మహిళా దర్బార్ ఎవరి కోసం? ఎందు కోసం?
తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్, రాష్ట్రంలో మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలను తెలుసకుకునేందుకు, రాజ్ భవన్’ లో మహిళా దర్బార్ నిర్వహించారు. ఒక్క హైదరాబాద్ నుంచే కాకుండా, రాష్రంష్లోని అన్ని జిల్లాల నుంచి మహిళలు, మహిళా సంఘాల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, అన్ని వయసుల వారు, అన్ని వర్గాలవారు వచ్చారు. గవర్నర్ మేడంకు, తమ కష్టాలు చెప్పుకున్నారు. వినతులు అందజేశారు. బాగుంది. అయితే, రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్’ ఇలా నేరుగా, మహిళా దర్బార్’ కానీ, ప్రజా దర్బారే కానీ నిర్వహించ వచ్చునా, ఇది గవర్నర్ గీతదాటడం కాదా? అనే అనుమానాలు, ఆరోపణలు వినిపిస్తున్నాయి అనుకోండి, అయినా, ఆ అనుమాన ఆరోపణలను కాసేపు పక్కన పెడదాం... ఆమె చెప్పినట్లుగా, గవర్నర్ మేడం గీతదాట లేదనే అనుకుందాం, అయినా, ఈ దర్బార్ ఎవరి కోసం, ఎందు కోసం? ప్రజలు తమ ముందు ఉంచిన సమస్యలను గవర్నర్ ఏ విధంగా పరిష్కరిస్తారు?
ప్రజల సమస్యల పరిష్కారానికి, గవర్నర్ వ్యవస్థ పరిష్కారం చూపుతుందా? రాజ్యాంగం, గవర్నర్’ కు అలాంటి వెసులుబాటు,అధికారాలు కలిపించిందా అంటే ... రాజ్యాంగ నిపుణులు లేదనే అంటున్నారు.నిజానికి, గవర్నర్ శాసన సభను ఉద్దేశించి చేసే ప్రసంగం కూడా గవర్నర్ ప్రసంగం కాదు. రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిన ప్రసంగాన్నే గవర్నర్ ఒక్క అక్షరం పొల్లు పోకుండా చవవలసిందే. ఒక్క అక్షరంముక్క మార్చే అధికారం కూడా గవర్నర్ కు ఉండదు. అందుకే, గవర్నర్ పదవి అలంకార ప్రాయమైన పదవిగా పేర్కొంటారు.
అదలా ఉంటే, నిజానికి గవర్నర్ తమిళి సై కూడా సమస్యల పరిష్కారానికి ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. బాధిత ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటానని మాత్రమే అంటున్నారు. వినతి పత్రాలను శ్రీ సర్కార్ వారి శ్రీముఖానికి పంపండం మినహా, గవర్నర్ కార్యాలయం చేయగలిగింది ఏమీ లేదు. అంటే, అనవచ్చునో లేదో కానీ, గవర్నర్ స్థాయిని పోస్ట్ మ్యాన్ స్థాయికి దిగజార్చారు అనే మాట అక్కడక్కడా వినిపిస్తోంది. పోనీ అలా చేసినా, ఫలితం ఉంటుందా అంటే అదీ లేదు. ఇక ఎందుకీ, దర్బార్ అనే ప్రశ్న సామాన్య జనం నుంచే వస్తోంది. నిజానికి ముఖ్యమత్రి, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులకు నేరుగా సమర్పించుకున్న విజ్ఞాపన పత్రాలకే దిక్కు లేదు. అలాంటిది, ప్రజలు గవర్నర్’ కు ఇచ్చిన విజ్ఞాపన పత్రాలను సంబంధిత శాఖల అధికారులకు పంపితే, సమస్యలు పరిష్కారం అవుతాయా?లేదు, అందులో ఎవరికీ అనుమానం లేదు.
నిజానికి గవర్నర్, తమ సమస్యలను తాము పరిష్కరించుకునే పరిస్థితి లేదు,అందుకే రాష్ట్ర ప్రభుత్వం తమను అడుగడుగునా అవమానించినా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం మినహా, ఏమీ చేయలేని పరిస్థితిలో గవర్నర్ ఉన్నారనేది, అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ప్రోటోకాల్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోలేకనే కదా, కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఇక ఆమె, ప్రజల సమస్యలు ఏమి తీరుస్తారు? అసలు, ఈ రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉన్నారనే విషయాన్నే, రాష్ట్ర ప్రభుత్వం మరిచి పోయింది. ముఖ్యమంత్రి ముఖం చూసి జూన్ 2కు సంవత్సరం అయిందని గవర్నర్ మేడమే స్వయంగా చెప్పారు. అంతే కాదు, గవర్నర్ అడ్రస్ లేకుండానే శాసన సభ బడ్జెట్ సమావేశాలు జరిగిపోయాయి. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్లుగా, ఇలాంటి ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వం, గవర్నర్ వ్యవస్థనే గుర్తించనప్పుడు, ఈ పేరు గొప్ప, మహిళా దర్బార్. ఎందుకు నిర్వహించినట్లు? అంటే, అందుకు సమాధానం కూడా ఏమంత అర్ధం కాని, బ్రహ్మ పదార్ధం కాదు. కేవలం రాజకీయం.
