జ‌గ‌న్ రాయ‌బేరం.. ఛీకొట్టిన చెల్లెలు!?

అందితే జుట్టు.. అంద‌క‌పోతే కాళ్లు.. ఈ ఫార్ములానే వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అనుస‌రిస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఐదేళ్లు అధికారంలో ఉన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అహంకార పూరితంగా వ్య‌వ‌హ‌రించారు. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన, మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడుతో దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌డంతో పాటు.. సొంత చెల్లి, త‌ల్లి ప‌ట్ల‌ కూడా అదే ప‌ద్ద‌తిని అవ‌లంబించారు. అధికార అహంతో త‌న‌కు వ్య‌తిరేకంగా మాట్లాడిన వాళ్ల‌పై కేసులు పెట్టి, పోలీసుల‌తో కొట్టించి ఆనందం పొందారు. పైగా.. అన్నీ దేవుడే చూసుకుంటాడు అంటూ చిల‌కప‌లుకు ప‌లికేవారు. నిజంగానే జ‌గ‌న్ చిల‌క‌ ప‌లుకుల‌ను దేవుడు చాలా సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్లున్నాడు. ఐదేళ్ల కాలంలో ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌ల‌ను, ప్ర‌జ‌ల‌ను జ‌గ‌న్‌ పెట్టిన ఇబ్బందుల‌కు బ‌దులుగా ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌ చేత ఓటు ద్వారా గ‌ట్టి గుణ‌పాఠం చెప్పించాడు.  క‌నీసం అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష హోదా కూడా ఇవ్వ‌లేదు.  చ‌రిత్ర‌లో జ‌గ‌న్‌కు ఇచ్చిన త‌ర‌హా ట్రీట్‌మెంట్ ప్ర‌జ‌లు ఏ రాజ‌కీయ పార్టీకి ఇవ్వ‌లేదు. అధికారంలో ఉన్న‌న్నినాళ్లు త‌ల్లీ, చెల్లెళ్ల‌నుకూడా బ‌య‌ట‌కు నెట్టిన జ‌గ‌న్‌, ఇప్పుడు వారి విలువ తెలిసొచ్చి కాళ్ల‌బేరానికి వెళ్తున్న‌ట్లు ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది.  ఎన్నిక‌ల్లో దారుణ ఓట‌మికి ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త‌తో పాటు త‌న సొంత చెల్లి వైఎస్ ష‌ర్మిల‌కూడా ఓ కార‌ణ‌మ‌ని జ‌గ‌న్ గుర్తించిన‌ట్లు తెలుస్తోంది. ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో జ‌గ‌న్‌పై ష‌ర్మిల తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. సొంత బాబాయ్ హ‌త్య కేసులో ప్ర‌ధాన ముద్దాయిగా ఉన్న వ్య‌క్తికి క‌డ‌ప‌ ఎంపీ టికెట్ ఇవ్వ‌డంపై ఆమె తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అదే క‌డ‌ప ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్ధిగా ష‌ర్మిల బ‌రిలోకి దిగారు. అంతేకాదు.. క‌డ‌ప జిల్లా వ్యాప్తంగా ఆమె కాంగ్రెస్ అభ్య‌ర్థుల ప‌క్షాన ప్ర‌చారం నిర్వ‌హించి జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దెదింపాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా జనం జగన్ ను ఛీ కొట్టారు. సొంత జిల్లా క‌డ‌పలోనూ జ‌గ‌న్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బే త‌గిలింది. ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లా త‌న కంచుకోట‌గా భావిస్తూ వ‌చ్చిన జ‌గ‌న్‌కు అక్క‌డి ప్ర‌జ‌లు గ‌ట్టి గుణ‌పాఠం చెప్పారు. ఇలా జ‌ర‌గ‌డానికి కార‌ణం ష‌ర్మిల ప్ర‌చార‌మేన‌ని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గుర్తించిన‌ట్లు వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌జ‌రుగుతున్నది. ష‌ర్మిల‌ను త‌న‌వైపుకు తిప్పుకోక‌పోతే క‌డ‌ప జిల్లాలోనూ ప‌ట్టు సాధించడం సాధ్యం కాదన్న జ‌గ‌న్ కు భ‌యం ప‌ట్టుకుంద‌ట‌. దీంతో త‌న త‌ల్లి విజ‌య‌మ్మ ద్వారా ష‌ర్మిల వ‌ద్ద‌కు జ‌గ‌న్ రాయ‌భారం న‌డుపుతున్న‌ట్లు ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.  అందితే జ‌ట్టు.. అంద‌క‌పోతే కాళ్లు అనే ఫార్మాల‌ను తు.చ. త‌ప్ప‌కుండా పాటిస్తున్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. ష‌ర్మిల వ‌ద్ద అదే ప‌ద్ద‌తిని అవ‌లంబిస్తున్నార‌ట‌. కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలో చేరాల‌ని కోరుతూ ష‌ర్మిల వ‌ద్ద‌కు రాయ‌బారం న‌డుపుతున్న‌ట్లు స‌మాచారం. అన్న నిజ‌స్వ‌రూపం తెలిసిన  ష‌ర్మిల‌.. ఛీ కొట్టిన‌ట్లు తెలుస్తోంది. నీ రాజ‌కీయ భ‌విష్య‌త్ బాగుండాలంటే వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేయాల‌ని ష‌ర్మిల కుండ‌బ‌ద్ద‌లు కొట్టేసిన‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. ఈ చ‌ర్చ‌ల‌కు బ‌లం చేకూర్చుతూ ఇటీవ‌ల ష‌ర్మిల చేసిన వ్యాఖ్య‌ల‌ను ఏపీ ప్ర‌జ‌లు గుర్తు చేసుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం ష‌ర్మిల మాట్లాడుతూ.. పిల్ల కాలువ‌ల‌న్నీ స‌ముద్రంలో క‌ల‌వాల్సిందే అంటూ ప‌రోక్షంగా వైసీపీని ఉద్దేశించి వ్యాఖ్య‌లు చేశారు. అయినా  ఎలాగైనా ష‌ర్మిల‌ను మ‌ళ్లీ వైసీపీలోకి ఆహ్వానించి  ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలో ప‌ట్టుకోల్పోకుండా ఉండాల‌ని జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నార‌ని స‌మాచారం.  చిన్న‌పిల్లోడు అంటూ ఇన్నాళ్లు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వెనుకేసుకొచ్చిన ఎంపీ అవినాశ్ రెడ్డి వివేకా హ‌త్య‌కేసులో ఎప్పుడైనా అరెస్ట్ అయ్యే అవ‌కాశం ఉంది. త‌న‌కు అండ‌గా ఉంటార‌నుకున్న ఎంపీ మిథున్ రెడ్డి  బీజేపీ అగ్ర నాయకత్వంతో టచ్ లోకి వెళ్లారని తెలుస్తోంది. బీజేపీ ఒప్పుకుంటే అవినాష్ రెడ్డి మినహా మిగిలిన ఇద్ద‌రు వైసీపీ ఎంపీల‌తో క‌లిసి మిథున్ రెడ్డి బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ జ‌రుగుతున్నది. తనతో పాటు బీజేపీలో చేరాల్సిందిగా తన తండ్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిపైనా మిథున్ రెడ్డి ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తోంది‌. నిజంగానే ఇలాంటి ప‌రిణామాలు ఉమ్మ‌డి ఎదురైతే క‌డ‌ప  జిల్లాలో బ‌లంగా నిల‌బ‌డాలంటే ష‌ర్మిల మ‌ద్ద‌తు అవ‌స‌ర‌మ‌ని జ‌గ‌న్ భావిస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే త‌ల్లి విజ‌య‌మ్మ ద్వారా వైసీపీలోకి రావాల‌ని ష‌ర్మిల‌పై ఒత్తిడి పెంచుతున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే జ‌గ‌న్ రాయ‌బారానికి ఛీ కొట్టిన ష‌ర్మిల  మున్ముందు కాలంలో అన్న‌కు ఎదుర‌య్యే ఇబ్బందుల‌నుచూసి మ‌న‌స్సు మార్చుకునే అవ‌కాశాలు ఉండొచ్చని రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య ఆత్మహత్యకు కారణమిదే...

