పృథ్వీరాజ్ కు షాక్ .. విజయవాడ ఫ్యామిలీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ 

సినీనటుడు పృథ్వీరాజ్ భార్య పెట్టిన భరణంకేసులో కొత్త చిక్కులు ఎదుర్కొంటున్నారు.  30 ఇయర్స్ ఇండస్ట్రీ  పేరిట మంచి గుర్తింపు తెచ్చుకున్న సినీనటుడు పృథ్వీరాజ్‌కు ఊహించని షాక్ తగిలింది. విజయవాడ స్థానిక ఫ్యామిలీ కోర్టు అతడికి బుధవారం నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. మనోవర్తి చెల్లించాలంటూ పృథ్వీ భార్య బలిరెడ్డి శ్రీలక్ష్మి అతడిపై ఫ్యామిలీ కోర్టులో వేసిన కేసులో ఈ పరిణామం చోటుచేసుకుంది.  భార్య బలిరెడ్డి శ్రీలక్ష్మికి నెలకు రూ.8 లక్షలు చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ ఆదేశాలను పాటించని పృథ్వీ హైకోర్టులో సవాలు చేశారు. కేసును పరిశీలించిన న్యాయస్థానం తాత్కాలిక ఉపశమనం కల్పిస్తూ భార్యకు నెలకు రూ.22వేల చొప్పున చెల్లించాలని ఆదేశించింది. అప్పటి వరకు ఉన్న బకాయిలు మొత్తం చెల్లించాలని స్పష్టం చేసింది. అయితే పృథ్వీరాజ్ హైకోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయలేదు. దీంతో భార్య శ్రీలక్ష్మి తన న్యాయవాదులు సుంకర రాజేంద్రప్రసాద్‌, సప్పా రమేష్‌, సీహెచ్‌ వడ్డీకాసులును సంప్రదించి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్‌ వేశారు. పృథ్వీరాజ్ కోర్టుకు హాజరుకాకుండా కేసు వివరాలను ఒక దినపత్రికలో ప్రకటన చేశారని, కోర్టుకు హాజరుకావడం లేదని లాయర్లు పిటిషన్‌లో వివరించారు. ఫ్యామిలీ కోర్టు జడ్జి బుధవారం పిటిషన్‌ను పరిశీలించారు. పృథ్విరాజ్‌కు నాన్‌బెయిలబుల్‌ అరెస్ట్ వారెంటు జారీ చేశారు. దీంతో పృథ్వీరాజ్ చిక్కుల్లో పడ్డట్టు అయింది.

చింతా పులుపూ రెండూ చచ్చిన వైసీపీ

పాతాళానికి పడిపోయినా.. మాదే పై చేయి అన్నట్లుంది వైసీపీ నాయకుడు విజయసాయి రెడ్డి తీరు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయి, ఆ పార్టీ అగ్రనేతలంతా కకావికలైపోయారు. పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.  ఇప్పటి వరకూ జగన్ గొంతుకగా నోరెట్టుకు పడిపోయిన సజ్జల ఎక్కడున్నారో తెలియడం లేదు. ఆయన మాటా వినిపించడం లేదు. మనిషీ కనిపించడం లేదు. ఇక బొత్స సత్యనారాయణ, కొట్టు వంటి నేతలు తమ పార్టీ అధినేత నిర్వాకం వల్లే ఘోరంగా ఓడిపోయామని చెప్పకనే చెప్పేస్తున్నారు. ఇప్పటి వరకూ ప్రత్యర్థుల పై బూతులతో విరుచుకుపడిన కొడాలి నాని.. తెలుగుదేశం వాళ్లు దాడులకు పాల్పడుతున్నారు బాబోయ్ అని బేల అరుపులు అరుస్తున్నారు. రోజా, వల్లభనేని వంశీ వంటి వారు పార్టీ పరాజయం తరువాత ఇప్పటి వరకూ గొంతు విప్పిన దాఖలాలు లేవు.  ఇప్పుడు నెల్లూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘోర పరాజయం పాలైన విజయసాయి రెడ్డి మాత్రం మీడియా ముందుకు వచ్చి.. పార్లమెంటులో మేం చాలా బలంగా ఉన్నాం. మా దయాదాక్షిణ్యాలు ప్రధాని మోడీకి చాలా అవసరం అన్న లెవల్ లో మాట్లాడుతున్నారు. ఔను సరిగ్గా ఇవే మాటలు కాకపోయినా.. తెలుగుదేశం పార్టీకి పార్లమెంటులో ఉన్నంత బలం మాకూ ఉందనీ, మా అవసరం కూడా మోడీకి ఉందని నమ్మబలకడానికి ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి రాజ్యసభలో వైసీపీకి 11 మంది సభ్యులు ఉన్నారు. తాజాగా లోక్ సభకు ఎన్నికైన వారు నలుగురు. అంటే విజయసాయి ఇప్పుడు చెబుతున్నట్లు వైసీపీకి పార్లమెంటులో 15 మంది సభ్యులు ఉన్నారు. నిజమే. అందుకే మోడీ మా మాట కూడా వింటారనీ, విని తీరుతారని విజయసాయి రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం కు 16 మంది సభ్యులు ఉంటే మాకు 15 మంది ఉన్నారు. మేం ఏం తక్కువ అని డాంబికాలు పోతు న్నారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయాం కానీ, పార్లమెంటులో బలంగా ఉన్నాం అని చెప్పుకుంటున్నారు.   ఇంత చెబుతున్న ఆయన మోడీ అడిగినా అడగకున్నా రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం ఎన్డీయే ప్రవేశ పెట్టే అన్ని బిల్లులకూ బేషరతుగా మద్దతు ఇస్తామంటూ అన్యాపదేశంగా మోడీని శరణు వేడుతున్నారు.  ఆదుకోండి స్వామీ అంటూ కాళ్లా వేళ్లా పడుతున్నారు. మేం మీతోనే ఉన్నాం గుర్తించండి అంటూ బతిమలాడుతున్నారు. 

