ఒంగోలు కార్పొరేషన్ తెలుగుదేశం వశం!?

వైసీపీ కష్టాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తరువాత ఇక ఆ పార్టీకి స్థానిక సంస్థలపై కూడా పట్టు లేకుండా పోతోంది. పలు కార్పొరేషన్లు, మునిసిపాలిటీలలో  వైసీపీ బలహీనం అవుతోంది. పంచాయతీలలో కూడా ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా మారుతోంది. తాజాగా   ఒంగోలు కార్పొరేషన్ ను వైసీపీ కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. పలువురు కార్పొరేటర్లు వైసీపీని వీడి తెలుగుదేశం గూటికి చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటీవలి సాధారణ  ఎన్నికలకు ముందే ఐదుగురు వైసీపీ కార్పొరేటర్లు తెలుగుదేశం గూటికి చేరారు. ఇప్పుడు తాజాగా మరో కార్పొరేటర్ శనివారం (జులై13) తెలుగుదేశం గూటికి చేరారు. దీంతో  ఒంగోలు కార్పొరేషన్ లో తెలుగుదేశం బలం 13కు పెరిగింది. అయితే మరింత మంది కార్పొరేటర్లు కూడా వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని స్థానికంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఒంగోలో ఎమ్మెల్యే దామచర్ల జనార్ధనరావు  ఒంగోలు కార్పొరేషన్ పై దృష్టి పెట్టి వైసీపీ కార్పొరేటర్లను తెలుగుదేశంలోకి ఆహ్వానిస్తున్నారు.  ఒంగొలు కార్పొరేషన్ కు వైసీసీ అధికారంలో ఉన్న సమయంలో ఎన్నికలు జరగడంతో ఆ పార్టీ సామదానభేద దండోపాయాలతో కొర్పొరేషన్ ను కైవసం చేసుకుంది. ఒంగోలు కార్పొరేషన్ లో 50 డివిజన్లు ఉండగా వాటిలో 43 డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. అప్పటి ఎన్నికలలో తెలుగుదేశం 6 డివిజన్లలోనూ, జనసేన ఒక డివిజన్ లోనూ విజయం సాధించింది.   కార్పొరేషన్ లో మెజారిటీ సాధించాలంటే తెలుగుదేశం పార్టీకి 26 మంది కార్పొరేటర్లు అవసరం.  ప్రస్తుతం ఉన్న 13 మంది కార్పొరేటర్లు, ఒంగోలు ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే దామచర్ల, సంతనూతల పాటు ఎమ్మెల్యే విజయ్ కుమార్ ను కార్పొరేషన్ లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా సభ్యత్వం తీసుకోవడానికి రెడీ గా ఉన్నారు. ఈ ముగ్గురూ కూడా తోడైతే ఒంగోలు కార్పొరేషన్ లో తెలుగుదేశం బలం 13కు చేరుతుంది.  మరో పది మంది వైసీపీ కార్పొరేటర్లు తెలుగుదేశం గూటికి చేరితే ఒంగోలు కార్పొరేషన్ తెలుగుదేశం హస్తగతం అవుతుంది.  తాజా పరిణామాలను గమనిస్తుంటే పలువురు వైసీపీ కార్పొరేటర్లు తెలుగుదేశం గూటికి చేరడానికి రెడీగా ఉన్నట్లు అవగతమౌతోంది. అలా చేరడానికి సిద్ధంగా ఉన్న కార్పొరేటర్ల సంఖ్య పది నుంచి 15 వరకూ ఉన్నట్లు వైసీపీ వర్గాలలోనే గట్టిగా వినిపిస్తున్నది.  తెలుగుదేశంలో చేరేందుకు అవకాశం లేని ఒకరిద్దరు జనసేన ద్వారా కూటమికి, తద్వారా తెలుగుదేశంకు దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ఇప్పటికే ఒంగోలు మేయర్ గంగాడ సునీత తెలుగేదేశం గూటికి చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆమెతో పాటు పలువురు కార్పొరేటర్లు కూడా చేరే అవకాశాలు మెండుగా ఉన్నప్పటికీ.. తెలుగుదేశం నేతలు మాత్రం ఆమెను పక్కకు పెట్టి నేరుగా కార్పొరేటర్లతోనే సంప్రదింపులు చేస్తున్నారు.  ఈ పరిస్థితిని గమనించిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి  వైసీపీ కార్పొరేటర్ల వలసన నిరోధానికి ప్రయత్నాలు ప్రారంభించినట్లు చెబుతున్నారు.  ఇటీవలి ఎన్నికలలో ఒంగోలు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బాలినేని పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఎన్నికలలో ఓటమి తరువాత బాలినేని హైదరాబాద్ కే పరిమితమయ్యారు. కార్పొరేషన్ చేజారకూడదన్న ఉద్దేశంతో ఆయన సోమవారం ఒంగోలు చేరుకున్నారు. అయితే కార్పొరేటర్ల వలసలను నిరోధించడానికి ఆయన ప్రయత్నాలు ఫలించే అవకాశాలు దాదాపు మృగ్యం అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అయితే కార్పొరేటర్ల వలసలను ఆపడానికి ఆయన పెద్దగా ఏమీ ప్రయత్నాలు చేయరని కూడా అంటున్నారు.  జగన్ రెండేళ్ల కిందట  మంత్రివర్గ విస్తరణలో తన మంత్రిపదవి ఊడబీకడం దగ్గర నుంచీ ఆ తరువాత జగన్  వ్యవహరించిన తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలినేని.. పార్టీ విషయాలు పెద్దగా పట్టించుకోవడం మానేశారు. ఎన్నికలలో పార్టీ ఓటమి, తన ఓటమి తరువాత ఆయన వైసీపీతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఒంగోలు కార్పొరేషన్ వైసీపీ చేజారకుండా ఆయన గట్టిగా ప్రయత్నించే అవకాశాలు లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఏదో నామ్ కే వాస్తే కార్పొరేటర్లతో చర్చిస్తారే తప్ప వారిని పార్టీ మారకుండా నిరోధించేందుకు సీరియస్ గా ప్రయత్నించే అవకాశాలు లేవని అంటున్నారు. ఆ విషయం తెలుసు కనుకనే తెలుగుదేశంలో చేరాలని భావిస్తున్న కొందరు కార్పొరేటర్లు బాలినేని చెప్పేది విని ఆ  తరువాతే నిర్ణయం తీసుకునే ఉద్దేశంతో  ఉన్నారని అంటున్నారు. 

చంద్రబాబు చెప్పిన ‘స్పీడ్ బ్రేకర్లు’ ఎవరు?

‘‘మంచి చేయాలని అనుకునేవారికి ఇక స్పీడ్ బ్రేకర్లు వుండవు’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అమరావతి పరిసరాల్లోని కొలనుకొండలో వున్న హరేకృష్ణ గోకుల క్షేత్రంలో నిర్వహించిన అనంతశేష స్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చంద్రబాబు పైన పేర్కొన్న వ్యాఖ్య చేశారు. అక్కడ జరిగింది ఆధ్యాత్మిక కార్యక్రమం కాబట్టి, అక్కడ వున్న చాలామంది ఈ వ్యాఖ్యను ఒక ఆధ్యాత్మిక కోణంలో చూసి వుండొచ్చు. మంచి చేయాలని అనుకున్నవాళ్ళని దేవుడు చల్లగా చూస్తాడు కాబట్టి, వాళ్ళు అభివృద్ధి పథంలో స్పీడు బ్రేకర్లు లేకుండా దూసుకుని వెళ్తారు అనేది చంద్రబాబు ఉద్దేశం అనుకుని, మనసులో దేవుడికి భక్తిగా నమస్కారం పెట్టుకుంటారు. అలాంటి వారిని ఆ భక్తి పారవశ్యంలోనే వుంచేసి, మనం కొంచెం పక్కకి తప్పుకుని రాజకీయ మార్గంలోకి వద్దాం.  రాజకీయ మార్గంలోకి వస్తే, చంద్రబాబు ఎవరిని ఉద్దేశించి ‘స్పీడ్ బ్రేకర్లు’ అని వుండొచ్చని ఆలోచిస్తే, చాలామంది బుర్రలో టక్కున కనిపించే ఒక దివ్య అమంగళ విగ్రహం జగన్‌ది. ఐదేళ్ళపాటు రాష్ట్రాన్ని తన నీచ నికృష్ట పాలనతో సర్వనాశనం చేసిన జగన్ ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకు పరిమితం అయిపోయాడు. పైగా కడప పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఢిల్లీకి పారిపోవాలని అనుకుంటున్నాడు. అందువల్ల చంద్రబాబు చేయాలనుకున్న మంచి పనులకు స్పీడ్ బ్రేకర్లా అడ్డు పడకుండా వుంటాడన్న ఆలోచన కొంత రాజకీయ స్పృహ వున్నవాళ్ళకి అనిపిస్తుంది. నిజానికి జగన్‌కి ఇప్పుడు చంద్రబాబుకు స్పీడ్ బ్రేకర్లా అడ్డుపడే సీన్ లేదు. ‘జగన్’ అనేది ఒక ముగిసిపోయిన చీకటి అధ్యాయం. సరే, జగన్ ఒక స్పీడ్ బ్రేకర్ అనుకుందాం. మరి చంద్రబాబు ‘స్పీడ్ బ్రేకర్లు’ అన్నారు. అంటే, జగన్ కాకుండా మరో స్పీడ్ బ్రేకర్ వున్నట్టే కదా.. ఇంతకీ ఎవరా స్పీడ్ బ్రేకర్. ఆ స్పీడ్ బ్రేకర్ మరెవరో కాదు.. ప్రధాని నరేంద్ర మోడీ. 2014లో టీడీపీ, బీజేపీ మధ్య స్నేహం వున్నా నిధుల విషయంలో మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి చేసింది సున్నా. అమరావతి విషయంలో, పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబును పెట్టిన ఇబ్బందులు అన్నీ, ఇన్నీ కావు. అప్పట్లో మోడీకి పూర్తి మెజారిటీ వుండేది కాబట్టి ఆయన ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగింది. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పెద్ద స్పీడ్ బ్రేకర్‌గా మోడీ మారారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కేంద్రంలో చక్రం తిప్పే స్థాయిలో చంద్రబాబు వున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవసరమైన నిధులను, ఏపీ న్యాయమైన డిమాండ్లను ప్రధాని ఒప్పుకోక తప్పని పరిస్థితులు వున్నాయి. ఈ రకంగా చూస్తే ఈసారి ఏపీ అభివృద్ధికి ‘మోడీ స్పీడ్ బ్రేకర్’ కూడా లేనట్టే. 