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్యకు గల కారణాలను మేడ్చల్ ఏసీపీ రాములు వెల్లడించారు. రూపాదేవి అల్వాల్ పంచశీల కాలనీలోని తన ఇంట్లో గురువారం రాత్రి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. గురువారం రాత్రి 11.30 గంటలకు రూపాదేవి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తమకు సమాచారం అందిందని తెలిపారు. వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నట్లు చెప్పారు. రూపాదేవి కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నారని... దాదాపు మూడేళ్లుగా తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నట్లు చెప్పారు. ఆమె చికిత్స తీసుకున్నారని... హోమియో మందులు కూడా వాడారని తెలిపారు. అయినప్పటికీ కడుపు నొప్పి తగ్గకపోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు చెప్పారు. ఈ డిప్రెషన్‌లో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లుగా చెప్పారు. రూపాదేవి తాను ఆత్మహత్య చేసుకోవడానికి ముందు మేడిపల్లి సత్యంకు ఫోన్ చేశారు. ఆ సమయంలో ఎమ్మెల్యే చొప్పదండిలో ఉన్నారు. తాను తీవ్రమైన కడుపునొప్పతో బాధపడుతున్నట్లు భర్తకు తెలిపారు. దీంతో తాను వెంటనే బయలుదేరి వస్తున్నట్లు ఆయన చెప్పారు. కానీ భర్తతో ఫోన్ మాట్లాడిన తర్వాత రూపాదేవి బెడ్రూంలోకి వెళ్లి గడియ వేసుకొని ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ అరెస్ట్ 

బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటిముందు ఆయన ఆందోళన చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పోచారం, ఆయన తనయుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పోచారం తన ఇంట్లో కాంగ్రెస్ కండువా కప్పుకున్న సమయంలో బాల్క సుమన్, మరికొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు లోనికి వెళ్లే ప్రయత్నం చేశారు. మాజీ మంత్రిని కలవాలంటూ గేట్లు తోసుకుంటూ లోనికి వెళ్లే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ ప్రలోభాలకు గురి చేస్తోందని ఆరోపించారు. లోనికి వెళ్లే ప్రయత్నం చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. ఆయనను కోర్టుకు తరలిస్తున్న సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు.

తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు 

నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత కూడా వర్షాలు పెద్దగా కురవేలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. శనివారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఆదిలాబాద్, కొమురం భీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 కిలో మీటర్ల నుంచి 40 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించాయని దీంతో స్వల్పంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి తెలిపారు. కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు వర్షాలు కురుస్తాయన్నారు. అల్లూరి జిల్లా, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించారు. శనివారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు.

కవిత జ్యుడిషియల్ కస్టడీ జులై 7 వరకు  పొడగింపు

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ తనయ కవితకు ఇప్పట్లో బెయిలు లభించే అవకాశాలు కన్పించడం లేదు.  ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై, తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మరోసారి పొడిగించింది. కవిత కస్టడీని జులై 7వ తేదీ వరకు పొడిగించింది. ఈరోజు కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో సీబీఐ ఆమెను వర్చువల్‌గా కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో కోర్టు ఆమె కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మద్యం పాలసీ కేసులో కవితను మార్చిలో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత సీబీఐ కూడా ఆమెను అదుపులోకి తీసుకుంది. నాటి నుంచి... నాలుగు నెలలుగా ఆమె తీహార్ జైల్లో ఉంటున్నారు.

ఎపి నూతన డిజిపిగా ద్వారకా తిరుమలరావు బాధ్యతల స్వీకరణ 

సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వారకా తిరుమలరావు నేడు ఏపీ నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు విచ్చేసిన ద్వారకా తిరుమలరావుకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ద్వారకా తిరుమలరావు తన చాంబర్ లో సంతకం చేసిన డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. ఆయనకు శంకబ్రత బాగ్చీ, వినీత్ బ్రిజ్ లాల్, రాజకుమారి తదితరు సీనియర్ ఐపీఎస్ అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.  ద్వారకా తిరుమలరావు 2021 నుంచి ఇప్పటివరకు ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. కర్నూలు జిల్లా ఏఎస్పీగా ఆయన ప్రస్థానం మొదలైంది. జిల్లా స్థాయిలోనూ, రైల్వే, సీఐడీ, సీబీఐ, ఎస్ఐబీ, ఆక్టోపస్, కౌంటర్ ఇంటెలిజెన్స్ తదితర విభాగాల్లోనూ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. సీనియారిటీ ప్రకారం ద్వారకా తిరుమలరావు మొదటి స్థానంలో ఉండడంతో ఆయనను ఏపీ డీజీపీ పదవి వరించింది.