గ్రూప్ పరీక్షల్లో  రేవంత్ సర్కార్  పురోగతి...తెలంగాణ గ్రూప్ 1 ప్రాథమిక కీ విడుదల

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రకరకాల కారణాల వల్ల గ్రూప్-1 పరీక్ష రెండు సార్లు వాయిదా పడగా.. కొత్తగా ఏర్పడిన రేవంత్ రెడ్డి సర్కారు పాత నోటిఫికేషన్ పూర్తిగా రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ గ్రూప్-1 పరీక్షకు త్వరలోనే కొత్త నోటిఫికేషన్ ఇచ్చి.. ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ప్రకటించారు. ఇప్పటికే 567 పోస్టుల భర్తీకి అనుమతి కూడా ఇచ్చామని సీఎం చెప్పారు. త్వరితగతిన.. గ్రూప్ పరీక్షలన్ని నిర్వహించనున్నట్టు హామీ ఇచ్చారు.  హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నూతనంగా ఎంపికైన ప్రభుత్వ గురుకుల ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందజేసేందుకు నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేశారు. జూన్ 9 న రాష్ట్ర  వ్యాప్తంగా 897 సెంటర్లలో ప్రిలిమ్స్ పరీక్షలు జరిగాయి. ఈ నేపథ్యంలో  గ్రూప్ 1 ప్రిలిమ్స్ కు సంబంధించి తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) విడుదల చేసింది. వెబ్‌సైట్‌లో మాస్టర్ ప్రశ్నపత్రంతో పాటు ప్రాథమిక కీ కూడా అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఆన్సర్ కీపై అభ్యంతరాలు ఉంటే జూన్ 17 వరకు స్వీకరించడం జరుగుతుందన్నారు. ప్రాథ‌మిక కీపై అభ్యంత‌రాల‌ను 13వ తేదీ నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంట‌ల లోపు టీజీపీఎస్సీ దృష్టికి తీసుకెళ్లొచ్చు. దీనికోసం మొదట కమిషన్ వెబ్‌సైట్‌లోని ప్రత్యేక లింక్ ద్వారా వ్యక్తిగత వివరాలను ధృవీకరించాలి. ఆ తర్వాత అభ్యంత‌రాల‌ను ఆంగ్లంలో నమోదు చేయాలి. వాటికి తగిన రుజువులు, పుస్తక రచయిత పేరు, పుస్తకంలో పేజీ నంబరు, పత్రిక ఎడిషన్, పేజీ నంబరు, పబ్లిషర్ పేరు.. వెబ్‌సైట్‌ యూ‌ఆర్‌ఎల్ వివరాలను ఇవ్వాలి. ఈ-మెయిల్, వ్యక్తిగత అభ్యర్థనలు, ఇతర పద్ధతుల్లో వచ్చే, గడువు ముగిసిన తర్వాత వచ్చే అభ్యంత‌రాల‌ను పరిగణనలోకి తీసుకోబోమని కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు.  మొత్తం 563 గ్రూప్‌-1 పోస్టులకు 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ జూన్ 9న రాష్ట్రవ్యాప్తంగా 897 పరీక్షా కేంద్రాల్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. అయితే వీరిలో 3.02 లక్షల (74 శాతం) అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. అంటే దాదాపు లక్ష మంది పరీక్షకు హాజరు కాలేదు. ఇక కమిషన్ బుధవారం మెయిన్స్ పరీక్షల షేడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 21 నుంచి 27వ తేదీ వరకు  గ్రూప్-1 మెయిన్ పరీక్షలు ఉంటాయని తెలిపింది.