‘జల మాంత్రికుడు’ కేఎల్ రావు జయంతి నివాళి!

అపర భగీరథుడుగా, తెలుగు నేలపై అవతరించిన ఒక మంచినీటి కోనేరుగా అందరూ అభివర్ణించే తెలుగు ఇంజనీర్ కానూరి లక్ష్మణరావు (కె.ఎల్.రావు) జయంతి నేడు (15 జూలై). తెలుగునేలను వరదల నుంచి కాపాడ్డమే కాకుండా, సస్యశ్యామలం చేసిన ఘనత కేఎల్ రావుకు కూడా దక్కుతుంది. తన కృషి ద్వారా ఎన్నో కోట్ల మంది జీవితాలలో వెలుగు నింపిన కేఎల్ రావును ఆయన జయంతి సందర్భంగా స్మరించుకోవడం కృతజ్ఞత అనిపించుకుంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వరదాయినిగా వున్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు సాకారం కావడానికి కారణం కానూరు లక్ష్మణరావు అనే ఒక్క వ్యక్తి పట్టుదలే. ‘‘నీవు లేకుంటే ఈ ప్రాజెక్టు బుట్ట దాఖలయ్యేది’’ అని ఆనాటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూయే ఆయనతో అన్నారు. భారతదేశపు అత్యుత్తమ ఇంజనీర్లలో ఒకరైన ఆయన డాక్టర్ కేఎల్ రావుగా సుప్రసిద్ధులు.  కేఎల్ రావు 1902, జూలై 15న కృష్ణాజిల్లా కంకిపాడులో జన్మించారు. ఆయన తండ్రి గ్రామ కరణం. కేఎల్ రావు తొమ్మిది సంవత్సరాల వయసులో వుండగానే ఆయన తండ్రి మరణించంతో పెదనాన్న, పెద్ద అన్నల సంరక్షణలో కేఎల్ రావు పెరిగారు. చిన్నప్పటి నుంచే ప్రతిభావంతుడైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మొదటి స్పీకర్ అయ్యదేవర కాళేశ్వరరావు, భాషా సేవకుడు కొమర్రాజు లక్ష్మణరావు, పార్లమెంట్ మాజీ సభ్యురాలు డాక్టర్ అచ్చమాంబ కేఎల్ రావుకు సమీప బంధువులు. పెదనాన్న, పెద్ద అన్న పోత్రాహంతో కేఎల్ రావు సివిల్ ఇంజనీరింగ్‌లో మద్రాసు యూనివర్శిటీ పట్టా పుచ్చుకున్నారు. అనంతరం తమిళనాడులోని గిండి ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్‌గా చేరారు. తన దృష్టిని పరిశోధనల వైపు మళ్ళించి, తాను రాసిన ఒక సిద్ధాంత వ్యాసాన్ని ఇంగ్లాండ్‌కి పంపారు. ఆ వ్యాసానికి మేధావుల నుంచి ప్రశంసలు పొందారు. గిండి ఇంజనీరింగ్ కాలేజీ నుంచి రీసెర్చ్ డిగ్రీ పొందారు. ఆ తర్వాత విదేశాలకు వెళ్ళి, కాంక్రీట్‌కి సంబంధించిన విద్యలో ప్రావీణ్యం సంపాదించారు.  ఇంజనీరింగ్ పూర్తయ్యాక విశాఖపట్నంలో, విజయనగరం సంస్థానంలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేశారు. ఆ తర్వాత పీడబ్ల్యూడీ ఆధీనంలోని మెట్టూర్ ప్రాజెక్టులో జూనియర్ ఇంజనీర్‌గా విధులను నిర్వర్తించారు. ఆ తర్వాత ఆయన సిమెంట్ కాంక్రీట్‌పై  పరిశోధనల వైపు దృష్టిని మళ్ళించారు. తాను రాసిన ఓ సిద్ధాంత వ్యాసాన్ని ఇంగ్లాండుకు పంపి అక్కడి మేధావులతో దానిని చదివించి మరీ రిసెర్చి డిగ్రీ పొందారు. విదేశాలకు వెళ్ళి కాంక్రీటు విద్యలో ప్రావీణ్యం సంపాదించారు. రీ ఇన్ ఫోర్స్‌డ్ కాంక్రీట్ గురించి ఫ్రాన్స్‌లో అధ్యయనానికి వెళ్లి, 1939 నుంచి రెండేళ్లు లండన్‌లో పనిచేశారు. విదేశాలలోనే ‘స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అండ్ రీ ఇన్ఫోడ్ కాంక్రీట్’ అనే ఒక సిద్ధాంత ఓ గ్రంథం రాసి పేరు గడించారు. అమెరికాలో  ప్రొఫెసర్‌గా పనిచేస్తుండగా నాటి మద్రాసు ప్రభుత్వ సలహాదారు సర్ రామమూర్తి  కేఎల్ రావును భారతదేశం వచ్చి శ్రీరామపాదసాగర్ (పోలవరం) ప్రాజెక్టు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో 1946లో కేఎల్ రావు స్వదేశానికి తిరిగి వచ్చారు. మద్రాస్ ప్రభుత్వ డిజైన్ ఇంజనీర్‌గా చేరారు. 1947లో స్వాతంత్రానికి పూర్వం  కాంక్రీట్ సాయిల్, హైడ్రాలిక్ మోడల్స్‌లో పోలవరం డ్యామ్ డిజైన్లు రూపొందించారు. కానీ రాజకీయ కారణాలతో నాడు పోలవరం ప్రాజెక్టు డిజైన్లు అటకెక్కాయి. ఆ తర్వాత ఢిల్లీలోని కేంద్ర జలవనరుల శాఖ డిజైన్స్ డెరైక్టర్‌గామహానదిపై హీరా కుడ్ డ్యామ్ డిజైన్‌ను రూపొందించారు. స్వాతంత్య్రానంతరం కృష్ణా, గోదావరి బేసిన్‌ల అభివృద్ధి గురించి కేఎల్‌రావు అధ్యయనం చేశారు. ఈ క్రమంలోనే కృష్ణానదికి ఎడమవైపున ఉన్న నందికొండ వద్ద (నాగార్జునసాగర్) డ్యామ్ కట్టవచ్చని గుర్తించారు. నాటి హైదరాబాద్ రాష్ట్రానికి కూడా ఈ ప్రాజెక్టు ఉపయోకరమని ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావుకు చెప్పి ఒప్పించారు. మద్రాసు ప్రభుత్వం అడ్డుకోవాలని చూసినా కేఎల్ రావు కృషి ఫలితంగా ఖోస్లా కమిటీ, ప్రణాళికా సంఘాలు నందికొండ వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి అంగీకారం తెలిపాయి. ఆచార్య నాగార్జునుని అవశేషాలను మ్యూజియం ఏర్పాటు చేసి భద్రపరచేలా పండిట్ నెహ్రూ నుంచి హామీ పొందారు. నాగార్జునసాగర్ పనులకు కేఎల్ రావే స్వయంగా నేతృత్వం వహించారు. 1967లో పూర్తయిన ఆ ప్రాజెక్టు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని 22,00,000 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు, తాగునీరు అందిస్తోంది. 820 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి తోడ్పడుతోంది.   నాగార్జున సాగర్ ఘన విజయం ఆ తర్వాత కృష్ణా నదిపై జల విద్యుత్ ప్రాజెక్టుల రూపకల్పనపై కేఎల్ రావు ప్రత్యేక అధ్యయనం చేశారు. వాటిలో ముఖ్య మైనది శ్రీశైలం ప్రాజెక్టు. ఆయన ప్రతిపాదనకు అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ఆమోదం తెలిపారు. ఆ తర్వాత కేఎల్ రావు ప్లానింగ్ కమిషన్ సభ్యుడిగా పనిచేశారు. 1963లో పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు.  ఇంజనీరింగ్‌కి సంబంధించిన అనేక విజ్ఞాన దాయకమైన సమాచారాలను సామాన్య ప్రజలకు చేరవేసే ఉపయుక్తమైన ఉపన్యాసాలెన్నో ఇచ్చారాయన. ఇంజనీరింగ్‌ను సాంఘిక అభివృద్ధి విజ్ఞానంగా అభివర్ణించారాయన. నాటి ప్రభుత్వం నాగార్జున సాగర్, భాక్రానంగల్ ప్రాజెక్ట్, హిరాకుడ్ ప్రాజెక్ట్ విషయంలో విదేశీ ఇంజనీర్లను పిలిపిస్తే వారు కూడా రావు గారిని సంప్రదించడం ఈయన ప్రతిభకు నిదర్శనం. ఇంజనీరింగ్ విషయాలకు సంబంధించి కేఎల్ రావు రాసిన "ఇండియాస్ వాటర్ వెల్త్" అనే పుస్తకం నేటి తరాల శాస్త్రవేత్తలకు ప్రామాణిక గ్రంథంగా ఉంది. ఉద్యోగ విరమణ అనంతరం అప్పటి జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు నీలం సంజీవరెడ్డి పిలుపు మేరకు 1962, 1967,1971లో విజయవాడ నుంచి పార్లమెంటుకు పోటీ చేసి గెలిచారు. జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహుదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, నేతృత్వంలోని ప్రభుత్వంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా పనిచేశారాయన.  కృష్ణా తీరం వెంబడి కట్టిన కరకట్ట నిర్మాణం, ఇంద్రకీలాద్రి పైకి ఏర్పాటుచేసిన ఘాట్ రోడ్ వంటివి ఈయన నిర్వహణలో జరిగినవే.కేఎల్ రావు స్మృత్యర్ధం పులిచింతల ప్రాజెక్టుకు కె.ఎల్.రావు ప్రాజెక్టు అని నామకరణం చేశారు. ఒక ఇంజనీరు పేరును ప్రాజెక్టుకు పెట్టడం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇదే ప్రథమం. కేఎల్ రావు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే గంగ, బ్రహ్మపుత్ర నదులలో వర్షాకాలంలో చేరుతున్న నీటిని నిల్వ ఉంచి భారతదేశంలో క్షామ ప్రాంతాలైన మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు నీటి సౌకర్యం కల్పించే "నేషనల్ వాటర్ గ్రిడ్" పథకానికి రూపకల్పన చేశారు.  భారత దేశానికి, ఆంధ్ర రాష్ట్రానికి, డెల్టా రైతాంగానికి అమూల్యమైన సేవలు అందించిన భారతదేశ బ్యారేజ్‌లకు మహారాజు, అపర భగీరథుడు భారతీయ జల యాజమాన్య పితామహుడు అయిన డాక్టర్ కేఎల్రావు  1986, మే 18వ తేదీన కన్నుమూశారు. పరిశోధకుడిగా, అధ్యాపకుడిగా, ఇంజనీర్‌గా, కేంద్ర మంత్రిగా సేవలు అందించిన కేఎల్‌రావు భావి ఇంజనీర్లు, విద్యార్థులు, రాజకీయ నాయకులకు ఆదర్శం. సుదీర్ఘ కాలం తన మేధా సంపత్తితో భారతదేశం నీటిపారుదల రంగానికి దిశ, దశను నిర్ణయించిన రావు తెలుగువారు కావడం మనకు గర్వకారణం.