జగన్ మీటింగ్.. అదే పాత సుత్తి..!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటే పాతకాలం అరిగిపోయిన గ్రామ్‌ఫోన్ రికార్డులు గుర్తొస్తున్నాయి. ఎందుకంటే, అధికారం పోయిన దగ్గర్నుంచీ ఆయన భారీగా సుత్తి కొడుతున్నారు. వేసిన రికార్డే వేస్తున్నారు. చెప్పిందే చెప్పి బుర్ర తింటున్నారు. అధికారం పోగానే ఏర్పాటు చేసిన మీటింగ్‌‌లో ఏం మాట్లాడారో విన్నారుగా. వాళ్ళకి ఇన్ని కోట్లు పంచాను ఆ ప్రేమ ఏమైందో.. వీళ్ళకి ఇన్ని కోట్లు పంచాను.. వీళ్ళ ప్రేమ ఏమైందో.. అంటూ సుదీర్ఘ  సుత్తికొట్టారు. పులివెందులలో ఈయన ఆస్తులు అమ్ముకొచ్చి ఆ డబ్బు పంచారు కాబట్టి ఈయన ఏమి చేసినా జనం ఈయన్ని ప్రేమించాలి. మరోసారి గెలిపించాలి.. అదీ ఈయన బాధ! ఆమధ్య ఓడిపోయిన ఎమ్మెల్యేలతో, నాలుగైదు రోజుల క్రితం ఎమ్మెల్సీలతో మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు కూడా ఇదే సుత్తి. డబ్బులు పంచాను.. వాళ్ళ ప్రేమ ఏమైంది.. డబ్బులు పంచాను... వీళ్ళ ప్రేమ ఏమైంది...! లేటెస్ట్.గా గురువారం (20-06-24) నాడు పార్టీ నాయకులతో జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కూడా అయన డబ్బు పంచాను.. బటన్ నొక్కాను.. హోమ్ డెలివరీ చేశాను.. ఆ ప్రేమంతా ఏమైంది అని చెప్పిందే చెప్పి బుర్ర వాచిపోయేలా చేశారు. ఈ మీటింగ్‌కి వచ్చిన నాయకులంతా, తామెందుకు ఓడిపోయారో అర్థంకాక బుర్ర హీటెక్కిపోయి వుంటే, ఇక్కడ కూడా ఈయన ఆ ప్రేమంతా ఎటు పోయిందో అని తగులుకుంటే ఎంతసేపని భరించగలరు? అందుకే మీటింగ్‌కి వచ్చిన నాయకులు చాలామంది, ఈయన సుత్తి త్వరగా ముగిస్తే పారిపోదాం దేవుడా అని ఎదురుచూశారని సమాచారం. జగన్ సారు మీటింగ్ పెడుతున్నారూ అంటే, మనం ఈ ఐదేళ్ళ కాలంలో ఈ తప్పులు చేశాం.. వాటిని సరిదిద్దుకుందాం అని చెప్తారని చాలామంది అనుకున్నారు. కానీ, ఇప్పటికీ తామేం తప్పు చేయలేదనే భ్రమల్లోనే బతుకుతున్న తమ నాయకుడిని చూసి నవ్వాలో, ఏడవాలో తెలియని పరిస్థితిలో సీనియర్ నాయకులు వున్నారు. మనం చాలా తప్పులు చేశాం.. వాటిని ఇలా సరిదిద్దుకోవాలి అని జగన్ ముందు నిలబడి మట్లాడే సినిమా ఏ నాయకుడికీ లేదు మరి. అందుకే, మీటింగ్ జరుగుతున్నంత సేపూ తమలో తామే కుమిలిపోతూ, ఆ తర్వాత బయటపడ్డారని సమాచారం. జగన్ మీటింగ్ అని అందర్నీ పిలిపించారు. కానీ స్పీచ్ ఇచ్చి పంపించేశారు. మీటింగ్ అంటే ఏమిటీ...? ఒక డిస్కషన్‌లాగా జరగాలి... కానీ జగన్ విషయంలో జరుగుతున్నది మీటింగ్ కాదు... కేవలం జగన్ స్పీచ్ మాత్రమే. ఈ ఐదేళ్ళలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తప్పులు చేస్తుంది.. మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం అని చేతగాని మాటలు చెప్పడమే. వాళ్ళు తప్పులు చేస్తే మనం అధికారంలోకి వస్తామనే తప్ప.. మనం ఈ మంచి పనులు చేద్దాం.. అధికారంలోకి వద్దామనే మాట జగన్ నోటి వెంట రావడం లేదని వైసీపీ నాయకులు తలలు బాదుకుంటున్నారు.

జగన్ మళ్లీ సభకు వచ్చేనా?

ఎమ్మెల్యేగా మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం (జూన్ 21) అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. గత అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్ కు అప్పుడు ఆయన పార్టీ తరఫున 151 మంది ఎమ్మెల్యులు ఉన్నారు. ఐదేళ్లు గిర్రున తిరిగి ఇప్పుడు  ఆయన కనీసం ప్రతిపక్ష నేత హోదాను కూడా కోల్పోయి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన పార్టీ తరఫున ఆయనతో సహా కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఇప్పుడు ఉన్నారు. అంటే ఐదేళ్ల జగన్ పాలన పట్ల ప్రజలు ఎంతగా విసిగిపోయారో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. జగన్ కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదన్నదే ప్రజా తీర్పు. ఆ ప్రజా తీర్పును ఎవరైనా సరే గౌరవించి తీరాల్సిందే. అందుకు ప్రస్తుత ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు కూడా మినహాయింపు లేదు. ఇక విషయానికి వస్తే ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన జగన్ కు చంద్రబాబు ఆయన కోరిన మీదటే అయినా కొన్ని వెసులు బాట్లు ఇవ్వడం పట్ల ప్రజలలో  ఒకింత అసంతృప్తి వ్యక్తం అవుతోంది. తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యేలు కూడా బాబు మరీ అంత మంచితనం ప్రదర్శించకుండా ఉండాల్సిందని అంటున్నారు. ఇంతకీ జగన్ కోరిన మీదట చంద్రబాబు ఆయనకు కల్పించిన వెసులు బాట్లు ఏమిటయ్యా అంటే.. మంత్రులు వచ్చినట్లుగానే జగన్ కూడా తన వాహనంలోనే అసెంబ్లీ ఆవరణలోకి వచ్చే అవకాశం కల్పించడం, అలాగే ప్రమాణ స్వీకారానికి అక్షర క్రమంలో తన వంతు వచ్చే వరకూ వేచి చూడాల్సిన అవసరం లేకుండా మంత్రుల ప్రమాణ స్వీకారం కాగానే జగన్  ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం ఇవ్వడం. ఈ వెసులు బాట్లను చంద్రబాబు జగన్ కు కల్పించడంపై తెలుగుదేశం, జనసేన ఎమ్మెల్యేలలోనే కాదు జనం నుంచి కూడా ఒకింత అసంతృప్తి వ్యక్తం అవుతోంది. జగన్ అసెంబ్లీలోకి ప్రవేశించగానే తెలుగుదేశం ఎమ్మెల్యే ఒకరు వచ్చావా? అంటూ ప్రశ్నించడం, అసెంబ్లీ బయట జగన్ మావయ్యా అంటూ జనం గేలి చేయడం చూసిన తరువాత జగన్ తన అస్తవ్యస్త పాలనతో అందరిలోనూ ఎంతగా వ్యతిరేకత మూటగట్టుకున్నారో అర్ధమౌతుంది.  ఇక ఆయన హయాంలో అసెంబ్లీ నడిచిన తీరు, ప్రత్యర్థి పార్టీ నేతలను అవమానించిన విధం అందరికీ తెలిసిందే. అంతకు అంతా తిరిగి ఇచ్చేయాలన్న భావిస్తున్న తెలుగుదేశం ఎమ్మెల్యేలకు గతం గత: మనం మాత్రం మంచిగానే ఉందామనేలా చంద్రబాబు జగన్ కు వెసులుబాట్లు కల్పించడమేంటన్న ఆవేదన తెలుగుదేశం ఎమ్మెల్యేలలో వ్యక్తం అవుతోంది. అయితే కొందరు మాత్రం చంద్రబాబు తన పట్ల ప్రదర్శించిన ఉదారత  జగన్ కు చెంపపెట్టులా తగులుతుందని అంటున్నారు. అందుకే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అసెంబ్లీ ఆవరణలోని తన చాంబర్ కు అక్కడ నుంచి బయటకు వెళ్లిన జగన్ మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టే సాహసం చేస్తారని అనుకోవడం లేదని పలువురు ఎమ్మెల్యేలు అంటున్నారు. ముఖ్యమంత్రిగా తన ప్రవర్తన ఎంత హేయంగా ఉందో తన హుందాతనంతో చంద్రబాబు జగన్ కు కళ్లకు కట్టేలా చూపించారంటున్నారు.  తొలి రోజే ఓ ఐదు నిముషాలు అసెంబ్లీలో కూర్చోలేకపోయిన జగన్.. ముందు ముందు అసెుంబ్లీలోకి వచ్చి సభా కార్యక్రమాలలో పాల్గొంటారని భావించలేమని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  