స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరేనా?

చంద్రబాబు కేబినెట్ కూర్పు పాత కొత్తల మేలు కలయికగా ఉందన్న ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో కొందరికి కేబినెట్లో స్థానం లేకపోవడం పట్ల ఒకింత అసంతృప్తి కూడా వ్యక్తం అవుతున్నది. ముఖ్యంగా  సీనియర్ నాయకుడు  రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కేబినెట్ బెర్త్ లభించకపోవడం పట్ల ఉమ్మడి తూర్పుగోదావరి తెలుగుదేశం క్యాడర్ లో తీవ్ర నిరాశ వ్యక్తం అవుతున్నది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఆయనకు స్పీకర్ పదవి కట్టబెట్టే అవకాశాలున్నాయన్న చర్చా జోరందుకుంది.  ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ అసెంబ్లీ స్పీకర్ ఎవరన్న అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. స్పీకర్ పదవి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజును వరించే అవకాశాలున్నాయని కేబినెట్ కూర్పు ముందు వరకూ అందరూ భావించారు. అయితే కేబినెట్ కూర్పు తరువాత అనూహ్యంగా మరి కొందరి పేర్లు కూడా తెరమీదకు వచ్చాయి.  గతానికి భిన్నంగా సీనియర్లతో పాటు జూనియర్లకు తన మంత్రివర్గంలో చంద్రబాబు అవకాశం కల్పించడంతో  మంత్రి పదవులు ఆశించిన పలువురు సీనియర్లకు అవకాశం దక్కలేదు.  సామాజిక, ప్రాంతీయ సమీకరణాలతో చాలామంది సీనియర్లను అనివార్యంగా పక్కన పెుట్టాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ స్పీకర్ పదవికి రేసులో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేరు ముందువరుసలోకి వచ్చింది.  నిజానికి, బుచ్చయ్య చౌదరికి మంత్రివర్గంలో బెర్త్  ఖాయమనే అంతా అనుకున్నారు.  అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు అవకాశం దక్కలేదు.  పార్టీలో ఆయన సీనియారిటీ దృష్ట్యా చంద్రబాబు స్పీకర్ గా ఆయన పేరును పరిశీలిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  అలాగే  కిమిడి కళా వెంకటరావు, నక్కా ఆనంద్ బాబు, రఘురామకృష్ణం రాజు పేర్లు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. 

పవన్ కళ్యాణ్‌కు కీలక శాఖలు?

చంద్రబాబు కేబినెట్ లో పవన్ కల్యాణ్ కు ఉమముఖ్యమంత్రి పదవితో పాటు కీలక శాఖలు కేటాయించే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఆయనకు అత్యంత కీలకమైన పంచాయతీరాజ్ శాఖతో పాటు అటవీ పర్యావరణ శాఖలను కూడా అప్పగించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఇక కేబినెట్ లో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు కూడా చంద్రబాబు స్థానం కల్పించిన సంగతి తెలిసిందే. ఆయనకు పౌరసరఫరాలు, అలాగే జనసేన నుంచి చంద్రబాబు కేబినెట్ లో చోటు దక్కించుకున్న కందుల దుర్గేష్ కు పర్యాటకం, సినిమాటోగ్రఫి శాఖలు కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు.  కాగా ఈ ముగ్గురూ కూడా తొలి సారిగా మంత్రి పదవులు చేపట్టబోతున్న వారే కావడం విశేషం

ఇటలీలో గాంధీ విగ్రహం ధ్వంసం.. ఖలిస్థాన్ సానుభూతి పరుల ఘాతుకం

ప్రధాని పర్యటన వేళ ఇటలీలో భారత్ కు ఘోర అవమానం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ జీ 7 సదస్సులో పాల్గొనేందుకు గురువారం (జూన్ 13) ఇటలీ పర్యటనకు వెడుతున్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఈ సమయంలో ఖలిస్థాన్ సానుభూతి పరులు ఇటలీలో ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆ సందర్భంగా కెనడాలో హత్యకు గురైన  ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్‌కు అనుకూలంగా నినాదాలు చేశాడు. ఘటన జరిగిన వెంటనే అధికారులు ఆ ప్రాంతాన్ని శుభ్రం చేశారు. ఈ చర్యకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని భారత రాయబార కార్యాలయం డిమాండ్ చేసింది. 

ఏడాది పాటు ఎమ్మెల్యేగా కొలికిపూడి జీతం సీఎం సహాయనిధికి!