భాగ్యనగరాన్ని ముంచెత్తిన భారీ వర్షం

భాగ్యనగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది.  నగరంలోని పలు ప్రాంతాలలో కుండపోత వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలలో ట్రాఫిక్ జామ్ అయ్యింది.  అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రజలను కోరారు.  మరి కొన్ని గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారీ వర్షం కారణంగా ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా జీహఎచ్ ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగారు.   అత్యవసర సహాయం కోసం  040-21111111, 9000113667 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. కాగా మారేడ్‌పల్లిలో అత్యధికంగా 75.3 మి.మీ., ఖైరతాబాద్‌లో 74, ముషీరాబాద్‌లో 70, షేక్‌పేటలో 69.3, శేరిలింగంపల్లిలో 68.మి.మీ వర్షపాతం  నమోదైంది.  అలాగే మియాపూర్‌, చందానగర్‌, లింగంపల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, బాచుపల్లి, ప్రగతి నగర్‌, కూకట్‌పల్లి, మూసాపేట, హైదర్‌నగర్‌, మల్కాజిగిరి, కుషాయిగూడ, దమ్మాయిపేట, చర్లపల్లి, కీసర, నిజాంపేట, నేరేడ్‌మెట్‌, అమీర్‌పేట్‌, ఈఎస్‌ఐ, ఎర్రగడ్డ, సనత్‌నగర్‌, బోరబండ, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌, ఉప్పల్‌, రామంతాపూర్‌, బోడుప్పల్‌, మేడిపల్లి, పీర్జాదిగూడ, నాంపల్లి, అబిడ్స్‌, కోఠి, బషీర్‌బాగ్‌, నారాయణగూడ, హిమాయత్‌ నగర్‌, ఖైరతాబాద్‌, లక్డీకాపూల్‌, మేడ్చల్‌, మల్లంపేట్‌, గండిమైసమ్మ, దుండిగల్‌, అంబర్‌ పేట, కాచిగూడ, నల్లకుంట, గోల్నాక తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లపై వర్షం నీరు చేరడంతో పలు చోట్ల ట్రాఫిక్‌ జామ్‌ అయింది. వరద ప్రవాహానికి యూసుఫ్‌గూడలోని  కృష్ణానగర్‌లో ఓ కారు కొట్టుకుపోయింది. మాదాపూర్ హైటెక్ సిటీ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఎర్రమంజిల్‌ వద్ద ప్రధాన రహదారిపై భారీగా వరదనీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయమేర్పడింది.

ఏయూలో అగ్నిప్రమాదం.. కీలక ఫైళ్ల దగ్ధంపై వెల్లువెత్తుతున్న అనుమానాలు

జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఐదేళ్ల పాటు నలిగిపోయింది. జగన్ పాలన కాదేదీ దోపిడీకి అనర్హం అన్న రీతిలో సాగింది. సహజనరులు, భూములు ఇలా ఒకటనేమిటి అన్నీ విధ్వంసానికి, దోపిడీకి గురయ్యాయి. ఆఖరికి సరస్వతీ నిలయాలైన విద్యాలయాలనూ జగన్ సర్కార్ వదలలేదు. విశ్వవిద్యాలయాలనూ అక్రమాలకు కేంద్రాలుగా మార్చేసింది. తాజాగా ఆంధ్రవిశ్వవిద్యాలయంలో జరిగిన అక్రమాలకు ఆధారాలను ధ్వంసం చేసిన సంగతి ఆల స్యంగా వెలుగులోకి వచ్చింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం వీసీగా ప్రసాదరెడ్డి చేసిన అక్రమాలకు సంబంధించి కొత్త ప్రభుత్వం విచారణ చేపడుతుందన్న భయంతో  ఆధారాలు మాయం చేశారన్న సంగతి ఆలస్యంగా బయటకు వచ్చింది.  గత నెల 18న సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ప్రిన్సిపాల్‌ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలు ఫైళ్లు, కంప్యూటర్ల అగ్నికి ఆహుతి అయ్యాయి. అయితే ఈ అగ్ని ప్రమాదంలో అప్పట్లో ఎవరూ ఫిర్యాదు చేయలేదు. పైగా అగ్ని ప్రమాదం జరిగిందన్న విషయం ఎవరికీ తెలియకుండా ఉంచేందుకు ప్రయత్నాలు జరిగాయి. ప్రిన్సిపాల్ కార్యాలమంలో రంగులు వేసి మాయ చేసి పబ్బం గడుపుకుందామని ప్రయత్నించారు.   పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం, వర్సిటీ ఉన్నతాధికారుల నుంచి విచారణకు ఆదేశాలు రాకపో వడంతో  అక్రమాల ఆధారాల ధ్వంసం కోసమే అగ్నిప్రమాదం పేరుతో ఫైళ్లు, కంప్యూటర్లను ఉద్దేశపూర్వకంగానే దగ్ధం చేశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. జగన్ హయాంలో  ఆంధ్రా వర్సిటీని రాజకీయాలకు నిలయంగా మార్చేసిన ప్రసాదరెడ్డి అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. కూటమి విజయం తర్వాత చర్యలు తప్పవనే భయంతో జూన్‌ మొదటి వారంలో వర్సిటీలోని కీలక దస్త్రాలను మాయం చేసేందుకు ప్రయత్నించారు. వీసీ కారులోనే దస్త్రాలను కార్యాలయం నుంచి హడావుడిగా ఇంటికి తరలించారని ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు అగ్ని ప్రమాదం అంటూ చెబుతున్న కబుర్లు కూడా నమ్మశక్యంగా లేవని విద్యార్థలు ఆరోపిస్తున్నారు. ప్రసాదరెడ్డి అక్రమాలపైనా, అగ్నిప్రమాదంపైనా సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. 

