యూపీకి సీఎం అయినా అమ్మకూచే!
posted on Jun 18, 2024 @ 9:53AM
అమ్మ చిన్నతనంలో కొంగున ముడి వేసుకున్న చిల్లర డబ్బులను కొడుకు చేతిలో పెట్టి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకో బాబూ అని చెబుతుంది. అటువంటి తల్లిని కుమారుడు పెద్దయ్యాకా నెత్తిన పెట్టి చూసుకుంటారు. అయితే రాజకీయాలలో తల్లి, చెల్లి కాదు, అధికారం, ఆధిపత్యం ఇవే రాజ్యమేలుతాయి.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ విషయంలో అదే జరిగింది. తన కోసం, తాను రాజకీయంగా ఉన్నతంగా ఎదగడం కోసం అహర్నిశలూ కృషి చేసిన తల్లినీ చెల్లినీ జగన్ రాష్ట్రం దాటించేశారు. తన అధికారం స్వార్జితమనీ, అందులో మీకు భాగం లేదనీ తన చేతల ద్వారా విస్పష్టంగా చెప్పేశారు. చెల్లిని ముందే గెంటేసిన జగన్ పార్టీ ప్లీనరీ వేదికగా అమ్మ చేత వైసీపీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేయించారు. పార్టీతో అప్పటి వరకూ ఉన్న బంధాన్ని పుటుక్కున తెంచేశారు. ఇది ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ తీరు అయితే...
దేశంలోనే అతి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ ది మరో తీరు. ఆయనకు అమ్మమీద అపారమైన ప్రేమాభిమానాలున్నాయి. అయితే కుమారుడి అధికారం, హోదా, పదవి కారణంగా వచ్చే ఏ సౌకర్యమూ తనకు వద్దనుకుంది యోగి తల్లి. ఎందుకంటే కాషాయ వస్త్రధారుడైన తన కుమారుడికి తాను బలహీనతగా మారకూడదని తలచిందా తల్లి.. ఎందుకంటే కుటుంబ బంధాలు లేని ‘యోగి’ ఆదిత్యనాథ్ ది నిరాడంబర జీవనశైలి. దేశంలోనే పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఆయనది మితాహారమే. పవళింపు నేలమీదే.
కుమారుడి బాటలోనే ఆయన తల్లీ నడుస్తున్నారు. తనయుడు ముఖ్యమంత్రి అయినా ఆమె తన రెక్కలకష్టంతోనే బతుకుతున్న పేదరాలు. వారిరువురూ తాజాగా ఒకరికొకరు ఎదురుపడ్డారు. అదెక్కడంటే.. రుద్రప్రయాగ్ లో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించేందుకు రిషికేష్ లోని ఎయిమ్స్ కు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెళ్లారు. అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లి సావిత్రీదేవిని చూసి నిర్ఘాంత పోయారు. కన్నీటి పర్యంతమయ్యారు. తనను చూసి కరిగి కన్నీరైన కుమారుడిని ఆ తల్లే ఓదార్చింది. క్షేమ సమాచారం కనుక్కుంది. వేళకు తింటున్నావా నాయనా అని ఆరా తీసింది. యోగి తన తల్లిని చూడడం రెండేళ్ల తరువాత ఇదే మొదటి సారి. తల్లికి ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి వెనుదిరిగి వెడుతున్న యోగి ఆదిత్యనాథ్ ను చేయి పట్టి ఆపి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకో బాబూ అంటూ పదివేల రూపాయలను కుమారుడికి ఇచ్చిందా తల్లి. అమ్మ ఇచ్చిన సొమ్మును కళ్లకద్దుకుని జాగ్రత్తగా జేబుతో పెట్టుకున్న యోగి ఆదిత్యనాథ్ ఆమె కాళ్లకు నమస్కరించి కన్నీటితో వెనుదిరిగారు. అనుబంధాలు, ఆప్యాయతలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఈ దృశ్యం అక్కడి వారందరినీ కదిలించేసింది.