బీఆర్ఎస్ భూస్థాపితానికి శంకుస్థాపన!

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నాయకత్వంలోని భారత రాష్ట్రీయ సమితి (బీఆర్ఎస్) పార్టీని భూస్థాపితం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం (21-06-24) నాడు శంకుస్థాపన చేశారు. బీఆర్ఎస్ నాయకుడు, శాసనసభ మాజీ స్పీకర్, బాన్సువాడ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్ తీర్థం ఇవ్వడం ద్వారా బీఆర్ఎస్ భూస్థాపితం కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. సాధారణంగా ఎవరైనా పార్టీ మారదలుచుకుంటే సదరు వ్యక్తి ముఖ్యమంత్రి దగ్గరకి వెళ్ళి పార్టీలో చేరడం సర్వసాధారణం. కానీ, పోచారం ఇంటికి ముఖ్యమంత్రి వెళ్ళి మరీ పార్టీలోకి తీసుకున్నారంటే, శంకుస్థాపన కార్యక్రమం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం ముందుముందు ఇంకా ఎంత భారీ స్థాయిలో జరగబోతోందో కూడా అవగాహనలోకి తెచ్చుకోవచ్చు. ముఖ్యమంత్రి చేపట్టిన బీఆర్ఎస్ భూస్థాపితం కార్యక్రమానికి వచ్చే అసెంబ్లీ సమావేశాలకు డెడ్‌లైన్‌గా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈలోపుగా కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు.. మరో ఇద్దరు ముగ్గురు మినహా మిగతా ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశంల్లో బీఆర్ఎస్ శాసనసభా పక్షాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేస్తారు. అప్పుడు బీఆర్ఎస్ భూస్థాపితం కార్యక్రమం సంపూర్ణమవుతుంది. ఇక ఆ తర్వాత కేసీఆర్ కుటుంబం ఇంట్లో కూర్చుని భజన చేయడం తప్ప చేయగలిగిందేమీ వుండదు.

పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారంపై నాగబాబు ట్వీట్ 

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అసెంబ్లీలో ఈ రోజు శాసన సభ్యుడిగా ప్రమాణ‌స్వీకారం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సోద‌రుడు, జ‌న‌సేన నేత నాగ‌బాబు 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పందించారు. డిప్యూటీ సీఎం హోదాలో శాసనసభలో ప్రమాణస్వీకారం చేస్తున్నటువంటి తమ్ముడు పవన్ కల్యాణ్‌ని చూసి త‌న‌ మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింద‌ని ఆయ‌న ట్వీట్ చేశారు.  "తోడబుట్టిన వాడిగా & జనసేన కార్యకర్తగా మా నాయకుడి ప్రమాణస్వీకారం చూసి నా గుండె ఆనందంతో నిండిపోయింది. పవన్ క‌ల్యాణ్‌ అసెంబ్లీకి వెళ్లాలి. 'పవన్ కల్యాణ్ అను నేను' అని ప్రమాణస్వీకారం చేయాలనేది పదేళ్ల నా కల. అసెంబ్లీకి రావడం గ్యాలరీలో కూర్చోవడం నాకిదే మొదటిసారి. నాకు ఎంతో థ్రిల్‌గా ఉంది. మా కుటుంబం అంతా కూటమిలో కల్యాణ్ బాబు ఘన విజయం సాధించినందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉన్నారు. ఇంతటి అఖండ గెలుపునిచ్చిన ప్రతి ఒక్క ఓటర్ నమ్మకాన్ని అనుక్షణం నిలబెట్టుకుంటాడు. తనకి కేటాయించిన అన్ని మంత్రిత్వ శాఖలకి నిజాయతీతో, నిష్పక్షపాతంగా అన్ని విధాల అంతఃకరణ శుద్ధితో న్యాయం చేస్తాడని నిర్భయంగా తెలియజేస్తున్నాను" అని నాగబాబు ట్వీట్ చేశారు.  

జగన్ మావయ్యా.. సూపర్ కామెడీ మావా!