కొలికిపూడి శ్రీనివాస్.. అమరావతి ఉద్యమం గురించి తెలిసిన వారెవరికీ పరిచయం అక్కర్లేని పేరు. జగన్ పాలనను ఎండగట్టడంలో ఆయన గత ఐదేళ్లుగా అవిశ్రాంతంగా శ్రమించారు. అమరావతి రైతుల ఉద్యమంలో కొలికపూడి కీలకంగా వ్యవహరించారు. ఆయన పోరాట పటిమను గుర్తించిన  తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు కొలికిపూడికి తిరువూరు నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు.  ఈ సందర్భంగా ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేగా తనకు వచ్చే జీతాన్ని ఒక ఏడాది పాటు  ముఖ్యమంత్రి సహాయనిధికి అందిస్తానని ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు.  

శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం (జూన్ 12)న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు అదే రోజు సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో సహా తిరుపతి చేరుకున్నారు. ఆ రోజు రాత్రి తిరుమలలో బస చేసిన ఆయన గురువారం (జూన్ 13) ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయ ప్రవేశం చేశారు. ఆలయ మహాద్వారం వద్ద చంద్రబాబుకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, ఆలయ అర్చకులు ఇస్తికఫల్  స్వాగతం పలికారు.   ధ్వజ స్తంభానికి నమస్కరించి బంగారు వాకిలిలొకి ప్రవేశించి  చంద్రబాబు తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. 

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు చుక్కెదురు 

పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసి దేశ వ్యాప్తంగా అభాసుపాలైంది. ఈ కేసులో ఇరుక్కున్న అధికారులు కెసీఆర్, కెటిఆర్ కనుసన్నల్లో పని చేసిన వారే. పదేళ్ల తర్వాత అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ కేసును సీరియస్ గా తీసుకుంది.  బిఆర్ఎస్ హాయంలో బాధితుడైన మాజీ టిడిపి  నేత రేవంత్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలో ఫోన్ ట్యాపింగ్ నిందితులపై ఉక్కుపాదం మోపారు.   తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు భుజంగరావు, తిరుపతన్నలకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. వారి బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం బుధవారం కొట్టివేసింది. తమను రాజకీయ దురుద్దేశంతో అరెస్ట్ చేశారని, తమపై ఎలాంటి సాక్ష్యాలు లేవని పిటిషనర్లు భుజంగరావు, తిరుపతన్నల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అయితే, ఛార్జిషీట్ దాఖలు చేశామని, మరింత విచారించాల్సి ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. కాబట్టి వారికి బెయిల్ ఇవ్వవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ బెయిల్ పిటిషన్లపై మంగళవారం వాదనలు పూర్తయ్యాయి. నాంపల్లి కోర్టు తీర్పును నేటికి వాయిదా వేసింది. ఈరోజు న్యాయమూర్తి వారి పిటిషన్లను కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

సీబీఎన్ కు అభినందనల వెల్లువ!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి పారిశ్రామిక వేత్తల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. దేశ విదేశాల నుంచి ఆయనను అభినందిస్తూ సామాజిక మాధ్యమంలో పోస్టులు పెడుతున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర సోషల్ మీడియా వేదికగా నారా చంద్రబాబును అభినందించారు. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబుకు  అభినందనలు అంటూ ఆయన తెలుగులో చేసిన వ్యాఖ్య వైరల్ అయ్యింది.  ఆనంద్ మహేంద్ర ట్వీట్ కు చంద్రబాబు ధన్యవాదాలు ఆనంద్ మహీంద్రాగారూ అంటూ సమాధానమిచ్చారు.   అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ కూడా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి తాను కూడా హాజరయ్యాననీ,  ఇది తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.   బ్రిటిష్ కాన్సుల్ జనరల్ గారెత్ విన్ ఓవెన్  కూడా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.  వీరే కాకుండా కేంద్ర మంత్రులు జైశంకర్ , కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, టాలీవుడ్ సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ తదితరులు కూడా చంద్రబాబుకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.  

