19 నుంచి పవన్ కల్యాణ్ ఆన్ డ్యూటీ
posted on Jun 17, 2024 @ 3:44PM
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు సెక్రటేరియెట్లో చాంబర్ రెడీ అయిపోయింది. ఆయనకు రెండో బ్లాక్ లోని మొదటి అంతస్తులో 212 నంబర్ రూం కేటాయించారు. అదే అంతస్థులో జనసేన కు చెందిన ఇద్దరు మంద్రుల చాంబర్లు కూడా ఉన్నాయి.
పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ చాంబర్లు పక్కపక్కనే ఉండేలా కేటాయింపులు జరిగాయి. చంద్రబాబు కేబినెట్ లో పవన్ కల్యాణ్ కు తన కేబినెట్ లో కీలకమైన శాఖలు కేటాయించారు.
పవన్ కల్యాణ్ కూడా తనకు కేటాయించిన శాఖల పట్లే కాకుండా, తమ పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులకూ కేటాయించిన శాఖల పట్ల సంతృప్తి, సంతోషం కూడా వ్యక్తం చేశారు. తమ పార్టీకి కేటాయించిన శాఖలు తమ పార్టీ మూల సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్నాయన్నారు. ఇక తనకు కేటాయించిన శాఖలు తన మనస్సుకు దగ్గరగా ఉన్నాయని చెప్పిన పవన్ కల్యాణ్.. ఈ నెల 19న బాధ్యతలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
ఇటీవలి ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీలకూడదన్న కృత నిశ్చయంతో మూడు పార్టీల నేతలూ, క్యాడర్ కలిసి పని చేయడంతో ఓట్ల బదలీ ఎటువంటి ఇబ్బందులూ లేకుండా సజావుగా సాగింది. ఫలితమే జగన్ అత్యంత అవమానకరమైన ఓటమిని మూటగట్టుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో 151 స్థానాలలో గెలిచిన వైసీపీ ఈ ఎన్నికలలో 11 స్తానాలకే పరిమితమైందంటే, కనీసం విపక్ష హోదాకు కూడా నోచుకోలేదంటేనే జనం జగన్ ను ఆయన పార్టీని ఎంతగా తిరస్కరించారో అర్ధమౌతుంది.