చంద్రబాబు పోలవరం సందర్శన

పోలవరం ప్రాజెక్టు పనుల్లో కదలిక రాబోతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం (17-06-24) పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించనున్నారు. సోమవారం ఉదయం 11.00 గంటలకు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు చంద్రబాబు ఉండవల్లి నివాసం నుండి బయలుదేరుతారు. మధ్యాహ్నం 12.00 నుండి 1.30 వరకు  పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారు. మధ్యాహ్నం 02.05 నుండి 03.05 గంటల వరకు పోలవరం ప్రాజెక్టుపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 03.10 నుండి 03.40 వరకు గెస్ట్ హౌస్‌లో మీడియా సమావేశం జరుపుతారు. సాయంత్రం 04.00 లకు పోలవరం నుంచి ఉండవల్లికి చంద్రబాబు తిరుగు ప్రయాణమవుతారు.

జగన్ లిక్కర్ స్కామ్... 7 వేల కోట్లు!

ఇంతకాలం ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి చదివి ‘‘అమ్మో ఎంత పెద్ద స్కామో’’ అనుకుంటున్నాం కదా.. ఆ స్కామ్‌కి తాత, ముత్తాత లాంటి భారీ లిక్కర్ స్కామ్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. అసలు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన లిక్కర్ స్కామ్‌తో పోల్చితే, ఢిల్లీలో జరిగింది టుమ్రీ స్కామ్. అది వందల కోట్ల స్కామ్ మాత్రమే.. కానీ, మన జగన్ చేసిన స్కామ్ వాల్యూ 7 వేల కోట్ల కంటే ఎక్కువే. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మన మాజీ తెలంగాణ తల్లి కల్వకుంట్ల కవిత తీహార్ జైల్లో వున్న సంగతి తెలిసిందే. ఆ స్కామ్‌లో నిందితుడిగా సాక్షాత్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా తీహార్ జైల్లోనే వున్నారు. వందల కోట్ల స్కామ్ జరిగిందని భావిస్తున్న ఆ స్కామ్ వల్ల ముఖ్యమంత్రినే జైల్లో వేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన వేల కోట్ల లిక్కర్ స్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా వుండబోతోందో ఊహించుకోవచ్చు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ఏపీ సీఐడీ ఈ స్కామ్ మీద విచారణ ప్రారంభించింది. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా విధులు నిర్వర్తించి, జగన్‌కి వేల కోట్లు దోచిపెట్టిన వాసుదేవరెడ్డి ఇంటిలో మూడు రోజుల పాటు సోదా నిర్వహించింది. స్కామ్‌కి సంబంధించిన కీలక ఆధారాలను స్వాధీనం చేసుకుంది. అరెస్టు గండం నుంచి గట్టెక్కడానికి వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్ కోసం అప్లయ్ చేసుకుంటే, హైకోర్టు నో చెప్పింది. దాంతో వాసుదేవరెడ్డి అప్రూవర్‌గా మారిపోయి, ఈ స్కామ్ వెనుక ఎవరెవరు ఉన్నారన్నది పూస గుచ్చినట్టు చెప్పడానికి సిద్ధమయ్యారని, దానికోసం ప్రభుత్వ అధికారులతో రాయబారాలు కూడా నడిపారన్న వార్తలు వస్తున్నాయి. ఈ ఏపీ లిక్కర్ స్కామ్ మీద సీఐడీ పూర్తి స్థాయి విచారణ జరుపుతోంది. ఏపీలో ఇంతకాలం అమల్లో వున్న లిక్కర్ పాలసీ పెద్ద స్కామ్ అని సీఐడీ ప్రాథమికంగా తేల్చింది. దీంతో అరెస్టుల పర్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దేశ చరిత్రలో అతి పెద్ద లిక్కర్ స్కామ్‌కి తెర తీసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఈ కేసులో ఏ1గా నిలవనున్నారు. ఇప్పటికే చాలా కేసులలో ఏ1 హోదా పొందిన జగన్‌కి, మరో ఏ1 హోదా లభించనుంది. ఏది ఏమైనా, విషం లాంటి నాసిరకం మద్యంతో ఎంతోమంది ప్రాణాలు జగన్ ప్రభుత్వం తీసేసింది. ఆ ఉసురు జగన్‌కి తప్పకుండా తగిలి తీరుతుంది.

విడదల రజని.. రూటు మార్చేశారా?!