ఆ పెద్దాయనకి వున్న బుద్ధి కూడా జగన్‌కి లేకపాయె!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చిన నరేంద్ర మోడీ, అమిత్ షా తదితర బీజేపీ నాయకులు ఒరిస్సా కూడా వెళ్ళి మాఝీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. ఒరిస్పా ప్రమాణ స్వీకారోత్సవంలో వున్న ఒక విశేషం ఏమిటంటే, గత 24 సంవత్సరాలుగా ఒడిషాకు ముఖ్యమంత్రిగా పనిచేసి, ఈమధ్యే తన పదవిని కోల్పోయిన బీజేడీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనడం. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కొత్త ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలపడం మాత్రమే కాకుండా, బీజేపీ నాయకులతో అచ్చట్లు ముచ్చట్లు కూడా పెట్టారు. మరి, మన జగన్ కూడా వున్నాడు. చంద్రబాబు స్వయంగా ఆహ్వానించడానికి ఫోన్ చేసినా ఫోన్‌కి అందుబాటులో లేకుండా తప్పించుకున్నాడు. అక్కడితో ఆగాడా... ఒకవైపు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తూ వున్న సమయంలోనే తన తోక విజయసాయిరెడ్డి చేత ప్రెస్‌మీట్ పెట్టించి, చంద్రబాబు మీద అవాకులు చెవాకులు పేలేలా చేశాడు. నో డౌట్.. ఈ మనిషి మారడు!  ఆ ఒరిస్సా పెద్దాయన పేరు నవీన్.. ఈ ఆంధ్రా చిన్నాయన పేరు జగన్.. ఇద్దరి పేర్లలో కొంచెం పోలిక వుందిగానీ, బుద్ధిలో మాత్రం చాలా తేడా వుంది! 

కువైట్‌లో అగ్ని ప్రమాదం.. 40 మంది భారతీయులు మృతి

కువైట్‌లోని ఒక భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 41 మంది మరణించారు. వీరిలో 40 మంది భారతీయులే. జీవనోపాధి కోసం భారతదేశం నుంచి వచ్చిన వీరందరూ ఒక కంపెనీలో పనిచేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. కువైట్‌లోని దక్షిణ మంగాఫ్ నగరంలోని ఆరు అంతస్తుల భవనంలో బుధవారం ఉదయం 6 గంటల సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ఆ భవనంలో మొత్తం 160 మంది వున్నారు. భవనంలోని కిచెన్‌లో ప్రారంభమైన మంటలు క్షణాల్లోనే భవనమంతా వ్యాపించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో 35 మంది అక్కడికక్కడే మరణించగా, ఆరుగురు చికిత్స పొందుతూ మరణించారు. ఈ ప్రమాదంలో మరో 50 మందికి పైగా గాయపడ్డారు. వారిలో 30 మంది భారతీయులే. ప్రమాదం జరిగిన సమయంలో అందరూ నిద్రలో వుండటం వల్ల మృతుల సంఖ్య పెరిగింది. కువైట్ అగ్నిప్రమాద ఘటనపై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధితులకు సహకారం అందించాలని కువైట్‌లోని భారత రాయబారిని ఆదేశించామని ఆయన తెలిపారు.

గెలిచినప్పటికీ ఎటూ తేల్చుకోలేకపోతున్నాను: రాహుల్ గాంధీ 

సార్వ త్రిక ఎన్నికల్లో    జాతీయ స్థాయిలో ఇండియా కూటమి పరాజయం చెందినప్పటి కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాత్రం డబుల్ ధమాకా కొట్టారు. ఆయన పోటీ చేసిన రెండు లోకసభ నియోజకవర్గాల్లో మంచి మెజార్టీతో గెలుపొందారు. అయితే రాహుల్ గాంధీకి ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. తాను ఏ నియోజకవర్గం నుంచి ప్రాతినిద్యం వహించాలి ఏ నియోజకవర్గం  రాజీనామా చేయాలి అనేది తేల్చుకోలేకపోతున్నారు. వయనాడ్, రాయ్‌బరేలీలలో ఏ నియోజకవర్గంలో కొనసాగాలనేది తేల్చుకోలేకపోతున్నానని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కేరళలోని మలప్పురంలో బుధవారం జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ... ఈ విషయంలో తానూ ఏమీ తేల్చుకోలేకపోతున్నానన్నారు. ఏమైనా తాను ఏదో ఒక నియోజకవర్గానికి మాత్రమే ఎంపీగా ఉండాల్సి ఉంటుందన్నారు. తన నిర్ణయంతో రెండు నియోజకవర్గాలు సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. తనను భారీ మెజార్టీతో గెలిపించిన వయనాడ్ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. దేశంలో విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు అదానీకి అప్పగించాలని దేవుడు ఆదేశించారా? అని ఎద్దేవా చేశారు. తాను మానవమాత్రుడినేనని... తనకు పేదలు, దేశమే దైవమన్నారు. నేనేం చేయాలో వారే చెబుతారన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత మోదీ తన వైఖరిని మార్చుకోవాల్సిందే అన్నారు. ఆయనకు ప్రజలు స్పష్టమైన సందేశం ఇచ్చారని మెజార్టీ రాకపోవడాన్ని ఉద్దేశించి అన్నారు.

