చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ప్రకారమే అమరావతి!
posted on Jun 17, 2024 @ 11:05AM
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి.. గత ఐదేళ్లుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. అమరావతిని నాశనం చేయడమే లక్ష్యంగా జగన్ పాలన సాగింది. మూడు రాజధానులంటూ మూడుముక్కలాట ఆడారు. సీఆర్డయే చట్టాన్ని మార్చడానికి ప్యయత్నించారు. మాస్టర్ ప్లాన్ ను పక్కన పెట్టేసి ఇష్టారీతిగా భూముల పందేరానికి కూడా తెగబడ్డారు. అయితే అన్ని విషయాలలోనూ జగన్ ఫెయిలయ్యారు. ఆయన చేయగలిగిందేమిటంటే గత ఐదేళ్లుగా అమరావతి పురుగతిని స్తంభింపచేయడమే. పనులను అర్ధంతరంగా ఆపివేయడం. అమరావతి కేంద్రంగా పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చిన వారిని వెనక్కు పంపేయడమే.
దీంతో అమరావతి భవిష్యత్ పై అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతుల్లోనే కాదు.. ప్రపంచ స్థాయి రాజధాని ఆంధ్రుల సొంతం అవుతుందని ఆశించిన వారిలో కూడా ఆందోళన నెలకొంది. ఈ ఐదేళ్లలో అమరావతి విధ్వంసాన్ని కళ్లారా చూసిన జనం మళ్లీ అమరావతి పూర్వవైభవం ఎప్పటికి సంతరించుకునేను అన్న ఆందోళన కూడా వ్యక్తం చేశారు.
అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వం పతనమైంది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో అమరావతి పురోగతి పరుగులు పడుతుందనడంలో సందేహం లేదు. ఏపీ మునిసిపల్ శాఖ మంత్రిగా నారాయణ బాధ్యతలు చేపట్టారు. ఆ సందర్భంగా నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ప్రకారమే అమరావతి నిర్మాణం ఉంటుందని విస్పష్టంగా చెప్పేశారు.
2014-19 మధ్య ఆయన అమరావతి పనులను పర్యవేక్షించారు. ఇప్పుడు కూడా ఆయనకు అమరావతి పనుల కొనసాగింపునకు సంబంధించి బాధ్యతలు ఉన్న మంత్రిత్వ శాఖనే చంద్రబాబు కట్టబెట్టారు. అమరావతి పునర్మిర్మాణ పనులను సాధ్యమైనంత త్వరలో చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. రెండున్నరేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేయాలన్నది తన లక్ష్యమని చెప్పిన ఆయన దీనిపై పూర్తిగా అవహాన చేసుకుని నిర్దిష్టమైన కాల పరిమితిని నిర్ణయిస్తామని చెప్పారు. అమరావతి ఫస్ట్ ఫేజ్ నిర్మాణానికి 48 వేల కోట్ల రూపాయలు అవుతుందని, మొత్తం మూడు ఫేజ్ లూ పూర్తి చేయడానికి లక్ష కోట్ల రూపాయలు అవసరమౌతుందని చెప్పారు.
అమరావతి రోడ్ల ధ్వంసం, సామగ్రి చోరీలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధ్వంసం, చోరీలపై విచారణకు ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇక అమరావతి లో పేరుకుపోయిన చత్త, ఇష్టారీతిగా పెరిగగిపోయిన ముళ్ల కంపల తొలగింపు వేగవంతంగా జరుగుతోందని వివరించారు. 2019 నాటికే దాదాపుగా పూర్తి అయిపోయిన భవనాలను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందనీ, ప్రస్తుతం వాటి పరిస్థితి ఎలా ఉంది అన్నదానిపై అధికారులు అధ్యయనం చేస్తున్నారనీ, అటువంటి వాటిని త్వరిత గతిన పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇస్తామని నారయణ చెప్పారు. మొత్తం మీద ఆంధ్రుల రాజధాని అమరావతి, ప్రపంచ స్థాయి నగరంలో త్వరలోనే రూపుదాల్చనుందని నారాయణ ఉద్ఘాటించారు.