సైబరాబాద్ ఐటీ వనంలో చంద్రబాబు నాటిన మొక్కను నేను..అంటూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ఓ వెలుగు వెలిగిన మ‌హిళా నేత.. అవ‌స‌రాన్ని బ‌ట్టి రాజ‌కీయాల్లో త‌న పాత్ర‌ను మార్చుకోవ‌టం ఆమెకు వెన్న‌తో పెట్టిన విద్య‌. రాజ‌కీయల్లో అండ‌గా నిలిచిన నేత‌ల‌కే పంగ‌నామాలు పెట్ట‌డంలో ఆమె దిట్ట‌. ఇంత‌కీ ఆ మ‌హిళా నేత ఎవ‌రా అని అనుకుంటున్నారా? ఈ ఉపోద్ఘాతమే చాలు ఆమె ఎవరో ఇట్టే తెలిసిపోవడానికి.. ఆమె  మాజీ మంత్రి, విడ ద‌ల ర‌జ‌నీ. వైసీపీ అధికారంలోఉన్న ఐదేళ్ల కాలంలో విడద‌ల ర‌జ‌నీ పేరు ఏపీ రాజ‌కీయాల్లోనూ, సోష‌ల్ మీడియాలోనూ మారుమోగిపోయింది. 2019 ఎన్నిక‌ల్లో గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించిన విడద‌ల ర‌జ‌నీ.. ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క్యాబినెట్ లో చోటు ద‌క్కించుకున్నారు.   ఆమెకు కొద్దికాలంలోనే రాజ‌కీయాల్లో గొప్ప మ‌హిళానేత‌గా, రాష్ట్ర రాజ‌కీయాల్లో చ‌క్రంతిప్పే నేత‌గా ఎద‌గాల‌ని ఆరాటం మెండు‌. రాజ‌కీయాల్లో గొప్ప నేత‌గా, ప్ర‌జానేత‌గా ఎద‌గాలంటే నిత్యం ప్ర‌జ‌ల్లో ఉంటూ వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో కీల‌క‌భూమిక పోషించాలి. ఆయితే ఆమెకు ఆ తీరాక‌లేక‌పోయో, లేక షార్ట్ కట్ లు ఉండగా కష్టపడటం ఎందుకనుకున్నారో కానీ తన ఎదుగుదలకు ఆమె జనాలను కాకుండా సోష‌ల్ మీడియాను న‌మ్ముకున్నారు.   అయితే త‌న‌ను గెలిపించిన ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌టంతో నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లు   ఆమెను లైట్ తీసుకున్నారు.  2024 ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ అధిష్టానం స‌ర్వే నిర్వ‌హించ‌గా.. చిలక‌లూరి పేట నియోజ‌క‌వ‌ర్గంలో విడద‌ల‌ ర‌జ‌నీ ఓట‌మి ఖాయ‌మ‌ని స్ప‌ష్టమైంది. దీంతో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆమెను గుంటూరు వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గానికి పంపించారు. ఊహించ‌ని ప‌రిణామంతో కంగుతిన్న ఆమె.. జ‌గ‌న్ నిర్ణ‌యానికి ఎదురుచెబితే ఉన్న‌సీటుకూడా పోతుంద‌న్న భ‌యంతో గుంటూరు వెస్ట్ నుంచి వైసీపీ అభ్య‌ర్ధిగా బ‌రిలోకి దిగారు. తెలుగుదేశం అభ్యర్థి  గెల్లా మాధ‌విపై పోటీలో నిలిచారు. ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించేందుకు విడద‌ల ర‌జ‌నీ అండ్ ఆమె గ్యాంగ్ అనేక కుట్ర‌లు చేశారు. కానీ, గుంటూరు వెస్ట్ ప్ర‌జ‌లు ర‌జ‌నీ కుట్ర‌ల‌ను తిప్పికొట్టి 49,772 ఓట్ల మెజార్టీతో గెల్లా మాధ‌విని గెలిపించారు. ఎమ్మెల్యే అయిన తొలిసారే ర‌జ‌నికి వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రిప‌ద‌వి ద‌క్కిన‌ప్ప‌టికీ.. ఆ అవ‌కాశాన్ని ఆమె స‌ద్వినియోగం చేసుకోలేక పోయారు. మంత్రి ప‌ద‌విని ప్ర‌జ‌ల‌ కోసం కాకుండా అక్ర‌మార్జ‌న‌కు ఉప‌యోగించిన‌ట్లు ఆమెపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పుతో విడ ద‌ల ర‌జ‌నీ నోరు మూగ‌బోయింది. ఆమె మీడియా ముందుకు  వ‌చ్చేందుకు సాహ‌సం చేయ‌డం లేదు. ఇటీవ‌ల జ‌గ‌న్ తో వైసీపీ నేత‌ల భేటీలో ఆమె ప్ర‌త్య‌క్ష‌మయ్యారు.  జ‌గ‌న్ తో స‌మావేశం సంద‌ర్భంగా విడుద‌ల ర‌జ‌నీ త‌న ఆవేద‌న‌ను వ్య‌క్తంచేసిన‌ట్లు తెలుస్తోంది. త‌న‌కు చిల‌క‌లూరి పేట నియోక‌వ‌ర్గంనుంచే పోటీకి అవ‌కాశం ఇస్తే విజ‌యం సాధించేదానిన‌ని చెప్పుకొచ్చిన‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు వైసీపీ ఘోర ఓట‌మి త‌రువాత సోష‌ల్ మీడియాలో బూతుపురాణంతో రెచ్చిపోయే వైసీపీ సానుభూతిప‌రురాలు శ్రీ‌రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. విడద‌ల ర‌జ‌నీ లాంటి నేత‌ల‌ మూలంగానే వైసీపీ దారుణ ఓట‌మికి గురైంద‌ని  శ్రీరెడ్డి తనదైనశైలిలో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ర‌జ‌నీ లాంటి నేత‌ల‌కు పార్టీలో హైప్ ఇవ్వ‌వ‌ద్ద‌ని ముందు నుంచే చెబుతున్నా పార్టీ అధిష్టానం ప‌ట్టించుకోలేద‌ని, ఫ‌లితంగా ప్ర‌జ‌లు ఘోరంగా ఓడించారంటూ శ్రీ‌రెడ్డి వ్యాఖ్యానించడం గ‌మ‌నార్హం. ఎన్నిక‌ల ముందు, ఎన్నిక‌ల త‌రువాత ప‌రిణామాలు ఎలాఉన్నా.. ప్ర‌స్తుతం విడదల ర‌జ‌నీ వైసీపీలోనే ఉంటారా? అనే చ‌ర్చ ఏపీ రాజ‌కీయాల్లో జోరుగా సాగుతున్నది. పరిస్థితులను బట్టి త‌న పాత్ర‌ను మార్చుకోవ‌టంలో దిట్ట‌గా పేరున్న విడద‌ల ర‌జ‌నీ వైసీపీని వీడేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు పెద్ద ఎత్తున టాక్ న‌డుస్తోంది   విడద‌ల ర‌జ‌నీ త‌న రాజ‌కీయ జీవితాన్ని తెలుగుదేశం పార్టీతోనే  ప్రారంభించారు. కొద్దికాలానికి వైసీపీలో చేరి 2019లో ఎమ్మెల్యేగా గెలిచారు. అధికార ప‌క్షంలో ఉన్న‌ప్పుడు తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబుపై విడుద‌ల ర‌జ‌నీ తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. దీంతో ఆమెపై టీడీపీ శ్రేణులు ఆగ్ర‌హంతో ఉన్నాయి. ఎన్నిక‌ల ఫ‌లితాల‌ త‌రువాత తెలుగుదేశం కార్య‌క‌ర్త‌లు ఆమె పార్టీ కార్యాల‌యంపై రాళ్ల‌దాడి  చేశారు. తెలుగుదేశంలోకి తిరిగివ‌చ్చేందుకు ర‌జ‌నీకి అవ‌కాశం లేద‌నే చెప్పొచ్చు.  బీజేపీ, జ‌న‌సేన పార్టీల్లో ఏదోఒక పార్టీలో విడుద‌ల ర‌జ‌నీ చేర‌డం ఖాయ‌మ‌ని ఏపీ రాజ‌కీయాల్లో టాక్ న‌డుస్తోంది. బీజేపీలోకి వెళ్లేందుకు ఇప్ప‌టికే ఆమె ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టిన‌ట్లు స‌మాచారం. అయితే, త‌న భ‌ర్త కాపు సామాజిక వ‌ర్గం కావ‌టంతో.. కాపు పెద్ద‌ల స‌హ‌కారంతో జ‌న‌సేన పార్టీలో చేరేందుకు భార్యాభ‌ర్త‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు వైసీపీ శ్రేణుల్లో చ‌ర్చ‌జ‌రుగుతోంది. ఈ విష‌యం తెలుసుకున్న వైసీపీ పెద్ద‌లు పార్టీలో కీల‌క ప‌ద‌వి ఇస్తామ‌ని ర‌జ‌నీకి హామీ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. వైసీపీలోనే కొన‌సాగితే మంత్రి హోదాలో చేసిన అవినీతి అక్ర‌మాల‌ను అధికార పార్టీ వెలికితీసే అవ‌కాశం ఉంటుంద‌ని, అదే   జ‌రిగితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని ర‌జ‌నీ భావిస్తున్నార‌ట‌. అన్నిఅంశాల‌ను బేరీజు వేసుకొని తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పక్షాలైన జ‌న‌సేన లేదా బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు విడుద‌ల ర‌జ‌నీ  సిద్ధ‌మ‌వుతున్నార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతున్నది. సోష‌ల్ మీడియా స్టార్‌గా పేరుపొందిన విడుద‌ల‌ ర‌జ‌నీ ఏ పార్టీలోకి వెల్లారన్న అంశంపై స్ప‌ష్టత రావాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే.

ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు?

ఆంధ్రప్రదేశ్ శాసన మండలిని రద్దు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. మండలిని రద్దు చేయబోతున్నారని శనివారం నాడు అమరావతిలో వార్తలు హల్‌చల్ చేశాయి. ఆదివారం గానీ, సోమవారం గానీ మండలిని రద్దు చేసే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. 2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో కూడా శాసన మండలిని రద్దు చేయాలని అనుకున్నారు. కానీ, ఆ తర్వాత ఆ ఆలోచనను విరమించుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి శాసన మండలి రద్దు అంశం తెరమీదకి వచ్చింది. ఈ విషయంలో ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం వుంది.

వణికి చస్తున్న కొడాలి నాని!