కూటమి కృషితో ఉన్నత శిఖరాలకు ఏపీ.. మోడీ ట్వీట్!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన దేశ ప్రధాని నరేంద్ర మోడీ, ఆ కార్యక్రమంలో ఏమీ మాట్లాడలేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒరిస్పాకి వెళ్ళిన మోడీ, ఆ తర్వాత ట్విట్టర్ (ఎక్స్)లో ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు. ‘‘తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఆంధ్రప్రదేశ్ కీర్తిని ఉన్నత శిఖరాలకు చేస్తుంది. ఏపీ నూతన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యాను. ముఖ్యమంత్రితోపాటు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులందరికీ అభినందనలు. రాష్ట్ర యువతరం ఆకాంక్షలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి వుంది’’ అని మోడీ ట్వీట్ చేశారు.

రోగాల పుట్ట జగన్!

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే చాలా రకాల వ్యాధులు వున్నాయని అంటూ వుంటారు. ముఖ్యంగా ఆయనకి మానసిక సమస్యలు చాలా వున్నాయని అంటూ వుంటారు. ఆ మెంటల్ ప్రాబ్లమ్స్ కోసం మందులు లండన్‌ నుంచి వస్తూ వుంటాయని, మొన్నామధ్య ఎలక్షన్లు అయిపోగానే లండన్‌కి వెళ్ళడానికి మెంటల్ ట్రీట్‌మెంట్ కూడా ఒక కారణమని చాలామంది అన్నారు. జగనన్నకి తనలో తాను మాట్లాడుకునే వ్యాధి వుంది. ఈ వ్యాధి లక్షణాలను చాలాసార్లు చూశాం. ఇక బీపీ వుందన్న విషయం ఎవరూ చెప్పకుండానే తెలిసిపోతూ వుంటుంది. ప్రతిపక్షంలో వున్నా, అధికారంలో వున్నా అసెంబ్లీ సమావేశాల సమయంలో అన్నగారి బీపీని తెలుగువాళ్ళందరూ ఆల్రెడీ చూశారు. కాబట్టి, జగన్‌కి హైబీపీ వుంది అనడంలో ఎలాంటి డౌటూ అవసరం లేదు. బీపీ అంత రేంజ్‌లో వుంది కాబట్టి అల్సర్ కూడా వుండే వుంటుంది. అలాగే, సొంతపార్టీ ఎమ్మెల్యేలతో సహా ఎవర్నీ దగ్గరకి రానివ్వరు... ఎవరితోనూ కలవరు కాబట్టి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పుష్కలంగా వుందని అర్థం చేసుకోవచ్చు. దీనికి పూర్తి రివర్స్జ.లో వుండే సుపీరియారిటీ కాంప్లెక్స్ కూడా జగన్ దగ్గర భారీగానే వుందని తెలుస్తూనే వుంటుంది. రెండు కాంప్లెక్సులూ ఒకే మనిషిలో ఈ రేంజ్‌లో వుండటం వైద్య శాస్త్రంలోనే ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. అలాగే జగన్‌కి లేనిది ఉన్నట్టు ఊహించుకునే వ్యాధి కూడా వుంది. అందర్నీ శత్రువుగా చూసే మానసిక వైకల్యం వుంది. అదేవిధంగా, జగన్‌కి ‘నార్సీ’ అనే మానసిక వ్యాధి వుందని చంద్రబాబునాయుడు కూడా చెప్పారు. తానే ఉన్నత స్థానంలో వుండాలి... మిగతావాళ్ళందరూ నాకంటే తక్కువ స్థాయిలో వుండాలి... ఎవర్నయినా సరే సామ, దాన, భేద, దండోపాయాలతో లొంగదీసుకోవాలి... ఇవన్నీ ‘నార్సీ’ మానసిక వ్యాధి లక్షణం. ఈ వ్యాధి అయితే జగన్‌లో టన్నులకు టన్నులు వుంది.  ఇక జగన్‌కి భవిష్యత్తులో రాబోయే రోగాలు ఏమిటన్నది పరిశీలిస్తే, జగన్ తన తాడేపల్లి ప్యాలెస్‌ని వదిలిపెట్టి బయటకి రావడం లేదు కాబట్టి ఎండ తగలకపోవడం వల్ల విటమిన్ ‘డి’ లోపం వచ్చే అవకాశం వుంది. దాని వల్ల ఎముకలు బలహీనం అయిపోయి కేసీఆర్‌కి విరిగినట్టుగా ఏ తుంటో విరిగే ప్రమాదం వుంది. ఇంట్లో కూర్చోవడమే తప్ప చేసే పనేమీ లేదు కాబట్టి ఊబకాయం వచ్చేసే అవకాశం వుంది. తద్వారా మోకాళ్ళ కీళ్ళు అరిగిపోయే అవకాశం వుంది. పనిలోపనిగా సుగర్ కూడా ఎటాక్ అయ్యే అవకాశం వుంది. ఎక్కువ సేపు కూర్చునే వుండటం వల్ల చెప్పుకోలేని చోట కూడా వ్యాధి వచ్చే ఛాన్సు వుంది. కాబట్టి... జగన్ తాడేపల్లి ప్యాలెస్‌ని వదిలిపెట్టి జనంలోకి వస్తూ వుంటే, పాత వ్యాధుల సంగతేమోగానీ, కొత్త రోగాలు రాకుండా వుంటాయి!