నా పరిపాలనలో స్టూడెంట్స్ ఇంగ్లీషులో ఇరగ్గొట్టేస్తున్నారు అని ప్రచారం చేసుకోవడం కోసం జగన్ ముఖ్యమంత్రిగా వెలగబెట్టిన కాలంలో తన దగ్గరకి స్కూలు పిల్లల్ని పిలిపించుకోవడం.. వాళ్ళ  చేత ఇంగ్లీషు మాట్లాడించడం లాంటి వికటించిన ప్రయోగాలు చేశారు. వాళ్ళలో ‘మై నేమీజ్ మ్యాగనా’ గురించి అందరికీ తెలిసిందే.   ఒకసారి ఓ సభలో ఒక కుర్రాణ్ణి పిలిపించి, జగన్ సమక్షంలో అతని చేత ఇంగ్లీషు మాట్లాడించారు. ఇంగ్లీషు మాట్లాడ్డం అంటే ఆక్స్.ఫర్డ్ డిక్షనరీ లెవల్లో ఆలోచించి, మరేదో అనుకోకండి.. స్టూడెంట్స్ ఇంగ్లీషు మాట్లాడ్డం అంటే, జగన్ పథకాల భజన చేయడం. సదరు కుర్రాడు కూడా నాన్ స్టాప్‌గా ఆంగ్లములో జగన్ భజన కార్యక్రమం నిర్వహించాడు. ఆ కుర్రాడలా భజన చేస్తుంటే, పక్కనే మన జగన్ చేతిలో చెయ్యి పెట్టుకుని, ముసిముసి నవ్వులు నవ్వుతూ మురిసిపోయారు. గడగడా ఇంగ్లీషు మాట్లాడాల్సిన ఆ కుర్రాడు గడగడలాడుతూ ఇంగ్లీషు మాట్లాడాడు. జగన్ హయాంలో రోడ్ల మీద వెహికల్ నడిపినట్టు బ్రేకుల మీద బ్రేకులు వేస్తూ ఇంగ్లీషు మీద కక్ష తీర్చుకున్నాడు. ఇదంతా ఇలా వుంటే, ఇంగ్లీషు మాట్లాడుతున్న ఆ కుర్రాడి ఫేస్‌లో సడెన్‌గా ఏదో మార్పు వచ్చింది. మనిషి స్టిఫ్ అయిపోయాడు. పొరపాటున ఇప్పుడు జగన్‌నిగానీ తిట్టబోతున్నాడా అనే సందేహం వచ్చేలా కనిపించాడు. అప్పుడు ఆ కుర్రాడి నోటి నుంచి బుల్లెట్‌లా ఒక మాట దూసుకొచ్చింది. ఆ కుర్రాడు ‘జగన్ మావయ్యా’ అని ఒక్కసారి గావుకేక పెట్టాడు. ఆ గావుకేక విని సాధారణంగా ఎవరైనా భయపడతారు. కానీ, మన జగన్ మావయ్య మాత్రం సిగ్గుపడిపోతూ ఆ పిలుపును ఆస్వాదించారు. ఆనాటి నుంచి మొదలైంది ట్రోలింగ్.. జగన్ కీర్తి కిరీటంలో ‘జగన్ మావయ్యా’ అనే మాట కూడా చేరింది. చివరికి ‘మావయ్య’ అనే పదం కామెడీగా మారిపోయిన పరిస్థితి జగన్ గారి పుణ్యమా అని ఏర్పడింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పడం జరిగిందంటే, శుక్రవారం నాడు అసెంబ్లీకి శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి జగన్ వచ్చినప్పుడు అక్కడున్న కుర్రకారు ‘జగన్ మావయ్యా.. జగన్ మావయ్యా’ అని కామెడీగా పిలుస్తూ రచ్చరచ్చ చేశారు. ఆ పిలుపులు జగన్ చెవిలో పడినా విననట్టుగా నటిస్తూ, నమస్కారాలు పెడుతూ అసెంబ్లీ లోపలకి వెళ్ళిపోయారు. 

ఈ యేడు ఘనంగా బోనాలు: పొన్నం

హైదరాబాద్‌ కలెక్టరేట్‌లో ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలపై తెలంగాణ రాష్ట్ర‌ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా బోనాల ఉత్సవాలు నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.  రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి జరుపుకుంటున్న బోనాల ఉత్సవాలను గతంలో కంటే ఘనంగా జరిగేలా చూడాలని అధికారుల‌కు చెప్పారు. జిల్లా పరిధిలోని 2,400 ఆలయాలకు ఇచ్చే చెక్కుల పంపిణీని త్వరగా పూర్తయ్యేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.  ఇక ఈసారి ఆల‌యాల‌కు ఇచ్చే డబ్బులను పెంచాలన్న విజ్ఞప్తిని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని మంత్రి వెల్లడించారు. బోనాల సంద‌ర్భంగా ఆల‌యాల‌కు వ‌చ్చే భక్తులకు అవ‌స‌ర‌మైన‌ సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కాగా, వ‌చ్చే నెల 7వ తేదీ నుంచి బోనాల ఉత్స‌వాలు ప్రారంభం కానున్నాయి.

అపురూప ఆలయాలకు ఆదరణ కరువు

భీమారం శిధిల శివాలయాన్ని కాపాడుకోవాలి!  కళ తప్పిన కాకతీయ ఆలయాలు 13వ శతాబ్ది ఆలయాలను పరిరక్షించాలి పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి  సూర్యాపేట జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో, కేతపల్లి మండలం, భీమారంలో కాకతీయ కాలపు శిధిల శివాలయాలను కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు ప్లీచ్ ఇండియా, సీఈవో, డా. ఈమని శివనాగిరెడ్డి అన్నారు. ఆమనగల్లు కు చెందిన దాస్యం వెంకట సురేందర్ ఇచ్చిన సమాచారం మేరకు ఆయన శుక్రవారం నాడు భీమారంలోని శివాలయాలను పరిశీలించారు. గ్రామ శివారులో గల రైస్ మిల్ దగ్గర పొలాల్లో ప్రవేశ మండపం, మహామండపం, గర్భాలయాలతో ఉన్న శివాలయం గోడల బయటి వరసరాళ్లు, మహా మండపం కప్పురాళ్లు కూలిపోయాయని, గర్భాలయంలోని శివలింగం, నంది శిథిలమైనాయని, ఆలయం చుట్టూ, పైన ముళ్లపొదలు పెరిగి చారిత్రక కట్టడం ఉనికికే ప్రమాదం వాటిలిందన్నారు.  అనంతరం భీమారం గ్రామ వెలుపల మూసి నదికి దగ్గర్లో గల గర్భాలయం, అర్దమండపం, మహా మండపం గల మరో శివాలయం పూర్తిగా శిథిలమైందని, ఆలయం లోపల నంది, శివలింగం చుట్టూ కాకతీయుల కాలపు భిన్నమైన భైరవ, నంది, గణేశా శిల్పాలు ఉన్నాయని, ఆలయ మండపం లోను, చుట్టూరా ముళ్లపొదులు పెరిగాయని శివనాగిరెడ్డి చెప్పారు. 800 ఏళ్ల నాటి అపురూప ఆలయాలను, అద్భుత శిల్పాలను అలన పాలనా లేక నిరాదరణకు గురికావడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక చరిత్ర, సాంస్కృతికి అద్దంపడుతున్న ఈ వారసత్వ కట్టడాలను, శిల్పాలను పరిరక్షించి రాబోయే తరాలకు అందించాలని శివనాగిరెడ్డి భీమారం గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. రెండు ఆలయాలు చుట్టూ పెరిగిన ముళ్లపదలను తొలగించి, పడిపోయిన రాళ్ళను యధా స్థానంలో పునర్నిర్మిస్తే ఆలయాలు అలనాటి వైభవాన్ని సంతరించుకుంటాయని ఆయన ఆశాభావంగా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థపతి భీమిరెడ్డి వెంకటరెడ్డి, ఈమని రాజ్యలక్ష్మి పాల్గొన్నారు అని ఆయన చెప్పారు.

సుజనా.. వంగవీటి.. ఛాన్స్ దక్కేదెవరికో?