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వున్న వైసీపీ నాయకులు ఒక అపోహలో మునిగిపోయి వణికిపోతున్నారు. మేం అధికారంలో వుండగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని చిత్రహింసలకి గురిచేశాం. నోటికి వచ్చినట్టు తిట్టాం. మర్డర్లు కూడా చేశాం. మళ్ళీ మా పార్టీయే అధికారంలోకి వస్తుందనే భ్రమల్లో బతికి ఇష్టమొచ్చినట్టు వాగి చచ్చాం. ఇప్పుడేమో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మా పరిస్థితి ఏమవుతుందో... మా జీవితాలు ఏమవుతాయో అని గడగడలాడుతున్నారు. ప్రభుత్వం వైపు నుంచి ఎప్పుడు ఏ నిర్ణయం వెలువడుతుందో, తమ పరిస్థితి ఖేల్ ఖతమ్ దుకాణ్ బంద్ అవుతుందో అని భయపడుతున్నారు. అసలు ఉన్న సిట్యుయేషన్ కంటే, వీళ్ళ భయం కొన్ని వందల రెట్లు ఎక్కువగా వుంది. వైసీపీ వాళ్ళుగానీ, వైసీపీ ప్రభుత్వం గానీ ప్రవర్తించినట్టుగా విచ్చలవిడిగా తెలుగుదేశం నాయకులుగానీ, తెలుగుదేశం ప్రభుత్వం కానీ ప్రవర్తించదు. ఏదైనా చట్ట ప్రకారమే వెళ్తుంది. వేధింపులు, కక్ష సాధింపులు, దాడులు, దూషణలు వుండవని, అలాంటి వాటిని తాను క్షమించనని తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ప్రకటించారు కూడా. అయినప్పటికీ వైసీపీ నాయకులు అల్లాడిపోతున్నారు. అలాంటి వారిలో ఫస్టు వరుసలో వున్న వ్యక్తి కొడాలి నాని. ఎన్నికల ఫలితాలు వెలువడక ముందు నుంచే ఆరోగ్యం అంతంత మాత్రంగా వున్న కొడాలి నాని, ఎన్నికల ఫలితాల తర్వాత ఒకసారి మీడియా ముందుకు వచ్చి ‘‘కాపాడండయ్యా నన్ను’’ అన్నట్టుగా బేలగా మాట్లాడి వెళ్ళిపోయాడు. ఒకరోజు జగన్ దగ్గరకి వెళ్ళి చేతులు కట్టుకుని నిల్చున్నాడు. ఆ తర్వాత మనిషి ఇల్లు దాటి బయటకి రావడం లేదు. ఆయన అనుచరులే అప్పుడప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి  పరామర్శించి వస్తున్నారు. కొడాలి నాని మానసికంగా బాగా క్రుంగిపోయినట్టు తెలుస్తోంది. టెన్షన్‌తో భయపడిపోతున్నట్టు తెలుస్తోంది. రెండ్రోజుల క్రితం తన దగ్గరకి వెళ్ళిన కొంతమంది పార్టీ నాయకులతో కొడాలి నాని, చాలా విరక్తిగా మాట్లాడారని సమాచారం. కూటమి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు తనకు ఎలాంటి థ్రెట్ వున్నట్టు తెలియకపోయినప్పటికీ, విపరీతమైన ఆందోళనకు గురవుతున్నానని చెప్పాడట. ఏ నిమిషంలో ఏ కేసు మీద పోలీసులు తన ఇంటి తలుపు తడతారో, ఏ నిమిషంలో ఇంటి మీదకి ఎవరు దాడి చేస్తారో అని భయంగా అనిపిస్తోందని చెప్పుకున్నాడట. ఈ టెన్షన్ తాను భరించలేకపోతున్నానని, చచ్చిపోతే ఏ గొడవా వుండదని అన్నాడట. కొడాలి నాని నోటి వెంట ‘చచ్చిపోతే’ అనే మాట వచ్చేసరికి ఆయన అనుచరులు ఒక్కసారిగా షాకైపోయారట. నువ్వలా మాట్లాడకన్నా, మాకు ధైర్యం చెప్పాల్సిన నువ్వే ఇలా మాట్లాడితే, ఇక మా పరిస్థితి ఏమిటని బాధపడ్డారట. దాంతో కొడాలి నాని ఏదో మాటవరసకి అన్నాలే.. చావడమంటే అంత ఈజీనా అని వాళ్ళని శాంతపరిచాడట. తన అనుచరులను అయితే కొడాలి నాని శాంతపరిచాడుగానీ, తాను మాత్రం అశాంతిలో మునిగితేలుతున్నట్టు సమాచారం.

పవన్ కళ్యాణ్‌కి వదినమ్మ సురేఖ బహుమతి!!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించడంతోపాటు ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా పొందిన పవన్ కళ్యాణ్‌కి అతని వదినమ్మ, చిరంజీవి భార్య సురేఖ ఒక గొప్ప బహుమతిని ఇచ్చారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చిరంజీవి ఇంటికి పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు సురేఖ ఆయనకు అత్యంత ఖరీదైన మోంట్‌బ్లాంక్ పెన్నును బహుమతిగా ఇచ్చారు. సురేఖ స్వయంగా పెన్నును పవన్ కళ్యాణ్ జేబులో పెట్టగా, ఆయన ఎంతో సంతోషించారు. అప్పటికే పవన్ కళ్యాణ్ దగ్గర వున్న పెన్నును తీసి చూపించారు. ‘ఇది కూడా అట్టిపెట్టుకో’ అని సురేఖ అన్నారు. ఇప్పుడు ఒక వైపు నుంచి చిరంజీవి, మరోవైపు నుంచి పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా వచ్చారు. ఈ నలుగురూ కలసి ఒక మెమరబుల్ ఫొటో దిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘‘తెలుగు ప్రజల ఆకాంక్షల్ని నిజం చేస్తావని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ వదిన, అన్నయ్య’’ అంటూ చిరంజీవి వీడియోను ముగించారు. పవన్ కళ్యాణ్‌కి సురేఖ్ అందించిన మోంట్‌బ్లాంక్ పెన్ను ఖరీదు ఎంత వుంటుందో తెలుసా... దాదాపు 2 లక్షల 75 వేల రూపాయలు.

ఎవడబ్బ సొమ్మని కులికేవు జగన్మోహనా!

ఆ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అతని పక్కనే వుండే వాళ్ళెవరైనా తన ముఖ్యమంత్రి పదవి ఊడిపోయిందని చెప్పండ్రా.. తానింకా ముఖ్యమంత్రి పదవిలోనే వున్నానని అయ్యగారు భ్రమపడుతున్నట్టున్నారు. అందుకే, ముఖ్యమంత్రిగా ఏయే బిల్డప్పులు ఇచ్చాడో, పదవి ఊడిపోయి ఇన్ని రో్జులైనా తగ్గేదేలే అంటూ సదరు బిల్డప్పుని కంటిన్యూ చేస్తున్నారు. అయ్యగారు ముఖ్యమంత్రిగా వెలగబెట్టినప్పుడు క్యాంపు కార్యాలయం దగ్గర జనం డబ్బుతో నిర్మించిన రోడ్డులో అప్పట్లో వేరేవాళ్ళు ఎవర్నీ అనుమతించేవారు కాదు. ఇప్పుడు పదవి ఊడిపోయిన తర్వాత కూడా ఆ రోడ్డు మీద ఎవర్నీ రానివ్వడం లేదు. జగన్ ఆదేశాలతో జగన్ సెక్యూరిటీవాళ్ళు ఆ రోడ్డుని ప్రైవేట్ రోడ్డుగా మార్చేశారు. 5 కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన రోడ్డు ఇది. ఈ రోడ్డులోకి ఎవర్నీ రానివ్వకపోవడం వల్ల జనం ఇబ్బంది పడుతున్నారు.  అలాగే జగన్ క్యాంపు కార్యాలయంలో ప్రజాధనం వినియోగించి భారీగా నిర్మాణాలు చేపట్టారు. ఆ భవనం ప్రైవేట్ కట్టడం అయినప్పటికీ భద్రత పేరుతో జనం సొమ్ముతో ఇంటి చుట్టూ ప్రహరీ మీద 20 అడుగుల ఎత్తులో ఐరన్ ఫెన్సింగ్, ఇంకా సోలార్ ఫెన్సింగ్ దాదాపు మూడు కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేశారు. జగన్ క్యాంపు కార్యాలయంలో ప్రస్తుతం వినియోగిస్తున్న ఫర్నిచర్, ఇతర సామాగ్రి మొత్తం ప్రజల సొమ్ముతో కొన్నవే. గతంలో ఈ భవనాన్ని సీఎం క్యాంపు కార్యాలయం అని ప్రకటించిన తర్వాత హైదరాబాద్ సచివాలయం హెచ్ బ్లాక్‌లో వున్న యూపీఎస్, కంప్యూటర్లను అక్కడి నుంచి తరలించి ఇక్కడ పెట్టారు. అయితే జగన్ మాజీ ముఖ్యమంత్రి  అయిన తర్వాత, క్యాంపు కార్యాలయాన్ని పార్టీ ఆఫీసుగా మార్చుకున్న తర్వాత జనం సొమ్ముతో కొన్న ఫర్నిచర్, కంప్యూటర్లు మొత్తాన్ని సొంత పార్టీ వ్యవహారాలకు ఉపయోగించుకుంటున్నారు.  గతంలో శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రభుత్వానికి చెందిన రెండు మూడు కంప్యూటర్ల లాంటివి ప్రభుత్వానికి తిరిగి ఇవ్వలేదని  ఆయన మీద కేసు పెట్టి, ఆయన్ని మానసికంగా వేధించి, మానసికంగా క్రుంగిపోయేలా చేసి, ఆత్మహత్య చేసుకునేట్టు చేసిన ఈ జగన్ రాక్షసుడు.. ఇప్పుడు మాత్రం తన పదవి ఊడిపోయినా ప్రభుత్వ సామగ్రిని తిరిగి ఇవ్వకుండా తన తాత, తండ్రి సంపాదించిన సొమ్ములా చక్కగా వాడుకుంటున్నారు. మరి అప్పట్లో కోడెల శివప్రసాదరావు మీద కేసులు పెట్టి అంతగా హింసించారే.. ఇప్పుడు ఈ జగన్ మీద ఎన్ని కేసులు పెట్టాలి? ఈ ఒక్క నేరం మీదే ఎలాంటి శిక్ష విధించాలి? కరెక్ట్.గా దొరకాలేగానీ ఈ జగన్ అంతకు అంత అనుభవించడం ఖాయం!

ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు పవన్ కళ్యాణ్ తొలి లేఖ!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో కొణిదెల పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు మొదటి లేఖ రాశారు. ఈ లేఖలో తన మనసులోని ఆలోచలను ప్రజలతో పంచుకున్నారు. రాష్ట్ర ప్రజలకు మేలైన సేవలు అందించే భాగ్యం కలిగింది   * ప్రజల సమస్యలు స్వయంగా చూశాను * గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, తాగు నీరు అందించడంపై ప్రత్యేక దృష్టి.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నేను నిర్వర్తించబోయే శాఖలు నా మనసుకు, జనసేన మూల సిద్ధాంతాలకు చాలా దగ్గరగా ఉన్నాయి. ఈ బాధ్యతలు  సంతోషం కలిగిస్తున్నాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక.. ఈ శాఖలన్నీ ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడేవి, ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరకు చేర్చేవిగా నేను భావిస్తున్నాను. 2008 నుంచి ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్న నేను ఉభయ తెలుగు రాష్ట్రాలలో విస్తృతంగా పర్యటించి ఉన్నాను. 2019 ఎన్నికలకు ముందు ప్రజా పోరాట యాత్రను ప్రజల సమస్యల అవగాహన, మౌలిక సదుపాయాల కల్పనపై అధ్యయనం కోసమే తలపెట్టాను. చాలా లోతుగా ఆనాడు స్వయంగా పరిశీలన జరిపాను. ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రతీ ప్రాంత సమస్యలపై బలమైన అవగాహన ఏర్పడింది.  * గ్రామాల్లో సమస్యలు కళ్ళారా చూశాను  విశాఖ మన్యంలో పర్యటిస్తున్నపుడు కురిడి అనే గిరిజన గ్రామానికి వెళ్ళాను. ఆ గ్రామ ఆడపడుచులు గుక్కెడు నీళ్ళ కోసం తాము పడుతున్న అవస్థలను చెబుతూ, అక్కడి బావిలో కలుషితమైపోయిన నీటిని చూపించారు. ఆ ప్రాంతంలోనే తోటవలస గ్రామానికి వెళ్లినప్పుడు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఆ ఊరివాళ్ళు వివరించారు. గోదావరి జిల్లాలకు వెళ్లినప్పుడు పలు మత్యకార గ్రామాలవాసులు తాగు నీటి కోసం ఎన్ని ప్రయాసలుపడుతున్నామో చెప్పారు. గ్రామీణ అభివృద్ధి - దేశాభివృద్ధి అనే నినాదం నామమాత్రంగా మిగిలిపోవడాన్ని గమనించాను. గుక్కెడు మంచి నీరు కోసం మైళ్ళ దూరం వెళ్లి ప్రయాసతో బిందెడు నీరు తెచ్చుకుంటున్న ఆడపడుచుల అవస్థలు చూసాను. కాలుష్యమయమైన జల వనరులనే తాగు నీరుగా తప్పని పరిస్థితులలో  వాడుకుంటున్న పల్లెవాసులను గమనించాను. గతేడాది గ్రామ సర్పంచులతో జనసేన కేంద్ర కార్యాలయంలో చర్చాగోష్టి నిర్వహించాము. పార్టీలకు అతీతంగా వందలమంది సర్పంచులు పాల్గొన్నారు.  నాటి రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల నిధులను ఏ విధంగా మళ్లించేసిందీ వివరిస్తూ తాము నిధులు, అధికారాలు లేక ఏ విధంగా చేష్టలుడిగిపోయి ఉన్నామో చెప్పారు. స్థానిక సంస్థల చట్టాలు, విధులు, నిధుల వినియోగంపై సాధికారత కలిగిన శ్రీ చెల్లప్ప గారు, డా.ఈడిగ వెంకటేష్ గారు లాంటి మేధావులు, ఆచార్యులతో కూడా ఆ రోజు చర్చించాము. ఉపాధి హామీ నిధులను సద్వినియోగం చేసుకోవడం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జల్ జీవన్ మిషన్ ద్వారా పల్లెలకు రక్షిత తాగు నీరు అందించి ప్రజల దాహార్తి తీర్చేందుకు కృషి చేస్తాను. * పర్యావరణం పార్టీ సిద్ధాంతాల్లో భాగం  ‘పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం’ అనేది జనసేన మూల సిద్ధాంతాల్లో ఒకటి అని ప్రతి ఒక్కరికీ తెలుసు. ఒక పక్క పారిశ్రామిక అభివృద్ధి వేగంగా జరగాలి. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా అందాలి అని నేను గట్టిగా కోరుకుంటున్నాను. అయితే ఆ అభివృద్ధి పర్యావరణానికి హితంగా జరగాలి. ఆధునిక సాంకేతికత మేళవించిన సురక్షితమైన పారిశ్రామిక అభివృద్ధి ఈ సమాజానికి అవసరం. విశాఖ ఎల్.జి. పాలిమర్స్ ప్రమాదాన్ని మనం ఏనాడూ మరచిపోలేము. ప్రజల ఆరోగ్యాలను హరించివేయకుండా పరిశ్రమలు ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకునేలా పరిశ్రమలు ముందుకు వెళ్ళడానికి చేయూతనిస్తాము. భూ తాపాన్ని తగ్గించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు చేస్తున్న ప్రయత్నాలకు బాసటగా నిలుస్తాము. గ్రీన్ ఎనర్జీని ఉపయోగించుకునేలా పరిశ్రమలను ప్రోత్సహిస్తాము. * అటవీ సంపదను కాపాడుకుందాము వృక్షో రక్షతి రక్షితః అనే సూక్తి నా మదిలో ఎప్పుడూ మారుమోగుతుంటుంది. ఒక్క వృక్షాన్ని రక్షించుకుంటేనే మానవ కోటికి ఎంతో మేలు కలుగుతున్నప్పుడు.. మరి లక్షలాది వృక్షాలను తన గర్భాన నిలుపుకున్న అడవి తల్లిని కంటికి రెప్పలా కాపాడుకుంటే ఎంతో మేలు కలుగుతుంది. అడవుల విధ్వంసమే కరువు కాటకాలకు హేతువు. అటువంటి అడవులను కంటికి రెప్పలా కాపాడతాము. ఎర్రచందనం, అటవీ సంపద అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపుతాము. అడవుల వినాశనానికి పాల్పడినా, ప్రయత్నించినా ఎంతటి వారైనా సరే కటకటాల వెనక్కు వెళ్ళవలసిందే. సామాజిక వనాలను పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. తీర ప్రాంతాల్లో మడ అడవుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. శాస్త్ర, సాంకేతిక విభాగాలు మానవాళి శ్రేయస్సుకు, లోక కళ్యాణానికి అత్యంత అవశ్యం. * ప్రజా పంపిణీ, ఆహార భద్రతపై ప్రత్యేక దృష్టి అదే విధంగా జనసేన పార్టీ నుంచి మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించబోయే శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, శ్రీ కందుల దుర్గేష్ గార్లకు ప్రజా ప్రయోజనం కలిగిన, అభివృద్ధి సంబంధిత శాఖలు అప్పగించారు.  పౌరసరఫరాలు, టూరిజం, సినిమాటోగ్రఫీ శాఖలు  కేటాయించడం సంతోషంగా ఉంది.  శ్రీ నాదెండ్ల మనోహర్ గారు నిర్వర్తించే ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తాము. ప్రజా పంపిణీ వ్యవస్థను అభివృద్ధి చేస్తాము. రేషన్ కార్డుదార్లకు నిత్యావసరాలు పంపిణీపై ప్రత్యేక దృష్టిపెడతాము. అదే విధంగా రైతుల నుంచి పంటల కొనుగోలు విధానం, వారికి సొమ్ములు చెల్లించడంలో మెరుగైన విధానాలు అవలంబిస్తాము. రాష్ట్రంలో వరి రైతులకు పంట కొనుగోలు డబ్బులు అందించడంలో గత ప్రభుత్వం అనుసరించిన నిర్లక్ష్య పోకడలు, రైతుల వేదనలు స్వయంగా చూశాను. ఆ పరిస్థితులు రానీయము. * పర్యాటక ప్రాజెక్టుల ద్వారా ఉపాధి అవకాశాలు రాష్ట్రంలో పర్యాటకం అభివృద్ధి జరిగితే ఉపాధి అవకాశాలు చాలా పెరుగుతాయి. ఆహ్లాదకర పర్యాటకంతోపాటు, ధార్మిక, భక్తి పర్యాటకం అభివృద్ధిపై దృష్టి పెడతాము. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. పర్యాటక కేంద్రాలలో మెరుగైన వసతులు కల్పించడంతోపాటు రాష్ట్రానికి ఒక బ్రాండ్ కల్పించడంపై దృష్టిపెట్టాలి. అదే విధంగా సినిమా రంగానికి రాష్ట్రంలో ప్రోత్సాహకరం, స్నేహపూరిత వాతావరణం తీసుకువస్తాము. చిత్రీకరణ ప్రాంతాలలో సినీ పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు ఈ రంగంలో రాష్ట్ర యువతకు ఉపాధి దక్కేలా చూస్తాము.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటుగావడానికి ఎనలేని సహకారం అందించిన ప్రధానమంత్రి  శ్రీ నరేంద్ర మోడీ గారికి, ప్రజలతో  నేరుగా సంబంధ భాందవ్యాలు కలిగిన మంత్రిత్వ శాఖలు కేటాయించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.  జనసేన పార్టీకి కేటాయించిన శాఖల ద్వారా చిత్తశుద్ధితో ప్రజా సేవలు అందిస్తాము. నేను నిర్వర్తించబోయే శాఖలపై మరింత లోతైన అధ్యయనం జరిపి ప్రజలకు అత్యంత మేలైన ఫలాలను అందించడానికి శక్తి వంచన లేని కృషి చేస్తానని అయిదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ వాసులకు సవినయంగా తెలియచేస్తున్నాను. (పవన్ కళ్యాణ్)   ఉప ముఖ్యమంత్రి  పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి  పర్యావరణం, అటవీ శాఖల మంత్రి

