రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య.. మోకాలడ్డుతున్న వైసీపీ?
posted on Jun 13, 2022 @ 11:12AM
భారత 16వ రాష్ట్రపతిని ఎన్నిక కో సమయం దగ్గర పడింది. దీంతో రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి కసరత్తు ముమ్మరం చేసింది. మరో వైపు బీజేపీయేతర పక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎంపిక కోసం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చొరవ తీసుకుని పలు పార్టీల అధినేతలకు లేఖలు రాశారు. రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి అవసరమైన బలానికి 1.2 శాతం ఓట్ల దూరంలో నిలవడంతో ఎన్డీయే అనివార్యంగా ప్రాంతీయ పార్టీల మద్దతుపై ఆధారపడుతోంది. తక్కువ అయన ఓట్ల శాతాన్ని వైసీపీ లేదా బీజేడీ ద్వారా సమకూర్చుకోగలమనే ఆత్మవిశ్వాసం మోడీ సర్కార్ లో కనిపిస్తోంది.
ఎన్డీయే కూటమి తరఫున బీజేపీ పరిశీలిస్తున్న రాష్ట్రపతి వారిలో పలు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వారిలో ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడి పేరు కూడా ఉంది. వినిపిస్తోంది. వెంకయ్య నాయుడి అభ్యర్థిత్వాన్ని ఎన్డీయే పరిశీలించడానికి పలు కారణాలు తెరమీదకు వస్తున్నాయి. వాటిలో దక్షిణాదికి ఈ సారి దేశ ప్రథమ పౌరుడి గౌరవం కల్పించాలని తద్వారా దక్షిణాదిలో కూడా పాగా వేయాలన్న లక్ష్యం నెరవేర్చుకోవడానిక మార్గం సుగమమౌతుందన్న భావన ఒకటి.
అయితే ఆయన అభ్యర్థిత్వానికి వైసీపీ మోకాలడ్డుతున్నట్లు రాజకీయ వర్గాలలో ఓ చర్చజరుగా నడుస్తోంది. రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడైతే మద్దతు ఇచ్చేది లేదని ఏపీలో అధికార పార్టీ వైసీపీ మెలిక పెడుతోందని బీజేపీ వర్గాుల చెబుతున్నాయి. ఒక పక్కన రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ రాకముందే ఇటీవలే ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిసిన ఏపీ సీఎం జగన్ వారి నిర్ణయానికి మద్దతు ఇస్తామని బేషరతుగా ఒప్పుకుని వచ్చారనే మాటలు వినిపించాయి. కానీ వెంకయ్య నాయుడు అభ్యర్థి అయితే.. మద్దతు విషయంలో వైసీపీ ఇప్పుడు మెలిక పెడుతోందంటున్నారు.
వాస్తవానికి ఏపీలో వైసీపీ సర్కార్ ఏర్పాటైన ఈ మూడేళ్ల నుంచీ లోక్ సభలో కానీ, రాజ్యసభలో కానీ బలం తగ్గినప్పుడల్లా కేంద్రాన్ని వైసీపీ ఆదుకుంటూ వచ్చింది. బీజేపీయేతర పార్టీల ఐక్యత కోసం తాజాగా ప్రయత్నాలు ప్రారంభించిన మమతా బెనర్జీ కూడా వైసీపీని కలుపుకోవడానికి సుముఖంగాలేదు. ఎందుకంటే వైసీపీని బీజేపీయేతర పార్టీలన్నీ బీజేపీ మిత్రపక్షంగానే పరిగణిస్తున్నాయి. బీజేపీకి అన్ని విధాలుగా అనుకూలంగా వ్యవహరిస్తున్న వైసీపీ వెంకయ్య నాయుడిని రాష్ట్రపతి అభ్యర్థిగా ఎందుకు అంగీకరించడం లేదో అవగతంకావడం లేదని బీజేపీ వర్గాలే అంటున్నాయి.
అయితే పరిశీలకులు మాత్రం వెంకయ్య నాయుడి అభ్యర్థిత్వానికి వైసీపీ మోకాలడ్డడంలో ఆశ్చర్యమేమీ లేదని విశ్లేషిస్తున్నది. వెంకయ్యనాయుడు తెలుగుదేశం పార్టీకి అనుకూలం అని వైసీపీ బలంగా నమ్ముతోందని, అటువంటప్పుడు ఆయనను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎలా అంగీకరిస్తుందని ప్రశ్నిస్తున్నారు. వెంకయ్య శరీరం బీజేపీలో, మనసు తెలుగుదేశంలో ఉంటుందని గతంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు.