‘విద్యుత్’ వాస్తవాలతో చంద్రబాబు ‘శ్వేతపత్రం’ విడుదల!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ రంగ సమగ్ర పరిస్థితిని ప్రజల ముందు వుంచే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని జగన్ ప్రభుత్వం ఎలా దెబ్బతీసిందో చెప్పి, ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే శ్వేతపత్రం విడుదల చేసినట్టు చంద్రబాబు చెప్పారు.
"ఏ ఎన్నికలలో అయినా రాజకీయ పార్టీలు కాదు.. ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలవాలని పిలుపునిచ్చాం. ప్రజలు గెలిచి మమ్మల్ని గొప్ప స్థానంలో నిలబెట్టారు. రాష్ట్రంలోని అన్ని శాఖల్లోనూ చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. విద్యుత్తుతో ప్రతి ఒక్కరి జీవితం ముడిపడి ఉంది. జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా నాశనం చేసింది. అసమర్థులు పాలకులైతే ఏమవుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలి. విద్యుత్ సంస్కరణల వల్ల నా అధికారం పోయినంది. అయినప్పటికీ, దేశం బాగుపడింది. నేను తెచ్చిన సంస్కరణలు రాజశేఖరరెడ్డి హయాంలో కనిపించాయి. తెలుగుదేశం హయాంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేశాం. విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. 2014-19లో సౌరశక్తి, పవన విద్యుత్ ఉత్పత్తి పెంచాం. 2018 నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఎదిగింది. 2018-19 నాటికి 14,929 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి చేరేలా చేశాం. మా ప్రభుత్వ హయాంలో ట్రాన్స్ కో, జెన్ కోలకు అవార్డులు వచ్చాయి. గత ఐదేళ్లలో జనంపై జగన్ 32,166 కోట్ల రూపాయల ఛార్జీల భారం మోపారు. విద్యుత్ రంగంలో 49,596 కోట్ల రూపాయల అప్పులు చేశారు.
థర్మల్ విద్యుత్తుని గ్రీన్ హైడ్రోజన్‌గా మార్చడానికి పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. గ్రీన్ హైడ్రోజన్ వస్తే అదనంగా పన్నులు వస్తాయి. రూఫ్ టాప్ సౌరశక్తి ఉత్పత్తి పెంచడానికిచర్యలు తీసుకుంటాం. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలపై కమిటీ నిర్ణయిస్తుంది. విద్యుత్ సరఫరాలో నష్టాలు తగ్గించడానికి చర్యలు తీసుకుంటాం. విద్యుత్ రంగాన్ని బోలపేతం చేయడానికి సాంకేతిక సహకారాన్ని తీసుకుంటాం. జగన్ అహంకారం వల్ల ఒక్క పోలవరం ప్రాజెక్టులోనే 4,773 కోట్ల రూపాయల మేర ప్రభుత్వంపై అదనపు భారం పడింది. గత ప్రభుత్వ అసమర్థత వల్ల ఊహించని కోణాల్లో విద్యుత్ సంస్థలకు నష్టాలు వస్తున్నాయి. ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ బాండ్లలో ఏపీ జెన్‌కో, ఏపీ ట్రాన్స్.కో పెట్టుబడులు పెట్టడం చూస్తుంటే జగన్ ప్రభుత్వం ఏ స్థాయి దుష్ట ఆలోచనలు చేసిందో అర్థమవుతోంది.
ట్రూ అప్, ఇంధన సర్‌ఛార్జ్, ఎలక్ట్రిసిటీ డ్యూటీ అని రకరకాల పేర్లతో జగన్ ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేసింది. గృహ వినియోదారులపై ఛార్జీలు 45 శాతం పెంచారు. ఛార్జీల పెంపుతో ఒక కోటి 53 లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. 50 యూనిట్లు వాడిన పేదవారి మీద కూడా వందశాతం ఛార్జీలు పెంచారు. టారిఫ్ ద్వారా 16,699 కోట్ల రూపాయలు, ట్రూ అప్ ద్వారా 5,886 కోట్ల రూపాయలు, ఇంధన ఛార్జీలు 3,977 కోట్ల రూపాయలు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ పేరుతో 5,607 కోట్ల రూపాయలు వసూలు చేశారు. వేల కోట్ల రూపాయల రుణం తీసుకుని విద్యుత్ రంగంపై పెనుభారం వేశారు. ఐదేళ్లలో విద్యుత్ సంస్థల అప్పు 79 శాతం పెరిగింది. విద్యుత్ ఉత్పత్తి నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయాలు కూడా ప్రజలపై భారం మోపాయి. కోర్టు ఆదేశంతో నిర్వహణ ఛార్జీలు 9 వేల కోట్ల రూపాయలు చెల్లించారు. పవన విద్యుత్తుతో చేసుకున్న 21 ఒప్పందాలు రద్దు చేశారు. అసమర్థ పాలనతో విద్యుత్ రంగం 47,741 కోట్ల రూపాయలు నష్ట పోయింది. విద్యుత్ రంగంలో ప్రజలకు, ప్రభుత్వానికి దాదాపు 1,29,503 కోట్ల రూపాయల నష్టం జరిగింది. సాధ్యమైనంత త్వరగా విద్యుత్ రంగాన్ని గాడిలో పెడతాం. భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ వాహనాలు మరింత పెరుగుతాయి. ఎలక్ట్రానిక్ వాహనాల డిమాండ్ మేరకు విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవాలి. టారిఫ్ నియంత్రణపై దృష్టి సారిస్తాం. విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టడానికి కేంద్రం సాయం తీసుకుంటాం. వ్యవసాయ పంప్ సెట్లకు స్మార్ట్ మీటర్లను బిగించే విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటాం” అని చంద్రబాబు వివరించారు.