పుంగనూరులో పెద్దిరెడ్డి సీన్ రివర్స్!

పుంగనూరులో పెద్దరెడ్డి సీన్ రివర్స్ అయ్యింది. ఇటీవలి ఎన్నికలలో పుంగనూరు నుంచి చావు తప్పి కన్నులొట్టబోయిన చంద్రంగా విజయం సాధించినా నియోజకవర్గంపై ఆయన పట్టు మాత్రం పూర్తిగా సడలిపోయింది. నియోజకవర్గంలోకి అడుగుకూడా పెట్టలేని దయనీయ స్థితిని ఆయన ఎదుర్కొంటున్నారు. ఓడలు బళ్లు బళ్లు ఓడలు అవుతాయంటారు. పుంగనూరులో తనకు తిరుగులేదు అన్నట్లు వ్యవహరించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డికి పది రోజుల్లో సీన్ రివర్స్ అయ్యింది. సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టే పరిస్థితి లేక చివరి నిముషంలో తన పుంగనూరు పర్యటన రద్దు చేసుకోవలసి వచ్చింది. గత ఐదేళ్లుగా పుంగనూరు నియోజకవర్గంలో... ఒక్క పుంగనూరు అనేమిటి మొత్తం చిత్తూరు జిల్లాలోనే తిరుగులేని ఆధిపత్యం చెలాయించారు.    అయితే ఒక్క పది రోజుల్లో ఆయన పరిస్ధితి తల్లకిందులైంది. పూలమ్మిన చోటే కట్టెలమ్ముకునే పరిస్థితికి దిగజారిపోయారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. జగన్ హయాంలో ఐదేళ్లూ మంత్రిగా కొనసాగిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాలో తాను చెప్పిందే వేదం అన్నట్లుగా పెత్తనం చెలాయించారు. స్థాయి మరిచి  పెద్ద పెద్ద సవాళ్లు విసిరారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబును ఓడిస్తానంటూ ప్రగల్భాలు పలికారు. కుప్పం మునిసిపాలిటీ ఎన్నికలలో దౌర్జన్యాలు, డబ్బుతో వైసీపీకి విజయం దక్కేలా చేశారు. దీంతో జగన్ వైనాట్ కుప్పం అంటూ విర్రవీగారు. సీన్ కట్ చేస్తే తాజా ఎన్నికలలో కుప్పం నుంచి చంద్రబాబునాయుడు 48వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2019 ఎన్నికలలో ఆయనకు వచ్చిన మెజారిటీ కంటే 18 వేల ఓట్లు మెజారిటీ అధికంగా వచ్చింది. అదే సమయంలో పుంగనూరు నుంచి పోటీ చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం కేవలం 6, 619 ఓట్ల మెజారిటీతో చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా విజయం సాధించారు. ఇక ఆయన కుమారుడు మిథున్ రెడ్డి రాజంపేట లోక్ సభ నియోజకవర్గం నుంచి 76వేల 71 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఆ విజయం ఏమీ ఆయన గొప్పతనం కాదు. రాజంపేట నుంచి తెలుగుదేశం అభ్యర్థి పోటీ చేసి ఉంటే మిథున్ రెడ్డి గెలిచే అవకాశమే ఉండేది కాదు. కానీ పొత్తులో భాగంగా రాజంపేట నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేయడంతో అసెంబ్లీకి తెలుగుదేశం పార్టీకి ఓటేసిన పలువురు లోక్ సభ నియోజకవర్గం దగ్గరకు వచ్చేసరికి క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు. దీంతో మిథన్ రెడ్డి గట్టెక్కారు.  ఇక విషయానికి వస్తే... చంద్రబాబునాయుడిని కుప్పంలో అడుగుపెట్టనీయను అని విర్రవీగిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు తన సొంత నియోజకవర్గమైన పుంగనూరులో అడుగుపెట్టలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. శనివారం (జూన్ 15) ఆయన పుంగనూరులో పర్యటించాల్సి ఉండగా తెలుగుదేశం శ్రేణులు రోడ్ల మీదకు వచ్చి గో బ్యాక్ పెద్దిరెడ్డి అన్న నినాదాలతో ఆందోళనకు దిగారు. దీంతో చివరి నిముషంలో పెద్దిరెడ్డి తన పుంగనూరు పర్యటన రద్దు చేసుకోవలసి వచ్చింది.  

