ఇక సోమవారం కాదు పోలవారం!
posted on Jun 17, 2024 @ 2:10PM
ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి లాంటి పోలవరం బహుళార్థ సాథక ప్రాజెక్టును జగన్ సర్కార్ పక్కన పెట్టేసింది. చంద్రబాబు హయాంలో పరుగులు పెట్టిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత పడకేశాయి. రివర్స్ టెండరింగ్ అంటూ జగన్ పోలవరం ప్రాజెక్టు పనుల వేగాన్ని గణనీయంగా తగ్గించేశారు. కనీస అవగాహన లేని అంబటి రాంబాబుకు జలవనరుల మంత్రిగా బాధ్యతలు కట్టబెట్టిన జగన్ పోలవరంపై తనకు ఉన్న శ్రద్ధ ఏమిటో చెప్పకనే చెప్పేశారు.
జగన్ అరాచకపాలనకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ ఓటు ద్వారా చరమగీతం పాడేశారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. దీంతో పోలవరం పనులు ఇక జోరందుకుంటాయన్న ఆశ సర్వత్రా వ్యక్తం అవుతోంది. అదే సమయంలో గతంలో చంద్రబాబో పోలవరం ప్రాజెక్టు పనులను తరచుగా పర్యవేక్షించి ఆ పనులను పరుగులెత్తించిన సంగతిని గుర్తు చేసుకుంటున్నారు. 2014 నుంచి 2019 వరకూ విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు వారం వారం పోలవరం సందర్శనకు ప్రత్యేక సమయం కేటాయించే వారు.
వారం ఆరంభంలోనే ఆయన పోలవరం సదర్శనకు రావడంతో ఆయన పర్యటన ఫలితంగా వారం అంతా పనులు జోరుగా సాగేవి. నిర్దేశించిన గడువు మేరకు నిర్దేశిస పనులు పూర్తయ్యేలా ఆయన తరచూ చేసే సమీక్షలు పోలవరం వేగం పుంజుకోవడానికి దోహదపడ్డారు. ఆయన హయంలో సోమవారం పోలవారంగా మారిపోయింది. స్వయంగా ఆయనే ఈ విషయాన్ని చెప్పేవారు. తనకు సోమవారం లేదనీ, అది పోలవారమని చంద్రబాబు చమత్కరించేవారు. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు మొత్తం మొత్తం 83 సార్లు పోలవరం పనులను సమీక్షించారు. అంతే కాదు పోలవరం పూర్తికి అత్యంత కీలకమైన ఏడు ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో విలీనం అయ్యే వరకూ తాను సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టేది లేదని భీష్మించి మరీ అనుకున్నది సాధించారు.
అయితే 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయంపాలై వైసీపీ అధికారలోకి వచ్చి జగన్ సీఎం కావడంతో పోలవరం పనులు ముందుకు సాగలేదు. అవగాహనా లోపం, ప్రాధామ్యాలు మారిపోవడంతో జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు, పురోగతి కంటే బటన్ నొక్కుడు సంక్షేమంపైనే జగన్ దృష్టి పెట్టారు. దీంతో పోలవరం పనులు కుంటుపడ్డాయి. దీనిపై రైతులతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయ్యింది.
జాతీయ హోదా ఉన్న పోలవరం ప్రాజెక్టు సత్వర పూర్తిపై జగన్ దృష్టి పెట్టక పోవడాన్ని రైలులే కాదు సామాన్య జనం కూడా తప్పుపట్టారు. సరే ఇప్పుడు జగన్ ప్రభుత్వం గద్దెదిగి చంద్రబాబు ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టడంతో పోలవరం పరుగులు పెడుతుందనీ, ఆంధ్రప్రదేశ్ నీటి కొరతే లేని రాష్ట్రంగా మారేందుకు ఎక్కువ సమయం పట్టదనీ ప్రజలు భావిస్తున్నారు.