అమరావతి ఓఆర్ఆర్ కు ఈ ఏడాది బడ్జెట్ లోనే నిధులు!
posted on Jul 10, 2024 @ 9:52AM
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్రం పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నది. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్న హామీని నిలుపుకునే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నది.
చంద్రబాబునాయుడు ఇటీవలి ఢిల్లీ పర్యటన సందర్భంగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం ఇప్పుడు అందుకు అవసరమైన నిధులను ఈ ఏడాది బడ్జెట్ లోనే కేటాయించనున్నట్లు సంకేతాలు ఇచ్చింది. 189 కిలోమీటర్ల అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు పాతిక వేల కోట్ల రూపాయలు వ్యయం అవుతాయన్నది అంచనా కాగా, కేంద్రం ఈ ఏడాది బడ్జెట్ లోనే ఐదు నుంచి పది వేల కోట్ల రూపాయలు కేటాయించేందుకు నిర్ణయించింది.
అంతే కాకుండా ఔటర్ రింగ్ రోడ్డు కోసం భూసేకరణ సహా మొత్తం ఖర్చులు కేంద్రమే భరించనుంది. ఈ ఔటర్ రింగ్ రోడ్డును కృష్ణా, గుంటూరు జిల్లాలను అనుసంధానించేలా 6 లేన్ల ఎక్స్ ప్రెస్ హైవేగా అభివృద్ధి చేయనున్నారు.