ఏపీలో చంద్రబాబాబు నాయకత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. జగన్ పాలనలో ఐదేళ్ల పాటు అన్ని రంగాలలో అధోగతి పాలైన రాష్ట్రాన్ని ప్రగతి పట్టాలెక్కించే దిశగా చంద్రబాబు కేబినెట్ అప్పుడే అడుగులు వేయడం మొదలు పెట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటికే క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నారు. ప్రాధాన్యతా క్రమంలో ఆయన తన తొలి పర్యటన పోలవరంతో ప్రారంభించారు. రెండో పర్యటన అమరావతిలో చేరారు. ఈ రెండు పర్యటనల్లోనూ చంద్రబాబు జగన్ విధ్వంస పాలనలో నవ్యాంధ్రప్రదేశ్ కు రెండు కళ్లలాంటి పోలవరం, అమరావతిల పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రెండిటిపై కూడా త్వరలో శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తామని చెప్పారు. ఏపీకి జీవనాడి వంటి పోలవరం, ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం ఇక వేగం పుంజుకుంటుందన్న విశ్వాసాన్ని ప్రజలలో కలిగించారు. అలాగే మంత్రి నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి ముందుగానే తన నియోజకవర్గం మంగళగిరిలో ప్రజాదర్బార్ నిర్వహిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఇసుమంతైనా అలసత్వం చూపబోనని చాటారు. అదే విధంగా హోంమంత్రి వంగలపూడి అనిత, పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ఇలా ఒకరని కాదు చంద్రబాబు కేబినెట్ లో స్థానం దక్కించుకున్న మంత్రులంతా.. రాష్ట్ర ప్రగతి, సుపరిపాలన ధ్యేయంగానే తమ ప్రభుత్వ తీరు ఉంటుందన్నది తమ చేతల ద్వారా చాటారు. సరే అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం (జూన్ 21) ప్రారంభమయ్యాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు శాసన సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సీనియర్ సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఇప్పుడు చంద్రబాబు కేబినెట్ లో ఖాళీగా ఉన్న స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొని ఉంది. పాలనను ప్రగతి బాటలో పరుగులెత్తించే పనిలో ఉన్న చంద్రబాబు తన కేబినెట్ లో ఖాళీగా ఉన్న బెర్త్ ను సాధ్యమైనంత త్వరగానే భర్తీ చేస్తారనడంలో సందేహం లేదు. దీంతో ఆ బెర్త్ ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొని ఉంది. ప్రస్తుత కేబినెట్ లో పలువురు సీనియర్లకు స్థానం దక్కని సంగతి తెలిసిందే. యనమల వంటి సీనియర్ మోస్ట్ లు కూడా కేబినెట్ లో స్థానం దక్కని వారిలో ఉన్నారు. అలాగే చంద్రబాబు గత ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన వారిలో కొందరికి కూడా ఈ సారి మంత్రి పదవి లభించలేదు. దీంతో ప్రస్తుత కేబినెట్ లో ఖాళీగా ఉన్న ఆ ఒక్క స్థానం కోసం ఆశావహుల సంఖ్య భారీగానే ఉంటుందనడంలో, ఉందనడంలో సందేహం లేదు. ఈ బెర్త్‌ కోసం రేసులో ఉన్న వారిలో ప్రధానంగా కేంద్ర మాజీ మంత్రి  సుజనా చౌదరి కూడా ఉన్నారని అంటున్నారు. అలాగే   పార్టీ టికెట్ ఆశించకుండా కూటమి అభ్యర్థుల విజయం కోసం పాటుపడిన వంగవీటి రాధాకృష్ణ కూడా రేసులో  ఉన్నారని అంటున్నారు. ఆయనను కేబినెట్ లో తీసుకుని.. త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించుకోవాలన్న ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నట్లు కూడా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అలాగే యనమల, పరిటాల సునీత, భూమా అఖిలప్రియ, కిమిడి కళా వెంకటరావు, గంటా శ్రీనివాసరావులు కూడా మంత్రి పదవులు ఆశిస్తున్నవారిలో ఉన్నారు.  మరి చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతోంది. 

చంద్రబాబును చూసి నేర్చుకో మిస్టర్ జగన్!

సంస్కారం వున్న సంస్కర్త అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి నిరూపించుకున్నారు. అది మరెవరి విషయంలోనో కాదు.. తన రాజకీయ ప్రత్యర్థి, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి విషయంలో. అసెంబ్లీ అంటే కౌరవ సభలా కాదు.. గౌరవ సభలా వుండాలని ఆశించే ఆయన, దాన్ని తన ఆచరణలో కూడా చూపించారు. ఇదే నాకూ, జగన్‌కి మధ్య వున్న తేడా అని చెప్పకనే స్పష్టంగా చెప్పారు.  శుక్రవారం (21-06-24) నాడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమైనప్పుడు మొదటగా కొత్తగా శాసనసభకు ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. మొదట ముఖ్యమంత్రి, తర్వాత ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, మహిళా సభ్యులు, సాధరణ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడం అనేది సాధారణంగా జరుగుతూ వుంటుంది. అదే సంప్రదాయాన్ని ఇప్పుడు కూడా పాటిస్తున్నారు. ఈ లెక్కప్రకారం ప్రతిపక్ష హోదా కూడా దక్కని జగన్మోహన్‌రెడ్డి సాధారణ శాసనసభ్యుడి హోదాలో ప్రమాణ స్వీకారం చేయాల్సి వుంటుంది. శాసన సభ్యుల ప్రమాణ స్వీకారం అనేది ఇంగ్లీషు ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో జరుగుతుంది. ఇంటిపేరు ‘A’తో ప్రారంభమయ్యే శాసనసభ్యుడు మొదట ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ లెక్కప్రకారం జగన్మోహన్‌రెడ్డి ఇంటిపేరు ‘YS’ కాబట్టి ఆయన అందరికంటే చివరగా ప్రమాణ స్వీకారం చేయాల్సి వుంటుంది. అంటే, ప్రమాణ స్వీకార కార్యక్రమం మొదటి నుంచి చివరి వరకు ఆయన శాసనభలోనే వుండి, తన పేరు వచ్చే వరకు వేచి చూడాల్సి వుంటుంది.  అయితే, జగన్ తనకు ముందే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. జగన్ విజ్ఞప్తిని గౌరవిస్తూ ప్రభుత్వాధినేత చంద్రబాబు నాయుడు జగన్‌కి ఆ అవకాశాన్ని ఇచ్చారు. అందువల్ల జగన్ సభకు వచ్చీ రాగానే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కల్పించారు. అలా వచ్చారు.. ఇలా ప్రమాణ స్వీకారం చేశారు.. మళ్ళీ అలా వెళ్ళిపోయారు. కట్టె కొట్టె తెచ్చె అన్నట్టుగా సింపుల్‌గా జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసింది. శుక్రవారం నాడు అసెంబ్లీ ప్రవేశద్వారం ఎమ్మెల్యేల కార్లను అనుమతించడం లేదు. జగన్ సాధారణ ఎమ్మెల్యేనే కాబట్టి ఆయన కారును కూడా అసెంబ్లీ ప్రవేశ ద్వారం వరకు అనుమతించే అవకాశం లేదు. కొంత దూరం నడుచుకుంటూ ప్రవేశ ద్వారం దగ్గరకి రావలసి వుంటుంది.  కానీ, జగన్మోహన్‌రెడ్డి కారును ప్రవేశద్వారం వరకు అనుమతించాలని చంద్రబాబు ఆదేశించారు. ఇలా జగన్మోహన్‌రెడ్డి గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా చూశారు. ఇదే జగన్ అయితే ఇలా చేసేవారా? నిస్సందేహంగా చేసేవారు కాదు.. తన అహంకారాన్ని నిర్లజ్జగా ప్రదర్శించి వుండేవారు. రూల్స్ పాటించాల్సిందే అని నియంతలాగా మాట్లాడి వుండేవారు. ఇదేదో ఊహించడం కాదు.. గతంలో చాలా సందర్భాల్లో అసెంబ్లీలోనే ఇలాంటి ప్రవర్తనను జగన్‌లో అందరూ చూశారు. అంతేకాదు, సినీ ప్రముఖులు ఆయన దగ్గరకి వచ్చినప్పుడు అందరూ ఎక్కడో దూరంగా కార్లు ఆపుకుని, చాలాదూరం నడిచి ముఖ్యమంత్రి కార్యాలయంలోకి వెళ్ళాల్సి రావడం అంత త్వరగా మరచిపోయే విషయం కాదు.  అధికారంలో వున్నా, అధికారంలో లేకపోయినా మనిషికి విలువని, గౌరవాన్ని పెంచేది సంస్కారమేనని జగన్ ఇప్పటికైనా తెలుసుకుంటే బాగుంటుంది. తనకు, చంద్రబాబు నాయుడికి తేడా ఏమిటో అర్థం చేసుకుంటే, తన ప్రవర్తనను దిద్దుకుంటే రాజకీయంగా ఉపయోగపడినా పడకపోయినా, ఒక మనిషిగా ఉపయోగపడుతుంది.

