో అవినీతి పెరిగిపోతోందని ఆరోపణలు గుప్పిస్తునారు. బెంగాల్లోనూ, అధికార పార్టీ అండదండలతో, వ్యాపార లాబీలు, సిండికేట్ పేరిట సాగిస్తున్న అవినీతిని ప్రధానంగా ప్రస్తవించారు. అలాగే, బీజేపీ అవినీతిని సహించదని, అందుకు, దాణా కుంభకోణం కేసులో ఇన్నేళ్ళుగా తిరుగుతున్న లాలు ప్రసాద్ యాదవ్ జైలు పాలు కావడమే నిదర్శనమని పేర్కొన్నారు. అలాగే, బెంగాల్ లోనూ అలాంటి పరిస్థితి వచ్చే రోజు ఎంతో దూరంలో లేదని హైచ్చారిచారు.
అయితే, నడ్డా ప్రకటనను తృణమూల్ కాంగ్రెస్ తప్పుపట్టింది. సీబీఐని బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందనేందుకు ఇదే నిదర్శనమని ఆరోపించింది. అయితే, తెలంగాణ పర్యటన సందర్భంగా, నడ్డానే హోం మంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ కూడా తెలంగాణ ముఖ్యమత్రి కేసీఆర్ ప్రభుత్వం మీద కూడా ఘాటైన అవినీతి ఆరోపణలే చేశారు., కానీ, చేసిందేమీ లేదని, కేవలం ప్రాంతీయ పార్టీలను ఇబ్బందుల పాలు చేసేందుకే బీజేపీ నాయకత్వం సీబీఐ, ఈడీలను అడ్డు పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తోందని అంటున్నారు. అయితే, 2024 ఎన్నికల్లో బీజేపీ ప్రాంతీయ పార్టీలను టార్గెట్ చేస్తోందని, అందుకు నడ్డా రాష్ట్రాలను చుట్టి వస్తున్న తీరు, ఆయన చేస్తున్న అవినీతి, కుటుంబ పాలన లే నిదర్శనమని అంటున్నారు.