భారతీయుడు 2’ టీమ్‌కి రేవంత్ అభినందనలు
posted on Jul 9, 2024 @ 3:34PM
కొంత కాలం క్రితం హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం రేగిన విషయం తెలిసిందే. అప్పట్లో ప్రభుత్వం దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి డ్రగ్స్‌ని విస్తరింపజేస్తున్న కొంతమందిపై చర్యలు తీసుకుంది. అయితే ఇటీవలికాలంలో ఈ డ్రగ్స్‌కి సంబంధించిన కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఆమధ్య బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్ వినియోగం జరిగిందన్న విషయం పెద్ద సంచలనమే సృష్టించింది. అది మరచిపోకముందే హైదరాబాద్‌లోని ఖాజాగూడలోని ఓ పబ్‌లో డ్రగ్స్ వాడుతున్నారన్న పక్కా సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఆ పబ్‌పై దాడి చేసి పలువురు యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు.
ఇలా దాదాపు ప్రతి రోజూ ఏదో ఒక మూల మనం డ్రగ్స్ మాట వింటూనే ఉన్నాం. డ్రగ్స్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. డ్రగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నట్టు ప్రకటించింది. దానికి అందరి మద్దతు కావాలన్న ఉద్దేశంతో సినిమాలకు సంబంధించిన ఈవెంట్స్‌లోగానీ, మరేదైనా పబ్లిక్ ఫంక్షన్స్‌లోగానీ ప్రముఖులంతా డ్రగ్స్‌పై అవగాహన కలిగించేలా సందేశాలు ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. అందులో భాగంగానే సోమవారం జరిగిన ‘భారతీయుడు2’ చిత్రానికి సంబంధించిన ఈవెంట్‌లో హీరోలు కమల్‌హాసన్, సిద్ధార్థ్, నటుడు సముద్రఖని, దర్శకుడు శంకర్ డ్రగ్స్‌కి వ్యతిరేకంగా తమ వాణిని వినిపించారు. ‘సే నో టు డ్రగ్స్’ అంటూ ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేశారు.
దీనిపై ఎక్స్ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రజా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి మద్దతుగా నిలిచిన కమల్‌హాసన్, సిద్ధార్థ్, సముద్రఖని, శంకర్ కలిసి ఓ అవగాహన వీడియో చేసినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాదు, ‘భారతీయుడు2’ చిత్ర యూనిట్‌కి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ చిత్రం జూలై 12న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కానుంది.