అబద్ధాల అవధాని లక్ష్మీపార్వతి!

నోరున్నది ప్రత్యర్థులను ఆడిపోసుకోవడానికే, వారిపై ఇష్టారీతిన విమర్శలు చేయడానికే. ఆధారాలు అక్కర్లేదు.  వాటిని నిరూపించాల్సిన అవసరం లేదు. మసిగుడ్డ చేతిలో ఉన్నట్లు నోట్లో నాలుక ఉంది. చాలు మాటలు అనేయడమే. మంచీ చెడు విచక్షణ అవసరం లేదు.  సమంజసమా కాదా అన్న ఆలోచన లేదు. తాము అంటున్నాం సరే జనం కనీసం నమ్ముతారా, నవ్విపోతారా అన్న సంశయం లేదు. నోటికి ఏది వస్తే అది ఎంతొస్తే అంతా అనేయడమే. గత ఐదేళ్లుగా అధికారంలో ఉండి వైసీపీ అధినేత సహా నేతలు చేసినది అదే.   అభివృద్ధిని విస్మరించి ప్రత్యర్థులపై కక్షసాధింపులు, వేధింపులు, దూషణలే పాలన అంటే... అధికారం అంటే పెత్తనం చెలాయించడం, ఇదేమని ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం  అన్నట్లుగా చెలరేగిపోయిన వైసీపీ నేతలు ఓటమి తరువాత కూడా ఆ వైఖరి మార్చుకోలేదు. ఓటమికి కారణం విపక్ష నేతలే అంటూ సాకులు చెప్పడమే కాదు, ఎవరూ నమ్మడానికి కూడా అవకాశం లేని విధంగా  ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు విన్న వారు నోట మాట రాక నిరుత్తురులౌతున్నారు. ఇలా కూడా మాట్లాడే మనుషులుంటారా? వీళ్లని మనుషులనొచ్చా అని ఆశ్చర్య పోతున్నారు. ఇప్పటికే మాజీ సీఎం మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి..  చంద్రబాబునాయుడు సింగపూర్ లో కూర్చుని టెక్నాలజీని ఉపయోగించి ఈవీఎంలను ట్యాంపర్ చేశారని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి.. చంద్రబాబు ఆ ట్యాంపరింగ్ టెక్నాలజీని రాజమహేంద్రవరం జైల్లో నేర్చుకున్నారని ఆరోపించారు.   స్కిల్ కేసులో జగన్ సర్కార్ ఆయనను అక్రమంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ విషయాన్నే గుర్తు చేస్తూ లక్ష్మీ పార్వతి జగన్ సర్కార్  స్కిల్ కేసులో అన్ని ఆధారాలతో  నారా చంద్రబాబునాయుడిని అరెస్టు చేసి రాజమహేంద్రవరం జైలుకు తరలిస్తే.. ఆయన అక్కడ కూర్చుని ఈవీఎంలను ఎలా ట్యాంపర్ చేయాలో నేర్చుకున్నారని చెబుతున్నారు. జైలులో ఉన్న రహస్య ప్రదేశాలలో ట్యాంపరింగ్ ఎలా చేయాలో నేర్పేవారున్నారట. అలా హరిప్రసాద్ అనే ఆయన చంద్రబాబుకు ఈవీఎంల  ట్యాంపరింగ్ విద్య నేర్పించాడట. ఆ విద్యను ఉపయోగించి చంద్రబాబు ఎలక్షన్ గెలిచారట. లక్ష్మీపార్వతి విమర్శలపై ఆమెను నెటిజన్లు ఓ రేంజ్ లో ఆటాడేసుకుంటున్నారు. 

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు శుభాకాంక్షలు తెలిపిన  రఘునందన్ రావు 

సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోని మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు గెలిచిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీ చేసి ఓడిపోయిన రఘునందన్ రావు పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచారు. ఈ నేపథ్యంలో  రఘ నందన్ రావు  స్పందించారు.   ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో... చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఆంధ్రప్రదేశ్‌ను కొత్త శిఖరాలకు చేరుస్తారని ఆశిస్తున్నానని బీజేపీ సీనియర్ నేత, మెదక్ నుంచి లోక్ సభ సభ్యుడిగా గెలిచిన రఘునందన్ రావు ఆకాంక్షించారు. ఈరోజు చంద్రబాబు ఏపీ సీఎంగా, పవన్ కల్యాణ్ సహా పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ నేపథ్యంలో వారికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రఘునందన్ రావు ఎక్స్ వేదికగా వారికి శుభాకాంక్షలు చెప్పారు. 'ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకు, మంత్రిగా ప్రమాణం చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు' అని పేర్కొన్నారు.

ఇద్దరూ ఇద్దరే.. దొందూ దొందే!

తెలుగు రాష్ట్రాలలో నెలల వ్యవధిలో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. గత ఏడాది డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగగా ఆ ఎన్నికలలో అధికారంలో  ఉన్న బీఆర్ఎస్ సర్కార్ పరాజయాన్ని మూటగట్టుకుని ప్రతిపక్షానికి పరిమితమైంది. ఆ తరువాత మేలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలలో అధికార వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే.. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఈ ఇద్దరూ 2019 ఎన్నికలలో సమష్టిగా పని చేశారు. ఆంధ్రప్రదేశ్ లో  చంద్రబాబు ఓటమికి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేయగలిగిందే కాకుండా చేయకూడనిది కూడా చేశారు. 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఓటమి అనంతరం తెలంగాణ సీఎం హోదాలో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ చేసిన సాయానికి జగన్ క్విడ్ ప్రోకో కింది.. తెలంగాణ రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ ఆస్తులను అప్పనంగా రాసిచ్చేశారు. సెక్రటేరియెట్ లో ఏపీకి చెందిన బ్లాక్ లను ఏకపక్షంగా తెలంగాణకు ఇచ్చేశారు. ఇక గత ఏడాది డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ కోసం జగన్ నాగార్జున సాగర్ డ్యాం వద్ద హై డ్రామాకు తెరలేపి తెలంగాణ సెంటిమెంట్ ఆ రాష్ట్రంలో మరోసారి రగిల్చేందుకు ప్రయత్నించారు. సరే ఆ విషయాలన్నీ పక్కన పెడితే..  అటు కేసీఆర్, ఇటు జగన్ లో కామన్ గా  ఒక నాయకుడికి ఉండకూడని లక్షణాలు ఎన్నో ఉన్నాయి. అహంకారం, అతిశయం, ఎవరైనా తమ మాట వినాలే తప్ప తామెవరి మాటా వినం అన్న వైఖరి ఇరువురిలోనూ ఉన్నాయి. ప్రత్యర్థులను శత్రువులుగా చూడటం, ప్రత్యర్థి పార్టీలను అణచివేయడం, వీలైతే నామరూపాల్లేకుండా చేసేయాతన్న తత్వం ఇద్దరిలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. వారి ఈ తీరు, ఈ వైఖరి, ఈ లక్షణాల కారణంగానే తిరుగులేని విజయాలను అందుకున్న ఇరువురూ కూడా తిరిగి లేవలేనంతగా పతనమయ్యారు. ఇప్పుడు తమతమ రాష్ట్రాలలో రాజకీయ ఉనికి కోసం పాటుపడాల్సిన పరిస్థితికి చేరుకున్నారు. అధికారంలో ఉన్నన్నాళ్లూ తమంత వారే లేరని చుట్టూ తిరిగిన సొంత పార్టీ నాయకులే ఇప్పుడు వారిని ధిక్కరిస్తున్నారు. పార్టీ ఓటమికి బాధ్యత, కారణం మీరేనంటూ నిందిస్తున్నారు.   తెలంగాణలో అధికారంలో ఉండగా చేసిన తప్పిదాలు, తప్పులకు సంబంధించిన కేసులు కేసీఆర్ ను ఉక్కిరి బిక్కిరి చేయనున్నాయి. రానున్న రోజులలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ కు కూడా అదే పరిస్థితి ఎదురు కానుంది. అయితే ఆయనపై ఇప్పటికే అక్రమాస్తుల కేసు విచారణలో ఉంది. ఇహ ఇప్పటి వరకూ సీఎం పదవి పేరు చెప్పి విచారణ నుంచి మినహాయింపు పొందిన ఆయన ఇక ముందు ప్రతీవారం కోర్టు మెట్లు ఎక్కక తప్పక పోవచ్చు. మొత్తం మీద కేసీఆర్, జగన్ ఇరువురూ కూడా తమ అహంకారం కారణంగానే     ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుని అధికారం కోల్పోయారు.