నీట్ పరీక్ష లీక్ పై జెడి లక్ష్మినారాయణ వెరైటీ ట్వీట్
posted on Jun 18, 2024 @ 10:29AM
మునుపెన్నడూ లేని విధంగా నీట్ పరీక్ష వివాదాస్పదమైంది. ప్రతిపక్ష పార్టీలకు నీట్ పరీక్ష అస్త్రంగా మారింది. నీట్ పేపర్ లీక్ అయ్యిందంటూ ఆరోపణలు వస్తున్న వేళ సీబీఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ఆసక్తికర ట్వీట్ చేశారు. 'ఒక దేశాన్ని నాశనం చేయాలంటే ఆటమ్ బాంబులు అవసరం లేదు. నాసిరకం విద్య, విద్యార్థులను పరీక్షల్లో కాపీ కొట్టనివ్వడం లాంటి విధానాలను ప్రోత్సహిస్తే ఆ దేశం దానంతట అదే నాశనం అవుతుంది. అలా చదివిన డాక్టర్ల చేతిలో రోగులు చనిపోతారు అంటూ పలు ఉదాహరణలను ఓ యూనివర్సిటీ ప్రవేశ ద్వారం వద్ద రాశారని' ఆయన పేర్కొన్నారు. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఇదిలాఉంటే.. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలు, ఫలితాల వెల్లడిలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నీట్‌లో ఎలాంటి అక్రమాలు జరగలేదని మొదట వాదించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. అక్రమాలు జరిగిన మాట నిజమేనని తాజాగా అంగీకరించారు. నీట్ అక్రమాలు గుజరాత్, బీహార్‌లో వెలుగుచూడటం.. అక్కడ ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వాలే అధికారంలో ఉండటం రాజకీయంగానూ చర్చనీయాంశమవుతోంది.
మెడికల్ కాలేజీలకు ఈ ఏడాది అర్హత పరీక్ష, నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ పై వివాదం, దీర్ఘకాల వ్యవస్థాగత లోపాలపై దృష్టిని ఆకర్షిస్తుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 1,500 కంటే ఎక్కువ మంది అభ్యర్థుల గ్రేస్ మార్కులను రివర్స్ చేసి, వారికి మళ్లీ పరీక్షకు అవకాశం ఇచ్చింది. ఈ విద్యార్థులకు మొదట్లో తప్పుడు ప్రశ్నపత్రం ఇచ్చారు. సరైన పేపర్‌కి మారడంలో కోల్పోయిన సమయాన్ని భర్తీ చేయడానికి వారికి పరిహారం మార్కులు ఇవ్వబడ్డాయి. ఈ “సాంకేతిక లోపం”ని అంగీకరించడానికి అనేక పిటిషన్‌లు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో దాఖలయ్యాయి. . 4,500కి పైగా పరీక్షా కేంద్రాల్లో కేవలం ఆరింటిలో మాత్రమే తప్పు జరిగిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ,
ఈ సంవత్సరం పరీక్షలో అరవై ఏడు మంది విద్యార్థులు రాణించారు, మరికొంత మంది విద్యార్థులు ఒకటి లేదా రెండు మార్కులు తక్కువగా వచ్చాయి. - గత సంవత్సరం ఇద్దరు మాత్రమే టాపర్‌లు గా నిలిచారు. 2022లో కూడా ఒక టాప్ ర్యాంకర్ సాధించారు. 2021లో ముగ్గురు టాపర్‌లు నిలిచారు. ఏ సంవత్సరం లేని పరీక్ష ఫలితాలు ఈ సంవత్సరమే వచ్చాయి.ఒకే సారి 67 మంది టాపర్లుగా నిలవడం బిజెపి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టింది.