డోన్ట్ వర్రీ.. అదంతా ఒట్టి గ్యాసే..!
posted on Jul 9, 2024 @ 6:03PM
వంట గ్యాస్ కస్టమర్ల ఈ కేవైసీ (నో యువర్ కస్టమర్) ప్రక్రియను చేపట్టాలని కొంతకాలం క్రితం కేంద్ర ప్రభుత్వం చమురు మార్కెటింగ్ కంపెనీలను ఆదేశించింది. దాంతో ఎల్‌పీజీ కంపెనీలు ఈ కేవైసీ ప్రక్రియను ప్రారంభించాయి. అయితే, ఈ కేవైసీ నమోదు గ్యాస్ ఏజెన్సీల దగ్గర మాత్రమే చేయించుకోవాలని కొన్ని కంపెనీలు పట్టుపడుతూ వుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అంతే కాకుండా, అర్జెంటుగా ఈ కేవైసీ చేయించుకోపోతే గ్యాస్ కనెన్షన్ రద్దు అవుతుందని కూడా వదంతులు వ్యాపించాయి. ఈ విషయమై కేరళ శాసనసభ పక్ష నేత వీడి సతీశన్ కేంద్రమంత్రి హర్‌దీప్‌సింగ్ పూరీకి లేఖ రాశారు. దీని మీద కేంద్ర మంత్రి స్పందించారు. కేవైసీ ప్రక్రియ మీద క్లారిటీ ఇచ్చారు. ఈ కేవైసీ అనేది కేవలం డీలర్ల దగ్గరే చేయించుకోవాలనే రూల్ ఏమీ లేదని చెప్పారు. అలాగే ఫలానా గడువు లోపల ఈ కేవైసీ చేయించుకోకపోతే గ్యాస్ కనెన్షన్ రద్దు అవుతుందన్న వార్తలు కూడా కేవలం పుకార్లేనని ఆయన స్పష్టం చేశారు.
బోగస్ కస్టమర్లను తొలగించడం కోసం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ కేవైసీని నిర్వహిస్తున్నాయి. గత ఎనిమిది నెలలుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. సాధారణంగా గ్యాస్ సిలెండర్లను డెలివరీ చేసే సమయంలోనే డెలివరీ సిబ్బంది కస్టమర్ల ఈ కేవైసీ వివరాలు తీసుకుంటారు. డెలివరీ సిబ్బంది దగ్గర వుండే ఫోన్లో వినియోగదారుల ఆధార్ వివరాలను నమోదు చేసుకుని ఈ ప్రక్రియని పూర్తి చేస్తారు. లేదా కస్టమర్లు వాళ్ళ గ్యాస్ డీలర్ దగ్గరకి వెళ్ళి అయినా ఈ కేవైసీ నమోదు చేసుకోవచ్చు. అది కూడా కుదరకపోతే ఏ కంపెనీ గ్యాస్ సిలెండర్ కొంటున్నారో, ఆ కంపెనీ వెబ్‌సైట్‌కి వెళ్ళి కేవైసీ అప్‌డేట్ చేసుకోవచ్చు. అలాగే ఈ నమోదు ప్రక్రియకి ప్రస్తుతానికి డెడ్‌లైన్ లాంటిదేమీ లేదు.