వయనాడ్‌లో ప్రియాంక ఓడిపోతారా?

కేరళలోని వయనాడ్ పార్లెమెంట్ నియోజకవర్గం నుంచి ప్రియాంకా వధేరా ఉప ఎన్నికలో పోటీ చేయబోతున్నారట. ఇది చాలా అద్భుతమైన విషయమని, ప్రియాంకా వధేరా గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గం ఎక్కడికో వెళ్ళిపోతుందని, అందువల్ల వయనాడ్ ప్రజలందరూ ఎగిరి గంతులు వేసి పండగ చేసుకోవాలి అన్నట్టుగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఇంతకీ వయనాడ్ నియోజకవర్గానికి ఎందుకు ఉప ఎన్నిక రాబోతోంది? ఎందుకంటే, ఇక్కడ నుంచి ఎన్నికైన రాహుల్ గాంధీ తన పదవికి రాజీనామా చేయబోతున్నారు కాబట్టి. రాహుల్ గాంధీ ఈసారి ఎన్నికలలో తన కుటుంబ నియోజకవర్గమైన ఉత్తర్ ప్రదేశ్‌లోని రాయబరేలి నుంచి కూడా పోటీ చేసి గెలిచారు. గత ఎలక్షన్స్.లో అమేథీ నుంచి ఓడిపోయినట్టుగానే  ఇక్కడ కూడా ఓడిపోతానేమోనే భయంతో సేఫ్ సైడ్‌గా తనకు గతంలో్ విజయాన్ని ఇచ్చిన వయనాడ్ నియోజకవర్గంలో కూడా పోటీ చేశారు. రెండు నియోజకవర్గాల్లో పో్టీ చేసేవారిని ఓడించాలనే జ్ఞానం తెలంగాణలోని కామారెడ్డి ఓటర్లకు బాగా వుంది. అందుకే, కామారెడ్డిని తమ రెండో స్థానంగా ఎంచుకుని పోటీ చేసిన కేసీఆర్, రేవంత్‌రెడ్డిని ఓడించారు. ఈపాటి జ్ఞానం లేకపోవడం వల్ల వయనాడ్ నియోజకవర్గ ప్రజలు రాహుల్ గాంధీని రెండోసారి కూడా గెలిపించారు. అలా గెలిపించిన వయనాడ్‌కి బైబై చెప్పేసి రాహుల్ గాంధీ రాయబరేలి ఎంపీగానే మిగలనున్నారు. వయనాడ్ ప్రజలు ఫీలవకుండా వుండటం కోసం ఉప ఎన్నికలో ఇక్కడ నుంచి ప్రియాంకా రాబర్ట్ వధేరాని నిలపాలని అనుకుంటున్నారు.  ఇంతకీ రాహుల్ గాంధీ సేఫ్ సైడ్‌గా పోటీ చేయడానికి వయనాడ్ నియోజకవర్గాన్నే ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకంటే, వయనాడ్ నియోజకవర్గం ఆంగ్లో ఇండియన్ల ప్రభావం వున్న నియోజకవర్గం. ఇక్కడ ఎక్కువశాతం క్రైస్తవులే వుంటారు. తల్లి వైపు నుంచి క్రైస్తవం వున్న రాహుల్ గాంధీకి ఇంతకంటే సేఫ్ నియోజకవర్గం మరొకటి వుంటుందా?  రాహుల్ గాంధీని కష్టకాలంలో ఆదుకున్న నియోజకవర్గం వయనాడ్. అలాంటి ఈ నియోజకవర్గం ఒక్కదాంట్లోనే ఈసారి రాహుల్ గాంధీ పోటీ చేసి వుండవచ్చు కదా? అదనంగా రాయబరేలి నుంచి కూడా ఎందుకు పోటీ చేశారు? వయనాడ్‌లో ఓడిపోతానని భయపడ్డారా? అంత నమ్మకంగా తనను గెలిపించిన వయనాడ్ మీద రాహుల్ గాంధీకి ఎందుకు అంత అపనమ్మకం కలిగింది? అలాంటి అపనమ్మకం ఏదో కలిగినప్పుడు, వయనాడ్‌ని వదిలేసి తన కుటుంబ నియోజకవర్గం రాయబరేలి ఒక్కదాంట్లోనే పోటీ చేసినట్టయితే, వయనాడ్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఖర్చుల ప్రజాధనం వృధా కాకుండా వుండేది కదా? వయనాడ్‌ నియోజకవర్గం  ఆటలో అరటిపండు నియోజకవర్గంలాగా దేశం ముందు నిలబడి వుండేది కాదు కదా?  ఇంతా చేసి, ఇప్పుడు మళ్ళీ వయనాడ్ నియోజకవర్గానికి ప్రియాంకని పంపించాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటోంది. తమను అవమానించిన రాహుల్ గాంధీ కుటుంబ సభ్యురాలినే మరోసారి గెలిపించాల్సిన అవసరం వయనాడ్ నియోజకవర్గానికి ఏముంది? రాహుల్ గాంధీ చేసిన పనికి మనసులో కోపం పెట్టుకున్న వయనాడ్ ఓటర్లు ఈసారి ఉప ఎన్నికలో ప్రియాంకని ఓడించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

ఇదో జగన్మాయ.. ప్రభుత్వ ఖజానా నుంచే ఐప్యాక్ కు చెల్లింపులు?!

వైసీపీకి రాజకీయ వ్యూహాలు అందించిన ఐప్యాక్ కు చెల్లింపులు ఎక్కడ నుంచి జరిగాయి అన్న విషయంలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఐ ప్యాక్ కు చెల్లించిన ప్రతి పైసా కూడా ప్రభుత్వం నుంచే వెళ్లిందనీ, ఆ విధంగా జగన్ సర్కార్ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిందన్న విమర్శలు, ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.   ఈ విషయంపై నిజాల నిగ్టు తీయడానికి  చంద్రబాబు సర్కార్ సమాయత్తమైందని తెలుస్తోంది. ఐప్యాక్ కు వైసీపీ చెల్లింపులపై ఓ ప్రత్యేక బృందం ఆరా తీస్తున్నట్లు చెబుతున్నారు. 2019, 2024 ఎన్నికలలో ఐ ప్యాక్  వైసీపీకి రాజకీయ, ఎన్నికల వ్యూహాలను అందజేసిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికలలో ఐప్యాక్ కు జగన్ దాదాపు 350 కోట్ల రూపాయలు చెల్లించినట్లు సమాచారం. దానిని బట్టి 2024లో ఐప్యాక్ కు అంతకు మించి చెల్లింపులు జరిగి ఉంటాయన్నది పరిశీలకుల విశ్లేషణ.  జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత  అధికారం కోల్పోయే వరకూ అంటే 2019 నుంచి 2024 వరకూ ఐప్యాక్ ప్రభుత్వంలో భాగంగా మారిపోయింది.   విశ్వసనీయ సమాచారం మేరకు జగన్  ఐప్యాక్ డైరక్టర్లతో బినామీ కంపెనీలు పెట్టించి వాటికి కొన్ని పాంప్లెట్లు.. ఇతర సామాగ్రి కాంట్రాక్టులు వాటికి ప్రభుత్వం ద్వారా చెల్లింపులు చేశారు.  దీంతో ఐప్యాక్ ద్వారా కొన్ని వందల మందిని రిక్రూట్ చేసుకుని ఎమ్మెల్యేలపై నిఘాకు నియోగించారు. వీరందరికీ వివిధమార్గాల ద్వారా ప్రభుత్వమే వేతనాలు ఇచ్చింది. ఇప్పుడు ఈ లెక్కలన్నీ తేల్చి బండారం బయటపెట్టాలని తెలుగుదేశం ప్రభుత్వం భావిస్తోంది.  ఇందుకోసం ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పటు చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఐప్యాక్ చెల్లింపుల బాగోతాన్ని బట్టబయలు చేసే దిశగా తెలుగుదేశం సర్కార్ అడుగులు వేస్తోంది.  

