జాతీయ పార్టీగా టీఆర్ఎస్ అడుగులు.. మళ్లీ తెలంగాణ తెరపై పీకే..!
posted on Jun 13, 2022 @ 10:33AM
తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎవరినీ నమ్మరు.. అలాగే ఆయనను ఎవరూ నమ్మరు. రాజకీయాలలో కేసీఆర్ ది సొంత స్టైల్.. ఆయనకు అవసరమనుకుంటేనే ఎవరితోనైనా భేటీలు, సమావేశాలు.. లేదనుకుంటే ఎవరికీ అప్పాయింట్ మెంట్ కూడా ఉండదు. ప్రగతి భవన్ గేటు దాటి లోపలికి ప్రవేశించేందుకు అనుమతి కూడా ఉండదు. తెరాస నుంచి బయటకు వచ్చిన ఈటల ఈ విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్టే చెప్పారు.
గతంలో తానే కాదు, ప్రస్తుతం రాష్ట్ర ఆరోగ్య మంత్రిగా ఉన్న హరీష్ రావు కూడా ప్రగతి భవన్ గేటు వద్ద అధినేత అప్పాయింట్ మెంట్ కోసం పడిగాపులు పడి నిరాశ చెందిన సందర్భాలు బోలెడు ఉన్నాయని ఈటల పలు సందర్భాలలో చెప్పారు. అటువంటి కేసీఆర్ ఇప్పుడు టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మార్చుందుకు అడుగులు వేస్తున్నారు. ఇందు కోసం ఆయన పార్టీ నేతలతో, కేబినెట్ సహచరులతో చర్చించడం లేదు. వారితో ఏర్పాటు చేసిన సమావేశంలో తన నిర్ణయాన్ని ప్రకటించేశారు. అందుకు అవసరమైన వ్యూహాలు, జాతీయ పార్టీగా అజెండా ఎలా ఉండాలి అన్న విషయాలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకేతో చర్చలు జరిపారు.
అదీ సుదీర్ఘంగా. అది కూడా వారం రోజుల్లో రెండు సార్లు. చివరిగా ఆదివారం గంటల పాటు పీకేతో కేసీఆర్ మంతనాలు జరిపారు. ఈ భేటీలో రాష్ట్రపతి ఎన్నికలలో మద్దతు ఎవరికి? అలాగే జాతీయ పార్టీ ఏర్పాటు విషయంలో అనుసరించాల్సిన వ్యూహం, కలిసి వచ్చే పార్టీలు, జాతీయ పార్టీ జెండా, అజెండా తదితర అంశాలపై ఇరువురి మధ్యా చర్చ జరిగినట్లు సమాచారం. అలాగే రాష్ట్రంలో టీఆర్ఎస్ పరిస్థితి, విపక్షాలు ఏ మేరకు బలోపేతం అయ్యాయి, రాష్ట్రంలో మూడో సారి అధికారం చేపట్టేందుకు టీఆర్ఎస్ కు ఎంత మేర అవకాశాలున్నాయి తదితర అంశాలపై కూడా కేసీఆర్, పీకే మధ్య సుదీర్ఘ చర్చ జరిగినట్లు ప్రగతి భవన్ వర్గాల సమాచారం. టీఆర్ఎస్ వ్యూహకర్తగా పని చేస్తున్న పీకే.. ఇటీవల రాష్ట్రంలో తన ఐ ప్యాక్ బృందంతో తెలంగాణలో పలు అంశాలపై విస్తృత సర్వేలు నిర్వహించింది. కేసీఆర్ తో భేటీలో పీకే ఆ సర్వేల వివరాలను కూడా ముఖ్యమంత్రికి కూలంకశంగా వివరించారని చెబుతున్నారు.
బలమైన అభ్యర్థులు ఎవరు, విజయావకాశాలు ఉన్న అభ్యర్థులు ఎందరు, ఏ యే నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది, ఎక్కడెక్కడ ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది తదితర వివరాలతో ఫైనల్ నివేదికను పీకే కేసీఆర్ ముందుంచినట్లు చెబుతున్నారు. ఇటీవల ఖమ్మం పర్యటనలో కేటీఆర్ పీకే సర్వేల ఆధారంగానే టికెట్లు ఉంటాయని పార్టీ నేతలకు స్పష్టమైన సంకేతం ఇచ్చిన సంగతి విదితమే. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, టీఆర్ఎస్ మరింత బలోపేతం కావాలంటే తీసుకోవలసిన చర్యలు తదితర అంశాలపై పీకే కేటీఆర్ ల మధ్య చర్చ జరిగినట్లు చెబుతున్నారు. అదే విధంగా రాష్ట్రపతి ఎన్నిక విషయంలో టీఆర్ఎస్ ఏ వైఖరి అవలంబిస్తే కేసీఆర్ జాతీయ పార్టీకి దేశ వ్యాప్తంగా ఏదో ఒక మేరకు సానుకూలత లభిస్తుంది అన్న అంశంపై కూడా ఇరువురూ చర్చించినట్లు చెబుతున్నారు.