అందితే జుట్టు.. అందకుంటే కాళ్లు.. కేసీఆర్ దారి ఇదేనా?
బీఆర్ఎస్ రోజు రోజుకూ బలహీనపడుతోందా, ఆ పార్టీ అస్థిత్వమే ప్రమాదంలో పడిందా? ఆ పార్టీకి రాజకీయ భవిష్యత్తు శూన్యమేనా? అంటే తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో అవుననే సమాధానం రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. పదేళ్లు తెలంగాణ రాజకీయాలను శాసించిన కేసీఆర్.. కేంద్రంలోనూ చక్రం తిప్పేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేసుకొని దేశ రాజకీయాల్లో కీ రోల్ పోషించాలని ఉవ్విళ్లూరారు. కానీ, రాజకీయాల్లో అన్నిరోజులు మనకు అనుకూలంగా ఉండవనేది జగమెరిగిన సత్యం. తెలంగాణ ప్రజలు ఇచ్చిన షాక్ కు అధికారం కోల్పోయిన కేసీఆర్, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న ముప్పేట దాడిని ఎలా ఎదుర్కోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఒకవైపు మద్యం కుంభకోణం కేసులో కూతురు కవిత కొన్ని నెలలుగా జైల్లోనే ఉంటున్నారు. ఆమెను బయటకు తీసుకొచ్చేందుకు కోర్టుల ద్వారా విశ్వప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. మరో వైపు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేజారిపోతున్నారు. వారిని కాపాడుకొనేందుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. అన్ని వైపుల నుంచి ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించుకోవాలంటే ఓ అడుగు వెనక్కు వేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలతో రాజీ మార్గాన్ని అన్వేషిస్తున్నట్లు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ (అప్పట్లో టీఆర్ఎస్) తెలంగాణలో తిరుగులేని శక్తిగాఉంది. ప్రత్యేక తెలంగాణ అవతరణ అనంతరం జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ స్వల్ప ఆధిక్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నుంచి అనేక మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ మరోసారి బీఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో ప్రజలకు చాలా చేశాం.. ఇక దేశ ప్రజలకు సేవ చేయాలన్న భావనకువచ్చిన కేసీఆర్.. కేంద్ర రాజకీయాలపై దృష్టి కేంద్రీకరించారు. ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ గా చేసుకొని కేంద్రంలో ఎన్డీయే, కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలను కలుపుకొని చక్రం తిప్పాలని కేసీఆర్ విశ్వప్రయత్నాలు చేశారు. ఒకానొక సందర్భంలో కాబోయే ప్రధాన మంత్రిని నేనే అంటూ కేసీఆర్ చెప్పడం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. కానీ, సీన్ కట్‌చేస్తే.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు బిగ్ షాకిచ్చారు. బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. అయితే, పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తే మళ్లీ రాజకీయంగా పుంజుకోవచ్చని భావించిన కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు మరో బిగ్ షాకిచ్చారు. ఒక్క ఎంపీ స్థానంలోనూ ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించలేక పోయారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం, సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టడంతో కేసీఆర్ కు కష్టాలు మొదలయ్యాయి. తెలంగాణలో పదేళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై రేవంత్ రెడ్డి గురిపెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దృష్టిసారించిన రేవంత్ సర్కార్.. కేసీఆర్ ను కటకటాలపాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సమయంలో బీఆర్‌ఎస్ పార్టీ నుంచి విజయం సాధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను రేవంత్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్, ప్రకాష్ గౌడ్ లాంటి నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థంపుచ్చుకున్నారు. మరో పది మంది కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. వీరిని కట్టడి చేసేందుకు కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఎక్కడా ఫలితాన్ని ఇవ్వడం లేదు. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో రోజురోజుకు ఆందోళన వ్యక్తమవుతోంది. ద్వితీయ శ్రేణి నేతలు సైతం భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. తాజా పరిణామాలతో క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ బలహీన పడుతోంది. పార్టీ క్యాడర్ ను కాపాడుకునేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు సఫలం కాకపోగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎదురయ్యే ఇబ్బందులు తట్టుకోవటం కేసీఆర్ కు కష్టంగా మారింది. దీంతో పార్టీ భవిష్యత్ ను పక్కన పెట్టిన కేసీఆర్.. ప్రస్తుతం ఎదురవుతున్న ఇబ్బందుల నుంచి తప్పించుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో రాజీ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో ఏనిమిది మంది కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ కు విపక్ష హోదా లేకుండా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి ఆగ్రహానికి అడ్డుకట్ట వేసేందుకు.. తనకు అనుకూలమైన కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని సూచించినట్లు తెలుస్తోంది. వారి ద్వారా కాంగ్రెస్ పెద్దలతో రాజీ కుదుర్చుకొని పలు కేసుల్లో విచారణ నుంచి బయటపడేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరో వైపు కేంద్రంలోని బీజేపీని శాంతింపజేసేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ రాజ్యసభ పక్షం బీజేపీలో విలీనం అయ్యేందుకు ఏర్పాట్లు పూర్తయినట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీకి ఉన్న నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరబోతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీఫ్ ధన్ ఖడ్ తో సమావేశం అయ్యారనీ, ఆ సమావేశంలో విలీన అంశంపై చర్చలు జరిపారని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాజ్యసభలో బీజేపీకి బలం అవసరం. పూర్తి మెజార్టీ లేదు. అందుకే రాజ్యసభ ఎంపీలను విలీనం చేసుకోవాలన్న ఆలోచనకు కేంద్ర బీజేపీ పెద్దలు వచ్చినట్లుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తద్వారా కవితను జైలు నుంచి బయటకు తీసుకురావడంతోపాటు, కేంద్రం నుంచి ఎదురయ్యే ఇబ్బందుల నుంచి బయట పడొచ్చని కేసీఆర్ భావిస్తున్నారని అంటున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల టార్గెట్ నుంచి కేసీఆర్, ఆయన ఫ్యామిలి కాస్త బయటపడినట్లేనని తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.