బిఆర్ఎస్ కు మరో షాక్... పోచారం ఇంటికి రేవంత్ రెడ్డి 

తెలంగాణలో పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. బిఆర్ఎస్ ముఖ్య నేతలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.  తెలంగాణ‌లో బీఆర్ఎస్‌కు మ‌రో షాక్ త‌గిలే అవ‌కాశం ఉంది. అసెంబ్లీ మాజీ స్పీక‌ర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు. వీరి భేటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. తాజా రాజ‌కీయాల‌పై చ‌ర్చ‌ల అనంత‌రం పోచారంను కాంగ్రెస్‌లో చేరాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించిన‌ట్లు స‌మాచారం. దీంతో పోచారం శ్రీనివాస్ రెడ్డి హ‌స్తం గూటికి చేర‌డం దాదాపు ఖాయ‌మైన‌ట్టేన‌ని చ‌ర్చ న‌డుస్తోంది. ప్ర‌స్తుతం పోచారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. 

చరిత్రలో కొత్త పదం ‘చంద్రబాబు శపథం’!

శపథం అంటే చంద్రబాబు చేసినట్టుండాలి.. శపథం అంటే చంద్రబాబు నెరవేర్చినట్టుండాలి.. ఇంతకాలం మనకు ‘చాణక్య శపథం’ అనే పదం మాత్రమే తెలుసు.. తెలుగు ప్రజలకు మరో కొత్త పదం పరిచయమైంది.. అది రాజకీయ చాణక్యుడు చంద్రబాబు చేసిన శపథం ద్వారా క్రియేట్ అయింది. అదే ‘చంద్రబాబు శపథం’. ‘‘ఇన్నేళ్ళూ పరువు కోసం బతికాను. అలాంటిది ఈరోజు సభలో నా  భార్య ప్రస్తావన తెచ్చి, అసభ్య వ్యాఖ్యలు చేశారు. ఇది గౌరవ సభ కాదు.. కౌరవ సభ. ఇలాంటి సభలో నేనుండలేను. మళ్ళీ ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగుపెడతాను. లేకపోతే నాకు రాజకీయాలే వద్దు. మీ అందరికీ ఓ నమస్కారం’’ అని నవంబర్ 19, 2021న శాసనసభలో చంద్రబాబు తీవ్ర అవమాన భారంతో శపథం చేశారు. ఆరోజు నుంచి ఆయన అసెంబ్లీకి వెళ్ళలేదు. ప్రజల నుంచే తీర్పు కోరారు. ప్రజలు సరైన తీర్పు ఇచ్చారు. ‘చంద్రబాబు శపథం’ నెరవేరేలా చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగానే శుక్రవారం (21-06-24) శాసనసభలోకి అడుగుపెట్టారు. గౌరవ సభలోకి చాలా గౌరవంగా ముఖ్యమంత్రి హోదాతో అడుగుపెట్టారు. ‘చంద్రబాబు శపథం’ అనే కొత్త పదాన్ని సృష్టించారు.

రాష్ట్రంలో శాంతి భద్రతల విఘాతానికి జగన్ దుష్టపన్నాగం?

