చంద్రబాబు నెల రోజుల పాలన.. జనంలో భవిష్యత్ పై భరోసా
ఏపీలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి, ప్రజా పాలన ప్రారంభమై నెల రోజులు అయ్యింది. ఐదేళ్లు జగన్ ప్రభుత్వ హయాంలో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగించిన ప్రజలు.. ఇప్పుడు స్వేచ్చగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టి నెల రోజులు దాటింది. మంత్రివర్గం కొలువుదీరింది. చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠం అదిరోహించిన నాటినుంచి ప్రతీ రోజూ సమీక్షలు, సమావేశాలతో అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. ఏపీ నలుమూలలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆంధ్రుల రాజధాని అమరావతిపై దృష్టిసారించిన చంద్రబాబు.. ఆమేరకు అభివృద్ధి పనుల్లో వేగం పెంచారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరంపైనా ఫోకస్ పెట్టారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధి పై ఫుల్ ఫోకస్ పెట్టారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విద్యావ్యవస్థ పై దృష్టి సారించారు. పాతిక మంది దివ్యాంగ విద్యార్థుల జీవితాలలో వెలుగు నింపారు. చిన్న టెక్నికల్ ఇష్యూతో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలలో ఆగిపోయిన వారి అడ్మిషన్లను తిరిగి లభించేలా చేశారు. ఇతర శాఖల మంత్రులు సైతం బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే వారివారి శాఖలపై ఫోకస్ పెట్టారు. ఫలితంగా నెల రోజుల వ్యవధిలోనే ఏపీలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. తద్వారా గత ఐదేళ్ల వైసీపీ హయాంలో నరకయాతన అనుభవించి ప్రజలు.. ప్రస్తుతం నెలరోజుల తెలుగుదేశం పాలన భేషుగ్గా ఉందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ హయాంలో జగన్ మోహన్ రెడ్డి, మంత్రులు అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు. ముఖ్యమంత్రి, మంత్రి పదవి అంటే కేవలం ప్రజలపై పెత్తనం చేయడానికి, ఎంజాయ్ చేయడానికి అన్నట్లుగా వ్వహరించారు. బూతులతో ప్రతిపక్ష పార్టీల నేతలపై రెచ్చిపోవటం, డ్యాన్సులు చేయడం, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసుకోవటానికే మంత్రులు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. తమకు పదవులు ఉన్నది జగన్‌ను పొగడటానికి, ప్రతిపక్ష పార్టీ సభ్యులను అవమానించటానికే అన్నట్లుగా వ్యవహరించారు. గత ప్రభుత్వంలో అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ప్రస్తుతం ప్రభుత్వంలో మంత్రులు నోటికి తక్కువ పనిచెబుతూ.. అభివృద్ధి పనులు పూర్తిచేయడంపై ఎక్కువ దృష్టిసారించారు. చంద్రబాబు, నారా లోకేశ్ ఇప్పటికే అనేక పథకాలపై సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ పాలనలో దూసుకెళ్తున్నారు. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తొలిసారి ప్రభుత్వంలో ఉండటంతో ఆయనకు కేటాయించిన శాఖలపై సమీక్షలతో అవగాహన పెంచుకుంటూ, ఇటు జనసేన పార్టీ, అటు ప్రభుత్వంలో తన శాఖలను బ్యాలెన్స్ చేసుకుంటూ తనదైన ముద్ర వేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఇచ్చిన హామీ ప్రకారం.. వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెంచిన పింఛన్లను 1వ తేదీనే అందించారు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మొదటి తారీకునే జీతాలు జమ అయ్యాయి. ఉచిత ఇసుక విధానం అందుబాటులోకి వచ్చింది. వైసీపీ హయాంలో ఇసుక ధర బంగారంతో పోటీపడింది. దీంతో నిర్మాణ రంగం కుదేలైంది. పనులు లేక నిర్మాణ రంగ కార్మికులు పస్తులుండాల్సి వచ్చింది. ఉచిత ఇసుక విధానం అమలులోకి రావడంతో వారికి పనులు పుష్కలంగా దొరుకుతున్నాయి. ప్రజలకు మంచిచే యడాన్ని జీర్ణించుకోలేని వైసీపీ నేతలు అనవసరపు రాద్దాంతం చేస్తూ ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారు. మరోవైపు తెలుగుదేశం నెలరోజుల పాలనలో నిరుద్యోగుల ఆశలు నెరవేర్చేలా నిర్ణయాలు తీసుకుంది. మెగా డిఎస్సీ ఆరు నెలల్లో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఉద్యోగాలు పరిమిత సంఖ్యలో ఉంటాయి కాబట్టి.. యువతకు ప్రైవేట్ రంగంలో పుష్కలంగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి తెచ్చేలా చంద్రబాబు దృష్టి కేంద్రీకరించారు. తద్వారా రాష్ట్రానికి భారీ సంఖ్యలో ప్రపంచ వ్యాప్తంగా పేరున్న కంపెనీలు, పరిశ్రమలను తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఈ క్రమంలోనే మచిలీపట్నంలో బీపీసీఎల్ సంస్థతో భారీ పెట్టుబడికి ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే వియత్నం దేశం నుంచి ఆటోమొబైల్ సంస్థ కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. మరోవైపు సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన నాటినుంచి సకాలంలో వర్షాలు కురుస్తున్నాయి. రైతులకు ఎరువులు, విత్తనాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచడంతో రైతులు సంతోషంగా తమ పనుల్లో నిమగ్నమయ్యారు.