అవును, రాజకీయ ఉద్దేశ, దురుద్దేశాలతోనే గవర్నర్, మహిళా దర్బార్ నిర్వహించారు, అని అనుకుంటే అందుకు అభ్యతరం చెప్పవలసిన అవసరం లేదని, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ విషయంలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఉండవచ్చును కానీ , సామాన్య ప్రజలు మాత్రం గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్, రాజ భవన్ ను రాజకీయ కార్యకలాపాల వేదిక చేశారనే అంటున్నారు. అలాగే, ఇంత చేసి, వ్రతం తప్పినా ఫలం లేని, వృధా ప్రయాసగానే, గవర్నర్ నిర్వహించిన మహిళా దర్బార్ ను చూడవలసి ఉంటుందని సామాన్య ప్రజలు అంటున్నారు. అలాగే, ఫిర్యాదులు చేయడానికి ఎక్కడేక్కడి నుంచో వచ్చిన మహిళలు కూడా, గవర్నర్ సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇవ్వక పోవడంతో, ఇక్కడి పరిస్థితిని ఎరక్క పోయి వచ్చామనే అవేదన వ్యక్తపరిచారు.
అయితే, జూబ్లీ హిల్స్ మైనర్ బాలిక సాముహిక అత్యాచారం నేపధ్యంగా నిర్వహించిన మహిళా దర్బార్ లో మహిళలు చేసిన ఫిర్యాదులు అక్షర సత్యాలు, అందులో సందేహం లేదు. మహిళలకు రాష్ట్రంలో రక్షణ లేదన్న ప్రధాన ఫిర్యాదే కాదు, బెల్ట్ షాపుల నుంచి ధరణి పోస్టల్ దారుణాల వరకు ఇంకా అనేక వ్యక్తిగత సమస్యల వరకు, మహిళలు గవర్నర్ మేడం ముందుంచిన ఫిర్యాదులు అన్నీ అక్షర సత్యాలే... రాష్ట్రంలో గడచిన ఎనిమిదేళ్ళలో పసికందుల పై అత్యాచారాలు ఏకంగా ఏడు రెట్లు పెరిగాయని, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికే చెప్పి నప్పుడు రాష్ట్రంలో పరిస్థితితులు ఎంత దౌర్భాగ్యంగా ఉన్నాయో వేరే చెప్ప నక్కరలేదు. మహిళలు కాదు, పసి కందులు, మైనర్ బాలికలకు రక్షణ లేని రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి మాట్లాడడం కూడా మర్యాద అనిపించుకోదు. గవర్నర్ దర్బార్ వలన ఏదైనా ప్రయోజన ఉందటే అది ఇదే, రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయో తెలియని వారు తెలుసుకునే అవకాశం లభించింది.
అయితే, గవర్నర్ నిర్వహించిన దర్బార్ వలన ప్రయోజనం ఏమిటి? ఒక విధంగా చూస్తే, గవర్నర్ కు ఫిర్యాదు చేయడం వలన, ప్రజల సమస్యల పరిష్కారం కాక పోగా, మరింత జటిలం అయ్యే ప్రమాదం కూడా లేక పోలేదని, సమస్యలకు పరిష్కారం చూప వలసిన అధికారులు, దర్బార్ ఫిర్యాదులను ఎర్ర మార్కు పెట్టి ‘ప్రత్యేక’ దృష్టితో పక్కన పెట్టే, ప్రమాదం లేక పోలేదన్న అనుమానాలు కూడా అధికార వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ అలంటి అనుభవాలు ఉన్నాయని అంటున్నారు.
అదలా ఉంటే నిజానికి, గవర్నర్ తమిళి సై, తమకు ఉన్న అధికారాలనే సక్రమంగా వినియోగించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం, 8వ షెడ్యూలు ప్రకారం, జీహెచ్ఎంసీ పరిధిలో శాంతి భద్రతల పరిస్థితిని అజమాయిషీ చేసే అధికారం గవర్నర్ కు వుంది.
అయినా, నగరంలో ఇన్ని నేరాలు, ఘోరాలు జరుగుతన్నా, గవర్నర్ ఏ రోజు అధికారులను పిలిచి పరిస్థితిని సమీక్షించ లేదు. అంతవరకు ఎందుకు, జుబ్లీ హిల్స్ మైనర్ బాలిక అత్యాచారం కేసుకు సంబంధించి, పూర్తి నివేదికను సమర్పించాలని, గవర్నర్ కార్యాలయం వారం రోజుల క్రితం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు లేఖ రాశారు. అంతే కాదు, అందుకు రెండు రోజుల గడువు కూడా విధించారు. అయితే, రెండు రోజులు కాదు, వారం రోజులు అయినా ఇంతవరకు రిప్లై లేదని, స్వయంగా గవర్నరే చెప్పారు. అంటే, గవర్నర్ ఒకరు ఉన్నారు అనే విషయాన్ని, ముఖ్యమంత్రి, మంత్రులే కాదు, అధికారులు కూడా మరిచి పోయారు ... బహుశా ప్రజలు కూడా మరిచి పోరాదనే గవర్నర్ మహిళా దర్బార్’ ఏర్పాటు చేశారో.. ఏమో కానీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నట్లుగా దర్బార్ వలన ప్రజలకు ఎలాంటి లాభం లేదు. ఆయనే అన్నట్లుగా ఇది పూర్తిగా రాజకీయవిన్యాసం, అందులో సందేహం లేదని అంటున్నారు.