ఏపీకి మంచిరోజులొచ్చాయి. అభివృద్ధి ప‌థంలో దూసుకెళ్లేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం సిద్ధ‌మైంది. చంద్ర‌బాబు నాయుడు సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వెంట‌నే రాష్ట్ర అభివృద్ధిపై దృష్టిసారించారు. రాష్ట్రానికి జీవ‌నాడి అయిన పోల‌వ‌రం ప్రాజెక్టును ప‌రుగులు పెట్టించేందుకు కార్యాచ‌ర‌ణ సిద్ధం చేస్తున్నారు. మ‌రోవైపు రాజ‌ధాని  అమ‌రావ‌తి నిర్మాణ ప‌నుల్లోనూ వేగం పెర‌గ‌నుంది. ఇప్ప‌టికే పోల‌వ‌రం ప్రాజెక్టు, అమ‌రావ‌తి ప్రాంతాల‌ను చంద్ర‌బాబు నాయుడు ప‌రిశీలించారు. ఐదేళ్ల కాలంలో అక్క‌డ జ‌రిగిన విధ్వంసాన్ని ఆక‌ళింపు చేసుకున్నారు. రెండు ప్రాంతాల్లోనూ ప‌నులు వేగంగా జ‌రిగేలా కీల‌క అధికారుల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. గ‌డిచిన ఐదేళ్ల‌కాలంలో అభివృద్ధి ఆనవాళ్లను కూడా చెరిపేసేలా సాగిన జగన్ పాలన చూసిన ఏపీ ప్ర‌జ‌లు.. చంద్ర‌బాబు దూకుడుగా అభివృద్ధి ప‌నుల‌కు శ్రీ‌కారం చుడుతుండ‌టంతో సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రోవైపు ఐదేళ్లుగా జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి అరాచ‌క పాల‌న‌తో ఇబ్బందులు ఎదుర్కొన్న తెలుగుదేశం, జ‌న‌సేన నేత‌లు, కార్య‌క‌ర్త‌లు బ‌దులు తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎన్నిక‌ల్లో గెలిచిన వెంట‌నే ఆ మేర‌కు రెండు పార్టీల కార్య‌క‌ర్త‌లు ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ సూచ‌న‌ల‌తో సంయమనం పాటిస్తున్నారు. కూట‌మి ప్రభుత్వం భారీ మెజార్టీతో అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే తెలుగుదేశం, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల ఆగ్ర‌హాన్ని ప‌సిగ‌ట్టిన చంద్ర‌బాబు, ప‌వ‌న్ వారికి హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ఎవ‌రూ తొంద‌ర‌ప‌డొద్దు.. వైసీపీ నేత‌ల‌పై దాడుల‌కు పాల్ప‌డ‌వ‌ద్ద‌ని గ‌ట్టిగానే చెప్పారు. దీంతో ఏపీలో ఎలాంటి క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు ఆ పార్టీల కార్య‌క‌ర్త‌లు దిగ‌లేదు. ఒక‌టి రెండు చోట్ల వైసీపీ నేత‌లు క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగ‌డంతో ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నెలకొంది. ఒక‌టిరెండు చోట్ల త‌లెత్తిన ఘ‌ర్ష‌ణ‌లకే వైసీపీ నేత‌లు పెద్ద రాద్దాంతం చేశారు. ఏపీలో బీహార్ త‌ర‌హా పాల‌న మొద‌లైందంటూ ఆ పార్టీకి చెందిన కీల‌క నేత‌లు గ‌వ‌ర్న‌ర్ కు విన‌తిప‌త్రాలు ఇచ్చి దొంగే.. దొంగ దొంగ అని అరిచిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించారు. చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట‌ను జ‌వ‌దాట‌ని ఇరు పార్టీల నేత‌లు, కార్య‌క‌ర్త‌లు వైసీపీ నేత‌ల‌పై ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు దిగలేదు. దీంతో రాష్ట్రంలో ప్ర‌శాంత వాతావ‌ర‌ణం నెల‌కొన‌డంతో పాటు.. చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలో అభివృద్ధి ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయి. ప్ర‌జ‌లుసైతం కూట‌మిని భారీ మెజార్టీతో గెలిపించినందుకు సంతోషంగా ఉన్నారు.  ఏపీలో ప‌రిణామాలు వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి  బొత్తిగా న‌చ్చ‌లేద‌ట‌. ప‌బ్జీ గేమ్‌కు అల‌వాటుప‌డిన జ‌గ‌న్‌.. ఎలాగైనా రాష్ట్రంలో గొడ‌వ‌లు జ‌రిగేలా చూడాల‌ని ఆ పార్టీలోని కొంద‌రు నేత‌ల‌కు టాస్క్ ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం సృష్టించ‌డం ద్వారా ఆ ప‌రిణామాల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవాల‌న్నది జ‌గ‌న్ వ్యూహమని వైసీపీ నేతలే అంటున్నారు.   వాస్త‌వానికి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హ‌యాంలో ఏపీలో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌పై దాడుల‌కు పాల్ప‌డ‌టం, అక్ర‌మ కేసులు బ‌నాయించి జైళ్ల‌కు పంప‌డ‌మే ప‌నిగా వైసీపీ ప్ర‌భుత్వం ఐదేళ్ల పాల‌న సాగింది. కేవ‌లం వైసీపీ సానుభూతిప‌రుల‌కు మాత్ర‌మే ప‌థ‌కాల పేరుతో నెల‌నెలా డ‌బ్బులు జ‌మ చేస్తూ వ‌చ్చారు. రాష్ట్ర  అభివృద్ధిని పూర్తిగా ప‌క్క‌న‌పెట్టేశారు. పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు చేప‌ట్ట‌లేదు. అమ‌రావ‌తి రాజ‌ధానిని నిర్వీర్యం చేసే ప్ర‌య‌త్నం చేశారు. ప్ర‌జావ్య‌తిరేక పాల‌న‌ను ప్ర‌శ్నించిన వారిపై  వైసీపీ గూండాలు దాడులకు తెగ‌బ‌డ్డారు. ఇవ‌న్నీ జీర్ణించుకోలేని ప్ర‌జ‌లు ఓటు ద్వారా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి గ‌ట్టి గుణ‌పాఠం చెప్పారు. కేవ‌లం 11 సీట్లే ఇచ్చి అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష హోదాసైతం లేకుండా చేశారు. కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత సీఎం చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలో రాష్ట్రంలో ప్ర‌శాంత వాతావ‌ర‌ణం నెల‌కొంది. అభివృద్ధి ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. నేష‌న‌ల్ మీడియాసైతం ఏపీలో చంద్ర‌బాబు పాల‌న‌పై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తోంది. వీట‌న్నింటికి చెక్ పెట్టాలంటే రాష్ట్రంలో గొడ‌వ‌లు సృష్టించ‌డం ఒక్క‌టే ఆయుధం అని జ‌గ‌న్ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో వైసీపీ హ‌యాంలో చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ పై బూతుపురాణంతో రెచ్చిపోయిన కొడాలి నాని, పేర్ని నాని, అంబ‌టి రాంబాబు, జోగి ర‌మేష్‌, ఆర్కే రోజా, అనిల్ కుమార్ యాద‌వ్ ల‌ను  జ‌గ‌న్ మ‌రోసారి రంగంలోకి దింప‌బోతున్నార‌ట‌. వీరి పేర్లు వినిపిస్తేనే ప్ర‌స్తుతం తెలుగుదేశం, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు మండిప‌డుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో వీరు మీడియా ముందుకొచ్చి చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ పై ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడ‌టం ద్వారా  తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు ఆగ్ర‌హానికిలోనై దాడుల‌కు పాల్ప‌డ‌తార‌ని, రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం ఏర్ప‌డుతుంద‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. ఆ ప‌రిణామాల‌ను అవ‌కాశంగా మార్చుకొని వైసీపీ నేత‌ల‌పై దాడుల‌కు పాల్ప‌డుతున్నార‌ని జాతీయ స్థాయిలో ప్ర‌చారం చేసేలా వైసీపీ అధిష్టానం ప్రణాళిక సిద్ధం చేసింది.  దానినే సాకుగా తీసుకుని గాయ‌ప‌డిన వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌ను ప‌రామ‌ర్శించే నెపంతో రాష్ట్రంలో ప‌ర్య‌టించాల‌ని జ‌గ‌న్  ప్రణాళిక సిద్ధం చేసుకున్నారన్న ప్రచారం  వైసీపీ వ‌ర్గాల్లో   జ‌రుగుతోంది. త‌ద్వారా తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం చేప‌ట్టే అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కంటే.. రాష్ట్రంలో ఘ‌ర్ష‌ణ‌ల‌ను హైలెట్ చేస్తూ ప్ర‌జ‌ల్లో మ‌రోసారి సానుభూతి పొందాలన్నదే జ‌గ‌న్ ప్లాన్ గా క‌నిపిస్తున్నది. మ‌రి జ‌గ‌న్ ప్లాన్ కు చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏ మేర‌కు చెక్ పెడ‌తారో చూడాల్సి ఉంది.