వైసీపీవి సంతాపసభలు!

చరిత్ర కనీవినీ ఎరుగని ఓటమిని చవి చూసిన వైసీపీ ఇప్పుడు ముఖం కాపాడుకోవడానికి నానా తంటాలూ పడుతోంది. ఫలితాల వెల్లడి తరువాత కొన్ని రోజుల పాటు వైసీపీ కార్యాలయంలో శ్మసాన నిశ్శబ్దం తాండవించింది. ఆ పార్టీ నాయకుల నోటి వెంట ఒక్క మాట కూడా రాలేదు. తరువాత ఎలాగో తమాయించుకుని ఒక్కొక్కరుగా బయటకు వచ్చి ఎవరికి వారు పార్టీ ఓటమికి కుంటి సాకులు చెబుతూ వచ్చారు. ఇప్పుడు ఆ పని జగన్ కూడా మొదలెట్టేశారు. ప్రజలకు దేశంలో ఎక్కడా లేని విధంగా మేళ్లు చేసినా వారు మనను తిరస్కరించారని పార్టీ రాజ్యసభ, లోక్ సభ సభ్యులతో సమావేశంలో చెప్పారు. అదే సమయంలో తమకు పార్లమెంటులో బలం ఉందనీ, సొంతంగా ప్రభుత్వాన్ని నడిపే బలం లేని  లేని బీజేపీకి  పార్లమెంటులో మన అండకావాలనీ పార్టీ సభ్యులకు ధైర్యం నూరిపోయడానికి ప్రయత్నించారు. ప్రజలు తప్పు తెలుసుకుని త్వరలో మనకు మద్దతుగా నిలుస్తారన్న ధీమా కూడా వ్యక్తం చేశారు. ఏపీలో ప్రస్తుతం తెలుగుదేశం, జనసేన, బీజేపీ హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారన్న జగన్ పార్టీ సభ్యులు ధైర్యంగా ఉండాలనీ మంచి రోజులు ముందున్నాయని చెప్పుకొచ్చారు. అయితే జగన్ వ్యాఖ్యలపై సెటైర్లు గుప్పించారు. జగన్ కు ఆయన పార్టీ సభ్యులకూ దిమ్మదిరిగేలా జగన్ ఇటీవలి భేటీలను జనం లేని సంతాప సభలుగా అభివర్ణించారు. ఇటీవలి ఎన్నికలలో జనం జగన్ పార్టీని 11 స్థానాలకే పరిమితం చేసి ప్రతిపక్ష హోదాకు కూడా అర్హత లేని పార్టీగా తేల్చేసినా వైసీపీ నేతలకు ఇంకా జ్ణానోదయం కలగలేదని ఎద్దేవా చేశారు. మొత్తం మీద జగన్ ఇటీవలి కాలంలో పార్టీ నేతలతో నిర్వహిస్తున్న సమావేశాలను సంతాప సభలుగా నెటిజనులు అభివర్ణిస్తున్నారు.  

రెండున్నరేళ్లలో అమరావతి పూర్తి!

అమరావతి పనులు పరుగులు పెట్టనున్నాయి. ప్రపంచ స్థాయి రాజధాని కావాలన్న ఆంధ్రుల కల అతి త్వరలో సాకారం కానుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం రెండున్నరేళ్లలో పూర్తి కానుంది. ఈ విషయాన్ని మంత్రి నారాయణ స్వయంగా చెప్పారు. చంద్రబాబు హయాంలో అమరావతి దాదాపు పూర్తి కావచ్చిన తరుణంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారిన సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ కొలువుదీరిన క్షణం నుంచీ అమరావతి నిర్వీర్యమే లక్ష్యంగా పాలన సాగింది. కరకట్టపై ఉన్న ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన జగన్ విధ్వంస పాలన అమరావతిని స్మశానం అనడం వరకూ సాగింది. అభివృద్ధి పనులను పడకేసేలా చేసి రాష్ట్రాన్ని రాజథాని లేని రాష్ట్రంగా మార్చారు. అమరావతి కోసం భూములిచ్చిన రైతులు నాలుగున్నరేళ్లుగా అవిశ్రాంతంగా జరిపిన పోరాటం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మాత్రమే ముగిసింది. చంద్రబాబు ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో ఇక అమరావతిని ఆగదన్న విశ్వాసం తమకు ఉందని రైతులు ఆనందంతో చెబుతున్నారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి సాకారం తథ్యమన్న నమ్మకం, విశ్వాసం సర్వత్రా వ్యక్తం అవుతోంది. అందుకు తగ్గట్టుగానే రాష్ట్ర మంత్రిగా నియమితులైన తరువాత అమరావతి రైతులలో ముచ్చటించిన మంత్రి నారాయణ రెండున్నరేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని ఉద్ఘాటించారు. ఏపీ ఎన్నికలలో జగన్ పరాజయం పాలైన మరుక్షణం నుంచీ అమరావతి వెలుగులు జిమ్మడం ఆరంభమైంది. చంద్రబాబునాయుడు ఇంకా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే అమరావతిలో అభివృద్ధి మెలకలు ఆరంభమయ్యాయి. జగన్ నిర్వాకంతో అడవిని తలపించేలా మారిపోయి ముళ్ల కంపలతో నిండిపోయిన అమరాతిలో చెత్తను తొలగించే కార్యక్రమం ఆరంభమైంది. రహదారులకుఇరువైపులా వెలుగులు విరజిమ్మేలా వీధిదీపాలు దేదీప్యమానంగా వెలిగాయి. ఇక చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి, ఆ మరుసటి రోజునే సెక్రటేరియెట్ కు వచ్చి కూర్చున్నారు. దాంతో సెక్రటేరియెట్ లో ఐదేళ్ల కిందటి కళ తిరిగి వచ్చింది. ఇక మిగిలినదంతా లాంఛనమే. నిర్మాణ పనులు జోరందుకోనున్నాయి. జగన్ నిర్వాకం కారణంగా పడుబడిన నిర్మాణాల మరమ్మతులపై ఇప్పటికే మంత్రి నారాయణ దృష్టి పెట్టారు. ఈ విషయాన్నే ఆయన అమరావతి రైతులతో మాట్లాడుతూ చెప్పారు. అడ్డంకులు తొలగిపోయాయి. రాష్ట్రానికి పట్టిన జగన్ గ్రహణం వీడిపోయింది. ఇక పనులు పరుగులు పెట్టడమే తరువాయి. అమరావతి నిర్మాణాన్ని చంద్రబాబు ప్రభుత్వం రెండున్నరేళ్లలో పూర్తి చేస్తుందని నారాయణ చెప్పారు. దీంతో భూములిచ్చిన తమకు సత్వర న్యాయం జరుగుతుందన్న భరోసా అమరావతి రైతులలో వ్యక్తం అవుతోంది.  

కేబినెట్ లో స్థానం దక్కని సీనియర్లకూ కీలక పోస్టులు.. చంద్రబాబు కసరత్తు!

