జగన్ కు అవినాష్ నుంచే అసమ్మతి సెగ?!
posted on Jul 10, 2024 @ 10:18AM
వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయా? జగన్ కు వ్యతిరేకంగా ఆయనకు అత్యంత సన్నిహితంగా మెలిగిన వారు పావులు కదుపుతున్నారా? అంటే జరుగుతున్న పరిణామాలను చూస్తే ఔననే సమాధానమే వస్తుంది.
జగన్ ను వైసీపీ శాసనసభాపక్షం తమ నేతగా ఇప్పటికీ ఎన్నుకోకపోవడం, ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అసలు జగన్ అసెంబ్లీకి హాజరౌతారా లేదా అన్న విషయంలో పార్టీ నేతలు, శ్రేణులకే స్పష్టత లేకపోవడం చూస్తుంటే.. జగన్ కచ్చితంగా సమావేశాలకు హాజరయ్యే ఉద్దేశంలో లేరని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సభలో కనీసం ప్రతిపక్ష హోదాకు అవసరమైనంత మంది సభ్యలు కూడా వైసీపీ నుంచి ఎన్నిక కాలేదు. దీంతో జగన్ అసెంబ్లీలో అడుగుపెట్టి అవమానాల పాలయ్యే కన్నా, పులివెందుల శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి కడప లోక్ సభ నుంచి పోటీ చేసి పార్లమెంటుకు వెళ్లడమే మేలన్న నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాల నుంచే గట్టిగా వినిపిస్తోంది.
అయితే కడప ఎంపీ అవినాష్ రెడ్డి మాత్రం తాను లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి ససేమిరా అంటున్నట్లు వైసీపీ వర్గాలలో చర్చ జరుగుతోంది. తాను పులివెందుల అసెంబ్లీ సభ్యునిగా రాజీనామా చేసి, ఉప ఎన్నికలో అవినాష్ కు పులివెందుల నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తానని జగన్ ఎంతగా చెబుతున్నా అవినాష్ వినడం లేదని కడప జిల్లా వ్యప్తంగా ఓ చర్చ అయితే జోరుగా సాగుతోంది. గతంలో పలువురికి ఇచ్చిన హామీలను జగన్ విస్మరించిన సందర్భాలను ఉటంకిస్తూ అవినాష్ కడప లోక్ సభ స్థానానికి రాజీనామా చేస్తే తన బతుకు కూరలో కరివేపాకులా తయారౌతుందని అనుమానిస్తున్నారని అంటున్నారు.
జగన్ పులివెందుల అసెంబ్లీ సభ్యుడిగా రాజీనామా చేసి, ఆ స్థానం నుంచి తనను నిలబెడతారని అవినాష్ నమ్మడం లేదు. తాను కడప లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే, తద్వారా వచ్చే ఉప ఎన్నికలో ఆ స్థానం నుంచి జగన్ పోటీ చేస్తారు, అందులో అనుమానం లేదు, కానీ జగన్ రాజీనామా చేసిన పులివెందుల స్థానం నుంచి తనకు అవకాశం ఇస్తారని మాత్రం అవినాష్ నమ్మడం లేదని కడప వాసులు అంటున్నారు. ఆ స్థానం నుంచి జగన్ తన సతీమణి భారతిని రంగంలోకి దించుతారని అవినాష్ గట్టిగా నమ్ముతున్నారనీ, అదే జరిగితే తన పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడలా మారడం ఖాయమని ఆయన భయపడుతున్నారు.
జగన్ పై అక్రమాస్తుల కేసులు ఉంటే, తనపై వైఎస్ వివేకా హత్య కేసు ఉందని ఆయన తన రాజీనామా గురించి అడిగిన వారికి గుర్తు చేస్తున్నారు. మొత్తం మీద కడప లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి పార్లమెంటుకు వెళ్లాలన్న జగన్ ఆశలకు అవినాష్ రెడ్డి ఆదిలోనే గండికొడుతున్నట్లుగా కనిపిస్తోందన్న చర్చ అయితే వైసీపీ వర్గాలలోనూ, కడప జిల్లా వ్యాప్తంగానూ జోరుగా సాగుతోంది.