ఉండవల్లీ... జరిగేవి చెప్పరాదా!
posted on Jun 14, 2022 @ 11:40AM
ఎవరు ఎంత ప్రయత్నించినా కాని పని ఒక్కోసారి వూహించని దారి కనిపించి లక్ష్యాన్ని సాధించే వీలు కల్పిస్తుంది. రాష్ట్ర హోదా సాధించుకోవాలని ఎంతగా ప్రయత్నస్తున్నా కేంద్రప్రభుత్వం అందుకు వీలు పడదనే సంకేతాలే ఇస్తోంది. అది తప్ప వేరేది ఏదయినా మాట్లాడుకుందామనే కేంద్రంలోనివారు అంటున్నా రు. రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అనేకం అడగాలని వెళ్లిన ప్రతీసారి అక్కడేమి జరిగిందీ ఎవరికీ తెలియకుండానే పోతోంది. మొన్నటికి మొన్న కూడా సేమ్ సీన్ రిపీట్. అయితే ఇప్పుడు హఠాత్తుగా ఒక చిన్న అవకాశం వుందని మాజీఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సూచించడం గమనార్హం. రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపీ అభ్యర్ధి విషయంలో మద్దతునీయకుండా వెనకడుగు వేయాలిట.
అసలే రాష్ట్ర పరిస్థితులు బాగా లేవు. పార్టీ వర్గాల్లోనూ కుమ్ములాటలు, అసంతృప్తులూ ఒకటొకటీ బయట పడుతున్నాయి. ప్రత్యేక హోదా మాత్రమే కాదు రాష్ట్రానికి రావలసిన నిధులు విషయంలోనూ కేంద్రాన్ని అడగదలచుకున్న విషయంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తటపటాయిస్తున్నాడు. ఇక్కడ గట్టిగా మాట్లాడు తున్నవాడు వూరు దాటగానే కేసుల భయం తలకు చుట్టుకుంటుండటంతో అడగలేకపోతున్నాడనేది సుస్పష్టం. ఈ పరిస్థితుల్లో అసలు బిజెపిని ఎదిరించి నిలవగలిగే సత్తా జగన్‌కి ఎక్క డ? అందువల్ల ఉండవల్లిగారి మనసులో మాటో, పోనీ జగన్‌కి ఇస్తున్న చిన్నపాటి సూచనో అంతగా పారక పోవచ్చు.
ఏది ఎలా వున్నా ఒకరే లబ్ధి పొందుతారట! ఆ ఒక్కరి ప్రభావం అలా వుందిట! ఎవరా ఒక్కరూ ఏమిటా లాభం? అనేదానికి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సవివరణ ఇచ్చేరు. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు గెలిచినా లబ్ధిపొందేది మాత్రం బిజెపీయేనని విలేకరులతో అన్నారు. దేశంలో మోదీ విపక్షాలు లేకుండా చేసుకోవడానికి శత విధాలుగా కృషిచేస్తున్నారు. ఎవరు గెలిచినా బిజెపీతో సఖ్యతగానే వుండాల్సి వస్తుం ది. బిజెపి అంతగా అన్ని పార్టీలను బలహీనపరిచింది.
గతంలో టిడీపీ కేంద్ర వద్ద సాగిలపడిందని కామెంట్ చేసేరు. ఇపు డు కేసుల భయంతో జగన్ చేస్తున్నదీ అదే. తెలంగాణా మాట ఎలా వున్నా ఆం ధ్రాలో బిజెపి బలం పుంజుకుందనే భ్రమలో బిజెపీ వర్గాలు తెగ ప్రచారం చేస్తున్నాయి. ఎవరయినా తమ ను దాటిపోవడం దుర్లభం అని ప్రచారం చేసుకుంటున్నారు బిజెపి నాయకులు. ఎవరయినా తమతో కలవవలసిందే అంటున్నారేగాని ఎవరూ కలవకపోయినా తాము తెలుగు రాష్ట్రాల్లో దున్నేస్తామని అధికా ర పగ్గాలు పడతామని బిజెపీ కూడా చెప్పలేకపోతోంది. కేవలం చర్చల్లో గట్టిగా అరిచి చెప్పడం, విపక్షాల మీద అరవడం తప్ప వాస్తవానికి అది జరిగే పనికాదు.