విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రతిపాదన వెనక్కి?
posted on Jul 10, 2024 @ 2:16PM
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత గత ఐదేళ్లుగా రాష్ట్రం మొత్తాన్ని ఆందోళనకు గురి చేసిన రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇసుక విధానం ఇలా ఒక్కటొక్కటిగా పరిష్కారం అవుతున్నాయి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వాటి విషయంలో నిర్ణయాలు అమలులోకి వస్తున్నాయి. తాజాగా విశాఖ ఉక్కు ప్రైవేటీ కరణ నుంచి కేంద్రం వెనక్కు తగ్గిందన్న వార్త యావత్ ఆంధ్ర ప్రజానీకాన్నీ ఆనందంలో మునిగి తేలేలా చేసింది.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ పోరాడి మరీ సాధించుకున్న విశాఖ పట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయడానికి కేంద్రం నిర్ణయించుకోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. కేంద్రం ప్రతిపాదనను కనీసం వ్యతిరేకించడానికి కూడా గత వైసీపీ అదే జగన్ సర్కార్ సాహసించలేదు. కేంద్రం నిర్ణయాన్ని కాదంటే.. మోడీకి ఎక్కడ కోపమొస్తుందో అన్నట్లుగా జగన్ వ్యవహరించారు. అయితే రాష్ట్రంలో జగన్ సర్కార్ పతనమై చంద్రబాబు సర్కార్ కొలువుదీరిన తరువాత ఏపీ ప్రజల అస్థిత్వ ప్రతీక అయిన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంలో కేంద్రం వెనక్కు తగ్గిన సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ లో కీలక భాగస్వామి అయిన తెలుగుదేశం ఎన్నికల సమయంలోనే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం కానీయబోమని హామీ ఇచ్చింది. అవసరమైతే విశాఖ ఉక్కు కర్మాగారం నిర్వహణ బాధ్యతను రాష్ట్రమే తీసుకుంటుందన్న భరోసాను కూడా ప్రజలకు కల్పించింది.
ఇప్పుడు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి గురువారం (జులై 11) విశాఖ పర్యటనకు రానున్నారు. ఆ సందర్భంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉపసంహరణ విషయంలో కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పర్యటనలో కేంద్ర మంత్రి కుమారస్వామి ప్రధానంగా విశాఖ ఉక్కు కర్మాగారం ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు ఏం చర్యలు చేపట్టాలి అన్న అంశంపై అధికారులతో పాటు ప్లాంట్ కార్మికులు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారితో చర్చించనున్నారు. ఇప్పటికే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు రాష్ట్రంలోని తెలుగుదేశం కూటమి ససేమిరా అంటున్న సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామ్యపక్షమైనందున రాష్ట్ర ప్రభుత్వ అభీష్ఠానికి వ్యతిరేకంగా కేంద్ర మంత్రి నిర్ణయం తీసుకునే అవకాశాలు దాదాపుగా లేవని అంటున్నారు.
విశాఖ ఉక్కులో కేంద్ర ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ప్రకటన తరువాత కేంద్ర మంత్రి విశాఖకు రావడం ఇదే తొలిసారి.పెట్టుబడుల స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో కలపాలని ఉద్యోగులు కోరుతుండగా… ప్లాంట్ నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెప్పాలని , ప్రైవేటీకరణ యోచన మానాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి విశాఖ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గురువారం చర్చల తర్వాత హైదరాబాద్ లోని ఎన్.ఎం.డీ.సీ అధికారులతో కేంద్రమంత్రి కుమారస్వామి చర్చలు జరుపుతారు. ఎన్.ఎం.డీ.సీకి ఐరన్ ఓర్ గనులున్న నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు.