చట్నీ గిన్నెలో ఎలుక స్విమ్మింగ్!

సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్ జేఎన్టీయూ కాలేజీ హాస్టల్లోని చట్నీ గిన్నెలో ఎలుక స్విమ్మింగ్ చేసింది. విశాలంగా వున్న చట్నీ గిన్నెలో సదరు ఎలుకమ్మ ప్రొఫెషనల్ స్విమ్మర్‌లాగా ఈత కొట్టింది. ఈ నేపథ్యంలో హాస్టల్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్లో తమకు నాణ్యమైన ఆహారం ఇవ్వడం లేదని ఆరోపించారు. క్యాంటిన్ సిబ్బంది పరిశుభ్రత పాటించడం లేదని వారు అంటున్నారు.  చట్నీ గిన్నెలో ఈదుతున్న ఎలుక విజువల్స్.ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ నేపథ్యంలో జేఎన్టీయూ కాలేజ్ ప్రిన్సిపాల్ నరసింహ స్పందించారు. విద్యార్థులు తినే చట్నీ గిన్నెలో ఎలుక పడలేదని, శుభ్రం చేయడానికి పక్కన పెట్టేసిన చట్నీ గిన్నెలో ఎలుక పడిందని చెప్పారు. కొంతమంది విద్యార్థులు కావాలనే వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పెట్టడం, ప్రజా ప్రతినిధులకు పంపించడం చేశారని వివరించారు. 

ఏపీ బడ్జెట్ ఎప్పుడు?

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎప్పుడన్నదానిపై క్లరిటీ రాలేదు. ఈ నెల 22 నుంచి ఐదు రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు కనిపించడం లేదు. అయితే మరి కొంత కాలం పాటు తాత్కాలిక బడ్జెట్ కోసం అర్డినెన్స్ తీసుకువచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.  రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం కొలువుదీరి నెలరోజులు అయ్యింది.  గత ఐదేళ్ల పాలనలో జగన్ తన ఆర్థిక అరాచకత్వంతో  రాష్ట్రాన్ని దివాళా అంచున నిలిపారు. అంతే కాకుండా  ఇష్టారీతిగా నిధుల మళ్లింపు, ఎక్కడ నుంచి ఏది తాకట్టు పెట్టి తెచ్చారో తెలియని విధంగా జగన్ సర్కార్ చేసిన అప్పులతో ప్రస్తుతం ఏ శాఖ పరిస్థితి ఎలా ఉంది అన్న విషయం ఆకళింపు చేసుకోవడానికీన, ఆయా శాఖల ఆర్థిక పరిస్థితిపై ఒక అవగాహనకు రావడానికి ఆయా శాఖల మంత్రులకు కొంత సమయం పడుతుంది. దీంతో ఇప్పటికిప్పుడు పూర్తి స్థియి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లేదని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే పూర్తి స్థాయి బడ్జెట్ కు బదులుగా ఓటాన్ అక్కౌంట్ బడ్జెట్ ప్రవేశ పెడితే ఎలా ఉంటుందన్న విషయాన్ని చంద్రబాబు సర్కార్ తీవ్రంగా పరిశీలిస్తోంది. వివిధ శాఖల్లోని ఆర్థిక పరిస్థితిపై మంత్రులకు పూర్తి స్పష్టత రావడానికి కొంత సమయం పడుతుంది. దీంతో ఇప్పటికప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టడానికి బదులుగా తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెడితే ఎలా ఉంటుంది..? అనే అంశంపై ఆర్థిక శాఖ సమాలోచనలు జరుపుతోంది. ఈ పరిస్థితుల్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను కొనసాగిస్తూ ఆర్డినెన్స్ తీసుకువచ్చి, ఆ తరువాత రెండు మూడు నెలల సమయం తీసుకుని పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలని యోచిస్తున్నది. అంతే కాకుండా ఈ నెల మూడో వారంలో కేంద్ర విత్తమంత్రి నిర్మలాసీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయింపులు ఎలా ఉన్నాయన్నది చూసి, వాటిని కూడా పరిగణనలోనికి తీసుకుని అప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ ను సర్వజనామోదయోగ్యంగా ఉండేలా ప్రవేశపెట్టాలని చంద్రబాబు యోచిస్తన్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఏది ఏమైనా ఈ నెల 22 నుంచి ఐదు రోజుల పాటు జరిగే అసెంబ్లీ సెషల్ లో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశాలు ఇసుమంతైనా లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఓటాన్ అక్కౌండ్ బడ్జెట్ తో సరిపెట్టేసి కొంత వ్యవధి తీసుకుని పూర్తి స్థాయి బడ్జెట్ ను అన్న శాఖలకూ, అన్ని వర్గాల ప్రజలకూ సమ ప్రాధాన్యత ఇస్తూ రూపొందించాలని  ప్రభుత్వం భావిస్తున్నది. అయితే ఈ విషయంలో మరంత క్లారిటీ రావాల్సి ఉంది. ఏది ఏమైనా చంద్రబాబు నిర్ణయం మేరకే ఏపీ బడ్జెట్ ప్రవేశ పెట్టేదెన్నడు అన్నది ఆధారపడి ఉంటుంది. ఈ నెల 16న జరగనున్న కేబినెట్ భీటీలో బడ్జెట్ పై పార్తి క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.  

జగన్‌కి కడుపు నొప్పి!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య పదేళ్ళ తర్వాత సుహృద్భావ వాతావరణంలో జరుగుతున్న చర్చలు చూసి జగన్మోహన్‌రెడ్డికి కడుపు ఉబ్బరం బాగా పెరిగిపోయిందని, ఆయన ఈ పరిణామాలు చూసి తట్టుకోలేక కడుపునొప్పితో బాధపడుతున్నారని తెలుగుదేశం సీనియర్ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. గత పదేళ్ళుగా తెలంగాణ అధికారంలో వున్న కేసీఆర్ గానీ, ఐదేళ్ళుగా కేసీఆర్‌తో రాసుకుని పూసుకుని తిరిగిన జగన్ గానీ, రెండు రాష్ట్రాల మధ్య వున్న విభజన వివాదాలను తొలగించే ప్రయత్నం చేయలేదని, ఇప్పుడు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తుంటే  చూసి తట్టుకోలేక జగన్ అండ్ కో విమర్శలు చేస్తున్నారని దేవినేని అన్నారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీని ప్రత్యక్ష ప్రసారం చేయాలని డిమాండ్ చేయడం ఇలాంటి కడుపునొప్పిలో భాగమేనని దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు.

కోహ్లీ... అడ్డంగా దొరికిపోయావుగా!

ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెందిన పబ్ మీద బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్ణీత సమయం దాటిన తర్వాత కూడా కార్యకలాపాలు నిర్వహిస్తూ వుండటంతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం సమీపంలో కోహ్లీకి చెందిన వన్8 కమ్యూన్‌తోపాటు మరికొన్ని పబ్‌లు నిర్ణీత సమయం దాటిన తర్వాత కూడా కొనసాగుతున్నాయని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా వాటి నుంచి పెద్ద శబ్దంతో సంగీతం వస్తోందని ఫిర్యాదు చేసినవారు పేర్కొన్నారు. అర్ధరాత్రి ఒంటిగంట వరకే అనుమతి వున్నప్పటికీ, ఆ తర్వాత కూడా తెరిచే వుంచడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాథమికంగా వన్8 కమ్యూన్ పబ్ మేనేజర్ మీద కేసు నమోదు చేశారు. విరాట్ కోహ్లీకి బెంగళూరుతోపాటు ఢిల్లీ, ముంబై, పూణె, కోల్‌కతాల్లో కూడా పబ్‌లు వున్నాయి.

అమెరికాలో మోసం.. తెలుగువాళ్ళ అరెస్టు!

అమెరికాలో నలుగురు తెలుగువాళ్ళని పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ కంపెనీలు సృష్టించి, కొంతమందితో బలవంతంగా పనిచేయించుకున్న నేరం మీద వీరిని అరెస్టు చేశారు. అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు వందమందికి పైగా వీరి ఆధ్వర్యంలో పనిచేస్తున్నట్టు తెలిసింది. పోలీసులు జరిపిన సోదాల్లో ఒక్క ఇంట్లోనే పదిహేను మంది పనిచేస్తున్నట్టు గుర్తించారు. ప్రిన్స్.టన్‌లోని గిన్స్.బర్గ్ లేన్‌లో ఒక ఇంట్లో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. సంతోష్ కట్కూరికి చెందిన ఆ ఇంట్లో పోలీసులు సోదాలు జరిపారు. ఆ ఇంట్లో మొత్తం 15 మందితో సంతోష్ కట్కూరి భార్య ద్వారక పని చేయిస్తున్నట్టు తేలింది. వీరంతా బలవంతంగా పనిచేస్తున్నట్టు పోలీసులు విచారణలో వెల్లడైంది. పోలీసులు అక్కడ నుంచి ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు, ప్రింటర్లు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత జరిపిన దర్యాప్తులో ప్రిన్స్.టన్, మెలిసా, మెకెన్సీ ప్రాంతాల్లో కూడా బాధితులను గుర్తించారు. ఎలక్ట్రానిక్ పరికరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు వీరు అక్రమంగా కంపెనీలు ఏర్పాటు చేసి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని తేల్చారు. సంతోష్, ద్వారకతోపాటు చందన్ దాసిరెడ్డి, అనిల్ మాలెని అరెస్టు చేశారు. 

22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. జగన్ హాజరయ్యేనా?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలలో తొలి రోజు గవర్నర్ అబ్దుల్ నజీన్ ప్రసంగిస్తారు. ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత జరుగుతున్న తొలి అసెంబ్లీ సమావేశాలు కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవలి ఎన్నికలలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న వైసీపీ పార్టీకి సభలో ఆ పార్టీ అధినేత జగన్ తో కలిసి కేవలం 11 మంది సభ్యలు మాత్రమే ఉన్నారు. కాగా అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం సందర్భంగా జగన్ వ్యవహరించిన తీరును గమనించిన వారెవరూ ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశాలున్నాయని భావించడం లేదు.  జగన్ వినతిని మన్నించి సాధారణ ఎమ్మెల్యే అయినా ఆయనకు మంత్రుల తరువాత ప్రమాణ స్వీకారం చేసే అవకాశాన్ని చంద్రబాబు ఉదారంగా ఇచ్చారు. అయినా కూడా జగన్  ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత సభలో కూర్చోకుండానే వెళ్లిపోయారు. ఆ తరువాత కూడా తనకు సభలో అవమానం జరిగిందన్నట్లుగా మాట్లాడారు. అక్కడితో ఆగకుండా కేవలం 11 మంది సభ్యుల బలమే ఉన్నప్పటికీ తమ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలనీ, తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాలనీ కోరుతూ  స్పీకర్ కు లేఖ రాశారు. ఆ లేఖపై స్పీకర్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు అది వేరే సంగతి కానీ, జగన్ తీరు చూస్తుంటే... సభలో తనకు గౌరవం లభించడం లేదు కనుక హాజరు కాలేనని చెప్పుకోవడానికి ముందు నుంచే ప్రయత్నాలు ప్రారంభించేశారని అనుకోవలసి ఉంటుంది. ఆయన తీరు చూస్తుంటే సభకు హాజరయ్యే అవకాశాలు ఇసుమంతైనా లేవనే పరిశీలకులు అంటున్నారు. అదీ కాక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టడాన్ని అవాయిడ్ చేయడానికి ఆయన కడప నుంచి లోక్ సభకు పోటీ చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కూడా చెబుతున్నారు. అంటే కడప లోక్ సభ స్ధానం నుంచి అవినాష్ చేత రాజీనామా చేయించి ఉప ఎన్నికలో తాను పోటీ చేయాలని జగన్ భావిస్తున్నట్లు సామాజిక మాధ్యమంలో  వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాను ఖాళీ చేసిన పులివెందుల స్థానం నుంచి అవినాష్ ను నిలబెట్టాలని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. అది నిజమా కాదా అన్నది పక్కన పెడితే  అసెంబ్లీ సమావేశాలకు జగన్ డుమ్మా కొట్టేందుకే ఎక్కువ అవకాశాలున్నయన్నది మాత్రం ఎక్కువ మంది నమ్ముతున్నారు. గతంలో తాను సభానాయకుడిగా అంటే ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో విపక్ష సభ్యుల పట్ల ప్రవర్తించిన విధంగానే ఇప్పుడు అధికార పక్ష నేతలు తన పట్ల ప్రవర్తిస్తారన్న భయమే అందుకు కారణమని అంటున్నారు. అయినా అసలు ఇప్పటి వరకూ వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ ను తమ పార్టీ శాసన సభాపక్ష నేతగానే ఎన్నుకోలేదు. అంటే జగన్ కు అసెంబ్లీకి హాజరయ్యే ఉద్దేశమేలేదనడానికి ఇదే తార్కానమని పరిశీలకులు అంటున్నారు. చూడాలి మరి 22 నుంచి ఆరంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరౌతారా లేదా?

నాలుగు వడ్డిస్తేగానీ పిన్నెల్లి దారిలోకి రాడు..!

ఈవీఎం, పగలగొట్టడం, సీఐ మీద రాయితో దాడి చేయడం నేరాల మీద రిమాండ్‌లో వున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసులు తమదైన శైలిలో నాలుగు వడ్డిస్తే తప్ప నోట్లోంచి నిజం బయటకి వచ్చేట్టు లేదు. ప్రస్తుతం ఆయన అందరికీ తెలిసిన నిజాలను కూడా అబద్ధాలుగా చెప్పే పనిలో తెలివితేటల ప్రదర్శన చేస్తున్నారు. ఈ తెలివితేటలు ఎంత ముదిరిపోయాయంటే, ‘‘నేనసలు ఈవీఎం పగలగొట్టలేదు’’ అని చెప్పే రేంజ్‌కి వెళ్ళిపోయాయి. ‘‘పోలింగ్ రోజున పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రానికి నేను వెళ్ళలేదు. ఈవీఎంని పగలగొట్టలేదు. నంబూరి శేషగిరిరావు ఎవరో నాకు తెలియదు. ఆరోజు నావెంట గన్‌మన్లు’’ లేరు అంటూ పోలీసుల విచారణలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పారు. పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేయడమే కాకుండా, అడ్డొచ్చిన తెలుగుదేశం పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు మీద పిన్నెల్లి దాడి చేశారు. ఈ ఘటన మీద కేసు నమోదైంది. మర్నాడు పరామర్శల పేరుతో కారంపూడిలో భారీగా అల్లర్లకు పాల్పడటమే కాకుండా, విధుల్లో వున్న సీఐ నారాయణస్వామి మీద రాయితో దాడి చేశారు. ఈ ఉదంతం మీద కూడా కేసు నమోదైంది. ఈ కేసులకు సంబంధించి నెల్లూరు సెంట్రల్ జైల్లో వున్న పిన్నెల్లి నుంచి మరింత సమాచారం రాబట్టడం కోసం కోర్టు అనుమతితో సోమవారం నాడు పల్నాడు జిల్లా గురజాల డీఎస్సీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో పిన్నెల్లి ఈ రకమైన వింత సమాధానాలు చెబుతున్నారు. ప్రపంచమంతా చూసిన సంఘటన, ఆయన పార్టీ నాయకుడు జగన్ కూడా ఒప్పుకుంటున్న సంఘటన పిన్నెల్లి ఈవీఎం పగులగొట్టిన సంఘటన. ఇప్పుడు పిన్నెల్లి తానసలు పోలింగ్ కేంద్రానికి వెళ్ళలేదని, ఈవీఎం పగులగొట్టలేదని అంటున్నారంటే ఆయన ఎంతకి తెగించారో అర్థమైపోతోంది. పోలీసులు తమదైన శైలిలో నాలుగైదు వడ్డిస్తే తప్ప పిన్నెల్లి నోట్లోంచి నిజాలు వచ్చేట్టు లేవు.

తెలంగాణలో చంద్రబాబు ఎంట్రీ.. కాంగ్రెస్ లో కంగారు!

ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో  తెలుగుదేశం కూట‌మి భారీ మెజార్టీతో అధికారంలోకి వ‌చ్చింది. సీఎంగా చంద్ర‌బాబు బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటినుంచి ఏపీ అభివృద్ధిపై దృష్టిపెట్టారు. ఇప్ప‌టికే ప‌లు రంగాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. అదే సమయంలో సంక్షేమాన్నీ విస్మరించడం లేదు. ఐదేళ్ల కాలంలో అభివృద్ధికి నోచుకోని ఏపీ ప్ర‌జ‌లు చంద్ర‌బాబు దూకుడుతో సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రోవైపు ప‌ద‌హారు ఎంపీ స్థానాల‌తో కేంద్రంలో తెలుగుదేశం అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. ఎన్డీయే ప్ర‌భుత్వం అధికారంలో కొన‌సాగ‌డానికి తెలుగుదేశం మద్దతు అత్యవసరం.  దీంతో గ‌తంలో ఎప్పుడూలేనంత ఉత్సాహం తెలుగుదేశం శ్రేణుల్లో క‌నిపిస్తోంది. బాబు విజన్ కు అనుగుణంగా ఏపీ ప్రగతికి, పురోగతికి కేంద్రం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందుతాయనీ, ఎందుకంటే మోడీ సర్కార్ కు తెలుగుదేశం మద్దతు కీలకమనీ అంటున్నారు. మొద‌టి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య ఎలాంటి విబేధాలు  లేకుండా అభివృద్ధి చెందాల‌నేది తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు ఆకాంక్ష‌.  ఏపీలో అధికారంలోకి వ‌చ్చిన కొద్ది రోజుల‌కే రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య విభ‌జ‌న స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై చంద్ర‌బాబు దృష్టి కేంద్రీక‌రించారు. ఈ క్ర‌మంలో ఇటీల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను విడ‌త‌ల వారిగా ప‌రిష్క‌రించుకోవాల‌ని రెండు రాష్ట్రాల సీఎంలు నిర్ణ‌యించారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. చంద్ర‌బాబు తెలంగాణలో అడుగు పెట్ట‌డంతో తెలంగాణ‌లోని ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ పార్టీతో పాటు  కాంగ్రెస్ పార్టీ  సైతం ఉలిక్కిపడుతున్నారు. తమ కాళ్ల కింద భూమి కదిలిపోతుందన్నంత కంగారు పడుతున్నారు.  ఏపీ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత చంద్ర‌బాబు నాయుడు ఇటీవ‌ల తొలిసారి తెలంగాణ‌లో అడుగుపెట్టారు. ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్ లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత‌ల‌తో స‌మావేశం అయ్యారు. రాష్ట్ర న‌లు మూల‌ల నుంచి భారీ సంఖ్య‌లో తెలుగుదేశం కార్య‌క‌ర్త‌లు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు. ఈ క్ర‌మంలో తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ బ‌లోపేతంపై దృష్టిపెడ‌తాన‌ని,  మంచిరోజులు రాబోతున్నాయ‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించ‌డం తెలంగాణ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారింది. తెలంగాణ‌లో చంద్ర‌బాబు అడుగు పెడుతున్నారంటే బీఆర్ఎస్ నేత‌ల్లో ఆందోళ‌న ఉంటుంది. ఎందుకంటే, తెలంగాణ‌లో  తెలుగుదేశం బ‌లోపేతం అయితే బీఆర్ఎస్ పార్టీకి ఆద‌ర‌ణ త‌గ్గుతుంద‌ని ఆ పార్టీ నేత‌ల భ‌యం. ఈ భావ‌న‌తోనే  చంద్ర‌బాబు తెలంగాణ రాజ‌కీయాల‌పై ఎప్పుడు ప్ర‌స్తావించినా బీఆర్ఎస్ నేత‌లు ప్రెస్‌మీట్లు పెట్టి చంద్ర‌బాబు వ‌స్తున్నారు.. మ‌ళ్లీ తెలంగాణ, ఏపీ క‌లిసిపోతాయంటూ రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్ట‌డం ప‌రిపాటిగా మారుతూ వ‌స్తుంది.  చంద్ర‌బాబును తెలంగాణకు శ‌త్రువుగా చూపించ‌డంలో బీఆర్ఎస్ అప్పట్లో  స‌ఫ‌ల‌మైంది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు నాయుడును తెలంగాణ ద్రోణిగా ముద్ర‌వేసి కేసీఆర్ అధికారంలోకి వ‌చ్చారు. ఎన్నిక‌లు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా చంద్ర‌బాబు ప్ర‌స్తావ‌న‌ను తెర‌పైకి తెచ్చే బీఆర్ఎస్ పార్టీకి.. 2023 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఆ అవ‌కాశాన్ని ఇవ్వ‌లేదు. ఆ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పోటీ నుంచి త‌ప్పుకుంది. దీంతో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డానికి  తెలుగుదేశం క్యాడర్ తమ వంతు పాత్ర పోషించింది.  ఇటీవ‌ల జ‌రిగిన ఎంపీ ఎన్నిక‌ల్లోనూ  తెలుగుదేశం శ్రేణులు కాంగ్రెస్ పార్టీకే మ‌ద్ద‌తుగా నిలిచారు. అయితే, ఏపీలో మ‌ళ్లీ  తెలుగుదేశం అధికారంలోకి రావ‌డంతో తెలంగాణలోని బీఆర్ఎస్ నేత‌ల‌తో పాటు.. కాంగ్రెస్ పార్టీలోని కొంద‌రు నేత‌లూ ఆందోళ‌న చెందుతున్నారు. వాస్త‌వానికి, చంద్ర‌బాబు  తెలంగాణలో తెలుగుదేశం బ‌లోపేతంపై దృష్టిపెడితే కాంగ్రెస్ పార్టీ  మేలే జ‌రుగుతుంది. ఎందుకంటే.. రాష్ట్రంలో తెలుగుదేశం ఎంతగా బ‌లోపేతం అయితే  అంతగా బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు గండిపడుతుంది.  త‌ద్వారా కాంగ్రెస్ పార్టీ మ‌రింత బ‌ల‌ప‌డుతుంది. కానీ, కాంగ్రెస్ లోని కొంద‌రు నేత‌లు చంద్ర‌బాబు తెలంగాణ రాజ‌కీయాల‌పై దృష్టిపెట్ట‌డాన్ని వ్య‌తిరేకిస్తూ, తెలంగాణకు మ‌ళ్లీ అన్యాయం జ‌రుగుతుందన్నట్లు మాట్లాడారు. కాంగ్రెస్ నాయ‌కురాలు విజ‌య‌శాంతి ఓ అడుగు ముందుకేసి.. తిరిగి తెలంగాణ వాదులు, ఉద్యమకారులు పోరాట ప్రస్థానానికి కదలటం నిశ్చయమైన భవిష్యత్ వాస్తవం.. అంటూ పేర్కొన‌డం కాంగ్రెస్ శ్రేణుల‌సైతం ఆశ్చ‌ర్యానికి గురిచేస్తుంది.  తెలంగాణ‌లో రాజ‌కీయాలు చేయ‌డానికి చంద్ర‌బాబుకు హ‌క్కులేద‌న్న‌ట్లుగా కొంద‌రు కాంగ్రెస్ నేత‌లు మాట్లాడ‌టం ప‌ట్ల తెలుగుదేశం నాయకులు   ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మీరు అన్న‌ట్లు చంద్ర‌బాబు తెలంగాణ వ్య‌తిరేకి అయితే.. 2018 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం ఎందుకు క‌లిసి పోటీచేశాయి. 2023 ఎన్నిక‌ల్లో తెలుగుదేశం కార్య‌క‌ర్త‌లు కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌టం నిజం కాదా అని ప్ర‌శ్నిస్తున్నారు. పలువురు కాంగ్రెస్ నాయకులు తెలుగుదేశం జెండా పట్టుకుని ర్యాలీలలో పాల్గొనడం వాస్తవం కాదా అని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ డైరెక్షన్ లో చంద్రబాబు, పవన్  పని చేస్తున్నార‌ని.. తెలంగాణ‌లో తెలుగుదేశం బ‌ల‌ప‌డితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో మూడు పార్టీలు క‌లిసి పోటీ చేస్తాయ‌ని, త‌ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఏర్ప‌డుతుంద‌న్న వాద‌న‌ను కొంద‌రు కాంగ్రెస్ నేత‌లు తెరపైకి తీసుకువస్తున్నారు. వాస్తవానికి   తెలంగాణ‌లో బీజేపీ, జ‌నసేన‌, తెలుగుదేశం క‌లిసి పోటీచేస్తే బీఆర్ఎస్ పార్టీ ఉనికే ప్రమాదంలో పడుతుంది. ఆ మూడు పార్టీల కలయిక వల్ల కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు వ‌చ్చే న‌ష్టం ఏమీ ఉండ‌దు.  అయితే కాంగ్రెస్ లోని కొందరు నాయకులు తెలంగాణలో చంద్రబాబు ఎంట్రీని వ్యతిరేకించడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ లో  రేవంత్ రెడ్డి బ‌లోపేతం అవుతారన్న దుగ్ధతోనే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మొత్తానికి తెలంగాణ‌లో తెలుగుదేశంబ‌లోపేతంపై చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు తెలంగాణ రాజ‌కీయాల్లో ర‌చ్చ రేపుతున్నాయి.

ఇక మారవా జగన్? ఛీ కొడుతున్న వైసీపీ శ్రేణులు!?

వైసీపీ అధినేత వైఎస్‌ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి రాజ‌కీయ అనుభ‌వలేమి కొట్టిచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. ఐదేళ్లు ప్ర‌తిప‌క్ష నేత‌గా.. మ‌రో ఐదేళ్లు సీఎంగా ప‌నిచేసిన‌ప్ప‌టికీ రాజ‌కీయంగా జ‌గ‌న్ ఏ మాత్రం ప‌రిణితి చెంద‌లేద‌ని వైసీపీ నేత‌లు ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు. జ‌గ‌న్ ఇలానే ఉంటే రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క‌నుమ‌రుగు కావ‌టం ఖాయ‌మ‌ని కుండ బద్దలు కొట్టేస్తున్నారు. మ‌రికొంద‌రు వైసీపీ నేత‌ల‌యితే.. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు జ‌గ‌న్ లో ఉంటాయ‌ని ఇన్నాళ్లు ఆయ‌న వెంట న‌డిచామ‌ని.. కానీ, అధికారంలో ఉన్ప‌ప్పుడూ.. ప్ర‌స్తుతం అధికారం కోల్పోయిన త‌రువాత కూడా జ‌గ‌న్‌లో రాజ‌కీయ ప‌రిణితి క‌నిపించ‌డం లేద‌ని బాహాటంగానే చెబుతున్నారు. ముఖ్యంగా వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి జ‌యంతి వేడుక‌ల సంద‌ర్భంగా ఇడుపుల‌పాయలోని వైఎస్ఆర్ ఘాట్ వ‌ద్ద జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌వ‌ర్త‌న‌ను చూసి వైసీపీ శ్రేణులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. త‌ల్లి, చెల్లిని దూరం చేసుకొని రాజ‌కీయంగా దెబ్బ‌తిన్నా జ‌గ‌న్ లో ఇంకా మార్పు రాలేదని అంటున్నారు. నిందితుడిని వెంట పెట్టుకొని ఎన్నాళ్లు రాజ‌కీయం చేస్తావు జ‌గ‌న్ అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. నిన్ను న‌మ్ముకొన్నందుకు మా  రాజ‌కీయంగా భవిష్యత్ నాశనం చేశావు జగన్ అంటూ నిందిస్తున్నారు. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మ‌ర‌ణానంత‌రం ఆయ‌న అభిమానులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు  అత్యధిక శాతం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డికి జైకొట్టిన విష‌యం తెలిసిందే. రాష్ట్ర విభ‌జ‌న తరువాత ఏపీలోని కాంగ్రెస్ శ్రేణులు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికే మద్దతుగా నిలిచారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి మాత్రంగా మిగిలిపోవడానికి ప్రధాన కారణం కూడా అదే.  వైఎస్ఆర్ అభిమానులు, కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల బ‌లంతోనే  2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ అధికారంలోకి రాగలిగారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని వైఎస్ఆర్ రాజ‌కీయ వార‌సుడిగా భావించిన ఏపీ ప్ర‌జ‌లు ఆయ‌న‌కు అధికారం క‌ట్ట‌బెట్టారు. అయితే జ‌గ‌న్ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో  వైఎస్ లెగసీని పూర్తిగా కోల్పోయారు. వైఎస్ పాలనతో జగన్ పాలనను పోల్చుకుని జనం ఆయనను ఛీకొట్టారు. జగన్ అభివృద్ధి అనే మాట‌ను పూర్తిగా ప‌క్క‌న పెట్టేశారు. ఆఖ‌రికి రాష్ట్రానికి జీవనాడి వంటి పోల‌వ‌రం ప్రాజెక్టును సైతం విస్మ‌రించాడు. కేవ‌లం ప్ర‌తిప‌క్ష  నేత‌ల‌పై అక్ర‌మ కేసులు పెట్టి జైళ్ల‌కు పంపించ‌డం, ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక పాల‌న‌ను ప్ర‌శ్నించి వారిపై కేసులు నమోదు చేస్తూ, దాడులు చేయిస్తూ తన  ఐదేళ్లు అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేశారు.   క‌ష్ట‌కాలంలో అండ‌గా నిలిచిన త‌ల్లి వైఎస్ విజ‌య‌మ్మ‌, చెల్లి వైఎస్ ష‌ర్మిల‌ను జ‌గ‌న్ దూరం చేసుకున్నారు. జగన్ తీరు  వైఎస్ఆర్ అభిమానుల‌ను తీవ్ర ఆగ్ర‌హానికి గురిచేసింది. ఐదేళ్లు జ‌గ‌న్ పాల‌న‌తో విసిగిపోయిన ప్ర‌జ‌లు జ‌గ‌న్‌లో వైఎస్ఆర్ రాజ‌కీయ వార‌స‌త్వం ఏమాత్రం లేద‌ని గ్ర‌హించి 2024 ఎన్నిక‌ల్లో  చిత్తుచిత్తుగా ఓడించారు. ఓట‌మి త‌రువాత కూడా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న తీరును మార్చుకోక‌పోవ‌టంతో  ఇక మారవా జగన్ అంటూ వైసీపీ శ్రేణులే ఛీ కొడుతున్నాయి.  రాజ‌కీయంగా ప‌రిణితి చెందిన నేత అంటే.. ఎలాంటి ప‌రిస్థితులు ఎదురైనా వాటిని త‌నకు అనుకూలంగా మార్చుకుంటూ, ప్ర‌జ‌ల తీర్పును గౌర‌విస్తూ.. పార్టీని న‌మ్ముకున్న కార్య‌క‌ర్త‌ల బాగోగుల‌ను దృష్టిలో పెట్టుకొని ముందడుగు వేయాలి. అలాంటి ల‌క్ష‌ణాలు క‌లిగిన నేత పార్టీ అధ్య‌క్షుడిగా ఉంటే ఆ పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్ప‌టికీ బ‌లంగా ఉంటుంది. కానీ, ప్ర‌స్తుతం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని చూస్తుంటే వైసీపీ శ్రేణుల‌కు ఆ భావ‌న క‌నిపించ‌డం లేద‌ట‌. పార్టీ పుంజుకుంటుందన్న భరోసా కలగడం లేదు. అధికారంలోఉన్న‌ప్పుడు ఎలా ఉన్నా చెల్లిపోతుంది. ఓడిపోయిన త‌రువాత కూడా జ‌గ‌న్ త‌న విధానాన్ని మార్చుకోక‌పోవ‌టంతో వైసీపీ నేత‌లు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు.   అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర ఓట‌మికి వైఎస్ ష‌ర్మిల కూడా ప్ర‌ధాన కార‌ణం. వైసీపీ క‌ష్ట‌కాలంలో ఉన్న‌ప్పుడు ష‌ర్మిల రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌ట‌న‌లు చేసి పార్టీని బ‌లోపేతం చేశారు. కానీ, అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత జ‌గ‌న్ ష‌ర్మిల‌ను పూర్తిగా ప‌క్క‌న పెట్టారు. అంతేకాదు.. త‌ల్లి విజ‌య‌మ్మ‌ను సైతం విస్మ‌రించాడు. దీంతో వారిద్ద‌రూ వైసీపీని వీడ‌డం.. ష‌ర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీ అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను చేప‌ట్ట‌డం వైసీపీ ఓట‌మికి బీజం ప‌డిన‌ట్ల‌యింది. దీనికితోడు బాబాయ్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కేసులో ప్ర‌ధాన ముద్దాయిగా ఉన్న అవినాశ్‌రెడ్డిని జ‌గ‌న్‌ వెనుకేసుకొనిరావ‌టం వైఎస్ఆర్ అభిమానుల్లో ఆగ్ర‌హానికి కార‌ణ‌మైంది. దీంతో మెజార్టీ శాతం వైఎస్ఆర్ అభిమానులు ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో వైసీపీకి దూర‌మ‌య్యారు. ఎన్నిక‌ల్లో ఓట‌మితో జ‌గ‌న్ తీరులో మార్పు వ‌స్తుంద‌ని వైసీపీ నేత‌లు భావించారు. కానీ, ఇడుపులపాయ‌లో జ‌రిగిన వైఎస్ఆర్ జ‌యంతి వేడుక‌ల్లో జ‌గ‌న్ తీరులో ఏమాత్రం క‌నిపించ‌లేదు. వైఎస్ ష‌ర్మిల వ‌చ్చేవ‌ర‌కు వేచిఉండ‌కుండానే జ‌గ‌న్ వైఎస్ఆర్ ఘాట్ వ‌ద్ద నివాళుల‌ర్పించి వెళ్లిపోయారు. దీనికితోడు విజ‌య‌మ్మ జ‌గ‌న్ రెడ్డిని హ‌త్తుకొని క‌న్నీరుపెట్టుకున్న స‌మ‌యంలో ఆమెను ఓదార్చే ప్ర‌య‌త్నం చేయ‌కుండా అక్క‌డి నుంచి వెళ్లిపోయాడు. దీంతో విజ‌య‌మ్మ వైఎస్ఆర్ ఘాట్ వ‌ద్దే ఉండి ఏడుస్తుంటే.. కుటుంబ స‌భ్యులు ఆమెను ఓదార్చాల్సి వ‌చ్చింది. దీనికి తోడు వివేకా హ‌త్య‌కేసులో కీల‌క ముద్దాయిగా ఉన్న వైఎస్ అవినాశ్ రెడ్డిని వ‌దిలి పెట్ట‌కుండా వెంట‌పెట్టుకోవడం వైఎస్ఆర్ అభిమానుల‌తోపాటు వైసీపీ శ్రేణుల్లోనూ ఆగ్ర‌హాన్ని కలిగించింది. తాజా ప‌రిణామాల‌పై  కొంద‌రు వైసీపీ నేత‌లు బ‌హిరంగంగానే జ‌గ‌న్ తీరు ప‌ట్ల‌ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.  శ్రేణులైతే జగన్ ఇక మారడు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రిన్సిపాల్‌ని హత్య చేసిన విద్యార్థి

ఒంగోలుకు చెందిన కెమిస్ట్రీ లెక్చరర్ బెజవాడ రాజేష్‌బాబు ఆయన ప్రిన్సిపాల్‌గా, ఆయన భార్య అపర్ణ డైరెక్టర్‌గా అస్సాంలోని శివనగర్‌లో సొంతగా పదమూడేళ్ళ క్రితం కాలేజీ నెలకొల్పారు. ఆ కాలేజీలో చదువుతున్న ఒక విద్యార్థికి మాథ్స్.లో తక్కువ మార్కులు రావడం, అతని ప్రవర్తన సరిగా లేకపోవడంతో మాథ్స్ లెక్చరర్ అతన్ని మందలించారు. పెద్దలను తీసుకురావాలని సూచించారు. ఆ సమయంలో  ప్రిన్సిపాల్ రాజేష్‌బాబు కూడా అక్కడే వున్నారు. దీన్ని అవమానంగా భావించిన ఆ విద్యార్థి ఆ తర్వాత క్లాస్‌రూమ్‌కి కత్తి తీసుకొచ్చాడు. రాజేష్‌బాబు కెమిస్ట్రీ క్లాస్ చెబుతూ వుండగా కత్తితో దాడి చేశాడు. దాంతో రాజేష్‌బాబు తీవ్ర గాయాలతో మరణించారు. రాజేష్‌బాబు దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె వున్నారు. 

కడపకి ఉప ఎన్నిక వస్తే ప్రచారం చేస్తా.. రేవంత్!

‘‘కడప పార్లమెంట్ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక వస్తుందని అంటున్నారు. అలా ఉప ఎన్నిక వస్తే ఊరూ వాడా తిరిగి ప్రచారం చేసే బాధ్యతను నేను తీసుకుంటా. కడప పౌరుషాన్ని ఢిల్లీలో చాటేలా చేస్తా. కడపలో పోగొట్టుకున్న కాంగ్రెస్ పార్టీ పరువును కాపాడటానికి కాంగ్రెస్ జెండా మోస్తూ కడపలో గల్లీలో తిరుగుతా’’ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విజయవాడలో జరిగిన వైఎస్సార్ 75వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న సందర్బంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో సర్పంచ్‌గా కూడా గెలవదని అంటారు. అయినప్పటికీ, ఈ ముళ్ళబాటలో నడవటానికి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యత తీసుకున్నారు. ఆమెకి అండగా నిలుస్తా. అందుకే, నేను ఈ వైఎస్సార్ సంస్మరణ సభకి నా మంత్రవర్గ సహచరులందరినీ తీసుకుని వచ్చాను అని రేవంత్ రెడ్డి అన్నారు. 

జగన్‌కి వాతలు పెట్టిన రేవంత్‌రెడ్డి!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీకి కూడా రాకుండా పారిపోయిన వైఎస్ జగన్‌కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటలతో వాతలు పెట్టారు. సోమవారం నాడు విజయవాడలో వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి, పరోక్షంగా అనిపించినప్పటికీ ప్రత్యక్షంగానే జగన్ మీదకి మాటల బాణాలు వదిలారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ‘‘చాలామంది వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు మీద అన్ని రకాల లాభాలు పొందారు. వాళ్లు మాత్రం వైఎస్సార్ బాటలో నడవటం లేదు. కుటుంబ సభ్యులుగా వారసత్వం రాదు.. ఆశయాలను మోసినప్పుడే వారసత్వం వస్తుంది. పేద ప్రజలకు అండగా నిలవాలని, రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కావాలని వైఎస్సార్ ఆశయాలుగా పెట్టుకున్నారు. ఆయన ఆశయాలను మోస్తున్న వారినే మనం వారసులుగా గుర్తించాలి. వైఎస్సార్ పేరు మీద రాజకీయ వ్యాపారం చేస్తున్నవాళ్ళు ఆయన వారసులు కాదు.. వైఎస్సార్ ఆశయాల సాధనలో నడుస్తున్న షర్మిలే ఆయన వారసురాలు’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.    ఏపీలో షర్మిలే ప్రతిపక్ష నాయకురాలు   ‘‘ఏపీలో ప్రతిపక్షం లేదు.. ఉన్నదంతా పాలకపక్షమే. ఏపీలో బీజేపీ అధికారంలో వుంది. బీజేపీ అంటే, బాబు, జగన్, పవన్... ప్రతిపక్షమే లేని ఈ రాష్ట్రంలో షర్మిల ప్రతిపక్ష నాయకురాలిగా పనిచేస్తారు. ప్రతిపక్ష బాధ్యతని నిర్వహించాల్సిన వారు ఆ బాధ్యతని వదిలేశారు. ఆ బాధ్యతను షర్మిల స్వీకరించారు. వైఎస్సార్ వారసురాలు షర్మిల మాత్రమే.. రాజశేఖరరెడ్డి వారసత్వాన్ని కొనసాగించేది షర్మిల మాత్రమే. 2009 నుంచి షర్మిల పోరాటం చేస్తున్నారు. ఆమెకు కూడా ఒక మంచి సందర్భం వస్తుంది. 2029లో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి షర్మిల ముఖ్యమంత్రి అవుతారు’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.

బాబోయ్... 514 కోట్ల భారీ మోసం..!

మనం మనం ఒకటే అని చెప్పి, తన సామాజికవర్గానికే చెందిన వారిని మాయచేసి 514 కోట్ల రూపాయల భారీ మోసం చేసిన మోసగాడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అధిక వడ్డీ ఆశచూపి ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వాహకులు భారీ మోసానికి పాల్పడ్డారు. ఈ ఫౌండేషన్ ఛైర్మన్ కమలాకర్ శర్మ బాధితుల నుంచి 514 కోట్ల రూపాయల డిపాజిట్లను సేకరించాడు. తన దగ్గర పెట్టుబడులు పెట్టిన కొంతమంది ప్లాట్లను ఇస్తానని చెప్పి మోసం చేశాడు. కమలాకర్ శర్మ చేతిలో మొత్తం 4 వేల మంది మోసపోయారని పోలీసులు గుర్తించారు. బాధితులందరూ మోసగాడి సామాజివర్గానికి చెందినవారే కావడం గమనార్హం. మన అనుకున్నవాడే తమను మోసం చేశాడని అర్థం చేసుకున్న బాధితులందరూ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి, కమలాకర్ శర్మను అరెస్టు చేశారు. ఏదో చిన్న మోసం అనుకుంటే, అది 514 కోట్ల రూపాయల మోసం అని తమ విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు. ధన్వంతరి ఫౌండేషన్ పేరు మీద వున్న ఆస్తులను పోలీసులు జప్తు చేశారు. అనంతరం దాదాపు 2 వందల మంది బాధితులతో సీసీఎస్ డీసీపీ శ్వేతారెడ్డి సమావేశం నిర్వహించారు. జప్తు చేసిన ఆస్తులను విక్రయించి నగదు డిపాజిట్లు చెల్లించే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

దివ్యాంగ ప్రతిభావంతులకు లాప్‌టాప్‌ బహుమతి!

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ చొరవతో రాష్ట్రంలోని పలువురు దివ్యాంగ విద్యార్థులు ప్రతిభను కనబరిచి ప్రముఖ విద్యాసంస్థల్లో సీట్లు సాధించారు. ఈ సందర్భంగా వాళ్ళు మంత్రి లోకేష్‌ని కలసి కృతజ్ఞతలు తెలిపారు. దివ్యాంగుల సమస్యను అర్థం చేసుకున్న లోకేష్ ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన జీవో నంబర్ 225 విడుదల చేశారు. దీనివల్ల రాష్ట్రంలోని పలువురు దివ్యాంగులకు మేలు జరిగింది. ఈ జీవో వల్ల ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ వంటి ప్రముఖ విద్యాసంస్థల్లో 25 మంది దివ్యాంగ విద్యార్థులు సీట్లు సాధించారు. వారందరూ తమ తల్లిదండ్రులతో కలసి ఉండవల్లిలోని నారా లోకేష్ నివాసానికి వచ్చి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను మంత్రి అభినందించి, వారికి లాప్‌టాప్‌లను బహుకరించారున. ‘సింపుల్ గవర్నమెంట్ -  ఎఫెక్టివ్ గవర్నెన్స్’ విధానంతో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడమే తమ లక్ష్యమని మంత్రి లోకేష్ ఈ సందర్భంగా అన్నారు.

కవిత కోసం బిజెపిలో బిఆర్ఎస్ విలీనం ? 

బిఆర్ఎస్ నేతలు  కెటీఆర్, హరీష్ రావులు తీహార్ జైల్లో కవితను  పరామర్శించినట్టు వార్తలు పైకి వెలువడుతున్నప్పటికీ  అసలు ఎజెండా మాత్రం ఢిల్లీ పెద్దలను కలవడం అని తెలుస్తోంది. కవితను తీహార్ జైల్లో పరామర్శించిన తర్వాత బావా బామ్మర్దులు ప్రధాని అపాయింట్ మెంట్ కోసం వేచిచూశారు. ప్రధాని కార్యాలయం వీరిరువురికి అపాయింట్ ఇవ్వలేదు. వరుసగా పదేళ్లు తెలంగాణలో  అధికారంలో ఉన్న బిఆర్ఎస్ నేతలకు అపాయింట్ మెంట్ దొరకకపోవడం చర్చనీయాంశమైంది. అవమాన భారంతో కుమిలిపోతున్న బిఆర్ఎస్ నేతలు ఇక బిజెపి నేతలతో చర్చలు జరపాలని  నిర్ణయించుకున్నారు. రేవంత్ రెడ్డి దూకుడు తగ్గించడానికి కెసీఆర్ సూచన మేరకు  బిఆర్ఎస్ నేతలు బిజెపి నేతలతో చర్చలు జరిపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కర్నాటక ఉపముఖ్యమంత్రి డికె. శివకుమార్ ను కెటీఆర్, హరీష్ రావులు కలిసారు. తెలంగాణలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలను భారీ స్థాయిలో చేర్చుకోవడం కెసీఆర్ ను ఆందోళనకు గురి చేస్తోంది.  రేవంత్ రెడ్డి దూకుడు తగ్గించకపోతే తమ పార్టీని బిజెపిలో విలీనం చేస్తామని డికెతో బిఆర్ఎస్ నేతలు హెచ్చరించినట్టు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అయ్యింది. ఎపిలో టీడీపీ కూటమి మాదిరిగా తెలంగాణలో  కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖతమ్ చేయడానికి  బిజెపిలో బిఆర్ఎస్ కల్సి పని చేయాలని డిసైడ్ అయ్యారు. అవసరమైతే బిజెపిలో  బిఆర్ ఎస్ విలీనం చేసే ప్రయత్నాలు  కెసీఆర్ చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కింగ్ పిన్ అయిన కవిత తీహార్ జైలులో 110 రోజులు దాటడంతో కెసీఆర్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వెయ్యి కోట్ల రూపాయలు అయినా ఇచ్చి కవితకు బెయిల్ దొరికే విధంగా ప్రయత్నాలు చేయాలని కెసీఆర్ సూచించినట్టు చర్చ జరుగుతోంది.  గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చెందిన బిఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల్లో జీరోకి పడిపోయింది. ఢిల్లీ పెద్దలు బిఆర్ఎస్ కు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంతో స్వయంగా కెసీఆర్ ప్రధానికి లేఖ రాసినట్టు తెలుస్తోంది. కవితను విడిపించుకునే క్రమంలో బిఆర్ఎస్ ను బిజెపిలో విలీన ప్రతిపాదనను కెసీఆర్ ప్రధాని ముందు ఉంచినట్టు తెలుస్తోంది.   

తెలుగు రాష్ట్రాల్లో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు 

వారం రోజుల ముందే నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ ఇప్పటి వరకు భారీ వర్షాలు లేవు. నెల రోజులు దాటినప్పటికీ ఇంత వరకు భారీ వర్షాలు లేవు. కానీ  ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సోమవారం  నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పశ్చిమ, మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఏపీలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రాయలసీమతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణ విషయానికి వస్తే ఈరోజు హైదరాబాద్, రంగారెడ్డి, భువనగిరి, మల్కాజిగిరి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కుమురం భీమ్, నిర్మల్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.  ఈరోజు దేశ వ్యాప్తంగా 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ 11 రాష్ట్రాల జాబితాలో ఏపీ, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, కేరళ, తమిళనాడు, గోవా ఉన్నాయి. ఉత్తరాఖండ్ లో గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా కేదార్ నాథ్, బద్రీనాథ్ రహదారులు కూడా మూతపడ్డాయి.