అవినాష్ కూడా జగన్ కు జెల్ల కొట్టేస్తారా!?
posted on Jul 9, 2024 @ 3:49PM
ఓటమి వైసీపీ ఇంటిగ్రిటీని దెబ్బతీసిందా? జగన్ పార్టీ ముక్కలుచెక్కలు కాబోతోందా? అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఔనన్న సమాధానమే వస్తోంది. వైసీపీ పూర్తిగా దివంగత వైఎస్సార్ లెగసీపైనే ఆధారపడి ఉంది. అంటే వైఎస్ కుటుంబ ఐక్యతే ఆ పార్టీకి బలం. అయితే ఇప్పుడు ఆ బలం వైసీపీకి లేదు. జగన్ తన ఐదేళ్ల పాలనతో చేతులారా వైసీపీ లెగసీని వదులుకున్నారు. కాదు కాదు దూరం చేసుకున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత భవిష్యత్ లో పార్టీపై తన ఆధిపత్యానికి అడ్డువస్తారన్న అనుమానమో, మరోటో కానీ ముందు చెల్లి షర్మిలను, ఆ తరువాత తల్లి విజయమ్మనూ పార్టీకి దూరం చేశారు. వారంతట వారే పార్టీతో బంధాన్ని పుటుక్కున తెంచేసుకునేలా చేశారు. ఆ క్రమంలో చెల్లినీ, తల్లినీ కూడా అవమానించారు.
దీంతో ముందు షర్మిల తెలంగాణకు వలస వెళ్లి తండ్రి వైఎస్ పేరుమీద ఆ రాష్ట్రంలో పార్టీ ఏర్పాటు చేసుకుని తన రాజకీయాలు తాను చేసుకుంటూ సాగుతుంటే అందుకు కూడా జగన్ పలు ఆటంకాలు కల్పించారు. షర్మిలకు ఎటువంటి సాయం అందకుండా మోకాలడ్డారు. ఈ క్రమంలో తల్లి షర్మిల కూడా వైసీపీతో అనుబంధాన్ని తెంచుకుని, ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలి పదవితో సహా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కుమార్తె షర్మిల పంచన చేరారు. సొదరుడి వేధింపుల కారణంగా షర్మిల తెలంగాణలో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేసి, ఆ పార్టీ ఏపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి సోదరుడికే సవాల్ విసిరారు. సరే షర్మిల ఫ్యాక్టర్ కూడా పని చేసింది. అంతకు మించి తన ప్రజావ్యతిరేక విధానాల కారణంగా జగన్ ను ఆయన పార్టీని ఏపీ ప్రజలు అధికారం నుంచి దించేశారు.
దీంతో వైసీపీ మనుగడ ప్రశ్నార్థకమైంది. జగన్ ఒక్కడూ ఒక వైపు, వైఎస్ కుటుంబం మొత్తం మరో వైపు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. దీంతో వైసీపీలో ఉండేదెవరు? గోడ దూకేసేదెవరు అన్న అనుమానాలు పార్టీలోనే వ్యక్తం అవుతున్నాయి. నిన్నమొన్నటి దాకా జగన్ చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్లు వ్యవహరించిన ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నేతలంతా సైలెంటైపోయారు. ఏ మాత్రం సందు చిక్కినా పార్టీ గోడదూకేయడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్ కు అత్యంత సన్నిహితులుగా పేరుపొందిన వారు కూడా బీజేపీతో టచ్ లోకి వెళ్లారని అంటున్నారు. అలా వెళ్లిన వారిలో పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గన్నవరం మాజీ ఎంపీ వల్లభనేని వంశీ వంటి వారు ఉన్నారని పార్టీ వర్గాల నుంచే గట్టిగా వినిపిస్తోంది.
ఈ తరుణంలో ఇడుపులపాయలో జరిగిన వైఎస్ జయంతి వేడుకలు వైఎస్ కుటుంబంలో ముగ్గరూ మూడు దారులు అన్న చందంగా జరిగాయి. వైఎస్ కుటుంబంలో ముగ్గురూ మూడు దారులు అన్నట్లుగా ఆ కార్యక్రమం జరిగింది. ఇడుపుల పాయలో జరిగిన వైఎస్ జయంతి కార్యక్రమం సాక్షిగా జగన్ వైఖరిని గమనించిన వారు.. కుటుంబంతో ఆయన సయోధ్య అసాధ్యమన్న అభిప్రాయానికి వచ్చేశారు. అంతే కాకుండా సొంత బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడైన అవినాష్ ను వెంటబెట్టుకుని ఆయన తిరగడంతో జగన్ వైఎస్ అభిమానులకూ దూరమయ్యారు. ఇక ఇప్పుడు ఇంత కాలం ఏ అవినాష్ కు అయితే తాను రక్షణ కవచంగా నిలబడ్డారో అదే అవినాష్ కూడా రివర్స్ అయ్యేలా జగన్ అడుగులు ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. అసెంబ్లీకి వెళ్లడానికి ఇసుమంతైనా ఆసక్తి చూపని జగన్ దృష్టి ఇప్పుడు లోక్ సభపై పడిందని అంటున్నారు. అక్రమాస్తుల కేసుల నుంచి ఏదో మేరకు రక్ష కావాలంటే లోక్ సభ సభ్యుడిగా ఉంటేనే సాధ్యమౌతుందని ఆయన భావనగా చెబుతున్నారు. అందుకే పులివెందుల అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి కడప లోక్ సభ సభ్యునిగా పోటీలో దిగాలని జగన్ భావిస్తున్నట్లు గట్టిగా వినిపిస్తోంది. ఇందుకోసం ఆయన అవినాష్ ను కడప లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సిందిగా ఒత్తిడి తీసుకువచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. గతంలో కూడా వైఎస్ వివేకానందరెడ్డిపై ఇలాగే ఒత్తిడి తెచ్చి కడప లోక్ సభ సభ్యత్వా నికి దూరం చేసిన సంగతి విదితమే.
అయితే ఇప్పుడు అవినాష్ అందుకు అంగీకరించే పరిస్థితి లేదని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కడప ఎంపీ సీటు తనకు రక్షణ కవచమని వైఎస్ అవినాష్ రెడ్డి బలంగా భావిస్తున్నారు. అయితే జగన్ ముఖ్యమంత్రి పీఠం చేజారడంతో అక్రమాస్తుల కేసుల్లో కేంద్రాన్ని మేనేజ్ చేసేందుకు పార్లమెంట్ కు వెళ్లడమొక్కటే మార్గమని జగన్ బలంగా విశ్వసిస్తున్నారు. దీంతో ఈ విషయంలో ఇరువురి మధ్యా విభేదాలు పొడసూపే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే..అంటే అవినాష్ కడప లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి నిరాకరించి తమ్ముడుతమ్ముడే పేకాట పేకాటే అన్నట్లు రాజకీయం రాజకీయమే అంటే జగన్ పరిస్థితి ఏమిటన్న చర్చ ఇప్పుడు రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. మొత్తం మీద ఏ రకంగా చూసినా ఎక్కడా కూడా జగన్ మాట నెగ్గే పరిస్థితులు కనిపించడం లేదు.