చంద్రబాబు సర్కార్ పై వైసీపీ విమర్శలు.. నవ్విపోతున్న జనం.. నవ్వుల పాలౌతున్న జగన్

ఆంధ్రప్రదేశ్ లో రాక్షస పాలన అంతమై నెల రొజులు గడిచింది. ప్రజలకు సుపరిపాలన అందించడమే లక్ష్యంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబా బునాయుడు పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన సీఎంగా అధికార పగ్గాలు అందుకున్న నెలరోజులలోనే రాష్ట్రంలో సుపరిపాలన దిశగా అడుగులు పడుతున్నాయి. శాఖల వారీ సమీక్షలు, గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసాన్ని ప్రజల కళ్లకు కడుతూ వరుస శ్వేతపత్రాలు, అదే సమయంలో సంక్షేమం, అభివృద్ధికి బాటలు పరచడంతో బాబు పాలనపై జనంలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా అమరావతి, పోలవరం పనులలో వేగం, గత ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగులు, పెన్షనర్లకు ఒకటో తేదీనే వేతనాలు, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, ఉచిత ఇసుక విధానం, జగన్ మద్యం పాలసీ రద్దు, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు వంటి చర్యలతో చంద్రబాబు ప్రజల మనస్సులను గెలుచుకున్నారు.  అయితే తమ అస్తవ్యస్త పాలనతో ప్రజా తిరస్కారానికి గురై ఘోర ఓటమి పాలైన వైసీపీ నేతలు మాత్రం రాష్ట్రంలో పాలనను చూసి కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు.  చంద్రబాబు హామీ ఇచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మాటేమిటి?  పోలవరంపై శ్వేతపత్రం ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటివరకూ ప్రాజెక్టు కు అయిన ఖర్చు ఎంత, ప్రాజెక్టు పూర్తికి ఇంకా ఎంత వ్యయం అవుతుంది వంటి అంశాలను పేర్కొనలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే  తల్లికి వందనం పథకం అమలు విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం మోసం చేస్తున్నదని వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది.  ఇంటో చదువుకునే ప్రతి బిడ్డకు రూ.15వేలు ఇస్తామని ఇప్పుడు దాన్ని కుదించే ఆలోచన చేస్తున్నదని వైసీపీ ఆరోపి స్తున్నది. ఉచిత ఇసుక అని డబ్బులు వసూలు చేస్తున్నారని, రెడ్ బుక్  రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఓ గగ్గోలు పెట్టేస్తోంది. కూటమి ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ కాదు సూపర్ మోసాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు  విమర్శించడాన్ని తెలుగుదేశం వర్గాలే తప్పుపడుతున్నాయి. సామాన్య ప్రజలు కూడా అంబటి విమర్శలను కొట్టి పారేస్తున్నారు. నవ్వుకుంటున్నారు.  అదే సమయంలో పరిశీలకులు రాష్ట్ర వాస్తవ పరిస్థితిని వివరిస్తూ వైసీపీ విమర్శలు అధికారం కోల్పో యిన దుగ్ధతో తప్ప వాటిలో వాస్తవం ఇసుమంతైనా లేదని విశ్లేషిస్తున్నారు.  2019లో  జగన్ సీఎంగా పదవీ పగ్గాలు చేపట్టేనానికి, అంటే చంద్రబాబు దిగేనాటికి, రాష్ట్రం అప్పు రూ.3.14లక్షల కోట్లు. అది ఇప్పుడు  రూ.14లక్షల కోట్లు. అంటే ఐదేళ్ల కాలంలో జగన్ చేసిన అప్పు దాదాపు 11లక్షల కోట్లు. జగన్ చెప్పిన ప్రకారం ప్రజలకు ఇచ్చింది రూ.2.70 లక్షల కోట్లు. మిగిలిన 8లక్షల కోట్లు ఏంచేశారన్నదే  ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. రోడ్లువేయలేదు,రాజధాని కట్టలేదు. ఏ నీటిపారుదల ప్రాజెక్టు చేపట్టలేదు సరికదా నిర్మాణంలో ఉన్న పోలవరం వంటి ప్రాజెక్టుల పనులు నిలిపివేశారు రాష్ట్ర ప్రగతికి ఒక్క ఇటుక కూడా పేర్చకుండానే 11 లక్షల కోట్ల రూపాయలను హారతి కర్పూరంలా కరిగిం చేసింది జగన్ సర్కార్. ఇప్పుడు అలా లేక్కా పత్రం లేకుండా చేసిన అప్పులు, అడ్డగోలుగా ఆర్థిక అరాచకత్వానికి పాల్పడిన జగన్ పార్టీ, ఆ పార్టీ నేతలూ ఇప్పుడు చంద్రబాబు హామీల అమలు ఏమైందని ప్రశ్నిస్తున్నారు.  సామాజిక ఫింఛన్లు రూ. 4వేలకు, వికలాంగుల పింఛన్ 6వేలు పెంచి , అరియర్స్ తో సహా ఇవ్వడం, ఉద్యోగులకు 1వతేదీనే వేతనాలు ఇవ్వడం కనిపించడం లేదా?  అని తెలుగుదేశం వైసీపీ విమర్శలను తిప్పి కొడుతోంది.  మెగా డిఎస్సీ నోటిఫికేషన్,ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు,ఉచిత ఇసుక విధానం, పట్టిసీమ ద్వారా గోదావరిని కృష్ణా నదికి అనుసంధానం చేసి నీరు వదలడం, నిత్యావసరాలు చౌక ధరలకు రైతుబజార్ల ద్వారా పంపిణీ  వంటి వాటిని ప్రస్తావిస్తూ తెలుగుదేశం వర్గాలు వైసీపీ నేతల విమర్శలను తిప్పి కొడుతున్నాయి.  అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డు, బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యత ఇస్తామన్న కేంద్రం హామీల వెనుక చంద్రబాబు రాష్ట్ర పరుగతికి చేస్తున్న కృషిని ప్రస్తావిస్తూ జగన్ హయాంలో ఇలా రాష్ట్ర అభివృద్ధి దిశగా ఒక్క అడుగు పడిందా అని ప్రశ్నిస్తున్నాయి.   ఆగస్టు 15 నుంచి అన్న క్యాంటిన్లు,మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పారంభమవుతాయని తెలుగుదేశం కూటమి సర్కార్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి.  గత ఐదేళ్లుగా  అద్వానంగా ఉన్న రోడ్ల మరమతులు మొదలు కావడం, అమరావతి పనుల ప్రారంభం కావడం అభివృద్ధి కాదా అని ప్రశ్నిస్తున్నాయి. జగన్ దృష్టిలో అభివృద్ధి అంటే వేరే ఏదైనా ఉందా అని ప్రశ్నిస్తున్నాయి.  నెలరోజులకే హామీలపై వైసీపి తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం, విరుచుకుపడటంపై జనం నవ్వి పోతున్నారు. పని చేస్తున్న ప్రభుత్వానికి తగినంత సమయం ఇవ్వాలని అంటున్నారు. ఎంతగా గొంతు చించుకున్నా వైసీపీకి మరో చాన్స్ ఇచ్చేందుకు తాము సుముఖంగా లేమని కుండ బద్దలు కొడుతున్నారు. వైసీపీ విమర్శలను తిప్పికొట్టడంలో తెలుగుదేశం శ్రేణుల కంటే సామాన్య జనమే ముందుంటున్నారు.  

