పరీక్షలకు తట్టుకుని నిలబడిన ‘స్కిల్ ’
posted on Jun 17, 2024 @ 11:29AM
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో జగన్ సర్కార్ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేసింది. లేని స్కాం ఉందంటూ ఎటువంటి ఆధారాలూ లేకుండా గాలిలో ఆరోపణలను చేస్తూ చంద్రబాబును వేధించింది. 50 రోజులకు పైగా జైలులో నిర్బంధించింది. ఇంత చేసినా జగన్ సర్కార్ స్కిల్ కేసులో అవినీతిని నిరూపించడంలో ఘోరంగా విఫలమైంది. తాజా ఎన్నికలలో జగన్ పార్టీ ఘోర పరాభవానికి ప్రధానమైన కారణాలలో చంద్రబాబు అరెస్టు కూడా ఒకటి అనడంలో సందేహం లేదు. జగన్ సర్కార్ దమనకాండకు కూడా వెరవకుండా ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టు అక్రమమంటూ నినదించారు.
యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనలో భాగంగా యువతకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు సీమెన్స్, డిజైన్‌టెక్ అనే సంస్థలతో గత చంద్రబాబు ప్రభుత్వం 3 వేల కోట్ల రూపాయల ఒప్పందం చేసుకుంది. 3 వేల కోట్ల రూపాయల్లో 10 శాతం ప్రభుత్వం ఇచ్చేలా.. మిగిలిన 90 శాతం సీమెన్స్ సంస్థ పెట్టుబడి పెట్టేలా ఒప్పందం చేసుకున్నారు. ఆ పది శాతం సొమ్ము ప్రభుత్వం చెల్లించినట్లుగా చూపించి వెనకేసుకున్నారనేది ప్రభుత్వ అభియోగం. దీనిపై సీమెన్స్ కంపెనీ అప్పట్లోనే స్పందించింది. జగన్ సర్కార్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం, అసత్యం అని కుండబద్దలు కొట్టింది. అంతే కాకుండా స్కిల్ డెవలప్ మెంట్ సంస్థలో అవినీతికి ఆస్కారమే లేదని అప్పట్లోనే సిమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్ విస్పష్టంగా చెప్పారు.
ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం అవినీతి ఆరోపణలు చేయడం తనకు ఆశ్చర్యంగా ఉందని.. స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో మనీల్యాండరింగ్ జరగలేదని అప్పుడే తేటతెల్లం చేశారు. విద్యార్థుల నైపుణ్యాలు మెరుగు పరచడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని వివరించిన ఆయన.. ప్రాజెక్టులో భాగంగా దేశంలో 200కు పైగా ల్యాబ్‌లను ప్రారంభించినట్లు వివరించారు. సిమెన్స్ కంపెనీతో అసలు అగ్రిమెంట్ జరగలేదని సీఐడీ చేస్తున్న ఆరోపణలను ఆయన అభూత కల్పనలుగా అభివర్ణించారు. ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయడం సులభమే కానీ, నిరూపించడం అసాధ్యమని చంద్రబాబు అరెస్టు సమయంలోనే ఆయన స్పష్టంగా చెప్పారు.
ఆయన మాటల్లో చెప్పాలంటే.. 2014లో రాష్ట్ర విభజన జరిగిన సమయంలో వ్యవసాయ రాష్ట్రంగా ఉన్న ఏపీలో ఐటీ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్ కోసం ముందుకు వచ్చింది. 2021 వరకు స్కిల్ డెవలప్‍మెంట్ ద్వారా 2.32 లక్షల మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు.. వారిలో చాలామంది మంచి ఉద్యోగాలలో కూడా స్థిరపడ్డారు. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టును గతంలో ఏపీఎస్ఎస్డీసీ ఎండీ కూడా మెచ్చుకుకున్నారు. అలాంటిది ఇప్పుడు అదే ఏపీఎస్ఎస్డీసీ ఇలాంటి ఆరోపణలు ఎలా చేస్తోందనేది అర్థం కావడం లేదు. ప్రస్తుతం స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు ఫలితాలు మన కళ్లముందే కనిపిస్తున్నాయి. అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చినపుడు సరైన విచారణ జరిపి కేసు పెట్టాల్సి ఉండగా.. కేసు పెట్టడం కోసమే ఆరోపణలు చేసినట్లుగా ప్రభుత్వం తీరు ఉంది. ఒక్క శిక్షణా కేంద్రాన్ని కూడా సందర్శించకుండా ఆరోపణలు నిజమని తేల్చేశారు.
ప్రభుత్వం మోపిన అవినీతి ఆరోపణల కేసు ఎలా ఉందంటే.. 'విచిత్రంగా హత్యకు గురైనట్లు చెబుతున్న వ్యక్తి బతికే ఉన్నాడు. ఆ వ్యక్తి బతికుండగానే హత్య జరిగిందని విచారణ చేస్తామంటున్నారు. స్కిల్ డెవలప్‍మెంట్ చాలా విజయవంతమైన ప్రాజెక్టు.. 2016లో కేంద్రం ఈ ప్రాజెక్టును విజయవంతమైన నమూనాగా కూడా ప్రకటించింది. ఇదే తరహా ప్రాజెక్టులు చాలా రాష్ట్రాల్లో అమలు చేశాం.. ఇప్పుడు కూడా చేస్తున్నాం. ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకు ఒక్క ఆధారం కూడా చూపలేదు. ఇలాంటి అవాస్తవ ఆరోపణలు చేయడం పలువురి జీవితాలపై ప్రభావం చూపుతుంది. రెండున్నర ఏళ్లుగా ఒక్క సాక్ష్యం చూపించలేకపోయారు. రెండున్నరేళ్లుగా రకరకాలుగా తమను ఇబ్బంది పెట్టారు. ప్రాజెక్టులో భాగంగా దేశంలో ఏర్పాటు చేసిన 200కు పైగా ల్యాబ్‌లు కనిపిస్తున్నా.. అగ్రిమెంట్ జరగలేదని ఆరోపించడం దారుణం. ఫలితాలు కళ్ళ ముందు కనిపిస్తున్నా ఇది స్కాంగా ప్రభుత్వం చెబుతుండటం విస్మయం కలిగిస్తోంది.
చంద్రబాబు అరెస్టు సమయంలో సీమెన్స్ మాజీ ఎండీ చెప్పిన మాటలన్నీ అక్షర సత్యాలని జగన్ ఘోర పరాజయం సందేహాలకు అతీతంగా తేల్చేసింది. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నిలిచిన సందర్భాన్ని పురస్కరించుకుని సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ న్యాయం గెలుస్తుందన్న తన విశ్వాసాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజం చేశారని ఎక్స్ ద్వారా పేర్కొన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లకు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరగాలని ఆకాంక్షించారు. ఆనసీమెన్స్ ప్రాజెక్టుపై వైకాపా ప్రభుత్వం బురద చల్లిన తీరుపై గతంలో లోకేశ్, బ్రాహ్మణులు చేసిన పోస్టులను ట్యాగ్ చేశారు.