బీజేపీ ప్రసన్నం కోసం హస్తినలో కేటీఆర్ పడిగాపులు!?
posted on Jul 10, 2024 @ 11:11AM
బీఆర్ఎస్ పార్టీ సొంతంగా బలోపేతం కావడంపై ఆశలు వదిలేసుకుందా? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అండదండలు ఉంటే చాలన్న పరిస్థితికి వచ్చేసిందా? అంటే ఆ పార్టీ అడుగులు చూస్తుంటే ఔనన్న సమాధానమే వస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న కవితను బెయిలుపై తీసుకువచ్చేందుకు హస్తిన వెళ్లిన కేటీఆర్, కేసీఆర్ గత కొన్ని రోజులుగా అక్కడే మకాం వేశారు. కవిత బెయిలు కోసం వారు చేస్తున్న ప్రయత్నాలు ఏమిటో పెద్దగా బయటకు రాలేదు కానీ, మంగళవారం (జులై 9)న వారు హస్తినలో మీడియాతో మాట్లాడిన మాటలు వింటే మాత్రం బీజేపీని ప్రసన్నం చేసుకోవడమే వారి టాస్క్ అన్నట్లుగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
హస్తిన వేదికగా కేటీఆర్ మీడియా సమావేశంలో ఢిల్లీ మద్యం కుంభకోణం లో కవిత అరెస్టు అక్రమం అని చెప్ప లేదు. అలాగే బీజేపీ రాజకీయ ప్రత్యర్థులపై ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను ప్రయోగించి వేధిస్తోందన్న విమర్శలూ చేయలేదు. మరి ఆయన ఆ మీడియా సమావేశంలో మాట్లాడిందేమిటి? అంటే అసందర్భంగా కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. ఆ విమర్శలు కూడా మోడీని మెప్పించే విధంగా ఉన్నాయి. అంటే మోడీ కాంగ్రెస్ పైనా, రాహుల్ గాంధీపైనా ఏ లైన్ లో అయితే విమర్శలు చేస్తారో కేటీఆర్ కూడా అదే లైన్ ను పట్టుకుని అవే విమర్శలను గుప్పించారు.
సాధారణంగా ప్రాంతీయ పార్టీల నాయకులు హస్తిన వేదికగా మీడియా సమావేశం ఏర్పాటు చేయాల్సి వస్తే వారు జాతీయ మీడియా కంటే తమ రాష్ట్ర మీడియాలో ఎక్కువ కవరేజ్ రావాలని కోరుకుంటారు. కానీ కేటీఆర్, హరీష్ రావులు మాత్రం తమ ప్రెస్ మీట్ వివరాలు జాతీయ మీడియా కవరేజ్ బాగుండాలని భావించారు. అందుకే వారు హస్తినలో మీడియా సమావేశం పెట్టి జాతీయ మీడియా దానిని విస్తృతంగా కవర్ చేసే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ బీజేపీ లక్ష్యంగా విమర్శలు గుప్పించింది. ఆ పార్టీ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఒక అడుగు ముందుకు వేసి మోడీనే టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు.
అయితే ఇప్పుడు హస్తిన వేదికగా కేటీఆర్ తన ప్రసంగంలో ఎక్కడా మోడీని పల్లెత్తు మాట అనలేదు. కాంగ్రెస్ టార్గెట్ గానే ఆయన విమర్శల ఝరి సాగింది. మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీనే టార్గెట్ చేశారు. ఇదంతా బీజేపీని, మోడీని మెప్పించడానికేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరి కేటీఆర్ ప్రయత్నాలు ఫలించాయా? లేదా? అన్నిది రానున్న రోజులలో తెలుస్తుంది.