తెలంగాణ‌ తెలుగుదేశంలో నయాజోష్.. బడా నేతల చేరికకు చంద్రబాబు గ్రీన్‌సిగ్న‌ల్‌

తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీకి పూర్వ‌వైభ‌వం రాబోతుందా.. తెలుగుదేశం  అధినేత‌ చంద్ర‌బాబు నాయుడు ఏపీ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత తెలంగాణ‌లో పార్టీ బ‌లోపేతంపై దృష్టిపెట్టారా?  ఇప్ప‌టికే ప‌లువురు ముఖ్య‌నేత‌లు తెలుగేదేశంలో చేరేందుకు చంద్ర‌బాబుతో మంత‌నాలు జ‌రిపారా?  అందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా? అంటే అవుననే స‌మాధానమే వస్తోంది.  తెలంగాణ‌లో  తెలుగుదేశం పార్టీకి బ‌ల‌మైన క్యాడ‌ర్ ఉంది. పార్టీని న‌డిపించే నాయ‌కుడు లేక‌పోవ‌టంతో పాటు, గ‌త అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో  తెలుగుదేశం పోటీ చేయ‌క‌పోవ‌టంతో ఆ పార్టీ క్యాడ‌ర్ ఇత‌ర పార్టీల‌కు మ‌ద్ద‌తుగా నిలిచారు.  గ‌తంలో తెలంగాణ తెలుగుదేశం ముఖ్య‌నేత‌లంతా బీఆర్ఎస్ లో చేర‌గా.. కొంద‌రు కాంగ్రెస్ లో చేరారు. అయితే, వారిలో చాలా మంది మ‌ళ్లీ తెలుగుదేశం గూటికి తిరిగి వచ్చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. తెలంగాణ రాజ‌కీయాల్లో ముఖ్య‌నేత‌లుగా చ‌లామ‌ణిలో ఉన్న ఇద్ద‌రు నేత‌లు త్వ‌ర‌లో  తెలుగుదేశం తీర్థం పుచ్చుకోబోతున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే వారు చంద్ర‌బాబుతో మంత‌నాలు జ‌రిపార‌ని, వీరిలో ఒక‌రు తెలంగాణతెలుగుదేశం అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్ట‌బోతున్నార‌న్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. తెలంగాణ‌లో ప్ర‌స్తుతం సుదీర్ఘ రాజ‌కీయ‌ అనుభ‌వం క‌లిగిన చాలా మంది నేత‌లు తెలుగుదేశం ద్వారా రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన‌వారే. వారిలో కొంద‌రు బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలోనూ, ప్ర‌స్తుత కాంగ్రెస్ ప్ర‌భుత్వంలోనూ మంత్రులుగా కొన‌సాగుతున్నారు. ప్ర‌త్యేక తెలంగాణ ఏర్పాటు త‌రువాత చంద్ర‌బాబు నాయుడు ఏపీ రాజ‌కీయాల‌పై ఎక్కువ కాన్ సన్ ట్రేట్ చేయడంతో తెలంగాణ‌లో తెలుగుదేశం బ‌ల‌హీనప‌డుతూ వ‌చ్చింది. ఆ త‌రువాత జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో టీడీపీలో ముఖ్య‌నేత‌లు అధిక‌శాతం మంది బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారు. దీంతో తెలంగాణ‌ తెలుగుదేశం  నాయ‌క‌త్వ లేమితో ఎన్నిక‌ల్లోసైతం అభ్య‌ర్థుల‌ను పోటీకి నిల‌బెట్ట‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీకి బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉన్న‌ప్ప‌టికీ.. దానిని స‌ద్వినియోగం చేసుకొని పార్టీని బ‌లోపేతంచేసే నాయ‌కుడు లేని పరిస్థితి ఏర్పడింది.   ప్ర‌స్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడిపోవ‌డంతో ఆ పార్టీని వీడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ ముఖ్య‌నేత‌లు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇష్ట‌ప‌డ‌ని నేత‌లు తెలుగుదేశం వైపు చూస్తున్నారు.   బీఆర్ఎస్  అధికారంలో ఉన్న స‌మ‌యంలో మంత్రిగా ప‌నిచేసి , ఇటీవల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆ పార్టీ నుంచి విజ‌యం సాధించిన మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి  తెలుగుదేశం గూటికి చేరడం ఇక లాంఛనమే అని అంటున్నారు.  ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో  తెలుగుదేశం తరఫున మల్కాజ్ గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి మల్లారెడ్డి లోక్ సభకు ఎన్నికయ్యారు.  ఆ త‌రువాత బీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగానూ ప‌నిచేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డం, ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డంతో మ‌ల్లారెడ్డి ఒరింత ఇబ్బందిరన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. గ‌తంలో మ‌ల్లారెడ్డి, రేవంత్ రెడ్డికి మ‌ధ్య భూక‌బ్జాల విష‌యంలో తీవ్రస్థాయిలో వాగ్వివాదం జ‌రిగింది. మ‌ల్లారెడ్డి వంద‌ల కోట్ల విలువైన భూముల‌ను క‌బ్జా చేశార‌ని అప్ప‌ట్లో రేవంత్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ సీఎం అయిన త‌రువాత మ‌ల్లారెడ్డి క‌ళాశాల‌కు చెందిన భ‌వ‌నం ప్ర‌భుత్వ భూమిని ఆక్ర‌మించుకొని నిర్మాణం చేశారంటూ కూల్చివేశారు. ప్ర‌భుత్వం నుంచి ఎదుర‌య్యే దాడిని త‌ప్పించుకునేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మ‌ల్లారెడ్డి, ఆయ‌న అల్లుడు సిద్ధ‌ప‌డిన‌ట్లు అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. అయితే, మ‌ల్లారెడ్డి రాక‌ను కాంగ్రెస్ లో కొంద‌రు వ్య‌తిరేకించ‌డంతో ఆయ‌న కాంగ్రెస్‌లో చేరిక నిలిచిపోయింది. ప్ర‌స్తుతం రాజ‌కీయంగా బ‌లోపేతం అయ్యేందుకు, తెలంగాణ‌ ప్ర‌భుత్వం నుంచి ఎదుర‌య్యే ఇబ్బందిని త‌ట్టుకోవాలంటే తెలుగుదేశంలో చేర‌డ‌మే మంచిద‌న్న భావ‌న‌కు మ‌ల్లారెడ్డి వ‌చ్చిన‌ట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కేంద్రంలోనూ కీల‌కంగా ఉన్నారు. మ‌రోవైపు చంద్ర‌బాబు అండ‌దండ‌లు ఉంటే తెలంగాణ ప్ర‌భుత్వం నుంచి పెద్ద‌గా ఇబ్బంది ఉండ‌ద‌ని మ‌ల్లారెడ్డి, ఆయ‌న వ‌ర్గీయులు భావిస్తున్నారు. దీంతో తెలుగుదేశంలో చేరి రాష్ట్ర పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టేందుకు మ‌ల్లారెడ్డి సిద్ధ‌మ‌య్యార‌ని, అందుకు చంద్ర‌బాబు నుంచి గ్రీన్ సిగ్న‌ల్ కూడా వ‌చ్చిన‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. తెలంగాణ రాజ‌కీయాల్లో కీల‌క నేత‌గాఉన్న నామా నాగేశ్వ‌ర‌రావు కూడా తెలుగుదేశం గూటికి చేర‌బోతున్న‌ట్లు కొద్దిరోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.  2019 పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు ముందు బీఆర్ఎస్ లో చేరిన నామా.. ఆ ఎన్నికలలో ఎంపీగా విజ‌యం సాధించారు. ఇటీవ‌ల జ‌రిగిన పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో మ‌రోసారి బీఆర్ఎస్  త‌ర‌పున పోటీచేసి ఓట‌మి పాల‌య్యారు. నామాకు తెలుగుదేశంతోనూ, ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబుతోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. గ‌తంలో సుదీర్ఘ‌కాలం ఆయ‌న  తెలుగుదేశంలో  ఉన్నారు. ఖ‌మ్మం జిల్లాలో  తెలుగుదేశం పార్టీకి బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉంది. ప్ర‌స్తుతం బీఆర్ఎస్ లో ఉంటే రాజ‌కీయ భ‌విష్య‌త్ ఉండ‌ద‌ని భావించిన నామా..  తెలుగుదేశం గూటికి చేరేందుకు   సిద్ధ‌మ‌య్యార‌ని, ఇప్ప‌టికే చంద్ర‌బాబుతో మంత‌నాలు కూడా జ‌రిపిన‌ట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశంలో చేరి.. ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో కీలకంగా వ్యవహరించొచ్చని నామా ఆశిస్తున్న‌ట్లు స‌మాచారం. మ‌ల్లారెడ్డి, నామాలు సైకిల్ సవారీ విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు స్ప‌ష్ట‌త ఇవ్వ‌న‌ప్ప‌టికీ.. వారిద్ద‌రూ తెలుగుదేశం పార్టీలో చేరితే రాష్ట్రంలో టీడీపీ పూర్వ‌వైభ‌వం సంతరించుకోవడం ఖాయమన్న భావన రాజకీయవర్గాల్లో వ్యక్తం అవుతోంది. 

ష‌ర్మిళ అటాక్.. వైసీపీ మైండ్ బ్లాక్!

ఏపీలో ఐదేళ్లు క‌క్ష‌పూరిత పాల‌న‌తో ప్ర‌జ‌ల‌ను ఇబ్బందుల‌కు గురిచేసిన వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి అధికారం కోల్పోయిన త‌రువాత వ‌రుస దెబ్బ‌లు త‌గులుతున్నాయి. ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు కేవ‌లం 11 సీట్లు మాత్ర‌మే ఇవ్వ‌డంతో రాబోయే కాలంలో ఆ పార్టీ భ‌విష్య‌త్ అగమ్యగోచరంగా మారింది. జ‌గ‌న్ పై ఉన్న పాత కేసుల‌కు కొత్త కేసులు తోడు కావ‌డంతో ఆయ‌న జైలుకెళ్ల‌డం ఖాయ‌మ‌ని వైసీపీ శ్రేణులే చర్చించుకుంటున్నాయి.  అదే జ‌రిగితే వైసీపీ క‌నుమ‌రుగు అవుతుంద‌న్న ఆందోళ‌న ఆ పార్టీ నేత‌ల‌ను వెంటాడుతోంది. మ‌రోవైపు.. సీఎం చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. కేంద్రం స‌హ‌కారం ఉండ‌టంతో ఐదేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల‌న్న  ప‌ట్టుద‌ల‌తో ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ఉన్నారు. దీంతో  వైసీపీ కనుమరుగు కావడం ఖాయమనిఆ పార్టీ నేత‌లు భ‌య‌ప‌డుతున్నారు. మ‌రో వైపు ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల దూకుడు వైసీపీ నేత‌ల‌ను వ‌ణికిస్తోంది. ష‌ర్మిల దూకుడుకు జ‌గ‌న్ అడ్డుక‌ట్ట వేయ‌కుంటే వైసీపీని వీడ‌ట‌మే బెట‌ర్ అనే నిర్ణ‌యానికి ఆ పార్టీ ముఖ్య‌నేత‌లు వచ్చేసినట్లు  ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.  ఏపీలో ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, వైసీపీ ప్ర‌భుత్వంపై వైఎస్ ష‌ర్మిల తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. ఆమె పోటీ చేసిన ఒక్క క‌డ‌ప పార్ల‌మెంట్‌ నియోజ‌క‌వ‌ర్గంలోనే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టించి వైసీపీ ప్ర‌భుత్వ ప్ర‌జావ్య‌తిరేక పాల‌న‌ను ప్ర‌జ‌ల్లో ఎండ‌గ‌ట్టింది. దీంతో వైసీపీ సోష‌ల్ మీడియా బ్యాచ్ ష‌ర్మిల‌పై అస‌భ్య‌క‌ర ప‌ద‌జాలంతో తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారం కోల్పోవ‌డంతో.. ఏపీలోని వైఎస్ అభిమానుల‌ను కాంగ్రెస్ లోకి ఆహ్మానించేందుకు ష‌ర్మిల, కాంగ్రెస్ పెద్ద‌లు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే విజ‌య‌వాడ వేదిక‌గా వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి జ‌యంతి వేడుక‌ల‌ను కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో ష‌ర్మిల ఘ‌నంగా నిర్వ‌హించారు. ఇటీవ‌ల ఆమె విలేక‌రుల‌తో మాట్లాడుతూ..  ఘోర ఓటమి తరువాత కూడా తమకు 39శాతం మంది ప్రజలు ఓట్లు వేశార‌ని వైసీపీ నేత‌లు గొప్పలు చెప్పుకోవడాన్ని ఎద్దేవా చేశారు. ఏపీ ఎన్నికలు జగన్ ముఖ్యమంత్రిగా ఉండాలా? చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉండాలా అనే విష‌యంపైనే జ‌రిగాయనీ, జనం  జగన్ ను నిర్ద్వంద్వంగా తిరస్కరించి చంద్రబాబుకు పట్టం కట్టారని షర్మిల చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీనంగా ఉండటంతో చంద్రబాబు సీఎంగా అంగీకరించని వాళ్లు వైసీపీకి ఓటు వేశారు. నిజానికి వైసీపీకి వచ్చిన ఓట్లన్నీ కాంగ్రెస్ వే అని షర్మిల వివరంగా చెప్పారు.  వైఎస్  రాజ‌కీయ వార‌సుడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కాదన్న షర్మిల   వైఎస్  రాజ‌కీయ వార‌స‌త్వం తనదేనని బాంబు పేల్చారు.  అంతేకాక‌.. కూట‌మి ప్ర‌భుత్వం తల్లికి వందనం ప‌థ‌కానికి సంబంధించి విడుద‌ల చేసిన జీవోపై వైసీపీ పెద్ద రాద్దాంతం చేసేందుకు ప్ర‌య‌త్నించింది. కానీ, ష‌ర్మిల గ‌తాన్ని గుర్తుచేస్తూ జ‌గ‌న్ మెహ‌న్ రెడ్డి, వైసీపీ నేత‌లు నోరెత్త‌కుండా చేశారు. త‌ల్లికి వంద‌నం పథకానికి సంబంధించి ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో ఇంట్లో ఎంత మంది పిల్ల‌లు ఉంటే వారంద‌రికీ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తామ‌ని చంద్ర‌బాబు చెప్పారు. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ప‌థ‌కం అమలుపై దృష్టి కేంద్రీక‌రించారు. తాజాగా ఏపీ ప్ర‌భుత్వం ఇందుకు సంబంధించిన జీవోను విడుద‌ల చేసింది. ఆ జీవోలో ఇంట్లో ఒక్క‌రికి మాత్ర‌మే త‌ల్లికి వంద‌నం ప‌థ‌కం అమ‌ల‌య్యేలా ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌ని వైసీపీ నేత‌లు పెద్ద రాద్దాంతం చేశారు. ఆ విష‌యంపై ప్ర‌భుత్వం వివ‌ర‌ణ ఇచ్చినా వైసీపీ నేత‌లు త‌మ అనుకూల మీడియాలో, సోష‌ల్ మీడియాలో పెద్ద‌ ఎత్తున త‌ప్పుడు ప్ర‌చారం చేశారు. ఈ స‌మ‌యంలో వైఎస్ ష‌ర్మిల మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి వైసీపీ ప్ర‌భుత్వంలో ఇంట్లో ఎంత మంది పిల్ల‌లు ఉంటే అంద‌రికీ ప‌థ‌కం వ‌ర్తింప‌జేస్తామ‌ని చెప్పి.. అధికారంలోకి వ‌చ్చాక కేవ‌లం ఒక్క‌రికి మాత్ర‌మే ప‌థ‌కాన్ని అమ‌లు చేశారు. ఇప్పుడు కూట‌మి ప్ర‌భుత్వాన్ని ఎలా ప్ర‌శ్నిస్తున్నార‌ని వైసీపీ నేత‌ల‌ను ష‌ర్మిల ప్ర‌శ్నించారు. అదే స‌మ‌యంలో త‌ల్లికి వంద‌నం ప‌థ‌కం జీవోపై సీఎం చంద్ర‌బాబు క్లారిటీ ఇవ్వాల‌ని ష‌ర్మిల డిమాండ్ చేశారు.  ష‌ర్మిల దూకుడుతో వైసీపీ నేత‌లు తేలిపోయారు. ఏపీలో అస‌లైన ప్ర‌తిప‌క్ష పార్టీ కాంగ్రెస్ పార్టీయే అంటూ ష‌ర్మిల తన దూకుడుతో చెప్ప‌క‌నే చెప్పారు. ఇదే విష‌యాన్ని వైసీపీ ముఖ్య‌నేత‌లు జ‌గ‌న్ ముందు ప్ర‌స్తావించారు‌. ష‌ర్మిల దూకుడుకు అడ్డుక‌ట్ట వేయ‌కుంటే భ‌విష్య‌త్తులో వైసీపీకి కోలుకోలేని దెబ్బ త‌గులుతుంద‌ని వారు జ‌గ‌న్ ముందు ఆవేద‌న వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. దీంతో ష‌ర్మిల‌పై జ‌గ‌న్ అనుకూల మీడియా  విమ‌ర్శలకు తెర లేచింది. అయితే వైసీపీ ఇంత కాలం పాడుతూ వస్తున్న పాత పాటనే మళ్లీ అందుకుంది.  వైఎస్ బిడ్డ‌నంటూ చెప్పుకుంటున్న ష‌ర్మిల‌ చంద్ర‌బాబు స్క్రిప్ట్ మేరకు మాట్లాడుతున్నారనీ,  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని రాజ‌కీయంగా దెబ్బ‌తీసేందుకు మాత్ర‌మే చంద్ర‌బాబు చెప్పిన‌ట్లు ష‌ర్మిల మాట్లాడుతున్నారంటూ కథనాన్ని వండి వార్చింది. చంద్ర‌బాబుకు తోక‌ పార్టీ కాంగ్రెస్ అంటూ పేర్కొంది. దీనిపై ష‌ర్మిల ఎక్స్ వేదిక‌గా గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు. పచ్చ కామెర్లు ఉన్న వాడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందనే సామెతలా వైసీపీ నేతల తీరు ఉందంటూ ష‌ర్మిల ఫైర్ అయ్యారు. మొత్తం మీద షర్మిల దూకుడుకు జగన్ వద్ద సమాధానమే లేదన్న భావన వైసీపీ వర్గాల్లోనే వర్గాల్లోనే వ్యక్తం అవుతోంది. దీంతో తమ  రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోసం వైసీపీని వీడడమే బెటర్ అన్న భావన ఆ పార్టీ ముఖ్య నేతల్లోనే వ్యక్తం అవుతోంది. 

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై కాల్పులు

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ లక్ష్యంగా కాల్పులు జరిగాయి.  పెన్సిల్వేనియాలోని బట్లర్ సిటీలో ఎన్నికల ప్రచారంలో  ప్రసంగిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ కాల్పుల్లో ట్రంప్ స్వల్పంగా గాయపడ్డారు. బుల్లెట్ ఆయన చెవిని తాకుతూ వెళ్లింది. చెవినుంచి రక్తం కారుతుండగా ట్రంప్ పిడికిలి బిగించి నినాదాలు చేశారు. కాగా ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించాడు. కాల్పులు జరిపిన వ్యక్తిని భద్రతా సిబ్బంది కాల్పుల్లో మరణించాడు.  కాగా ట్రంప్ పై కాల్పుల ఘటనను అమెరికా అధ్యక్షుడు జో బెడెన్ ఖండించారు. అమెరికాలో హింసకు తావులేదని  ట్వీట్ చేశారు. కాగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ట్రంప్ పై కాల్పుల ఘటనను ఖండిస్తూ ట్వీట్ చేశారు.  ప్రజాస్వామ్యంలో రాజకీయ హింసకు స్థానం లేదని పేర్కొన్నారు.  ట్వీట్ చేశారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.   

