జగన్ హయాంలో ‘అసలు స్వరూపా’నంద!
posted on Jun 17, 2024 @ 4:18PM
గత ఐదేళ్ల కాలంలో జగన్ హయంలో జరిగిన అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, దాడులు అన్నీ ఇన్నీ కాదు. జగన్ హయాంలో అక్రమార్జన, ప్రభుత్వ ధన దుర్వినియోగం ఏ స్థాయిలో జరిగిందో ఇప్పుడు అంటే జగన్ అధికారం కోల్పోయిన తరువాత ఒక్కటొక్కటిగా వెలుగులోనికి వస్తున్నాయి. నిబంధనలను తోసి రాజని జగన్ తన అస్మదీయులకు, అనుయాయులకు అప్పనంగా ప్రభుత్వ ధనాన్ని దోచి పెట్టేశారు. రాష్ట్రంలో రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చడానికి పైసా విదల్చని జగన్ ప్రభుత్వం తన అనుయాయులకు మాత్రం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచిపెట్టింది. అలా జగన్ హయాంలో ఆయాచితంగా కోట్ల రూపాయల మేర లబ్ధి పొందిన వారిలో, అనుచిత ప్రయోజనం పొందిన వారిలో స్వరూపానంద స్వామి కూడా ఉన్నారు.
ఔనుజగన్ హయాంలో ప్రజాధనంతో విలాస జీవితాలు గడిపిన వారిలో వైసీపీ నాయకులే కాదు.. వారితో పరిచయం, కొద్ది పాటి స్నేహం ఉన్నవారు కూడా ఉన్నారు. మంది సొమ్ము మంగళవారం ముప్పొద్దుల తిన్నారన్నట్లు.. జనం సొమ్ముతో జల్సాలు చేసుకున్న వారిలో స్వరూపానంద స్వామి ఒకరు. జగన్ హయాంలో ఆయనకు సకల సౌకర్యాలూ నడిచివచ్చేశాయి. జగన్ హయాంలో అర్హతలు లేకపోయినా స్వరూపానంద స్వామికి వై కేటగరి సెక్యూరిటీని ప్రభుత్వం కల్పించింది. పెందుర్తిలోని ఆయన పీఠం నలుగురు గన్ మెన్లతో పికెట్ ఏర్పాటు చేసింది. దీనిని పర్యవేక్షించడానికి అదనంగా ఒక ఎస్ ఐను నియమించింది. ఒక ప్రొటోకాల్ కారును సైతం కేటాయించింది.
స్వరూపానంద స్వామికి నిబంధనలకు వ్యతిరేకంగా చేసిన ఈ ఏర్పాట్ల కారణంగా ప్రభుత్వానికి నెలకు 18 నుంచి 24 లక్షల ఖర్చు అయ్యేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అధికారులు స్వరూపానంద స్వామికి భద్రతను తొలగించారనుకోండి అది వేరే సంగతి. ఇక తన భద్రతా సిబ్బందితో స్వరూపానంద దురుసుగా ప్రవర్శించేవారన్న ఆరోపణలు ఉన్నాయి5. స్వరూపానంద ఆగడాలు ఇంతటితో ఆగలేదు. ఆయన తిరుమల వెళ్లిన ప్రతి సారి ఘాట్ రోడ్డుపై తన వాహనాన్ని వేగంగా నడపాలని డ్రైవర్ ను ఆదేశించేవారు. అలిపిరి నుంచి తిరుమలకు పదిహేను నుంచి ఇరవై నిముషాలలో వెళ్లా4లని ఒత్తిడి తెచ్చేవారట.
నిబంధనల మేరకు అలిపిరి నుంచి తిరుమల వరకూ ఏ వాహనమైనా సరే 45 నిముషాల కంటే తక్కువ సమయంలో వెళ్లేందుకు వీలులేదు. కానీ ముఖ్యమంత్రి జగన్ కు గురువు అన్న ఒకే ఒక్క కారణంతో అధికారులు స్వరూపానంద ఆగడాలను చూసీ చూడనట్లు వదిలేసేవారు. స్వరూపానంద అరాచకాలపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.