చంద్రబాబు కేబినెట్ లో సీనియర్లకు స్థానం దక్కకపోవడంపై పలువురు విస్మయం వ్యక్తం చేశారు. కేబినెట్ కూర్పు పాత కొత్తల మేలు కలయికగా ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నప్పటికీ పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచి, జగన్ సర్కార్ వేధింపులను ఎదుర్కొని, కేసుల్లో ఇరుక్కుని పోరాడిన అయ్యన్నపాత్రుడు వంటి వారికి కూడా స్థానం లేకపోవడం ఏమిటన్న ఆశ్చర్యం మాత్రం పలువురిలో వ్యక్తం అయ్యింది. అలాగే ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు, అదే విధంగా పరిటాల సునీత, యనమల రామకృష్ణుడు వంటి వారికి స్థానం లేకపోవడంపై పలువురు విస్మయం వ్యక్తం చేశారు. అనుభవజ్ణుడైనప్పటికీ నిన్న మొన్నటి వరకూ వైసీపీలో ఉన్న ఆనంకు కేబినెట్ లో స్థానం కల్పించిన చంద్రబాబు తొలి నుంచీ పార్టీని అంటిపెట్టుకుని అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్న వారికి కేబినెట్ లో చోటు దక్కకపోవడంపై ఒకింత అసంతృప్తి కూడా వ్యక్తం అయ్యింది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి అయితే తాను కేబినెట్ లో చోటుదక్కుతుందని ఆశించానని మీడియాతో చెప్పేశారు కూడా.    అయితే మెల్లమెల్లగా చంద్రబాబు సీనియర్లను పార్టీ కోసం పని చేసిన వారిని విస్మరించలేదనీ, కేబినెట్ లో స్థానం కల్పించకపోయినా, అందుకు సమాన స్థాయి పదవులను ఇచ్చే యోచనలోనే ఉన్నారనీ తెలుస్తోంది. ఇప్పటికే గాజువాక ఎమ్మెల్యే పల్లాకు తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష పదవి ఇచ్చారు. అలాగే యనమల రామకృష్ణుడిని ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ గా పంపించే యోచన ఉందనీ, ఈ మేరకు ఇప్పటికే బీజేపీ అగ్రనాయకత్వంతో చర్చలు కూడా జరిగాయనీ విశ్వసనీయంగా తెలుస్తుంది. అలాగే మరో సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతి రాజుకు టీటీడీ చైర్మన్ పదవి, లేదా గవర్నర్ గా పంపించే యోచన ఉందని అంటున్నారు. ఇక పరిటాల సునీతకు సైతం ఏదో ఒక కీలక పోస్టు ఖాయమని చెబుతున్నారు. ఇప్పటికే ఆమెకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు వచ్చిందని చెబుతున్నారు. ఇక అయ్యన్న పాత్రుడిని అసెంబ్లీ స్పీకర్ గా ఎంపిక చేసే అవకాశాలున్నాయని గట్టిగా వినిపిస్తోంది. అదే విధంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కూడా ఆయన స్థాయికి తగ్గట్టుగా, ఆయన గౌరవానికి భంగం వాటిల్లకుండా ఏదో ఒక కీలక పోస్టు ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 

కొరివితో తల గోక్కుంటున్న కేసీఆర్!

బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ కొరివితో తల గోక్కుంటున్నారు. ఇప్పటికే ఆయన పార్టీ ఇటు రాష్ట్రంలో అట్టడుగుకి వెళ్ళిపోయింది. అటు కేంద్రంలో శూన్యం అయిపోయింది. గతంలో మాదిరిగా ఆయన బిల్డప్ మాటలు, ఉడత ఊపులు ఊపితే భయపడేవారు, నమ్మేవారు ఎవరూ లేరు. చింత చచ్చినా పులుపు చావలేదని అన్నట్టుగా, అధికారం పోయి పాతాళంలోకి పడిపోయినా కేసీఆర్‌లో పొగరు ఎంతమాత్రం తగ్గలేదు. లక్షల పుస్తకాలు చదివిన ఈ కుహనా మేధావికి ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలియడం లేదు. ఈయన నిరంకుశ విధానాల ఫలితంగా ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత తీహార్ జైల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. కాళేశ్వరం కేసులో కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కేసులో కావచ్చు, మిగతా అవినీతి కేసులలో కావచ్చు కేసీఆర్ కుటుంబం మొత్తం జైలుకు వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ చాణక్యం ప్రదర్శించి ముళ్ళ కంప మీద పడ్డ గుడ్డను మెల్లగా బయటకి తీసుకునేలాగా వ్యవహరించాల్సిన కేసీఆర్ అలా చేయడం లేదు. కొరివితో తల గోక్కునే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పాతాళంలోకి పడిపోయిన ఆయన, అక్కడ కూడా గోతులు తవ్వుకుంటూ వాటిలో పడిపోవడానికి సిద్ధమవుతున్నారు. కేసీఆర్ అధికారంలోకి రాగానే కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టుగా సంబరపడిపోయారు. నేనేం చేసినా నడుస్తుంది.. నన్నెవరూ ఏమీ అడగలేరు.. నేను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నట్టుగా వ్యవహరించారు. సాధారణంగా ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రం నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలంటే టెండర్లు పిలిచి, ఎవరు తక్కువ కోట్ చేస్తే వాళ్ళ దగ్గర కొనుగోలు చేయాల్సి వుంటుంది. అయితే కేసీఆర్ మాత్రం తనను తాను నిబంధనలకు అతీతుడైన మహారాజులా భావించుకున్నారు. ఎలాంటి టెండర్లను ఆహ్వానించకుండా, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం నుంచి చాలా ఎక్కువ రేటుకు కరెంట్ కొనే ఒప్పందాలను చేసుకున్నారు. ఇప్పుడు ఆ ఒప్పందాలు కేసీఆర్ పీకకి చుట్టుకున్నాయి. ఈ అంశం మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణ కమిషన్‌ని ఏర్పాటు చేసింది.  జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఈనెల 15 లోగా కేసీఆర్ ఈ అంశం మీద వివరణ ఇవ్వాలని సీరియస్‌గా ఆదేశించింది. దానికి కేసీఆర్ జులై 30 వరకు తనకు గడువు కావాలని అడిగారు. అలా కుదరదు.. జూన్ 15 లోగా వివరణ ఇవ్వాల్సిందేనని కమిషన్ ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌కి వివరణ ఇస్తూ 12 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. ఈ లేఖ వివరణ ఇస్తున్నట్టుగా లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద విరుచుకు పడుతున్నట్టుగా వుంది. జస్టిస్ నరసింహారెడ్డిని అవమానించే విధంగా వుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్ట్రానికి కేటాయించిన విద్యుత్ రాష్ట్ర అవసరాలకు సరిపోయే విధంగా లేదని కేసీఆర్ తన వివరణలో చెప్పారు. అందుకే రాష్ట్ర అవసరాల కోసం కరెంట్ కొనుగోలు చేశామని కేసీఆర్ వివరించారు. అక్కడితో ఆగకుండా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన మీద రాజకీయ కక్ష సాధించడం కోసం ఈ విచారణ కమిషన్ ఏర్పాటు చేసిందని విమర్శించారు. పనిలోపనిగా విచారణ కమిషన్ మీద, జస్టిస్ నరసింహారెడ్డి మీద కూడా కేసీఆర్ విమర్శలు చేశారు. ‘‘మా ప్రభుత్వం గణనీయ మార్పుతో కరెంటు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. మా మార్పును తక్కువచేసి చూపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. విలేకరుల సమావేశంలో విచారణ కమిషన్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడింది. విచారణ అనేది ఒక పవిత్రమైన బాధ్యత. ఇరుపక్షాల మధ్య మధ్యవర్తిగా నిలిచి నిగ్గుతేల్చాలి. అన్ని కోణాల్లో సమగ్రంగా పరిశీలించి నిర్ణయాలు వెల్లడించాలి. కానీ, ఈ కమిషన్ మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్టు ఇవ్వాలి అన్నట్టుగా మాట్లాడుతున్నట్టు వుంది. మీ విచారణలో నిస్పాక్షికత ఎంతమాత్రం కనిపించడం లేదు. నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం వుండదు. మేం చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకుని జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ బాధ్యతల నుంచి వైదొలగితే మంచిదని వినయపూర్వకంగా కోరుతున్నా’’ అని కేసీఆర్ తన వివరణలో పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్‌కి నాయకత్వం వహిస్తున్న న్యాయమూర్తిని వ్యక్తిగతంగా విమర్శించడం, ఆయన మీద లేనిపోని ఆరోపణలు చేయడం కొరివితో తల గోక్కోవడమే అవుతుంది. కేసీఆర్ తన వంతు బాధ్యతగా కొరివితో తల గోక్కున్నారు. ఇక కొరివి తన బాధ్యతను తాను నిర్వర్తిస్తుంది.