నా పెళ్ళానికి విజయసాయిరెడ్డి కడుపు చేశాడు మొర్రో!

ఏపీలో ఒక మాజీ అధికారిణి భర్త సంచలన ఫిర్యాదు చేశారు. తన భార్య గర్భందాల్చడానికి విజయసాయిరెడ్డి కారణమని ఆమె భర్త మదన్‌ మోహన్‌ సంచలన ఫిర్యాదు చేశారు. తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భం దాల్చిందని,  భార్య గర్భానికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, గవర్నమెంట్‌ ప్లీడర్‌ సుభాష్‌లే కారణమని మదన్‌ మోహన్‌ తన అనుమానాన్ని ఫిర్యాదులో వ్యక్తి చేశారు. తన భార్య అక్రమ సంతానానికి తండ్రి ఎవరో తేల్చాలని కోరారు. కాగా, సదరు ఉద్యోగినిపై ఇటీవల సస్పెన్షన్ వేటు పడింది. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అండతో 2021లో ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల దేవదాయ శాఖ అధికారిగా బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి నుంచి ఆమె తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అవినీతి ఆరోపణలతో పాటు ఉద్యోగుల్లోనూ తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆమెను విధుల్లో నుంచి తొలగించారు.

ఏడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉపఎన్నికలు.. ఇండియా కూటమి హవా

సార్వత్రిక ఎన్నికలలో గట్టిగా పుంజుకున్న కాంగ్రెస్ మంచి జోష్ మీద ఉంది. సార్వత్రిక ఎన్నికలలో అత్యధిక స్థానాలలో విజయం సాధించి అధికారంలోకి రాలేకపోయినా ఇండియా కూటమి గణనీయంగా పుంజుకుంది.  ఎన్నికలల విజయం సిద్ధించకపోయినా బలమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్ అవతరించింది.  గత రెండు సందర్భాలలోనూ అంటే 2014, 2019 ఎన్నికలలో వలె బీజేపీకి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగేందుకు అవసరమైన స్థానాలు దక్కాయి. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు సంగతి దేవుడెరుగు కనీసం విపక్షంగా ఉండేందుకు అసమైర స్థానాలకు  దక్కించుకోలేకపోయింది. అయితే 2024 ఎన్నొకతు వచ్చే సరికి కాంగ్రెస్ స్వయంగా బలం పుంజుకోవడమే కాకుండా, కేంద్రంలో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తగినన్ని స్థానాలు బీజేపీకి లభించకుండా చేయడంలో సక్సెస్ అయ్యింది.  ఇప్పుడు ఏడు రాష్ట్రాలలోని 13 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 10న జరిగిన ఉప ఎన్నికలలో   కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి హవా సాగుతోంది.  ఈ ఉప ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తొలి విజయాన్ని నమోదు చేయగా,  మిగతా 12లో 10 స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.  లోక్‌సభ ఎన్నికల తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల ఫలితాలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ మార్కు అందుకోలేకపోయిన బీజేపీ, మెజార్టీ మార్కుకు చేరువగా వచ్చిన కాంగ్రెస్ కూటమి ఈ ఎన్నికలను సవాలుగా తీసుకున్నాయి. పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, పంజాబ్, బీహార్‌లలో ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. పశ్చిమ బెంగాల్‌లోని బాగ్డా, రాణాఘాట్, మణిక్తల, రాయ్‌గంజ్‌లోని నాలుగు స్థానాల్లోనూ అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగింది.  ఉత్తరాఖండ్‌లోని మంగ్లావుర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఖాజీ నిజాముద్దన్ తన సమీప బీఎస్పీ అభ్యర్థి ఉబేదెర్ రెహ్మాన్‌పై ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు.  అలాగే బద్రీనాథ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి లఖ్‌పత్ సింగ్ బుటోలా స్పష్టమైన ఆధిక్యత కనబరిచారు.  పంజాబ్‌లోని జలంధర్ వెస్ట్‌లో ఆప్ అభ్యర్థి మొహిందర్ భగత్ విజయం సాధించారు. ఇక్కడి నుంచి విజయం సాధించిన ఆప్ ఎమ్మెల్యే శీతల్ అంగురల్ బీజేపీలో చేరడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.  తమిళనాడులోని విక్రవంది అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార డీఎంకే అభ్యర్థి అన్నియూర్ శివ లీడింగ్‌లో ఉన్నారు. బీహార్‌లో జేడీయూ అభ్యర్థి కళాధర్ ప్రసాద్  మండల్  పై చేయి సాధించారు.  మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లా అమర్వారా నియోజకవర్గంలో బీజేపీ, హిమాచల్ ప్రదేశ్‌లో తొలుత వెనకబడిన కాంగ్రెస్ పుంజుకుని ఆధిక్యంలోకి దూసుకొచ్చింది.   డేహ్రాలో తొలుత వెనకబడిన సీఎం సుఖ్విందర్ సుఖు భార్య కమలేశ్ ఠాకూర్ ముందంజలో ఉన్నారు. 

కాంగ్రెస్ పగ్గాలు ఇక ప్రియాంకకు? రాహుల్ గాంధీయే ప్రతిపాదిస్తారా?

కాంగ్రెస్ పార్టీలో ప్రియాంక గాంధీకి ఉన్న గుర్తింపే వేరు. ఆమె దివంగత ప్రధాని ఇందిరాగాంధీ పోలికలతో ఉంటారనీ, ఆమె మాట తీరు, నిర్ణయాలు తీసుకునే వేగం అన్నీ ఇందిరాగాంధీని స్ఫురణకు తీసుకువస్తాయన్నది మెజారిటీ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల భావన. ఇప్పటి వరకూ ఆమె ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొన్నది అంతంత మాత్రమే. అయితే ఈ సారి మాత్రం ఆమె రాహుల్ గాంధీ ఖాళీ చేసిన వాయనాడ్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు పోటీ చేస్తున్నారు. కేరళలోని వాయనాడ్ నుంచి ఆమె అభ్యర్థిత్వం ఖరారు కాగానే ఒక్క సారిగా కాంగ్రెస్ పార్టీలో ఆమె ప్రాధాన్యత పెరిగిపోయింది. మున్ముందు ప్రియాంకగాంధీయే ఇందిరాగాంధీ రాజకీయ వారసురాలిగా రాజకీయాలలో చక్రం తిప్పుతారన్న పార్టీ వర్గాలలో గ ట్టిగా వినిపిస్తున్నది. వాయనాడ్ నుంచి ఆమె ఎన్నికైన క్షణం నుంచీ రాజకీయాలలో పెనుమార్పులకు అవకాశం ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సారథ్యం ఆమె చేతుల్లోకి తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రియాంక కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా ముందుకు వచ్చినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. కాగా సామాన్య జనంలో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వరుసగా మూడు పరాజయాల తరువాత రాహుల్ గాంధీలో ఎంత పరిణితి కనిపిస్తున్నప్పటికీ పార్టీ మొత్తం ఆయన నాయకత్వాన్ని సంపూర్ణంగా అంగీకరించడం లేదు. అలాగే సంకీర్ణ యుగంలో కాంగ్రెస్ నేతృత్వంలో పని చేయడానికి సుముఖత వ్యక్తం చేస్తున్న పార్టీలు కూడా రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండియా కూటమి భవిష్యత్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీపైనా కాంగ్రెస్ భారీ ఆశలు పెట్టుకుంది.  అయితే ఇప్పటి వరకూ ఆమె తన సోదరుడు రాహుల్ గాంధీ కోసమే తన ప్రచారం, తన రాజకీయం అని చెబుతూ వస్తున్నారు. అంటే ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీలో లీడ్ రోల్ తీసుకోవాలంటే అందుకు ముందుగా రాహుల్ గాంధీ ప్రతిపాదించాల్సి ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో రాహుల్ గాంధీకి ప్రధాని అవ్వాలన్న కాంక్ష కంటే బీజేపీ దుష్టపాలన నుంచి దేశానికి విముక్తి కలిగించాలన్న లక్ష్యమే బలంగా ఉందని, ఆ కారణంతో నిజంగా కాంగ్రెస్ బలోపేతానికి ప్రింయాక గాంధీ లీడ్ రోల్ పోషించాలని ఆయన కన్విన్స్ అయితే క్షణం ఆలోచించకుండా వెనక్కు తగ్గి ప్రియాంకను ముందు పీఠిన నిలబెడతారని కాంగ్రెస్ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి.