వైసీపీ ఐదేళ్ల పాలనలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చింది చాలా తక్కువ. కేవలం బహిరంగ సభలకు మాత్రమే హాజరయ్యారు. అదికూడా ఆయన ప్రయాణించే మార్గంలో అధికారులు పరదాలు కట్టేవారు. ఒక్కసారి కూడా మీడియా సమావేశంలో జగన్ మాట్లాడలేదు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీలో జరిగిన అక్రమాలను శాఖల వారిగా శ్వేతపత్రాల రూపంలో చంద్రబాబు బయటపెడుతున్నారు. అంతేకాదు.. నెలరోజుల వ్యవధిలోనే నాలుగైదు సార్లు మీడియా సమావేశాలు ఏర్పాటు చేశారు. పలు జిల్లాల్లో పర్యటనలు చేశారు. తద్వారా నెలరోజుల పాలనలో ఎక్కువగా ప్రజల మధ్య ఉండేదుకు చంద్రబాబు ప్రాధాన్యతనిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఏపీకి పెద్ద మొత్తంలో నిధులు మంజూరయ్యేలా చంద్రబాబు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి.. గతంలో జగన్ పాలన ఆరంభంలోనే కూల్చివేతలు, రీ టెండర్లు, మంత్రుల బూతు పురాణాలతో ప్రారంభమైతే.. తెలుగుదేశం ప్రభుత్వ పాలన ప్రజా సంక్షేమం, అభివృద్ధితో ప్రారంభమైంది.
ఇంత చేస్తున్నా తెలుగుదేశం ప్రభుత్వంపై ఆ పార్టీ శ్రేణుల్లోనే ఒకింత అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఆ అసంతృప్తిని క్యాడర్ బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం వైసీపీ హయాంలో తెలుగుదేశం క్యాడర్ పై ఇష్టారీతిగా కేసులు నమోదు చేసి, ఇబ్బందులకు గురి చేసిన అధికారులపై చర్యల విషయంలో చంద్రబాబు సర్కార్ దూకుడుగా వెళ్లకపోవడమే. ఇదే విషయాన్ని క్యాడర్ సోషల్ మీడియాలో ప్రస్తావిస్తున్నారు. లోకేశ్ రెడ్ బుక్ విషయంలోకూడా పార్టీ క్యాడర్ కాస్త అసంతృప్తి గానే ఉంది. గత ఐదేళ్ల కాలంలో వైసీపీ నేతల అరాచకాలతో ఇబ్బందులు పడిన టీడీపీ కార్యకర్తలు లోకేశ్ రెడ్ బుక్ ఎప్పుడు తెరుస్తారా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించకుండా తెలుగుదేశం క్యాడర్ అవినీతికి, అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు కాదు కాదు తక్షణ చర్యలు ఉండాలని భావిస్తున్నారు. చట్టాన్ని అతిక్రమించిన ప్రతి అధికారిపై చర్యలు ఉంటాయనీ, చట్ట ప్రకారమే ఆ చర్యలు ఉంటాయనీ చంద్రబాబు భరోసా ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో పరిధిమీరి వ్యవహరించిన ఏ ఒక్కరినీ విడిచిపెట్టేది లేదని లోకేష్ సైతం చెబుతున్నారు. క్యాడర్ అసహనానికి గురి కాకుండా ఓపికపట్టాల్సి ఉంటుంది.