కిషన్ రెడ్డికి ఇది చాలెంజ్... ఇకపై జమ్ము కాశ్మీర్ ఎన్నికల ఇన్ చార్జి
త్వరలో ఎన్నికలు జరగనున్న జమ్మూకశ్మీర్, హరియాణా, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లకు బీజేపీ ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. దీనిలో భాగంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి జమ్మూకశ్మీర్ బాధ్యతలు అప్పగించింది. అలాగే హరియాణాకు ఇన్‌ఛార్జ్‌లుగా ధర్మేంద్ర ప్రధాన్, బిప్లవ్ దేవ్‌లను నియమించింది. మహారాష్ట్ర బాధ్యతలు భూపేంద్ర యాదవ్, అశ్వినీ వైష్ణవ్‌కు అప్పగించడం జరిగింది. ఇక శివరాజ్ సింగ్ చౌహాన్, హిమంత బిశ్వశర్మలను ఝార్ఖండ్ ఇన్‌ఛార్జ్‌లుగా నియమిస్తున్నట్లు ప్రకటించింది. కిషన్ రెడ్డి ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ లో రాజకీయ నేతగా ఎదిగిన వ్యక్తి. ఉగ్రవాదులకు అడ్డాగా ఉన్న హైదరాబాద్ లోనే ఆయన రాజకీయ ప్రస్థానం సాగింది. ఒకప్పుడు టెర్రరిస్టుల హిట్ లిస్ట్ లో ఉన్న కిషన్ రెడ్డికి జమ్ము కాశ్మీర్ వేర్పాటువాదాన్ని ప్రోత్సహించే టెర్రరిస్టుల స్థావరంలో కిషన్ రెడ్డి ఎన్నికలు జరపాలని హైకమాండ్ ఆదేశించింది.
లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. మళ్లీ ఐదేళ్ల వరకు లోక్‌సభ ఎన్నికలు లేవు. అయినా మళ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఆర్టికల్ 370 రద్దు చేయడానికి ముందు నుంచి రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్ము-కాశ్మీర్ సహా మరికొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం.. అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సమాయత్తమైంది. ఆయా రాష్ట్రాలకు ఎన్నికల ఇంచార్జులు, సహ ఇంచార్జులుగా కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బాధ్యతలు అప్పగించింది. తద్వారా కేంద్ర ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలను ఖరారు చేసే సమయానికే ఎన్నికల రణరంగంలో ప్రత్యర్థుల కంటే నాలుగు అడుగులు ముందుండాలని చూస్తోంది. ఆయా రాష్ట్రాల్లో పార్టీ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాల విషయంలో ఎన్నికల ఇంచార్జులు కీలకం కానున్నారు. ప్రదేశ్ చునావ్ ప్రభారీ (రాష్ట్ర ఎన్నికల ఇంచార్జి) పేరుతో ప్రతి రాష్ట్రానికి బీజేపీ ఇంచార్జులను నియమిస్తూ ఉంటుంది. ఆయా రాష్ట్రాల వ్యవహారాలు చూసుకునే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులకు అదనంగా ఎన్నికల ఇంచార్జులు అక్కడ ఉండి పార్టీని గెలిపించేందుకు వ్యూహాలు, ప్రణాళికలు అమలు చేయాల్సి ఉంటుంది.
జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఆ రాష్ట్రం నుంచి లద్దాఖ్ ప్రాంతాన్ని వేరు చేసిన విషయం తెలిసిందే. లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, మిగతా జమ్ము-కాశ్మీర్‌ను అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించింది. ఇందులో పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ లో కూడా కొన్ని నియోజకవర్గాలను ప్రకటిస్తూ అసెంబ్లీని పునర్వ్యవస్థీకరించింది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ద్వారా రాష్ట్రపతి పాలన నడుస్తోంది. ఈ రాష్ట్రానికి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పించాలంటూ సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలవగా.. త్వరలోనే రాష్ట్ర హోదా కల్పిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. ఈ రాష్ట్ర హోదాతో సంబంధం లేకుండా అక్కడి అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించే విషయంలోనూ పిటిషన్లు దాఖలవగా.. లోక్‌సభ ఎన్నికల తర్వాత అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిస్తామంటూ కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆ మేరకు మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాలతో పాటు జమ్ము-కాశ్మీర్‌కు ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది.
ఆర్టికల్ 370 రద్దు చేసిన సమయంలో కాశ్మీర్ లోయ పూర్తి అల్లకల్లోలంగా మారింది. ఏడాది కాలం పాటు ఆ రాష్ట్రంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాల్సి వచ్చిందంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిత్యం ఘర్షణలతో అట్టుడుకిన ఆ ప్రాంతంలో మెల్లమెల్లగా శాంతి నెలకొంది. మారిన కాశ్మీర్ కనిపిస్తోంది. అభివృద్ధి పట్టాలెక్కింది. పర్యాటకం ఒక్కసారిగా ఊపందుకుంది. ఆ ప్రాంత ప్రజల్లో సైతం మార్పు సానుకూల దృక్పథాన్ని పెంచింది. అయితే ఇదంతా చూసి ఓర్వలేని పాకిస్తాన్.. కుట్రలు చేస్తూనే ఉంది. తమ భూభాగంపై శిక్షణ ఇచ్చి, అధునాతన మారణాయుధాలు సమకూర్చి ఉగ్రవాదులను మన భూభాగంపైకి పంపుతోంది. ఇంతకాలం పాటు భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్న సీమాంతర ఉగ్రవాదులు, ఈ మధ్య జమ్ము ప్రాంతంలో యాత్రికులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు.
భౌగోళికంగా హిందూ, సిక్కు ప్రజలు ఎక్కువగా ఉన్న జమ్ములో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన సమస్య పెద్దగా లేకపోయినా, అత్యధిక శాతం ముస్లిం జనాభా కల్గిన కాశ్మీర్ లోయ కాషాయ దళానికి సవాళ్లు విసురుతోంది. ఆ పార్టీ తరఫు ప్రజా ప్రతినిధులుగా ఉన్నవారిని ఉగ్రవాదులు వెంటాడి హతమార్చుతున్నారు. పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడం బీజేపీకి అసలు సిసలు సవాలుగా మారింది. ఇలాంటప్పుడు బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించడం, వ్యూహాలు, ప్రణాళికలను అమలు చేయడం కూడా అంత సులభమేమీ కాదు. అలాంటి రాష్ట్రానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని బీజేపీ హైకమాండ్ ఎన్నికల ఇన్‌చార్జిగా నియమించింది. గతంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేసిన కిషన్ రెడ్డి, ఈ రాష్ట్రంపై గట్టి పట్టు సాధించారు. పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఆయన అక్కడే ఉండి ఎన్నికల వ్యూహాలు అమలు చేశారు. గతానుభవాలను దృష్టిలో పెట్టుకున్న బీజేపీ హైకమాండ్.. అసెంబ్లీ ఎన్నికల బాధ్యతల్ని కూడా ఆయన భుజాలపై మోపింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగనున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు సవాళ్లతో కిషన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్నాయి.