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ #aaram

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహ మహోత్సవం యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహ మహోత్సవాలలో ఒకటిగా ఈ జంట పెళ్ళి నిలిచింది. బాడీ షేమింగ్ చేసే బుద్ధిలేని కుక్కలు ఎంత మొరిగినా, అనంత్, రాధికల జంట నిజంగానే చూడముచ్చటైన జంట. ఈ జంటకి తెలుగువన్ ఒక హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేస్తోంది. అదే.. #aaram. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంటను వాళ్ళ పేర్లలోని అక్షరాలను తీసుకుని ‘విరుష్క’ అన్నట్టుగా, అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ జంటను ‘ఆరామ్’ అనొచ్చు. Anant Ambani, RAdhika Merchent.. ఇలా ఇద్దరి పేర్లలోని అక్షరాలను తీసుకుని క్రియేట్ చేసిన హేష్‌టాగ్ #aaram. చూడముచ్చటగా వున్న ఈ జంట జీవితం ఆరామ్‌గా గడిచిపోవాలన్న సత్సంకల్పం కూడా ఈ హ్యాష్ ట్యాగ్ వెనుక వుంది.  ఇక మన #aaram పెళ్ళి వేడుకల విషయానికి వస్తే, అనంత్, రాధిక వివాహానికి తారాలోకం దిగి వచ్చింది. సెలబ్రిటీల సందడితో ముంబై నగరం మురిసింది. అంబానీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, అతిథుల మధ్య అనంత్, రాధిక #aaram ప్రేమ బాసలు చేసుకున్నారు. ‘‘శ్రీకృష్ణుడి ఆశీర్వాదంతో మనిద్దరం కలసి మనం కలలు కంటున్నట్టుగా మన ఇంటిని నిర్మించుకుందామని నీకు ప్రామిస్ చేస్తున్నాను. మన ఇల్లు ఒక ప్రదేశం మాత్రమే కాదు.. మనం ఎక్కడున్నామన్న దానితో సంబంధం లేకుండా అది ప్రేమతో నిండి వుంటుంది’’ అని అనంత్ అంబానీ తన భార్య రాధికకు భరోసా ఇచ్చారు. రాధిక కూడా అనంత్‌తో ‘‘మన ప్రేమ బంధం కలగలసిన ప్రాంతంగా మన ఇల్లు వుంటుంది’’ అన్నారు. శుక్రవారం రాత్రి అనంత్, రాధిక ‘శుభవివాహం’ బాంద్రాలోని జియో వరల్డ్ సెంటర్లో జరిగింది. సినీ, రాజకీ, వ్యాపార తదితర రంగాలకు చెందిన ప్రముఖులు వచ్చి సందడి చేశారు. అతిథులందరూ సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్నారు. సినీతారలు షారుక్ ఖాన్, రణ్‌వీర్ సింగ్, సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్, రజనీకాంత్, మాధురీ దీక్షిత్ తమ డాన్స్.తో ఆకట్టుకున్నారు. శనివారం జరిగే ‘శుభ్ ఆశీర్వాద్’, ఆదివారం జరిగే రిసెప్షన్ ఇంకెంత భారీ స్థాయిలో వుంటాయోనన్న అంచనాలు వున్నాయి.

ఒడిశాలో బస్సు ప్రమాదం... ముగ్గురు హైదరాబాద్ వాసుల దుర్మరణం 

పూరి జగన్నాథ రథ యాత్రకు వెళ్లి తిరిగొస్తున్న తెలంగాణవాసులు దుర్మరణం చెందారు. హైదరాబాద్ నుంచి ఒడిశాకు యాత్రికులతో బయలుదేరిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు  తిరిగి వస్తుండగా ఒడిశాలో ప్రమాదానికి గురైంది. బస్సు డ్రైవర్ సహా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ఉన్నట్టు తెలిసింది. వీరంతా హైదరాబాద్ పాతబస్తీలోని ఛత్రినాకకు చెందిన వారని సమాచారం. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అయితే, ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది? క్షతగాత్రులు ఎక్కడ చికిత్స పొందుతున్నారు? వంటి వివరాలు తెలియాల్సి ఉంది.

ఎపి ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ముఖేష్ కుమార్ మీనా

ఎపిలో ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఐఏఎస్ అధికారి ముకేశ్ కుమార్‌ మీనాకు ఏపీ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ముకేశ్ కుమార్ మీనా నిన్న సాయంత్రం ఏపీ సీఈవో బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. ఆ స్థానంలో వివేక్ యాదవ్ నియమితులయ్యారు.  ఇటీవల జరిగిన ఎన్నికల్లో ముకేశ్ కుమార్ మీనా అక్రమాలను అడ్డుకోవడంలో సమర్థంగా పనిచేశారన్న ప్రశంసలు అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆయనను ఈ బాధ్యతల్లోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక, ఆయన స్థానంలో కొత్త సీఈవోగా నియమితులైన వివేక్ యాదవ్ మొన్నటి వరకు సీఆర్డీయే కమిషనర్‌గా పనిచేశారు. రెండు రోజుల క్రితం యువజన సర్వీసులు, క్రీడలశాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. అంతలోనే ఆయనను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఆయనను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

అన్న క్యాంటిన్లకు కోటి విరాళం

గుంటూరు జిల్లా కొలనుకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రంలో నిర్వహించిన అనంతశేష స్థాపన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఇస్కాన్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యలమంచిలి వెంకట కృష్ణమోహన్, విజయలక్ష్మి దంపతులు ఇస్కాన్‌కి కోటి రూపాయల విరాళంగా ఇచ్చారు. అలాగే అన్న క్యాంటిన్ల నిర్వహణ కోసం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడం వల్ల తన ఆస్తి వంద కోట్ల రూపాయలు పెరిగిందని, ఆ సంతోషంలోనే ఈ విరాళాలు ఇస్తున్నానని యలమంచిలి వెంకట కృష్ణమోహన్, విజయలక్ష్మి దంపతులు చెప్పారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, తాను ఇంకా అభివృద్ధి ప్రారంభించకుండానే భూముల విలువ పెరిగిందని, దీనివల్ల సమాజం ఆర్థికంగా ముందుకు వెళ్తుందని అన్నారు. యలమంచిలి వెంకట కృష్ణమోహన్, విజయలక్ష్మి దంపతులు వంద పేద కుటుంబాలను పైకి తీసుకురావాలని చంద్రబాబు ఈ సందర్భంగా సూచించారు. దానికి ఆ దంపతులు సంతోషంగా అంగీకరించారు.

హరేకృష్ణ గోకుల క్షేత్రంలో చంద్రబాబు పూజలు!

గుంటూరు జిల్లా కొలనుకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించి పూజలు చేశారు. గర్భాలయంలో నిర్వహించిన అనంతశేష స్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వేంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా ఇక్కడ అనంత శేష స్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడితోపాటు సుప్రీంకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కూడా పాల్గొన్నారు. అక్షయపాత్ర ఫౌండేషన్ అంతర్జాతీయ అధ్యక్షుడు మధుపండిట్, మంత్రులు నారాయణ, సవిత, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ‘‘మంచి చేసే వారందరికీ ఆంధ్రప్రదేశ్ చిరునామాగా వుంటుంది. మంచి చేసేవారంతా ఏపీలో ముందుకు రావాలి. అక్షయపాత్ర స్ఫూర్తితో రాష్ట్రంలో అతి త్వరలో అన్న క్యాంటిన్లను పునఃప్రారంభిస్తాం. హరేకృష్ణ సంస్థ దైవసేవతోపాటు మానవసేవను సమానంగా చేస్తోంది. ఆధ్యాత్మికత ద్వారా వచ్చే మానసిక ఆనందం లేకపోతే ముందుకు వెళ్ళలేం. దైవత్వాన్ని అందరిలోనూ పెంపొందించడానికి అక్షయపాత్ర అంతర్జాతీయ అధ్యక్షుడు మధు పండిట్ కృషి చేస్తున్నారు. 50 మంది ఐఐటీ పట్టభద్రులు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ వుండటం అభినందనీయం. వేంకటేశ్వరస్వామి దయవల్లనే బాంబు పేలుళ్ళ నుంచి బయటపడ్డాను. ప్రపంచానికి సేవలందించే అవకాశం ఇవ్వడం కోసమే నాకు ఏడుకొండల వాడు ప్రాణభిక్ష పెట్టాడు’’ అన్నారు.  అమరావతి ప్రాంతంలో నూతన ఆధ్యాత్మిక ఒరవడికి శ్రీకారం చుట్టడం శుభసంకేతమని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ‘‘ఆలయాల్లోనూ రాజకీయాలు చొరబడిన ప్రభుత్వాలను మనం చూశాం. గోకుల క్షేత్రం నిర్మాణానికి సీఎం చంద్రబాబు సారథ్యంలో మార్గం సుగమమైంది. ఆధ్యాత్మికతతోపాటు సంస్కృతి, ఆచార వ్యవహారాలను కాపాడటం ముఖ్యం. ఇస్కాన్ సంస్థ ఎంతోమందికి అన్నదానం కూడా చేస్తోంది. అక్షయ పాత్ర ద్వారా గతంలో అన్న క్యాంటిన్లకు ఇస్కాన్ సంస్థ తోడ్పాటునిచ్చింది. ఎవరూ అర్ధాకలితో వుండకూడదనే ఉద్దేశంతో అక్షయపాత్ర అన్నదానం చేస్తోంది’’ అని ఎన్వీ రమణ అన్నారు.